4 సీట్ల కోసం ఢిల్లీలో పొర్లుదండాలు

కోదండరాంపై హరీశ్‌రావు పిలిచి పీఠం ఇస్తే పంగనామాలు పెట్టారు కెసిఆర్‌పై కనీసం విశ్వాసం చూపించడం లేదు ఉద్యమకాలంలో తిట్టిన వారితో టిజేఎస్ దోస్తీ కట్టింది మన తెలంగాణ/హైదరాబాద్: కోదండరాంకు పిలిచి పీఠం ఇస్తే పంగ నామాలు పెట్టారని మంత్రి హరీష్‌రావు ఆరోపించారు. టిఆర్‌ఎస్ భవన్‌లో సోమవారం మంత్రి హరీశ్ రావు సమక్షంలో సంగారెడ్డి జిల్లా తెలంగాణ జన సమితి కార్యదర్శి నగేష్ ,ఆయన అనుచరులు ,ప్రైవేటు ఉద్యోగుల సంఘం నేతలు టిఆర్ ఎస్ పార్టీలో చేరారు. ఈ […]

కోదండరాంపై హరీశ్‌రావు

పిలిచి పీఠం ఇస్తే పంగనామాలు పెట్టారు
కెసిఆర్‌పై కనీసం విశ్వాసం చూపించడం లేదు
ఉద్యమకాలంలో తిట్టిన వారితో టిజేఎస్ దోస్తీ కట్టింది

మన తెలంగాణ/హైదరాబాద్: కోదండరాంకు పిలిచి పీఠం ఇస్తే పంగ నామాలు పెట్టారని మంత్రి హరీష్‌రావు ఆరోపించారు. టిఆర్‌ఎస్ భవన్‌లో సోమవారం మంత్రి హరీశ్ రావు సమక్షంలో సంగారెడ్డి జిల్లా తెలంగాణ జన సమితి కార్యదర్శి నగేష్ ,ఆయన అనుచరులు ,ప్రైవేటు ఉద్యోగుల సంఘం నేతలు టిఆర్ ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ కెసిఆర్ పిలిచి కోదండరాంను జేఏసి చైర్మన్‌గా చేశారని ప్రస్తుతం ఆయన ఆ విశ్వాసం చూపించడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జేఏసి చైర్మన్‌గా ఉన్నప్పుడు కోదండరాంను తిట్టిన కాంగ్రెస్, టిడిపి పార్టీలతో ఆయన ప్రస్తుతం దోస్తీ చేస్తున్నాడని హరీష్ ఆరోపించారు. కోదండరాం నాలుగు సీట్ల కోసం అమరావతికి, ఢిల్లీ కి గులామయ్యారని, గాంధీ భవన్ మెట్ల మీద, సోనియా, రాహుల్ ఎదుట కోదండరాం పొర్లు దండాలు పెడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఉద్యమ సమయంలో జరిగిన  విషయాలను కోదండరాం ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలని, కావాలంటే పాత పేపర్లు ముందు వేసుకొని చూసుకోవాలని ఆయన సూచించారు.

ఉద్యమ సమయంలో కోదండరాంను కాంగ్రెస్, టీడీపీ టార్గెట్ చేస్తే ఆయన్ను కంటికి రెప్పలా కాపాడుకున్నది గులాబీ జెండానన్నారు. నాడు తిట్టిన వారే నేడు కోదండరాంకు దోస్తీలు అయ్యారని టిఆర్ ఎస్ పార్టీ మాత్రం చెడ్డది అయ్యిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒకసారి జేఏసీ రోజులు గుర్తుకు తెచ్చుకోవాలని హరీష్‌రావు కోదండరాం సూచించారు. అప్పట్లో కోదండరాంకు రక్షణ కవచంగా నిలిచింది టిఆర్ ఎస్ పార్టీయేనని, నాటి ఉద్యమ కారులను గౌరవించింది టిక్కెట్లు ఇచ్చింది  టిఆర్‌ఎస్ పార్టీయేనని ఆయన పేర్కొన్నారు. ఉద్యమ కారులను జైల్లో పెట్టించింది కాంగ్రెస్ వారని, బెయిల్ ఇప్పించింది మాత్రం టిఆర్ ఎస్ పార్టీ అని జైల్లో పెట్టించిన వారు కోదండ రాంకు ముద్దయ్యారని, బెయిల్ ఇప్పించిన టిఆర్‌ఎస్ చేదు అయ్యిందన్నారు. ఉస్మానియా విద్యార్థులతో పాటు వివిధ జేఏసీ నాయకులకు టికెట్లు, పదవులిచ్చింది టిఆర్‌ఎస్ పార్టీ అని అయితే వారిని అవమానపరిచింది కాంగ్రెస్ పార్టీ అని ఆయన ఆరోపించారు. జరలిస్టులు కూడా ఉద్యమంలో ముందున్నారని, వారి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని టిఆర్‌ఎస్ ప్రత్యేక నిధి ఏర్పాటు చేసిందన్నారు. జర్నలిస్టులపై కేసులు నమోదు చేయించిన ఘనత కూడా కాంగ్రెస్‌కే దక్కుతుందన్నారు.  అప్పట్లో జేఏసీని విచ్చిన్నం చేయాలని చూసిన వారికి ప్రస్తుతం  కోదండ దగ్గరయ్యాడని అయినా వారు కోదండను పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు.

కోదండ రామ్ 2014 ఎన్నికల్లో పరోక్షంగా కాంగ్రెస్ కు మద్ధతిచ్చా,రని రాత్రికి రాత్రే ఢిల్లీకి వెళ్లి 4 సీట్లు తమ వారికి ఇప్పించుకున్నాడని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పోయాడని ఆయన పేర్కొన్నారు. నాలుగైదు సీట్ల కోసం కోదండరాంను కాంగ్రెస్ అష్టకష్టాలు పెడుతోందని, కాంగ్రెస్ తాను గెలవని సీట్లనే టిజేఎస్ పార్టీకి ఇస్తోందని ఈ విషయం ఆయనకు తెలియదా అని హరీష్ ప్రశ్నించారు.  టీడీపీతో కలిసినందుకు తెలంగాణ సమాజానికి కోదండరాం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబును తాను టార్గెట్ చేయడాన్ని కోదండరాం తట్టు కోలేక పోయారని అప్పుడే టిడిపి పార్టీపై ఆయన నిజస్వరూపం బయట పడిందన్నారు. చంద్రబాబు వ్యూహం ప్రకారం, అమరావతి ఆదేశాలతోనే కోదండరాంను తెలంగాణ ప్రజల ఆకాంక్ష అమలు కమిటీ చైర్మన్‌గా కోదండను నియమించినట్టు ఉత్తమ్ తెలిపాడని, అంత మాత్రాన ప్రజలు మహాకూటమిని నమ్మే పరిస్థితిలో లేరని ఆయన పేర్కొన్నారు. కోదండరాంతో పాటు కాంగ్రెస్, టిడిపి పార్టీలు రంగులు మార్చినంత మాత్రాన ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు.

చెరువు కు బుంగ పడ్డట్టుగా ఇక నుంచి టిజేఎస్ ఖాళీ అవుతోందని, రానున్న రోజుల్లో కార్యకర్తలు ఎవరూ మిగలరని ఆయన జోస్యం చెప్పారు. కాంగ్రెస్ నాయకులు పిడి యాక్టు కింద జైల్లో పెట్టిన చెరుకు సుధాకర్ గౌడ్‌ను ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పంచన చేరాడని ఆయన పేర్కొన్నారు. ఆయనకు ఒక్క సీటు కూడా ఇవ్వని పరిస్థితి నెలకొందన్నారు. విద్యార్థి సంఘాల నేతల్లో చాలామంది టిఆర్‌ఎస్ తరఫున ఎమ్మెల్యే, ఎంపిలుగా, కార్పొరేషన్ చైర్మన్లుగా ఉన్నారని హరీష్ రావు పేర్కొన్నారు. ఇప్పటి నుంచి కోదండరాం నిజస్వరూపాన్ని బయట పెడుతామని ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్ కు ఆనాడు ఈనాడు ఉద్యమ కారుల మీద ప్రేమ గౌరవం చూపించలేదన్నారు. ఈ ఎన్నికల్లో వంద సీట్లు సాధిస్తామని, సంగారెడ్డిలోని దారులన్నీ టిఆర్‌ఎస్ వైపే ఉన్నాయని, భారీ మెజారిటీతో చింతా ప్రభాకర్ గెలవడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బేవరేజస్ కార్పొరేషన్ చైర్మన్ దేవిప్రసాద్ మాట్లాడుతూ మహాకూటమి మాటలను ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరన్నారు.

మొదటి నుంచి పార్టీలో పనిచేసిన వారికి కెసిఆర్ తగిన గుర్తింపు నిచ్చారని ఆయన తెలిపారు. టిఆర్‌ఎస్ అభ్యర్థుల్లో ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్నారని రానున్న ఎన్నికల్లో 100 సీట్లు సాధించయం ఖాయమన్నారు. కెసిఆర్ బంగారు తెలంగాణ కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అది మహాకూటమి కాదని విషకూటమి ఆయన ఆరోపించారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్, టిడిపిలు తాకట్టుపెట్టాయన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, ప్రైవేటు ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంధం రాములు, నగేష్ తదితరులు పాల్గొన్నారు.

Private Employees Union leaders joined the TRS party

Telangana Latest News