బాలోత్సవాలే బ్రహ్మోత్సవాలు…

పిల్లల కోసం పెద్దలం మనం రాయడమే కాదు, పిల్లల కోసం పిల్లలు రాసే రోజులు రావాలి’ అంటారు బాల సాహితీవేత్త, కవి, రచయిత, నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా తెలుగు సంపాదకులు డాక్టర్ పత్తిపాక మోహన్. ఇవ్వాళ్ళ తెలుగుు రాష్ట్రాల్లో పిల్లల కోసం సృజనాత్మక కార్యశాలలు, శిబిరాలు విరివిగా సాగుుతున్నాయి. వంద వరకు పిల్లలు రాసిన పుస్తకాలు వచ్చాయి. ఇంకా వస్తున్నాయి. బాల సాహిత్య రచన, వికాసం ఇవ్వాళ్ళ తెలంగాణలో ప్రధాన స్రవంతిగా సాగుుతోంది. ఈ నేపథ్యంలో […]

పిల్లల కోసం పెద్దలం మనం రాయడమే కాదు, పిల్లల కోసం పిల్లలు రాసే రోజులు రావాలి’ అంటారు బాల సాహితీవేత్త, కవి, రచయిత, నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా తెలుగు సంపాదకులు డాక్టర్ పత్తిపాక మోహన్. ఇవ్వాళ్ళ తెలుగుు రాష్ట్రాల్లో పిల్లల కోసం సృజనాత్మక కార్యశాలలు, శిబిరాలు విరివిగా సాగుుతున్నాయి. వంద వరకు పిల్లలు రాసిన పుస్తకాలు వచ్చాయి. ఇంకా వస్తున్నాయి. బాల సాహిత్య రచన, వికాసం ఇవ్వాళ్ళ తెలంగాణలో ప్రధాన స్రవంతిగా సాగుుతోంది. ఈ నేపథ్యంలో బాలల సర్వతోముఖాభివృద్దే బాలల వికాసానికి తోడ్పడుతుందని, అందుకు బాలోత్సవాలే సాధనమని… ‘బాలోత్సవాలే బ్రహ్మోత్సవాలు’ అన్న పిలుపుతో ముందుకు నడుస్తున్న  \డా.పత్తిపాక మోహన్ తో ‘బాలల దినోత్సవం’ సందర్భంగా… మన తెలంగాణ మాట ముచ్చట.

నేపథ్యం
పుట్టి పెరిగింది ‘మానేరు మాకళ్లకు ముత్యాల పేరు’ అంటూ మహాకవి డా.సి.నారాయణరెడ్డి వర్ణించిన మానేరునది తీరంలోని ఉద్యమాల పురిటిగడ్డ సిరిసిల్లలో. చేనేత కుటుంబం నా నేపథ్యం. నా బాల్యమంతా అచలయోగి అయిన మా తాత బ్రహ్మశ్రీ పత్తిపాక శంకరయ్య పంతులుతో గడిచింది. ఓనమాలకు ముందే కబీర్‌ను, అఆఇఈలకు ముందే వేమనను పరిచయం చేశారు. తన ఒళ్లో కూచుండబెట్టుకుని నాకు అన్నీ ఆయనే నేర్పారు. తెల్లవారుజామునే మానేరు నదికి తాతతో కలిసి వెళ్లడం, స్నానం చేసి భజన కీర్తనలు పాడుకుంటూ రావడం, ప్రతి గురుపౌర్ణమి రోజున ఇరవైనాలుగు గంటలు జరిగే భజనలు నా బాల్యమంతా ఆసక్తిగా ఉండేది. సిరిసిల్లలోని తొలి నేత కుటుంబాలలో మా కుటుంబం ఒకటి. మా వీధి పత్తిపాక వీథి. బాల్యంలో మా కుటుంబాల్లో యాభై మందికి పైగా పిల్లలం ఉండేవాళ్లం. ఆడింది ఆట, పాడింది పాటగా ఉండేది. పరాంకుశం నారాయణసారు వీథి నుండి ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్ కళాశాల మెట్లు ఎక్కేవరకు ప్రతిక్షణం నడిపించింది మా ఊరు..మానేరు.
సాహిత్యం…బాలసాహిత్యం వైపు ఎలా మొగ్గారు
నా మీద మా తాత ప్రభావం ఎంత ఉందో సాహిత్యం విషయంలో మా అత్త పత్తిపాక ఇందిరాబాయి ప్రభావం కూడా అంతే ఉంది. తనే లేకుంటే నేను కవిత్వం, విమర్శ వంటి రంగాల్లో ఉండేవాణ్ణి కావచ్చు కానీ బాల సాహిత్యంవైపుకు వచ్చేవాణ్ణి కాదేమో. పోలియో వల్ల మా ఇందిరత్త ఎక్కడికీ కదిలేది కాదు. కానీ తెలుగునాట ఉన్న ప్రతి పత్రిక, అచ్చయిన ప్రతి నవల తన ముంగిట్లోకి వచ్చేది. చందమామ ప్రారంభ సంచిక నుండి తను చదివిందట. బడికి పోయివచ్చి ఆడుకున్నాక దాదాపు ఇరవైమంది పిల్లలం సాయంత్రం ఆరుగంటల నుండి రాత్రయ్యే వరకు తన రాట్నం ముందు కూర్చుని తను ధారావాహికంగా చెప్పే కథలు వినేవాళ్లం. వీటికి తోడు ప్రతి నవల, పాకెట్ బుక్స్‌లోని కథలు, బేతాళ కథలు ఇలా అద్భుతంగా చెప్పేది. పెద్దతాతకు అంటే ఇందిరత్త తండ్రికి సినిమా టాకీసు ఉండటంతో వచ్చిన ప్రతి సినిమాను చూసేవాళ్లం. చూడని సినిమాలన్ని తెల్లారి రాట్నం దగ్గర కథలు, కథలుగా వినేవాళ్లం.

అప్పుడు అంతగా తెలియదు కానీ ఇప్పుడు యాది చేసికుంటే తెలుస్తుంది కథ చెప్పడం ఎంత అద్భుతమైన కళనో. అప్పటికీ ఇంకా మా ఇంట్లోకి టి.వి రాలేదు. రేడియో, సినిమా, పుస్తకాలు ఇవ్వే మాకు తెలిసిన వినోదం. మా ఊరిలో తొలి రేడియో కూడా మా ఇందిరక్కేదే. అలా బాల్యంలో నాకు తెలియకుండానే కథలపట్ల, కథలు చెప్పడం పట్ల నాకు ఆసక్తిని కలిగించింది మా ఇందిరక్క. తర్వాత నేను ఉద్యోగరీత్యా ఆదిలాబాద్ జిల్లా, కాగజ్‌నగర్ సమీపంలోని సిర్పూర్ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న సమయంలో హౌజ్ మాస్టర్‌గా పాఠశాల విద్యార్థులతో గడుపుతున్న సమయంలో వాళ్లకు కథలు చెప్పటం, పాటలు, పద్యాలు నేర్పడం చేసేవాణ్ణి. అదే సమయంలో అనుకోకుండా హైదరాబాద్ వెళ్లిన మా విద్యార్థి ట్యాంక్‌బండ్ మీద ఉన్న విగ్రహాలు చూసివచ్చి ‘వాళ్లంతా ఎవలు సారు’ అని అడిగినప్పుడు వాళ్ల కోసం తెలుగు కవుల్ని, ప్రముఖుల్ని పరిచయం చేయడం మొదలుపెట్టారు.

మిత్రుడు తిరునగరి వేదాంతసూరిని కలిసినప్పుడు తన ఇంచార్జిగా ఉన్న పత్రికలో పిల్లల కోసం శీర్షికలు ప్రారంభిస్తున్నామని, ఏమైనా రాయగలరా అని అడిగినప్పుడు ‘పిల్లల కోసం తెలుగు కవులు’ పేరుతో మా పిల్లలకు పరిచయం చేసిన వారిలోంచి కవుల వివరాలు రాసి పంపాను. దాదాపు మూడు సంవత్సరాలు ధారావాహికంగా వచ్చాయి. సినారె నుండి సామల సదాశివ వరకు కితాబు ఇవ్వడంతో వాటిని తర్వాత అదే పేరుతో పుస్తకంగా తెచ్చాను. మళ్లీ గత వారం నుండి ‘మన తెలంగాణ’లో పిల్లల కోసం ‘భారతీయ జ్ఞానపీఠ పురస్కా గ్రహీతలు’ శీర్షికన భారతీయ భాషా సాహీతీమూర్తులను పరిచయం చేస్తున్నాను.
మీ బాల సాహిత్య రచనలు వివరాలు
గతంలోకి చూస్తే ఒక విషయం స్పష్టంగా కన్పిస్తుంది. తొలి తరం రచయితలంతా కథ, కవిత్వం, విమర్శ ఇలా ఏ ప్రక్రియ చేపట్టి సుసంపన్నం చేసి సాహిత్య అకాడమీ పురస్కారాలు, జ్ఞానపీఠాలు అధిష్టించినా ఏదో ఒక సందర్భంలో పిల్లల కోసం రాశారు. పొట్లపల్లి రామారావు, చింతా దీక్షితులు, కె. సభా, మధురాంతకం రాజారాం, డా.సి.నారాయణరెడ్డి, పాకాల యశోదారెడ్డి వంటి వందలాది మంది తెలుగు రచయితలతో పాటు, తొలి జ్ఞానపీఠ పురస్కార గ్రహీత శంకర కురూప్ నుండి విశ్వకవి రవీంద్రుని వరకు అన్ని భారతీయ భాషా సాహిత్యాల్లో పిల్లల కోసం విశిష్టమైన సాహిత్య సృజనను చేశారు. ఎన్నో పత్రికలు పిల్లల రచనలను ప్రచురించేందుకు ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయించాయి. పత్రికలు కూడా మనకంటే ఎక్కువగాను ఉన్నాయి. కానీ తెలుగులో ఎందుకో ప్రధాన స్రవంతి అయిన బాల సాహిత్య సృజనను అందరు రచయితలు చేపట్టలేదు. వేదగిరి రాంబాబా వంటి కొందరు మాత్రమే రెంటిని సమానంగా ప్రేమించారు.

తొంబయ్యో దశకంలో బాల సాహిత్యం పట్ల కలిగిన ఆసక్తి తర్వాత పూర్తిగా అటువైపు మొగ్గేలా చేసింది. ‘పిల్లల కోసం మన కవులు’, ‘చందమామ రావే’, ‘వెన్నముద్దలు’ బాల గేయ సంకలనాలు పిల్లల కోసం తెచ్చాను. తొలిసారిగా పిల్లల కోసం భారత్ అభియాన్ అవగాహన దిశగా కరదీపికగా ఉంటుందని ‘ఆకు పచ్చనిపాట’ బాలల గేయ సంకలనం, తొలి బాలల బతుకమ్మ గేయాల సంకలనం ‘ఒక్కేసి పువ్వేసి చందమామ’ సంపుటిని తెచ్చాను. నా బాల్యంలో మా అమ్మ కోసం.. ఇప్పుడు నా పిల్లల కోసం పాడిన పాటలు విన్న యాదితో ‘పిల్లల కోసం మన పాటలు’ పేరుతో బాలల జానపద గేయ సంకలాన్ని ప్రచురించాను. అలాగే ‘పిల్లల కోసం పొడుపు కథలు’ తెచ్చాను. ఆంగ్ల, హిందీ మాధ్యమాల ద్వారా వివిధ భారతీయ భాషలకు చెందిన పదిహేను పిల్లల పుస్తకాలను తెలుగులోకి అనువాదం చేశాను.
నేటి బాల సాహిత్యం ఎలా ఉంది..ఎలా ఉండాలి..
గతంతో పోల్చి చూస్తే ఇవ్వాళ తెలుగులో బాల సాహిత్యం విరివిగా వస్తోంది. నాలాంటి రచయితలే కాకుండా స్వయంగా పిల్లలు కూడా రచనలో చేస్తున్నారు. దాదాపు వంద పుస్తకాలు తెలుగు రాష్ట్రాల్లో పిల్లలు రాసినవి అచ్చయ్యాయంటే పిల్లల సృజన ఎటువంటిదో తెలుస్తుంది. ఒక్క తెలంగాణ నుండే ఎనభైకి పైగా పుస్తకాలు వచ్చాయి. వీటికి తోడు ప్రతి జిల్లాల్లో, తాలుకాలో, మండలం, పాఠశాలలో పిల్లల కోసం సృజనాత్మక రచనా కార్యశాలలు జరుగుతున్నాయి. భావి రచయితలకు ఇవి ఖార్ఖానాలుగా తోడ్పడుతున్నాయి.

సంతోషాన్ని కలిగించే విషయం ఏమిటంటే ఈ మలిదశ కార్యశాలల ఉద్యమం మా సిరిసిల్ల, ముస్తాబాద్, నిజామాబాద్‌ల నుండి ప్రారంభం కావడం, గరిపల్లి అశోక్, వి.ఆర్. శర్మలతో పాటు అందులో నేను ప్రత్యక్షంగా భాగస్వామిని కావడం మరిచిపోలేని విషయం. ఇక్కడ ఇంకొక్క విషయం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. తెలంగాణా ప్రభుత్వం నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభల్లో అంతకు ముందు జరిగిన నాలుగు మహాసభల్లో లేని విధంగా బాలసాహిత్యానికి పెద్దపీట వేయడం, ప్రారంభం తర్వాత తొలి సభలో ప్రధాన వేదిక మీద తొలి సభ బాల సాహిత్యానికి సంబంధించిందే కావడం, మరునాడు కూడా బాలల కవి సమ్మేళనం, సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలకు కేటాయించడం వంటివి బాల సాహిత్యకారులకు కొంత స్ఫూర్తిని కలిగించాయి.

ఇక సాహిత్యం విషయానికి వస్తే రామాపురం, రంగాపురం కాకుండా నేటి మారుతున్న పరిస్థితులు, సాంకేతిక అభివృద్ధి వంటి వాటిని ప్రతిబింబించేట్టుగా రాసినట్టయితే ఈ తరానికి బాగా నచ్చుతుంది. హ్యారిపొట్టర్ వంటివి లక్షలాదిగా అమ్ముడు పోవడానికి కారణం ఇదే. వాళ్లకు నచ్చే వాటిని చక్కని రచనలుగా అందించినట్టయితే పిల్లలు వాటిని తప్పకుండా చదువుతారు. మన బాల్యంలో టి.విలు, మొబైల్ ఫోన్స్, ఇంటర్నెట్‌లు లేవు కాబట్టి భేతాళ కథలు చదివి, విని ఆనందించాం. ఇప్పటి తరం అరచేతిలోనే అద్భుతమైన విశేషాలు, విషయాలు వీక్షిస్తున్నారు కాబట్టి ఈ దయ్యాలు, భూతాలు వాళ్లకు నచ్చుతాయని నేననుకోను. వాళ్లను అద్భుత లోకంలోకి తీసుకెళ్లే అంశాలు రాసినట్టుయితే మన పిల్లలు సాహిత్యాని ఇంకా బాగా చదువుతారు.

Pathipaka Mohan National Book Trust India

Telangana News