ఉప్పుతిప్పలు

అనగనగా ఒక ఉప్పు రవ్వ. అది తల్లిదండ్రుల గారాల పట్టి. అల్లారు ముద్దుగా పెంచుకునేవారు. ఇల్లు విడిచి, బయటకు వెళ్లనిచ్చేవారు కాదు. నీరు నిప్పుతో స్నేహం చేయవద్దని చెప్పేవారు. కాని ఉప్పు కొత్త ప్రాంతాలను చూడాలనుకుంది. తన పాత స్నేహితులు నత్త, ఆల్చిప్పలను కలుసుకోవాలనుకుంది. ఒక రోజు తల్లిదండ్రులకు చెప్పకుండానే దగ్గరలో ఉన్న సముద్ర తీరానికి బయలుదేరింది. దారిలో ఉన్న నత్తగువ్వ ఇంటికి వెళ్ళింది. “మిత్రమా, నేను సముద్ర తీరానికి వెళ్తున్నాను. ఎప్పటి నుంచో సముద్రంలో ఎగిసిపడే […]

అనగనగా ఒక ఉప్పు రవ్వ. అది తల్లిదండ్రుల గారాల పట్టి. అల్లారు ముద్దుగా పెంచుకునేవారు. ఇల్లు విడిచి, బయటకు వెళ్లనిచ్చేవారు కాదు. నీరు నిప్పుతో స్నేహం చేయవద్దని చెప్పేవారు. కాని ఉప్పు కొత్త ప్రాంతాలను చూడాలనుకుంది. తన పాత స్నేహితులు నత్త, ఆల్చిప్పలను కలుసుకోవాలనుకుంది. ఒక రోజు తల్లిదండ్రులకు చెప్పకుండానే దగ్గరలో ఉన్న సముద్ర తీరానికి బయలుదేరింది. దారిలో ఉన్న నత్తగువ్వ ఇంటికి వెళ్ళింది.

“మిత్రమా, నేను సముద్ర తీరానికి వెళ్తున్నాను. ఎప్పటి నుంచో సముద్రంలో ఎగిసిపడే అలలను చూడాలనుకుంటున్నాను. నీవు నాతో వస్తవా. ఇద్దరం కలిసి వెళ్దాం.” అని అడిగింది ఉప్పు. నత్త సరేనంది. ఇరువురు బయలుదేరారు. ఆల్చిప్ప ఇంటికి వెళ్లారు. “స్నేహితుడా, నీవు కూడా మాతో రా. మేము సముద్ర తీరంలో కాసేపు ఆడుకొని వస్తాం.” ఆల్చిప్ప సరేనంది. ముగ్గురు కలిసి సముద్ర తీరం వైపు అడుగులు వేస్తున్నారు. అవి సముద్ర తీరాన్ని చేరుకున్నాయి.

అలలు ఒక్కొక్కటిగ తీరాన్ని తాకుతూ వెళ్తున్నాయి. వాటికి బాగా నచ్చింది. ఏనాడు సముద్రాన్ని చూడని అవి, నీళ్లను చూసి సంభ్రమాశ్చర్యానికి గురయ్యాయి. చాలాసేపు అలలను చూస్తూ గడిపాయి. ఇసుకలో గూడు కట్టాయి. కూల్చాయి. ఇలా చాలా సేపు ఆడుకున్నాయి. అలసిపోయాయి. ఇంతలో ఉప్పుకు సముద్రంలో స్నానం చేయాలనిపించింది. మిత్రులు వద్దని వారించినా, ఉప్పు నీళ్లలో దుమికింది. అంతే క్షణాల్లో నీటిలో మునిగిపోయింది. మిత్రులు ఉప్పు బయటకు వస్తుందని చాలా సేపు ఎదురుచూశారు. ఉప్పు రాలేదు. దాని జాడ తెలియలేదు భయపడ్డారు. చాలా సేపు ఏడ్చారు. ఇంతలో చీకటైంది. ఉప్పు తల్లిదండ్రులు బిడ్డ జాడను తెలుసుకుంటూ తీరాన్ని చేరుకున్నారు. “నా బిడ్డను మీరు చూసారా”, అని అడిగారు. మిత్రులు వారు జరిగిన విషయాన్ని చెప్పారు. తమ బిడ్డ తిరిగి రాదని తెలుసుకుని భోరుభోరున విలపించాయి. సముద్రుడితో తమ బిడ్డను తిరిగి ఇచ్చేయమని ప్రాధేయపడ్డారు.

ఆ తల్లిదండ్రుల గుండె కోతను అర్థం చేసుకున్న సముద్రుడు నీ బిడ్డ నా దగ్గరే క్షేమంగా ఉంది. దుఃఖించకు. అయితే నీ బిడ్డను ఇప్పుడు నేనివ్వలేను. కానీ నీకు చూడాలనుకున్నప్పుడు నా వద్దకు రా అంది. “నా అలల నీరు ఉప్పు కయ్యలలోకి చేరి, ఎండవేడికి ఆవిరౌతుంది. అప్పుడు అక్కడ ఉప్పు ఏర్పడుతుంది. ఆ ఉప్పులో నీ బిడ్డను చూసుకో” అని అన్నాడు సముద్రుడు. ఆ మాటలు విన్న ఆ తల్లిదండ్రులు స్థిమిత పడ్డారు. ఒకరోజు బిడ్డను చూడాలన్న కోరికతో సముద్రాన్ని చేరుకున్నారు. అలల నీరు ఉప్పుకయ్యలలో చేరి, ఎండకు ఆవిరై ఉప్పు స్పటికాలుగా మారుతున్న ఆ దృశ్యాన్ని చూశారు. లక్షల, కోట్ల స్ఫటికాలలో బిడ్డను చూసుకున్నారు. ఎంతో సంతోషించారు. సముద్రునికి లోలోన కృతజ్ఞతలు చెప్పి, ఇంటి ముఖం పట్టారు.

పుల్లూరి జగదీశ్వర్‌రావు
సెల్:9441538797

Salt Story With Sea in Telugu

Telangana news