కాకతీయుల ఆనవాళ్ళు రామగిరి ఖిల్లా

కాకతీయుల కాలంలో రామగిరిపై నిర్మించిన రామగిరి కోట శిల్ప కళా సంపదతో శోభిల్లుతోంది. పర్యాటకులను ఆహ్లాదపరుస్తూ, అలరిస్తోంది. ఈ ఖిల్లా శిల్ప సాంస్కృతిక సంపదకు తార్కాణంగా నిలుస్తూ , సందర్శకులకు నిలయంగా మారింది.  ప్రకృతి కళ్లకు కట్టినట్లుగా, కోట గోడలు ఆకాశాన్ని అంటినట్లుగా ఈ దృశ్యాలను చూశారా! ఆ గిరిపై ఉన్న కోటలన్నీ ఎప్పుడో ఒకటో శతాబ్దంలో నిలబడిన గోడలవి. అప్పుడు తెరుచుకున్న ఖిల్లా ద్వారాలు.. శాతవాహనులు, మౌర్యులు, కాకతీయులు, దిల్లీ సుల్తానులు, బహమనీలు, రెడ్డి రాజులు, […]

కాకతీయుల కాలంలో రామగిరిపై నిర్మించిన రామగిరి కోట శిల్ప కళా సంపదతో శోభిల్లుతోంది. పర్యాటకులను ఆహ్లాదపరుస్తూ, అలరిస్తోంది. ఈ ఖిల్లా శిల్ప సాంస్కృతిక సంపదకు తార్కాణంగా నిలుస్తూ , సందర్శకులకు నిలయంగా మారింది. 

ప్రకృతి కళ్లకు కట్టినట్లుగా, కోట గోడలు ఆకాశాన్ని అంటినట్లుగా ఈ దృశ్యాలను చూశారా! ఆ గిరిపై ఉన్న కోటలన్నీ ఎప్పుడో ఒకటో శతాబ్దంలో నిలబడిన గోడలవి. అప్పుడు తెరుచుకున్న ఖిల్లా ద్వారాలు.. శాతవాహనులు, మౌర్యులు, కాకతీయులు, దిల్లీ సుల్తానులు, బహమనీలు, రెడ్డి రాజులు, మొఘలాయి చక్రవర్తులు, గోల్కొండ నవాబులు, నిజాం రాజులు ఒకరి తర్వాత ఒకరు ఎవరొచ్చినా స్వాగతించాయి. వారంతా వచ్చారు.. వెళ్లారు. చరిత్రలో కలిసిపోయారు. ఇక్కడ నిర్మింపజేసిన రాతి కట్టడాలు అప్పటి శిల్పకళానైపుణ్యాన్ని చాటుతాయి. రాతిపై చెక్కిన సుందర దృశ్యాలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి. ఆ ద్వారాలు ఇంకా అక్కడే ఉన్నాయి. కానీ వీటిని చూడడానికి ఏడాదికోసారి మాత్రమే అవకాశం ఉంటుందట..

ఈ రాజులెవరూ ఇక్కడికి రాకముందు శ్రీరామచంద్రుడు వచ్చాడటంటారు. సీతమ్మ, లక్ష్మణస్వామి సమేతంగా ఇక్కడ కాలుమోపాడని చెబుతారు. అందుకే ఈ ప్రాంతం రామగిరి అయింది. రాజుల కన్ను పడటంతో రామగిరి కాస్తా ఖిల్లాగా మారింది. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలో ఉంటుందీ ఖిల్లా. బేగంపేట గ్రామానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న భారీ గుట్టపై..ఎత్తు గోడలతో.. ఓ పక్క బండలతో.. అన్నివైపుల నుంచి చుట్టిముట్టిన చెట్టూచేమతో ఠీవీగా దర్శనమిస్తుంది. శ్రావణ మాసంలో ఇక్కడికి తండోపతండాలుగా భక్తులు తరలివస్తారు. అక్కడ ఉన్న కొండలు, గుట్టలు , దారిలో పచ్చని ప్రకృతిని చూసి పరవశిస్తారు. అక్కడి సెలయేళ్లను చూస్తుంటే ఎవరైనా మంత్రముగ్ధులం అయిపోవాల్సిందే. కొండలలో నెలకొన్న సీతారామాలక్ష్మణుల విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేస్తారు. బృందాలుగా వన భోజనాలు చేస్తారు. శ్రావణ మాసంలో కోటలో జరిగే సందడి ఇది.

రామగిరిపైన ఉన్న కోటలు, బురుజులు చూసి ఆశ్చర్యపోతారు. తొమ్మిది ప్రాకారాలతో నిర్మించిన రాతిగోడలు ఔరా అనిపిస్తాయి. 120 అడుగుల ఎత్తుండే గోడలపై అడుగడుగునా ఆనాటి శిల్పకారుల కళావిన్యాసం అబ్బురపరుస్తుంది. దుర్గంలో గజశాల, అశ్వశాల, చెరశాల, ప్రతాపరుద్రుల కోట, నిమ్మకోట, సోలుకోట ఇలా అలరించే విశేషాలెన్నో ఉన్నాయి. బ్రహ్మగుండం, గంగ-గౌరి సవతుల బావులు, కూర్మగుండం, మల్లెవనం, బృందావనం పర్యాటకులకు కనువిందు చేస్తాయి. శ్రీరాముడు ప్రతిష్ఠించాడని చెప్పే శివలింగం మరో అద్భుతం. కొండపై నుంచి వచ్చే నీటిధార నేరుగా శివలింగంపై పడటం విశేషం. ఇలాంటి వింతలు, విశేషాలన్నీ ఆస్వాదించాలంటే శ్రావణ మాసంలో సాధ్యమవుతుంది. ఈ నెల దాటిందా.. కోట ద్వారాలు మూసుకుంటాయి. ఖిల్లా మీద మనుషుల సంచారం దాదాపుగా ఉండదు.

శతాబ్దాల చరిత్ర
క్రీ.శ ఒకటో శతాబ్దంలో గౌతమీపుత్ర శాతకర్ణి రామగిరిని సైనిక స్థావరంగా చేసుకొని ఉత్తర భారతాన్ని పాలించారని శాసనాల ద్వారా తెలుస్తోంది. మౌర్య చక్రవర్తులు చంద్రగుప్తుడు, బిందుసారుడు, అశోకుడు రామగిరి పాలనా కేంద్రంగా దక్షిణాదిని పాలించారు. కాకతీయ రాజులు ఓరుగల్లు తరహాలో రామగిరిపై తొమ్మిది కోటలు, దర్వాజాలను నిర్మించారట. ఢిల్లీ సుల్తాన్ మహ్మద్‌బిన్‌తుగ్లక్ ఓరుగల్లు కోటను ముట్టడించే ముందు రామగిరిని హస్తగతం చేసుకున్నాడు. తర్వాత కాలంలో రామగిరిపై బహమనీ సుల్తానులు, వారి నుంచి రెడ్డిరాజుల ఆధిపత్యం కొనసాగింది. మొఘలాయిలు సైతం రామగిరిని పాలించారు. గోల్కొండ నవాబులు, నిజాం రాజుల వరకు రామగిరిపై రాచగిరి కొనసాగింది.

చూడాల్సిన ప్రదేశాలు
రామగిరి దుర్గంలో సాలుకోట, సింహాల కోట, జంగేకోట, ప్రతాపరుద్రుల కోట, అశ్వశాల, కొలువుశాల, మొఘల్శాల, చెరశాల, గజశాల, భజన శాల, సభాస్థలి వంటి వాటితో పాటు చెక్కరబావి, సీతమ్మ బావి, పసరుబావి, సీతమ్మకొలను, రహస్య మార్గాలు, సొరంగాలు లాంటి అనేక ప్రదేశాలు పర్యా టకులను ఇట్టే మైమరిచిపోయేలా చేస్తాయి.

1. ఖిల్లాలోని విశేషాలు చూసుకుంటూ రాములోరి గుడికి చేరుకోవాలనుకుంటే దాదాపు 5 కిలోమీటర్లు నడవాల్సి వస్తుంది. నేరుగా దైవ దర్శనం చేసుకోవాలనుకుంటే.. రత్నాపూర్ గ్రామం నుంచి సొంత వాహనాల్లో ఖిల్లా వరకు వెళ్లవచ్చు. ఖిల్లాపై వన్యమృగాలు సంచరించే అవకాశం ఉండటంతో, ఒంటరిగా వెళ్తే ప్రమాదం. బృందంగా కలిసి వెళ్తే మంచిది.

ఇలా వెళ్లొచ్చు..
రామగిరిఖిల్లా.. పెద్దపల్లి నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. పెద్దపల్లి-మంథని రహదారిలోని నాగేపల్లి (బేగంపేట అడ్డరోడ్డు)లో దిగాలి. ఇక్కడి నుంచి బస్సులో కాని, ఆటోలో 4 కిలోమీటర్లు ప్రయాణిస్తే బేగంపేట చేరుకోవచ్చు. ఇక్కడి నుంచి 3 కిలోమీటర్లు కాలినడకన వెళ్తే ఖిల్లాకు చేరుకోవచ్చు. రైలు మార్గం ద్వారా వచ్చే పర్యాటకులు కాజీపేట – బల్లార్షా మార్గంలోని పెద్దపల్లి రైల్వేస్టేషన్‌లో దిగి బస్సు ద్వారా మంథని మార్గంలో బేగంపేటకు చేరుకోవచ్చు.

Karimnagar Ramagiri Killa an historical place in Telangana

Telanagana Latest News