నోట్ల రద్దు జిఎస్‌టితో దేశానికి ఎదురు దెబ్బ

7 శాతం వృద్ధి రేటు దేశ అవసరాలకు చాలదు : ఆర్‌బిఐ మాజీ గవర్నర్ రాజన్ వాషింగ్టన్: భారత దేశ ఆర్థిక వ్యవస్థను పెద్ద నోట్ల రద్దు, వస్తు సేవల పన్ను (జిఎస్‌టి)లు 2017లో స్తంభింపజేశాయని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ చెప్పారు. ప్రస్తుతం భారత దేశ ఆర్థిక వృద్ధి రేటు 7 శాతంగా ఉందని, అయితే దేశ అవసరాలకు అది సరిపోదని ఆయన అన్నారు. అమెరికా బర్క్‌లీలోని యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో శుక్రవారం […]

7 శాతం వృద్ధి రేటు దేశ అవసరాలకు చాలదు : ఆర్‌బిఐ మాజీ గవర్నర్ రాజన్

వాషింగ్టన్: భారత దేశ ఆర్థిక వ్యవస్థను పెద్ద నోట్ల రద్దు, వస్తు సేవల పన్ను (జిఎస్‌టి)లు 2017లో స్తంభింపజేశాయని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ చెప్పారు. ప్రస్తుతం భారత దేశ ఆర్థిక వృద్ధి రేటు 7 శాతంగా ఉందని, అయితే దేశ అవసరాలకు అది సరిపోదని ఆయన అన్నారు. అమెరికా బర్క్‌లీలోని యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో శుక్రవారం రాజన్ మాట్లాడారు. 2012నుంచి 2016 వరకు నాలుగేళ్ల పాటు భారత్ శరవేగంగా అభివృద్ధి చెందిందని, అయితే ఆ తర్వాత రెండు ప్రధాన అడ్డకులను అది ఎదుర్కొందని రాజన్ చెప్పారు.‘పెద్ద నోట్ల రద్దు, జిఎస్‌టి రద్దు నిర్ణయాలకు ముందు వరకు దేశం శరవేగంగా అభివృద్ధి చెందుతూ వచ్చింది.

అయితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో పాటుగా భారత దేశం కూడా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో రెండు వరస దెబ్బలు తగలడం తీవ్ర ప్రభావాన్ని చేసించిందని భట్టాచార్య లెక్చర్‌షిప్‌లో భాగంగా ‘భారత దేశ భవిష్యత్తు’అనే అనే అంశంపై మాట్లాడుతూ రాజన్ అన్నారు.‘ ఉద్యోగార్థుల సంఖ్యను చూస్తే 7 శాతం వృద్ధి ఏ మాత్రం సరిపోదు. మనకు మరిన్ని ఉద్యోగాలు కావాలి. ఈ వృద్ధితో సంతృప్తి చెందలేము.2017లో ఏం జరిగిందో చూడండి. ప్రపంచమంతా వృద్ధి చెందుతున్న సమయంలో భారత్‌లో వృద్ధి మాత్రం కుంటుపడింది. ఈ రెండు అంశాలు ఎంతగా ప్రభావం చూపించాయో అక్కడే అర్థమవుతుంది. వీటి కారణంగా మనం దెబ్బతిన్నాం’ అని రాజన్ అన్నారు. అయితే మళ్లీ దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోంది. అయితే ఈ తరుణంలో చమురు ధరలు పెరగడం ప్రారంభమయింది. భారత దేశం తన ఇంధన అవసరాలకోసం ఎక్కువగా దిగుమతులపై ఆధారపడుతోన్న విషయాన్ని మనం మరువకూడదు’ అని ఆయన అన్నారు.

మొండి బకాయిలను శుద్ధి చేయాల్సిందే
బ్యాంకుల్లో మొండి బకాయిలు పెరిగిపోవడాన్ని రాజన్ ప్రస్తావిస్తూ, ఇటువంటి పరిస్థితులలు ఎదురయినప్పుడు బ్యాంకులను శుద్ధి చేయాల్సిందేనని ఆయన అన్నారు. కష్టాలను ఎదుర్కోవలసిందేనని కూడా స్పష్టం చేశారు. మొండి బకాయిలు లేని బ్యాలెన్స్ షీట్లతో బ్యాంకులు మళ్లీ గాడిలో పడతాయన్నారు. అయితే మొండి బకాయిలను గాడిలో పెట్టడానికి సరయిన వ్యవస్థ లేకపోవడంతో భారత్‌లో చాలా రోజులు పట్టిందన్నారు. దివాలా చట్టం ఒక్క దానితో బ్యాంకులను గాడిలో పెట్టలేమన్నారు. దీనికి మరిన్ని చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందన్నారు. ఇప్పుడున్న పరిస్థితిలో భారత్ 7శాతం వృద్ధి రేటును సునాయాసంగా సాధించగలదని, దీనికన్నా తగ్గితే ఎక్కడో తప్పు చేశామనే భావించాలని రాజన్ అభిప్రాయపడ్డారు.

ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌లో నెలకు పది లక్షల ఉద్యోగాలను సృష్టించాల్పిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే మెరుగైన మౌలిక వసతులు, విద్యుత్ రంగం, ఆరోగ్యకరమైన బ్యాంకులు దేశ అభివృద్ధికి కీలకమని రాజన్ అన్నారు. భారత దేశంలో అతి పెద్ద సమస్య ఏమిటంటే రాజకీయ నిర్ణయాలు తీసుకోవడంలో అధికారం మితిమీరి కేంద్రీకృతమై ఉండడమని రాజన్ అభిప్రాయపడ్డారు. ‘కేంద్రంనుంచి భారత దేశం పని చేయలేదు. ఎక్కువ మంది భారాన్ని భరించగలిగినప్పుడే దేశం పని చేస్తుంది. అయితే ఇప్పుడు దేశంలో కేంద్రప్రభుత్వం మితిమీరి కొద్ది మంది చేతిలోనే కేంద్రీకృతమై నంది’ అని ఆయన అన్నారు. ప్రధానమంత్రి కార్యాలయంనుంచి అనేక నిర్ణయాలకు ఆమోద ముద్ర లభించాల్సిన అవసరం ఉండడమే దీనికి ఓ ఉదాహరణ అని రాజన్ అన్నారు. ఆర్‌బిఐ, ఆర్థిక మంత్రిత్వ శాఖల మధ్యవివాదం ముదురుతున్న నేపథ్యంలో రాజన్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

Demonetisation GST Held Back India Economic Growth

Telangana Latest News

Related Stories: