పెద్దనోట్ల రద్దు పీడకల

        రెండేళ్ల క్రితం దేశమ్మీద విరుచుకుపడిన పెద్దనోట్ల రద్దు కోడి పిల్లలను తన్నుకుపోయిన గద్ద మాదిరిగా నేరుగా పలువురి ప్రాణాలను తీసింది. పరోక్షంగా లక్షలాది కుటుంబాల ఉపాధులను బలి తీసుకున్నది. బ్యాంకుల వద్ద రోజులతరబడి సుదీర్ఘంగా తీరిన బారులలోని ముసలి, ముతక అక్కడికక్కడే ప్రాణాలొదిలారు. శుభ కార్యాలకోసం ముందుగా డ్రా చేసి ఉంచుకొన్న సొమ్ము ఉన్నపళంగా విలువ కోల్పోవడంతో ఆ పరిణామాన్ని తట్టుకోలేక అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. గుండెపోటు వచ్చి హఠాత్తుగా […]

        రెండేళ్ల క్రితం దేశమ్మీద విరుచుకుపడిన పెద్దనోట్ల రద్దు కోడి పిల్లలను తన్నుకుపోయిన గద్ద మాదిరిగా నేరుగా పలువురి ప్రాణాలను తీసింది. పరోక్షంగా లక్షలాది కుటుంబాల ఉపాధులను బలి తీసుకున్నది. బ్యాంకుల వద్ద రోజులతరబడి సుదీర్ఘంగా తీరిన బారులలోని ముసలి, ముతక అక్కడికక్కడే ప్రాణాలొదిలారు. శుభ కార్యాలకోసం ముందుగా డ్రా చేసి ఉంచుకొన్న సొమ్ము ఉన్నపళంగా విలువ కోల్పోవడంతో ఆ పరిణామాన్ని తట్టుకోలేక అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. గుండెపోటు వచ్చి హఠాత్తుగా మరణించారు. ప్రధాని మోడీ ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యకు ఉన్నట్టుండి ఇంకిపోయిన చెరువుల్లా బ్యాంకుల్లోని కరెన్సీ నిల్వలు ఖాళీ అయిపోయాయి. ఎటిఎంలు నో క్యాష్ బోర్డులు వేళ్లాడదీశాయి. చిల్లర అవసరాలకు సైతం డబ్బు కరువై దేశ వ్యాప్తంగా మధ్య తరగతి, చిన్న సన్న ప్రజానీకం ఒడ్డున పడిన చేపల్లా విలవిలలాడిపోయారు. వ్యాపారాలకు మదుపు కరువై వర్తకులు దుకాణాలు మూసుకున్నారు. నదీ ప్రవాహం స్తంభించిపోయినట్టు ఆర్థిక వ్యవస్థ కాళ్లు చేతులు ఆడక కొన ఊపిరికి చేరుకున్నది.

2016 నవంబర్ 8న రూ. 500, 1000 నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించిన సందర్భంగా ప్రధాని మోడీ దేశ ప్రజలనుద్దేశించి ఉదాత్త గంభీర ప్రకటన చేశారు. గుట్టలుగుట్టలుగా పేరుకుపోయిన గుప్త ధనాన్ని విలువ లేనిదిగా చేసి అవినీతిని నిలువెత్త్తు గోతిలో పాతిపెట్టడానికి తద్వారా జాతి విద్రోహుల, అసాంఘిక శక్తుల ఆట కట్టించడానికి, టెర్రరిస్టుల నడ్డి విరవడానికి దృఢ సంకల్పం వహించి పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని తీసుకున్నామని చెప్పుకున్నారు. దీనివల్ల నీతిమంతులు, నిజాయితీపరులైన పేదలకు మేలు కలుగుతుందని కూడా చెప్పారు. వాస్తవంలో జరిగింది అందరికీ తెలుసు. రద్దు చేసిన నోట్లలో 99 శాతం తిరిగి సురక్షితంగా బ్యాంకులకు చేరుకుని తెల్లధనంగా మారిపోయిందని రిజర్వు బ్యాంకు గణాంకాలు స్పష్టం చేశాయి. ప్రధాని నరేంద్ర మోడీ ఘనంగా చెప్పుకున్న నల్లధనం నిర్మూలన బొత్తిగా చోటు చేసుకోలేదని ఆర్‌బిఐ ప్రకటనతో రుజువైంది. రెండేళ్ల తర్వాత ఇప్పుడు గుప్త ధనం గుట్టలుగుట్టలుగా రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లోకి చేరుకుంటున్న చేదు వాస్తవం కళ్లకు కడుతున్నది. పెద్దనోట్ల రద్దు ఆదాయపు పన్ను ఎగవేతను అరికట్టిందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెబుతున్నదే నిజమైతే అక్రమ ధనమింతగా మళ్లీ పొంగిపొర్లడం ఎలా సాధ్యమైంది? పన్నులు ఎగవేసి దాచుకున్నదే గుప్తధనం కదా!

ఒక్కసారిగా భారీ ఎత్తున కరెన్సీ రద్దు కావడంతో ఆమేరకు అంతెత్తు కొత్త నోట్లను తిరిగి ప్రవేశపెట్టడం అమిత కష్టతరమైంది. తరణోపాయంగా ముద్రించిన రూ. 2000 నోట్లు సామాన్యులకు కొరకరాని కొయ్యలుగా తయారయ్యాయి. వారికి ఉపయోగపడే తక్కువ కిమ్మత్తు నోట్లు కనుమరుగయ్యాయి. తాజా ధరల ప్రాతిపదికన కొత్త నోట్ల ముద్రణ ఖర్చే భరించరానిదిగా మారింది. పర్యవసానంగా దేశ ప్రజలు సమయానికి అవసరానికి తగినంత డబ్బు లభించక ఇప్పటికీ నానా అగచాట్లు పడుతున్నారు. ఎటిఎంలలో నో క్యాష్ సంక్షోభం పరిష్కారం కాలేదు.

అరుణ్‌జైట్లీ చెబుతున్నట్లు ప్రజలు డిజిటల్, క్యాష్ లెస్ లావాదేవీలకు నిజంగానే అలవాటుపడి ఉంటే ఈ దురవస్థ ఎందుకు ఎదురైంది? 70 శాతానికి పైగా పేద ప్రజలున్న దేశంలో కరెన్సీ, నాణేల రూపంలోని ద్రవ్యమే జీవన మూలం కావడం సహజం. మన దేశం అందుకు తిరుగులేని మచ్చుతునక. ఇటువంటి చోట ఒకేసారి పెద్ద నోట్లను విలువలేనివిగా చేయడం సాధారణ ప్రజలకోసమైతే కాదని ఘంటాపథంగా చెప్పవచ్చు. ఈ చర్య వెనుక ప్రధాని మోడీకిగల రహస్య లక్షం ఏమైనప్పటికీ ప్రజలు మాత్రం చెప్పనలవికాని కష్టాలకు గురయ్యారు. నిరుద్యోగం అసాధారణ స్థాయికి పెరిగిపోయింది. నోట్ల రద్దు జరిగిన తర్వాత కొద్ది మాసాల్లోనే 15 లక్షల కొలువులు రద్దయ్యాయని గణాంకాలు చెబుతున్నాయి. రెండేళ్లలో ఎన్నడూ లేనంతగా 2018 అక్టోబర్‌లో దేశంలో నిరుద్యోగం రేటు 6.7 శాతానికి చేరుకున్నదని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (ఇఎంఐఇ) తెలిపింది. పెద్ద నోట్ల రద్దుకు ముందు దేశ ఆర్థిక కార్యకలాపాల్లో కార్మిక భాగస్వామ్యం రేటు 47 48 శాతంగా ఉండగా, ఇప్పుడు 42.4 శాతానికి పడిపోయింది. ఏటా కోటి ఉద్యోగాలను సృష్టిస్తామని నరేంద్ర మోడీ ఇచ్చిన హామీ అడ్రసు లేకుండాపోయింది. మాటలతో మభ్యపెట్టి దేశ ప్రజలను బుట్టలో వేసుకోవడం ఒక్కసారే సాధ్యమవుతుందిగాని ఎల్లవేళలా కాదు.

The article about cancellation of Bank big notes

Telangana Latest News