మరో రామప్ప..వేల్పుగొండ

రామప్ప పేరు వినగానే శిల్ప సౌందర్యం, నిర్మాణమూ గుర్తుకొస్తాయి..ఈ దేవాలయం కాకతీయుల శిల్పకళకు నిలువుటద్దం. అదే తీరులో మరొక రామప్ప ఉందండీ..!అదెక్కడంటే పాలంపేట…వినడానికి కొత్తగా ఉంది కదూ..అచ్చం అలాగే ఉంటుంది..అంతే అపురూపం, నిర్మాణమూ అదే తీరు! వేల్పుగొండను దేవతల కొండ అని కూడా పిలుస్తారు. వేల్పుగొండలో ఓ గుట్ట ఎక్కి దిగిన తర్వాత చెరువు ఒడ్డున తుంబురేశ్వర ఆలయం కనిపిస్తుంది. చెరువు మధ్యలో మరో గుట్ట ఉంది. అక్కడ దేవతలు ఉంటారని గ్రామస్తుల నమ్మకం. ఎవరూ ఆ […]

రామప్ప పేరు వినగానే శిల్ప సౌందర్యం, నిర్మాణమూ గుర్తుకొస్తాయి..ఈ దేవాలయం కాకతీయుల శిల్పకళకు నిలువుటద్దం. అదే తీరులో మరొక రామప్ప ఉందండీ..!అదెక్కడంటే పాలంపేట…వినడానికి కొత్తగా ఉంది కదూ..అచ్చం అలాగే ఉంటుంది..అంతే అపురూపం, నిర్మాణమూ అదే తీరు!

వేల్పుగొండను దేవతల కొండ అని కూడా పిలుస్తారు. వేల్పుగొండలో ఓ గుట్ట ఎక్కి దిగిన తర్వాత చెరువు ఒడ్డున తుంబురేశ్వర ఆలయం కనిపిస్తుంది. చెరువు మధ్యలో మరో గుట్ట ఉంది. అక్కడ దేవతలు ఉంటారని గ్రామస్తుల నమ్మకం. ఎవరూ ఆ గుట్టవైపు వెళ్లరు. కొండపై వేల్పులు (దేవతలు) ఉంటారనే ప్రచారం కారణంగా ఈ గ్రామాన్ని వేల్పులకొండగా పిలిచేవారు. కాలక్రమంలో అదే వేల్పుగొండగా స్థిరపడింది. ఇక్కడి గుట్టపై వర్ధమాన మహావీరుడి విగ్రహం కూడా కనిపిస్తుంది. ఒకప్పుడు ఇది జైనమత స్థావరంగా కూడా విలసిల్లిందని చెబుతారు. ఏటా జనవరిలో నాలుగు రోజుల పాటు తుంబురేశ్వరాలయంలో జాతర నిర్వహిస్తారు.

శిల్పసౌందర్యం
తుంబురేశ్వరాలయం అందమైన శిల్పాకృతులతో తీర్చిదిద్దిన పదహారు స్తంభాలు కలిగి ఉంది. గర్భాలయంలో చుట్టూ అపురూప శిల్పాలున్నాయి. మంటప స్తంభాలు నగిషీలతో చెక్కబడి అందంగా కనిపిస్తాయి. మంటపం చుట్టూ ఉన్న శిలాతోరణాలపై లతలు, పద్మాలు దర్శనమిస్తాయి. వివిధ ఆకారాల్లో తీర్చిదిద్దిన నర్తకీమణుల శిల్పాలు రామప్ప ఆలయంలో ప్రతిష్ఠితమైన శిల్పాలను గుర్తుకు తెస్తాయి. ఈ శిల్పాల అందాలను చూస్తే ఎంతటివారైనా ముగ్ధులైపోవాల్సిందే! నాట్యమయూరీల సోయగాలు అటుంచితే.. తాండవ నటరాజు విగ్రహం చూపు మరల్చుకోనీయదు. వీరభద్రుడు, మహిషాసుర మర్ధని, కాలభైరవ మూర్తులు ఆధ్యాత్మిక వైభవాన్ని చాటుతాయి. ఇప్పటికీ గర్భాలయంలోని శివలింగానికి ప్రతి రోజు అభిషేకాలు చేస్తుంటారు.

సృష్టికర్త ఒక్కరే
* తుంబురేశ్వర ఆలయంలోని శిల్పకళాకృతులు రామప్ప శిల్పసంపదతో సరిపోల్చదగినవి.
* రామప్ప ఆలయాన్ని కట్టించిన గణపతిదేవుడి సేనాని రేచర్ల రుద్రుడే దీన్ని నిర్మించాడు.
* 1220-25 మధ్య ఆలయ నిర్మాణం జరిగిందని ఓ అంచనా.
* రామప్పలో శిల్పాల కన్నా.. వేల్పుగొండలో శిల్పాలు మరింత సౌందర్యంగా కనిపిస్తున్నాయి.
* నిర్మాణశైలి, శిల్పాలను పరిశీలించిన తర్వాత ఈ రెండు అద్భుతాల సృష్టికర్త ఒక్కరే అని పురావస్తు శాఖ అధికారులు అంచనాకు వచ్చారు.

ఎక్కడ ఉంది? వరంగల్ రామప్ప గుడికి వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న వేల్పుగొండ గ్రామంలో కనువిందు చేస్తుంది. సంగారెడ్డి జిల్లా టేక్మాల్ మండలం వేల్పుగొండలో రామప్ప ఆలయం పోలికలతో ఉన్న తుంబురేశ్వరాలయం ఉంది.
దీనిని ఎవరు నిర్మించారో నిన్నమొన్నటి వరకూ ఎవరికీ తెలియదు. ఎప్పుడు కట్టించారో అంచనా లేదు. తాజాగా కేంద్ర పురావస్తు సర్వే శాఖ (ఏఎస్‌ఐ) అధికారులు పరిశోధనలో కొత్త విషయాలు వెలుగు చూశాయి. కాకతీయరాజు గణపతిదేవుడి కాలంలో ఈ ఆలయం నిర్మితమైందని అంచనాకు వచ్చారు. రామప్ప ఆలయాన్ని నిర్మించిన శిల్పులే వేల్పుగొండ తుంబురేశ్వరాలయాన్ని తీర్చిదిద్దారని తేల్చి చెప్పారు. క్రీస్తుశకం 1220-25 మధ్య తుంబురేశ్వర ఆలయం నిర్మించినట్టుగా చెబుతున్నారు.

ఎలా వెళ్లాలి: హైదరాబాద్ నుంచి సంగారెడ్డి వరకు బస్సులో వెళ్ళొచ్చు. సంగారెడ్డి నుంచి టేక్మాల్ మండలం మీదుగా వేల్పుగొండ వరకు సౌకర్యాన్ని బట్టి బస్సులు, ఆటోల్లో వెళ్ళొచ్చు.

History of Valigonda Temple in Telugu

telangana latest news