బ్యాలట్, బుల్లెట్ల చత్తీస్‌ఘడ్

నిన్న చత్తీస్‌ఘడ్‌లో మొదటిదశ పోలింగ్ జరిగింది. రెండవ దశ పోలింగ్ నవంబర్ 20న జరుగుతుంది. మొదటి దశ పోలింగ్ మొత్తం మావోయిస్టు ప్రాబల్యం బలంగా ఉన్న ప్రాంతాల్లో జరిగింది. మొత్తం పోలింగ్ జరిగే ప్రాంతాలన్నింటా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సాధ్యమైనంత వరకు ఎన్నికలు ప్రశాంతంగా జరిపే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే చత్తీస్‌ఘడ్ ఎన్నికల్లో హింసాయుత సంఘటనలు చోటు చేసుకున్నాయి. చత్తీస్‌ఘడ్‌లో మొత్తం 90 నియోజకవర్గాలున్నాయి. ఇందులో 18 నియోజకవర్గాలకు మొదటిదశలో పోలింగ్ జరిగింది. బస్తర్ ప్రాంతంలో […]

నిన్న చత్తీస్‌ఘడ్‌లో మొదటిదశ పోలింగ్ జరిగింది. రెండవ దశ పోలింగ్ నవంబర్ 20న జరుగుతుంది. మొదటి దశ పోలింగ్ మొత్తం మావోయిస్టు ప్రాబల్యం బలంగా ఉన్న ప్రాంతాల్లో జరిగింది. మొత్తం పోలింగ్ జరిగే ప్రాంతాలన్నింటా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సాధ్యమైనంత వరకు ఎన్నికలు ప్రశాంతంగా జరిపే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే చత్తీస్‌ఘడ్ ఎన్నికల్లో హింసాయుత సంఘటనలు చోటు చేసుకున్నాయి.

చత్తీస్‌ఘడ్‌లో మొత్తం 90 నియోజకవర్గాలున్నాయి. ఇందులో 18 నియోజకవర్గాలకు మొదటిదశలో పోలింగ్ జరిగింది. బస్తర్ ప్రాంతంలో 12 నియోజకవర్గాలున్నాయి. రాజ్ నంద్ గాంవ్ జిల్లాలో 6 నియోజకవర్గాలున్నాయి. ఈ నియోజకవర్గాల పోలింగ్ తర్వాత నవంబర్ 20 మిగిలిన నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుంది. మావోయిస్టు ప్రాబల్యం, హెచ్చరికలు ఉన్నప్పటికీ చత్తీస్‌ఘడ్ లో ఎన్నికలు హోరాహోరీగానే ఎప్పుడూ జరుగుతుంటాయి. ఇక్కడ రెండే ప్రధాన పార్టీలు. ఒకటి భారతీయ జనతా పార్టీ, రెండవది కాంగ్రెస్.

చత్తీస్‌ఘడ్ 2000 సంవత్సరంలో కేంద్రంలో వాజపేయి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రం ఉనికిలోకి వచ్చింది. ఆదివాసీ జనాభా అధికంగా ఉన్న రాష్ట్రం. మధ్యప్రదేశ్‌లోని దక్షిణాది జిల్లాల్లో ఆదివాసీ ప్రాంతాలను వేరు చేసి ప్రత్యేకంగా చత్తీస్‌ఘడ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలోని ఆదివాసీ జనాభా ప్రత్యేక గుర్తింపు, ప్రయోజనాలను కాపాడ్డం కోసం ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకున్నారు. రాష్ట్రంలో 32 శాతం ఆదివాసీ జనాభా ఉంది. 12 శాతం షెడ్యుల్డ్ కులాల జనాభా ఉంది. 49 శాతం ఒబిసి జనాభా ఉంది. రాష్ట్ర విభజన శాంతియుతంగా జరిగింది. కాని కొత్త రాష్ట్రం ఏర్పాటు తర్వాత హింసాత్మక రాజకీయ చరిత్ర కనబడుతుంది. చత్తీస్‌ఘడ్ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇద్దరే ముఖ్యమంత్రులు ఈ పదిహేడు సంవత్సరాల కాలంలో పనిచేశారు.

రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ నాయకుడు అజిత్ జోగి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన 2000 నుంచి 2003 వరకు మూడేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత చత్తీస్‌ఘడ్ బిజెపికి కంచుకోటగా మారిపోయింది. 2003 తర్వాతి నుంచి బిజెపి వరుసగా గెలుస్తోంది. పదిహేను సంవత్సరాలుగా బిజెపికి చెందిన రమణ్ సింగ్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. మావోయిస్టు ప్రాబల్యం ఉన్న ఈ రాష్ట్రంలో రాజ్యహింస గురించిన ఆరోపణలు కూడా చాలా వచ్చాయి. బూటకపు ఎన్‌కౌంటర్ల ఆరోపణలూ ఉన్నాయి. ఆదివాసీ భూములను కబళిస్తున్నారని, అసమ్మతిని అణగదొక్కుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలు, ప్రజల్లో నిరసనలు బస్తర్ ప్రాంతంలో మావోయిస్టులు మరింత బలపడడానికి కారణమయ్యాయి. వారు చత్తీస్‌ఘడ్‌లో ప్రజాస్వామ్య ప్రక్రియకు సవాళ్ళు విసురుతున్నారు.

చత్తీస్‌ఘడ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ మూడు రాష్ట్రాలు ఒకేసారి ఏర్పడ్డాయి. ఈ రాష్ట్రాలు ఏర్పడినప్పుడు వెంటనే ఎన్నికలు జరగలేదు. అంతకు ముందు ఎన్నికల్లో మెజారిటీ ఉన్న పార్టీ తరఫున ముఖ్యమంత్రి ఎంపికయ్యారు. అజిత్ జోగి అలా ముఖ్యమంత్రయ్యారు. చత్తీస్‌ఘడ్‌లో మొదటిసారి ఎన్నికలు జరిగింది 2003లోనే. ఆ ఎన్నికల నుంచి నేటి వరకు బిజెపి ఓడిపోలేదు. 2003లో బిజెపికి 90 అసెంబ్లీ స్థానాల్లో 50 లభించాయి. ఆ తర్వాత 2008లో జరిగిన ఎన్నికల్లోను బిజెపి సత్తా చూపించింది. మళ్ళీ 50 స్థానాలు గెలుచుకుంది. 2013 ఎన్నికల్లో కేవలం ఒకే ఒక్క స్థానం తగ్గింది. 49 స్థానాలతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

చత్తీస్‌ఘడ్ మొదటి ఎన్నికల నుంచి నేటి వరకు కాంగ్రెస్ వెనుకబడే ఉంది. 2003లో 37 స్థానాలు గెలిస్తే, 2008లో ఒక్క స్థానం పెంచుకుని 38 స్థానాలు గెలుచుకుంది. 2013లో మరో స్థానం గెలుచుకుని 39 స్థానాలకు వెళ్ళగలిగింది. ఓట్ల శాతం విషయంలో కాంగ్రెస్ పరిస్థితి మెరుగుపడుతోంది. 2003లో కాంగ్రెస్‌కు 36.71 శాతం ఓట్లు లభిస్తే, బిజెపికి 39.26 శాతం ఓట్లు లభించాయి. 2008లో ఈ తేడా తగ్గింది. కాంగ్రెస్ 38.63 శాతం ఓట్లు సాధించగలిగింది. బిజెపి ఓట్లశాతం కూడా పెరిగింది. బిజెపికి 40.33 శాతం ఓట్లు వచ్చాయి. 2013లో బిజెపికి ఓట్లశాతం మరింత పెరిగింది. బిజెపి 41.0 శాతం ఓట్లు సాధించింది. కాగా, కాంగ్రెస్ ఓట్లశాతం కూడా పెరిగింది. కాంగ్రెస్‌కు 40.3 శాతం ఓట్లు వచ్చాయి. రెండు పార్టీలకు పోలయిన ఓట్లశాతం పెరగడమే కాదు, రెండు పార్టీల మధ్య ఓట్లశాతం తేడా కూడా తగ్గుతూ వచ్చింది.

చత్తీస్‌ఘడ్ మొదటి ముఖ్యమంత్రి అజిత్ జోగి 2007లో ఒక హత్యకేసులో అరెస్టయ్యారు. 2003 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌సిపి పార్టీ నాయకుడు రామావతార్ జగ్గీ హత్యకేసు. కాంగ్రెస్ అప్పట్లో అజిత్ జోగిని పార్టీ సస్పెండ్ చేసింది. అప్పటి నుంచి జోగీకి కాంగ్రెస్‌కు మధ్య లోలోన ఘర్షణలు పెరిగాయి. 2016లో అజిత్ జోగి కాంగ్రెస్‌ను వదిలి బయటకు వచ్చేశారు. ఆయన కుమారుడు అమిత్ జోగి పార్టీ వ్యతిరేక కార్యకలాపాల కారణంగా కాంగ్రెస్ ఆయన్ను బహిష్కరించింది. ఆ తర్వాత అజిత్ జోగి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి చత్తీస్‌ఘడ్ జనతా కాంగ్రెస్ పార్టీ పెట్టాడు.

ఈ సారి ఎన్నికల్లో మహాఘట్ బంధన్ ఆశలపై చన్నీళ్ళు కుమ్మరిస్తూ మాయావతి చత్తీస్‌ఘడ్‌లో అజిత్ జోగితో చేతులు కలిపారు. చత్తీస్‌ఘడ్‌లో బహుజన సమాజ్ పార్టీకి చెప్పుకోదగ్గ బలం ఉంది. చత్తీస్‌ఘడ్‌లో 10 రిజర్వుడు స్థానాలున్నాయి. అజిత్ జోగి కనీసం 40 స్థానాల్లో ఫలితాలను ప్రభావితం చేయగలడు. మాయావతి అజిత్ జోగి చేతులు కలపడం వల్ల ఇప్పుడు కాంగ్రెస్ మూడోస్థానానికి నెట్టివేయబడుతుందని అంచనా. దాదాపు 10 స్థానాల్లో బహుజన సమాజ్ పార్టీ ఫలితాలను తారుమారు చేయగలదు. 2003లో బి.యస్.పి. రెండు స్థానాలు గెలుచుకుంది. 4.45 ఓట్ల శాతం పొందింది. 2008లో మాయావతికి లభించిన ఓట్లశాతం 6.11. కాని 2013లో ఈ ఓట్లశాతం 4.27కు పడిపోయింది. 2013లో అజిత్ జోగి కాంగ్రెసులో ఉన్నప్పుడు, ఈ రెండు పార్టీలు కలిసి 44.56 శాతం ఓట్లు పొందాయి.

బిజెపికి 41.18 శాతం ఓట్లు వచ్చాయి. కాబట్టి ఈ సారి కాంగ్రెసుకు ఎదురు దెబ్బ తప్పదని ఇండియా టివి, సిఎన్‌ఎక్స్ సర్వే ప్రకటించింది. బిజెపికి 42 శాతం ఓట్లు, కాంగ్రెసుకు 37 శాతం ఓట్లు రావచ్చని, అజిత్ జోగి, మాయావతి కూటమి కాంగ్రెసు విజయావకాశాలను దెబ్బతీస్తుందని ఈ సర్వే వివరాలు తెలియజేశాయి. కానీ ఎబిపి సివోటర్ సర్వే ప్రకారం కాంగ్రెస్‌కి 47, బిజెపికి 40 సీట్లు వచ్చే అవకాశాలున్నాయి. కాంగ్రెస్‌కు 38.9 శాతం ఓట్లు వస్తే, 38.2 శాతం బిజెపికి రావచ్చని ఈ సర్వే తెలిపింది. అంటే ఈ సర్వే ప్రకారం మాయావతి, అజిత్ జోగిల ప్రభావం బిజెపిపై కూడా పడుతుంది. అనేక సర్వేలు వివిధ ఫలితాలను ప్రకటిస్తున్నాయి. మరోవైపు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కాంగ్రెస్ బలం పెరిగిందన్న వార్తలు కూడా వచ్చాయి. చత్తీస్‌ఘడ్ ప్రజల తీర్పు ఏమిటో ఎన్నికల ఫలితాల తర్వాతే తెలుస్తుంది.

70% turnout in first phase of Chhattisgarh polls

Telangana Latest News