తెలంగాణ శ్రీశైలం.. ఓదెల

శ్రీశైలం ఈ మాట వినగానే భక్తి పారవశ్యంతో నిండిపోతుంది. శ్రీశైలం మాదిరిగానే లింగరూపం, పానపట్టం ఉండటంతో తెలంగాణ శ్రీశైలంగా పేరుగాంచిన శైవక్షేత్రమే పెద్దపల్లి జిల్లాలోని మల్లికార్జునస్వామి దేవాలయం. తనకు గాయం చేసిన భక్తుడికి సైతం మోక్షాన్ని ప్రసాదించడమే కాకుండా అతడి పేరును పక్కన చేర్చుకుని ఓదెల మల్లన్నగా పూజలందుకుంటున్నాడు.. ఆలయానికి వెళ్ళాలంటే కరీంనగర్ జిల్లా కేంద్రానికి 40కిలోమీటర్ల దూరంలో మల్లికార్జునస్వామి క్షేత్రం ఉంది. రైలు రోడ్డు మార్గాల ద్వారా ప్రయాణించి ఈ ఆలయానికి చేరుకోవచ్చు. కరీంనగర్ బస్సు […]

శ్రీశైలం ఈ మాట వినగానే భక్తి పారవశ్యంతో నిండిపోతుంది. శ్రీశైలం మాదిరిగానే లింగరూపం, పానపట్టం ఉండటంతో తెలంగాణ శ్రీశైలంగా పేరుగాంచిన శైవక్షేత్రమే పెద్దపల్లి జిల్లాలోని మల్లికార్జునస్వామి దేవాలయం. తనకు గాయం చేసిన భక్తుడికి సైతం మోక్షాన్ని ప్రసాదించడమే కాకుండా అతడి పేరును పక్కన చేర్చుకుని ఓదెల మల్లన్నగా పూజలందుకుంటున్నాడు..

ఆలయానికి వెళ్ళాలంటే కరీంనగర్ జిల్లా కేంద్రానికి 40కిలోమీటర్ల దూరంలో మల్లికార్జునస్వామి క్షేత్రం ఉంది. రైలు రోడ్డు మార్గాల ద్వారా ప్రయాణించి ఈ ఆలయానికి చేరుకోవచ్చు. కరీంనగర్ బస్సు డిపో నుంచి పెద్దపల్లి చేరుకునే ప్రతి బస్సూ ఓదెల మీదుగానే వెళ్తుంది. వరంగల్ జిల్లా నుంచి 60 కిలోమీటర్లు రోడ్డు మార్గం ద్వారానైనా ఇక్కడకు చేరుకోవచ్చు.

దిక్కులనే అంబరాలుగా కలిగిన ఆ దేవదేవుడు భ్రమరాంబ సహిత మల్లికార్జునుడిగా వెలుగొందుతున్న క్షేత్రం ఓదెల. పురాతన శైవ క్షేత్రాల్లో ఈ ఆలయం ఒకటి. ఇక్కడ మల్లికార్జునుడు స్వయంభుగా వెలిశాడనీ, ఆర్తిగా మల్లన్నా అని పిలిస్తే చాలు నేనున్నానంటూ అభయమిస్తాడనీ భక్తుల నమ్మకం. అందుకే, ఓదెల మల్లన్నను దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచీ పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడ బారులుతీరుతారు.

స్థలపురాణం

పూర్వం ఓదెల ప్రాంతమంతా దండకారణ్యంగా ఉండేదనీ, అక్కడే వెలసిన శివలింగాన్ని పంకజ మహాముని పూజించేవాడనీ ఆలయ స్తంభంపై చెక్కిన మునీశ్వరుడి రూపం, పేర్లూ తెలియజేస్తున్నాయి. కాల లింగం పూర్తిగా కనుమరుగైపోయింది. అదే స్థలంలో చింతకుంట ఓదెలు అనే రైతు వ్యవసాయం కోసం పుట్టను దున్నుతుండగా నాగలి పుట్టలోపలున్న లింగాన్ని బలంగా తాకింది. ఆ సమయంలో భయంకరంగా ఓంకార నాదం చేస్తున్న అశరీరవాణి ‘ఓదెలా! ఇకపై ఈ వంశం నశించుగాక అని శపించింది. జరిగిన పొరపాటును గ్రహించిన ఓదెలు వెంటనే స్వామి వారికి నమస్కరించి, తాను తెలియక చేశాననీ, తనని మన్నించమనీ ప్రాధేయపడ్డాడు. అతడి నిజాయితీనీ, పశ్చాత్తాప బుద్ధిని మెచ్చిన శంకరుడు ఓదెలకు శాశ్వత మోక్షాన్ని ప్రసాదించడమే కాకుండా ఓదెల మల్లికార్జున స్వామిగా ఈ ప్రాంతంలోనే కొలువై భక్తుల కష్టాలను తీరుస్తానని అభయమిచ్చాడు. అప్పటి నుంచీ ఈ ఆలయాన్ని ఓదెల మల్లికార్జున స్వామి దేవాలయంగా పిలుస్తున్నారు. ఇప్పటికే ఇక్కడున్న శివలింగానికి నాగలి కర్ర చేసిన గాయాన్ని పోలిన ఆనవాలు కనిపించడం విశేషం. కాకతీయుల కాలంలో ఈ ఆలయ పునర్నిర్మాణం జరిగిందని ఇక్కడి శాసనాలు తెలియజేస్తున్నాయి. స్వామి వారికి ఉత్తరంగా భ్రమరాంబ అమ్మవారినీ, క్షేత్రపాలకుడిగా వీర భద్రస్వామినీ ప్రతిష్ఠించారు. వీరశైవ ఆగమ శాస్త్ర ప్రకారం శ్రీశైల పండితారాధ్య పీఠానికి సంబంధించిన అర్చకులతోనే స్వామి వారికి నిత్యకైంకర్యాలు జరుపుతున్నారు. ఆలయానికి పశ్చిమ దిశలో వీరశైవ మఠం కూడా ఉంది. అపరభక్తులైన కొండవీటి వంశంలో మల్లన్న ఖండేశ్వరుడిగా అవతరించాడు. బలిజ వంశానికి చెందిన కేతమ్మలనే కన్యలు ఖండేశ్వరస్వామిని భక్తితో సేవించి ఆయనలో లీనమయ్యారు. ఇందుకు ప్రతిరూపంగా ఆలయానికి ఈశాన్యదిశలో ఖండేశ్వరస్వామి, మేడలాదేవి, కేతమ్మల విగ్రహాలు ప్రతిష్ఠించారని పండితులు చెబుతున్నారు.

సీతారాములు నడయాడిన ప్రదేశం

ఈ ఆలయంలో మరో విశేషమూ ఉంది. శ్రీరామచంద్రుడు వనవాసం చేస్తున్న సమయంలో రామగిరి ఖిల్లా నుంచి ఇల్లంతకుంటకు వెళ్లే మార్గంలో మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నట్లు పురాణాలు చెబుతున్నాయి. అందుకు గుర్తుగా స్వామి వారికి దక్షిణ దిశగా శ్రీ సీతారామచంద్ర స్వామి విగ్రహాలను ఏర్పాటు చేశారని భక్తుల విశ్వాసం. ఆలయానికి తూర్పు దిశగా బంగారు పోచమ్మ, వాయవ్య దిశగా మదన పోచమ్మ ఆలయాలూ ఉన్నాయి.

బ్రహ్మోత్సవ సమయంలో…

ఫిబ్రవరిలో నిర్వహించే బ్రహ్మోత్సవాల సందర్భంగా మల్లికార్జున స్వామి భ్రమరాంబ దేవిల కళ్యాణ మహోత్సవం అత్యంత రమణీయంగా జరుగుతుంది. కార్తీక, శ్రావణ మాసాల్లో జరిపే ప్రత్యేక పూజలూ, మహా శివరాత్రి సందర్భంగా నిర్వహించే మహారుద్రాభిషేకాలూ విశిష్టతను సంతరించుకుంటాయి. ఈ పూజల్లో పాల్గొనడానికి దేశం నలుమూలల నుంచీ పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. ఒగ్గు పూజారులు వేసే పెద్ద పట్నాలు, అగ్ని గుండాల ప్రదక్షిణ, దక్షయాగాది కార్యక్రమాలను ప్రత్యేకంగా నిర్వహిస్తారు.

స్వామి వారికి తెల్లవారుజాము నుంచే మేలుకొలుపు సేవ, సుప్రభాత సేవలు ప్రారంభమవుతాయి. మంగళ వాద్యాల నడుమ నిత్యాభిషేకాలూ, అన్నపూజలూ, మహా నివేదనలూ ఘనంగా నిర్వహిస్తారు. సాయంత్రం ఆరు గంటల తర్వాత జరిగే ప్రదోషకాల పూజలూ, హారతీ, ద్వార బంధన కార్యక్రమాలు విశిష్టమైనవి. పట్నాలు, బోనాల మొక్కులు సమర్పించే భక్తులతో ఈ ఆలయంలో ఎప్పుడూ పండుగ వాతావరణం కనిపిస్తుంది.