అరివీర భయంకర అరిహంత్

భారత నౌకాదళంలో ప్రవేశించిన మొదటి దేశీయ అణ్వాయుధ జలాంతర్గామి అరిహంత్ మొన్న 7వ తేదీన అరిహంత్ మొదటి గస్తీ పూర్తి చేసి వచ్చింది. అరిహంత్ పూర్తిగా భారతదేశం తయారు చేసుకున్న అణ్వాయుధ జలాంతర్గామి. అణుశక్తితోనే నడుస్తుంది. అణ్వాయుధాలను ప్రయోగిస్తుంది. అరి అంటే శత్రువు. హంత్ అంటే సంహారకుడు. అరిహంత్ అంటే శత్రువును సంహరించేవాడని అర్థం. ఐఎన్‌ఎస్ అరిహంత్ రాకతో ఇప్పటికే అణు జలాంతర్గాములను నిర్మించి నిర్వహిస్తున్న అమెరికా, రష్యా, ఫ్రాన్స్, చైనా, బ్రిటన్‌ల సరసన భారత్ చేరింది. […]

భారత నౌకాదళంలో ప్రవేశించిన మొదటి దేశీయ అణ్వాయుధ జలాంతర్గామి అరిహంత్ మొన్న 7వ తేదీన అరిహంత్ మొదటి గస్తీ పూర్తి చేసి వచ్చింది. అరిహంత్ పూర్తిగా భారతదేశం తయారు చేసుకున్న అణ్వాయుధ జలాంతర్గామి. అణుశక్తితోనే నడుస్తుంది. అణ్వాయుధాలను ప్రయోగిస్తుంది. అరి అంటే శత్రువు. హంత్ అంటే సంహారకుడు. అరిహంత్ అంటే శత్రువును సంహరించేవాడని అర్థం. ఐఎన్‌ఎస్ అరిహంత్ రాకతో ఇప్పటికే అణు జలాంతర్గాములను నిర్మించి నిర్వహిస్తున్న అమెరికా, రష్యా, ఫ్రాన్స్, చైనా, బ్రిటన్‌ల సరసన భారత్ చేరింది.

ఐఎన్‌ఎస్ అరిహంత్ బరువు ఆరు వేల టన్నులు, పొడవు 110 మీటర్లు, వెడల్పు 11 మీటర్లు. జలగర్భంలో 24 నాటికల్ మైళ్ళ వేగంతో ప్రయాణిస్తుంది. నీటి ఉపరితలంపై 12 నుంచి 15 నాటికల్ మైళ్ల వేగం తో వెళుతుంది. ఎంత వేగంగా ప్రయాణించినా శబ్ధం ఉండదు. నిశ్శబ్ధంగా ప్రయాణిస్తుంది. సముద్రగర్భం నుంచీ క్షిపణులను ప్రయోగించే సామర్థ్యం ఉంది. శత్రువుల కంట పడకుండా నీటి లోపల ఎక్కువసేపు ఉండగలదు. ఈ జలాంతర్గామిలో ఉన్న అణు రియాక్టర్లు 83 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి. దీనిలో 12 సాగరిక క్షిపణులను అమర్చవచ్చు. ఒక్కో సాగరికా క్షిపణి 750 కి.మీ. రేంజ్‌లో లక్ష్యాన్ని ఛేదిస్తుంది. అలాగే 4 K-4 క్షిపణులను కూడా ప్రయోగించవచ్చు. ఈ క్షిపణుల రేంజ్ 1,500 కి.మీ.కు పైబడి ఉంటుంది. అరిహంత్ సముద్ర ప్రవేశం చేసి దాదాపు పది సంవత్సరాలై పోయింది. గుట్టుచప్పుడు కాకుండా 2009 జులై 6న అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ దంపతులు దీన్ని ప్రారంభించారు. విశాఖపట్నంలోని ఓడ నిర్మాణ కేంద్రం నుంచి సముద్ర జలాల్లోకి ప్రవేశపెట్టారు. 2014 డిసెంబరు నుంచి ప్రయోగాత్మక వినియోగం మొదలుపెట్టారు. కార్యకలాపాలకు సిద్ధంగా ఉందని 2016 ఫిబ్రవరిలో ప్రకటించారు. 100 మంది అరిహంత్ సిబ్బందికి రష్యా నిపుణులు శిక్షణ ఇచ్చారు. అరిహంత్ లో 95 మంది సిబ్బంది పనిచేస్తారు. సముద్రంలో 980 అడుగుల లోతుకు వెళ్ళగలదు. అణుశక్తితో నడుస్తుంది కాబట్టి చాలా నెలల వరకు జలగర్భంలోనే ఉండగలదు. శత్రువుల రాడార్లు దీన్ని పసిగట్టలేవు. అరిహంత్ నిర్మాణం జాతి గర్వించదగిన విజయం.

అణుత్రయమంటే … నేల నుంచి, ఆకాశం నుంచి, జలగర్భం నుంచి అణ్వాయుధాలు ప్రయోగించే సామర్థ్యం కలిగి ఉండడం. అరిహంత్ రావడంతో అణుత్రయం పూర్తయ్యింది. అణ్వాయుధాలు నేలపై నుంచి ప్రయోగించడానికి పృథ్వీ, అగ్ని క్షిపణులున్నాయి. ఆకాశం నుంచి అణ్వాయుధాలు ప్రయోగించడానికి మిరాజ్, జాగ్వర్, మిగ్ విమానాలున్నాయి. త్వరలో రానున్న రఫాల్ విమానాలు కూడా అణ్వాయుధ సామర్థ్యం కలిగినవి. జలగర్భం నుంచి అణ్వాయుధ ప్రయోగానికి అరిహంత్ జలాంతర్గామి జయప్రదంగా సేవలందించడం ప్రారంభించింది.

ఈ అణుత్రయం ఎందుకు అవసరమంటే, భారతదేశం అణ్వాయుధాల విషయంలో “ప్రథమ ప్రయోగం చేయం” అన్న విధానాన్ని ప్రకటించిన దేశం. అణ్వాయుధాల లక్ష్యం ప్రయోగించడం కాదు, శత్రువు ప్రయోగించకుండా నిలువరించడానికి ఉద్దేశించినవి. “ప్రథమ ప్రయో గం చేయం” అంటే అర్థం మనపై అణుదాడికి ఎవరైనా దిగితే తప్ప మనం మొదట అణ్వాయుధాలు ప్రయోగించడం జరగదని హామీ ఇవ్వడం. ఈ విధానం ప్రకటించిన దేశాలకు అణుత్రయం అవసరమవుతుంది. ఎందుకంటే, శత్రువు అణ్వాయుధ దాడికి దిగితే మొదట మన అణ్వాయుధాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తాడు. ఆ విధంగా తనపై ఎదురుదాడి జరక్కుండా జాగ్రత్త పడతారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతికత వల్ల నేల నుంచి ప్రయోగించే అణ్వాయుధాలు ఎక్కడెక్కడు ఉన్నాయో పసిగట్టడం శత్రువుకు సాధ్యం కావచ్చు. అలాగే విమానదళం ద్వారా ఆకాశం నుంచి ప్రయోగించే అణ్వాయుధాలు, వాటిని తీసుకెళ్ళే విమానాలను కూడా గుర్తించవచ్చు. కాని జలగర్భంలో రహస్యంగా సంచరించే జలాంతర్గామిని పసిగట్టడం శత్రువు వల్ల కాదు. కాబట్టి అణ్వాయుధ దాడి చేయాలంటే శత్రువులు అణ్వాయుధ జలాంతర్గామి నుంచి వచ్చే ఎదురుదాడికి కూడా సిద్ధంగా ఉండవలసి వస్తుంది.శత్రువును నిలువరించడానికి ఈ జలాంతర్గామి ఎంతై నా అవసరం. మొదటి దాడిలో మన అణ్వాయుధ పాటవాన్ని శత్రువు ధ్వంసం చేయలేడన్న భీతిని శత్రువులో కలిగించడం దీని లక్ష్యం.

భారత నౌకాదళం, భారత శాస్త్రవేత్తలు, రక్షణ వ్యూహకర్తల నిబద్దతకు అరిహంత్ నిదర్శనం. అంతేకాదు, భారత రాజకీయ నాయకులు, భారత వాణిజ్యసంస్థల నిబద్దతకు కూడా ఇది నిదర్శనం. ఎందుకంటే, డెబ్బయిల్లో ఇందిరాగాంధీ ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. ఎడ్వాన్సెడ్ టెక్నాలజీ వెహికిల్ ప్రాజెక్టుగా ఇది ప్రారంభమైంది.ఇందిరాగాంధీ త ర్వాత మురార్జీ దేశాయ్, చరణ్ సింగ్, మళ్లీ ఇందిరాగాంధీ, రాజీవ్ గాందీ, వి.పి.సింగ్, చంద్రశేఖర్, నరసింహారావు, వాజపేయి, దేవెగౌడ, ఐ.కె.గుజ్రాల్, మన్మోహన్ సింగ్.. ఇంతమంది ప్రధానులు వచ్చారు. కానీ ఎవ్వరు కూడా అత్యంత ప్రతిష్ఠాత్మకమైన, రక్షణకు సంబంధించి అత్యంత కీలకమైన ఈ ప్రాజెక్టు గురించి బయటకు పొక్కనీయలేదు. తమ రాజకీయ ప్రయోజనాలకు వాడుకునే ప్రయత్నాలు చేయలేదు. ఇది భారత రాజకీయాల పరిపక్వతకు, నిబద్దతకు నిదర్శనం. మరో విషయమేమంటే, అనేక ప్రైవేటు కంపెనీలు కూడా ఈ ప్రాజెక్టులో పాలు పంచుకున్నాయి. వాల్చంద్ నగర్ ఇండస్ట్రీస్ రియాక్టరుకు సంబంధించిన స్టీం టర్బయిన్లు, ఇతర కీలకమైన భాగాలను తయారు చేసింది. లార్సన్ అండ్ టూబ్రో, టాటా పవర్ ఎస్‌ఇడి వంటి అనేక కంపెనీలు ఇందులో తమ పాత్ర పోషించాయి. ప్రైవేటు కంపెనీలు పాలుపంచుకున్నప్పటికీ ఈ ప్రాజెక్టు గురించి వివరాలేవీ బయటకు పొక్కలేదు. మన వాణిజ్య సంస్థల నిబద్దతకు కూడా ఇది నిదర్శనం.

జలాంతర్గాములు రెండు రకాలు. సాంప్రదాయిక జలాంతర్గాములు. వీటిని ఎస్‌ఎస్‌కె అంటారు. ఇవి డీజిల్ ఇంజన్లతో – ఎలక్ట్రిక్ ఇంజన్లతో నడుస్తాయి. ఇవి ప్రతిరోజు సముద్ర ఉపరితలంపైకి రావడం అవసరం. లేకపోతే ఇంథనానికి కావలసిన ఆక్సిజన్ లభించదు. రెండవ రకం జలాంతర్గాములు అణు జలాంతర్గాములు. వీటిలో అణు రియాక్టరు ఉంటుంది. ఇవి ఉపరితలానికి రాకుండా జలగర్భంలోనే నెలల తరబడి ఉండగలవు. అణు జలాంతర్గాముల్లో రెండు రకాలున్నాయి. అణుశక్తితో నడిచి, శత్రువులపై దాడి చేసే జలాంతర్గాములను ఎస్‌ఎస్‌ఎన్ అంటారు. అణుశక్తితో నడుస్తూ, అణ్వాయుధ క్షిపణులు ప్రయోగించే జలాంతర్గాములను ఎస్‌ఎస్‌బిఎన్ అంటారు. నిపుణుల అంచనా ప్రకారం భారత నౌకాదళానికి కనీసం నాలుగు ఎస్‌ఎస్‌బిఎన్, ఆరు ఎస్‌ఎస్‌ఎన్, కనీసం 20 ఎస్‌ఎస్‌కె జలాంతర్గాములు అవసరం. ఇప్పుడు అరిహంత్ జలాంతర్గామి ఎస్‌ఎస్‌బిఎన్ తరగతికి చెందినది.

రష్యాకు చెందిన ఆకుల శ్రేణి జలాంతర్గామి మనం లీజుకు తెచ్చుకున్నాం. ఇక మిగిలిన ఎస్‌ఎస్‌కె జలాంతర్గాముల విషయానికి వస్తే కేవలం 13 మాత్రమే ఉన్నాయి. ఇందులో 9 సింధూఘోష్ శ్రేణి జలాంతర్గాములు. రష్యాకు చెందిన కిలో శ్రేణికి చెందినవి. మరో నాలుగు శిశుమార్ శ్రేణి జలాంతర్గాములున్నాయి. 2013లో జరిగిన ప్రమాదంలో ఒక జలాంతర్గామిని కోల్పోయాం. సాంప్రదాయిక జలాంతర్గాములను దేశీయంగా తయారు చేసుకునే పథకం 1999లోనే అమోదం పొందింది. ప్రాజెక్ట్ 75, ప్రాజెక్ట్ 75 (1) ప్రారంభమయ్యాయి. 2030 నాటికి 24 అత్యాధునిక సాంప్రదాయిక జలాంతర్గాములు తయారు చేయాలన్నది ప్రాజెక్టుల లక్ష్యం. అరిహంత్ దేశీయ పరిజ్ఞానంతో నిర్మించుకోవడం గర్వించదగిన విషయం. కానీ, ప్రపంచంలో అత్యధికంగా రక్షణ సామాగ్రి దిగుమతులు చేసుకునే దేశం భారతదేశమే. ప్రపంచంలో రక్షణ దిగుమతుల్లో 14 శాతం మనవే. చైనా 4.7 శాతం దిగుమతులు మాత్రమే చేసుకుంటుంది. అది రెండవస్థానంలో ఉంది. మనం అరిహంత్ వంటి అణు జలాంతర్గామి నిర్మించాం, కాని ఆయుధాల్లో రివాల్వర్లు, ఆటోమేటిక్ రైఫిళ్ళు, కలష్నికోవ్ వంటివి ఇంకా దిగుమతి చేసుకుంటున్నాం. ఆర్టిలరీ తుపాకులు కూడా ఇంకా దిగుమతి చేసుకుంటున్నాం.

Arihant means the enemy is killer

Telangana Latest News