దీవిలెకు ఇండ్లకు సున్నాలు, నోములు, బంతిపూల దండలు

దీవిలె పండుగ ఊల్లల్ల మంచిగనే చేస్తరు. దీవిలె అంటే ఏం లేదుల్లా ‘దీపావళి’ అన్నట్టు. పుస్తకాలల్ల ఇట్లుంటది ఊల్లల్ల అట్లంటరు. దీవిలె అనంగనే నోములు ఉంటయి చానమంది క్యాదార గౌరీ నోములు నోముకుంటరు. కొందరు శట్టివారం అని గిదీ టైం చేసికుంటరు. శట్టి అంటే పాలు, పెరుగు ఎవలకు పొయ్యరు. దేవునికి చేసుకుంటరు. క్యాదార గౌరీనోములు అంటే ముందు ఇండ్లకు సున్నాలు ఏస్తరు. సున్నం పొడి తెచ్చి గోలెంల కలిపి ఇంటి గోడలకు చీపురుకట్టలతోని కొట్టేది అట్లనే […]

దీవిలె పండుగ ఊల్లల్ల మంచిగనే చేస్తరు. దీవిలె అంటే ఏం లేదుల్లా ‘దీపావళి’ అన్నట్టు. పుస్తకాలల్ల ఇట్లుంటది ఊల్లల్ల అట్లంటరు. దీవిలె అనంగనే నోములు ఉంటయి చానమంది క్యాదార గౌరీ నోములు నోముకుంటరు. కొందరు శట్టివారం అని గిదీ టైం చేసికుంటరు. శట్టి అంటే పాలు, పెరుగు ఎవలకు పొయ్యరు. దేవునికి చేసుకుంటరు. క్యాదార గౌరీనోములు అంటే ముందు ఇండ్లకు సున్నాలు ఏస్తరు. సున్నం పొడి తెచ్చి గోలెంల కలిపి ఇంటి గోడలకు చీపురుకట్టలతోని కొట్టేది అట్లనే ఇద్దరు మనుషులు ఇల్లు పురాగ తెల్లగ చేస్తరు. పాత ఇల్లు బల్లిపాతర దుమ్ము, ధూళి పోయి తెల్లంగ అయితది. ఇల్లుకు సున్నం ఏపెచ్చుడు అంటే పెద్ద పని ఇంట్ల సామానంత తియ్యాలె బయట పెట్టాలె వాటి మీద సున్నం నీళ్లు పడకుంట ఏదన్న పరుదా కప్పాలె. ఇగ సున్నం ఏస్తరు ఇంటికి సున్నం ఏసినంగ బయట పడారి గోడలకు ఎర్ర అలుకు సల్లుతరు. పడారి గోడలను శానిగ మాట్లాడేటోళ్లు ‘ప్రహారీ గోడలు’ అని పలుకుతరు. పడారి గోడకు ఎర్ర అలుకు కొట్టితే ఎర్రగోడలు మస్తు కనిపిస్తయి. ఆ ఎర్ర అలుకు మీద తెల్లగసున్నం చిక్కగ చేసి గీతలు గీస్తరు.

ఈత చెట్టు కమ్మ దగ్గరుండి పుల్లను దంచితె మంచి బ్రష్ తయారు అయితది దాంతోని గీతలు గీస్తరు. ఎర్రని అలుకు మీద బొమ్మలు గీయవచ్చు పల్లెటూరోల్లు సదువు రాకున్నా సహజంగ కళాకారులు కాకపోతే ఇది కళ అని వాళ్లకు తెల్వది. కొందరు అస్సలు గా ముగ్గులు ఏస్తరు కొందరు రాగం తీసి పాటలు పాడుతరు మరికొందరు తమపూర్వీకుల నుంచి వచ్చిన కథలను చెప్పుతరు. వీటినే శాత్రాలు చెప్పుడు అంటరు. ఇట్ల పండుగ ముందు ఇంట్ల అంత సందడి సందడిగనే ఉంటది. సున్నం ఏసినంక గోడలకు బొట్లు పెట్టి తీనెలు తీసి కడుపలకు పచ్చరంగు ఏస్తరు. వాటి మీద ఎర్రగ గీతలు పెడుతరు. రంగులు లేనోల్లు పచ్చగ పసుపు పూస్తరు ఇంటి ముందు వాకిలి మంచిగ చేసుకుంటరు. పెద్ద దర్వాజకు బంతి పూలదండ కట్టుతరు. ఇంటి ముందు గల్మల్ల సుత మామిడి ఆకుల దోర్నం కట్టుతరు. నడుమ నడుమ బంతి పూలు కుచ్చుతరు ఈ దీవిలె యాల్లకే బంతిపూలు ఇరగపూస్తయి. ఎవుసం చేసుకునేటోల్లకు పొలంతో పాటు తోడు ఉండేది. ఆ తోటకు నీళ్లు పారిచ్చే పొన్న బంతిపూల చెట్టు పెడుతరు. ఎవుసం లేనోల్లకు సుత ఊర్లల్ల ఉన్నోళ్లు పూలు పుణ్యానికే ఇస్తరు. ఇట్ల పూలదండ మామిడి ఆకుల దోర్నం కట్టుకొని నోములు నోముకుంటరు.

నోముల నాడు గుమ్మడికాయ కూర, బెల్లన్నం, కాకరకాయ కూర, ఆన్వెకాయకూర, బెల్లప్పాలు చేసికుంటరు. నోములు పొద్దీక జాముల అయితయిగని పిల్లగండ్లు పుల్లెగండోళ్లు ముందుగల్లనే అన్ని తింటరు. అయితే దేవునికాడికి అని బెల్లన్నం, పసుపన్నం, బెల్లప్పాలు తీసి ఏరే పెట్టి ఉంచుతరు. దీవిలె అనంగనే కొత్తగ పెండ్లి అయిన అల్లుడు బిడ్డ ఇంటికి వస్తరు. అల్లునికి, బిడ్డకు కొత్త బట్టలు పెట్టుడు ఆనవాయితీ. దీవిలె నీసు తినే పండుగ కాదు కని అందరికీ ఇష్టమైన పండుగ ఎన్నటికాలంల పటాకలు కాల్చకపోయేది కాని రాను రాను ఊళ్లల్ల అక్కడక్కడ చిచ్చుబుడ్లు, కాకర పుల్లలు కాల్సుకునేది అంది ఇంకా పెరిగిపోయింది. దీపావళి అంటేనే టపాకాయలు కాల్చుడు కాడికి వచ్చింది. అయితే దీపావళి రోజు దీపాంతలల్ల సమరు పోసి వత్తితోని దీపాలు ముట్టిస్తరు. ఇంటి గల్మల్ల అటూ ఇటూ రెండు దిగుట్లు ఉంటయి. ఆ దిగుట్లల్ల దీపాలు వెలిగిస్తరు. గాలి వచ్చినా ఆరిపోకుండ అక్కడ దీపాలకు ఏర్పాట్లు చేసిండ్రు ఎన్కటోల్లు. దీపావళి రోజు వాకిలి అంతా సందడి, ఇంట్ల సందడి, చెల్లె, బావ బెల్లన్నం, నోములు దర్వాజలకు బంతిపూల దండలు అదొక పండగే అందరికీ..

-అన్నవరం దేవేందర్, 9440763479