ముక్కలైన హృదయాలు

వెంటాడుతున్న కాళరాత్రి దుర్ఘటన విషాదం మిగిల్చిన రైలు ప్రమాదం విచారణకు ఆదేశించిన సిఎం అమరీందర్ సింగ్ అమృత్‌సర్ : దసరా వేడుకనాడు అమృత్‌సర్ దగ్గర జరిగిన ఘోర రైలు ప్రమాద బాధితులు ఆ కాళరాత్రిని తలుచుకుని అల్లాడిపోతున్నారు. తనవారిని కోల్పోయిన వారి శోకానికి అంతులేదు. తన కొడుకు కోసం తల్లడిల్లిన తండ్రికి తీరని వేదన మిగిలింది. ప్రాణాలతో తిరిగి వస్తాడని ఎదురు చూసిన విజయ్‌కుమార్ అనే బాధితుడికి తన వాట్సప్‌లో వచ్చిన ఫొటో అతని గుండెని ముక్కలు […]

వెంటాడుతున్న కాళరాత్రి దుర్ఘటన
విషాదం మిగిల్చిన రైలు ప్రమాదం
విచారణకు ఆదేశించిన సిఎం అమరీందర్ సింగ్

అమృత్‌సర్ : దసరా వేడుకనాడు అమృత్‌సర్ దగ్గర జరిగిన ఘోర రైలు ప్రమాద బాధితులు ఆ కాళరాత్రిని తలుచుకుని అల్లాడిపోతున్నారు. తనవారిని కోల్పోయిన వారి శోకానికి అంతులేదు. తన కొడుకు కోసం తల్లడిల్లిన తండ్రికి తీరని వేదన మిగిలింది. ప్రాణాలతో తిరిగి వస్తాడని ఎదురు చూసిన విజయ్‌కుమార్ అనే బాధితుడికి తన వాట్సప్‌లో వచ్చిన ఫొటో అతని గుండెని ముక్కలు చేసింది. తన 18 ఏళ్ల కొడుకు మృతదేహం ఫొటో చూసి కన్నీరుమున్నీరయ్యాడు. రావణ దహన వేడుకని చూడటానికి వెళ్లిన తన కొడుకు తిరిగిరాని లోకానికి వెళ్లాడని ఆ తండ్రి తల్లడిల్లిపోతున్నాడు. తన పెద్ద కొడుకు క్షేమంగా ఇంటికి చేరుకున్నాడు.

కాని చిన్న కొడుకు జాడ తెలియలేదు. అతని కోసం ప్రతి ఆసుపత్రికి వెళ్లి గాయపడిన వారిలో తన కొడుకు ఉన్నాడా అని గంపెడాశతో వెతికాడు. రావణ దహన వేడుకను రైలు పట్టాల మీద నిలబడి చూస్తున్న వారి మీదికి రైలు రూపంలో మృత్యువు దూసుకు వచ్చింది. బాణాసంచా పేలుళ్ల శబ్దానికి రైలు కూత వినపడలేదు. ఒకవైపు నుంచి దూసుకు వచ్చిన రైలు నుంచి తప్పించుకునే క్రమంలో మరో పట్టాలపై అతి వేగంగా వచ్చిన మరో రైలు మనుషులను తునాతునకలు చేసింది. అంతా క్షణాల్లో జరిగిపోయింది. తన కొడుకు కోసం వెతికిన తండ్రికి విషాదమే మిగిలింది. ఈ రైలు ప్రమాదంలో 61 మంది ప్రాణాలు కోల్పోయారు. 70 మందికిపైగా గాయపడ్డారు.

ప్రభుత్వ మెడికల్ కాలేజీకి చెందిన గురునానక్ ఆసుపత్రిలో బాధితుల పరిస్థితి విషమంగా ఉంది. కొందరు ఈ విషాదం వల్ల కలిగిన షాక్ నుంచి ఇంకా తేరుకోలేదు. మాటామంతి లేక నిశ్చేష్టులై చూస్తున్నారు. ప్రమాదంలో ముక్కలైన శరీర భాగాలు రైలు పట్టాలపై పడి ఉండం చూశానని ప్రమాదంలో తల, కాళ్లకు గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు చెప్పారు. రావణ దిష్టిబొమ్మకు నిప్పంటించగానే వేదిక దగ్గర నుంచి అంతా రైల్వే పట్టాలవైపు వెళ్లారు. అదే సమయంలో ఒక ట్రాక్‌పై రైలు దూసుకువచ్చింది. దాని నుంచి తప్పించుకోవడానికి మరో రైలు పట్టాలవైపు వెళ్లగానే ఆ మార్గంలో మరో రైలు దూసుకువచ్చి జనంపై నుంచి వెళ్లింది. బాణాసంచా పేలుళ్ల వల్ల రైలు కూత వినపడలేదని మరో బాధితురాలు చెప్పింది. ఒకటిన్నర ఏళ్ల మేనకోడలు, తన తమ్ముడిని కోల్పోయిన ఆమె అంతా క్షణాల్లో జరిగిపోయిందని తెలిపింది. తాను రైలు పట్టాలపై నిలబడలేదని, తొక్కిసలాటలో తన తలకు కాళ్లకు గాయాలయ్యాయని ఉత్తరప్రదేశ్‌కి చెందిన 40 ఏళ్ల బాధితుడు చెప్పాడు. ప్రభుత్వ ఆసుపత్రితోపాటు ప్రైవేటో అసుపత్రులు బాధితుల ఆర్తనాదాలు మిన్నంటుతున్నాయి. బంధువులను కోల్పోయిన వారి శోకానికి అంతులేకుండా పోయింది. ఖుషి అనే మరో బాధితురాలు దారుణ సంఘటనలో గాయపడి మాట మాట్లాడలేని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఆసుపత్రికి తీసుకువచ్చిన వారిలో 20 మంది అప్పటికే చనిపోయారని గురునానక్ ఆసుపత్రి సర్జన్ డాక్టర్ రాకేష్ శర్మ చెప్పారు. గాయపడిన వారిలో అత్యధికులు బీహార్ , ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారని డాక్టర్ మయాంక్ తెలిపారు. 80 నుంచి 90 మంది డాక్టర్లు రేయింబవళ్లు బాధితులకు చికిత్స అందిస్తున్నారని ఆయన చెప్పారు.

39 మంది మృతుల గుర్తింపు

రైలుదుర్ఘటనలో చనిపోయిన 61 మందిలో 39 మందిని గుర్తించామని అధికారులు ప్రకటించారు. ప్రమాదంలో గాయపడిన వారిని ఏడు ఆసుపత్రుల్లో చేర్చి చికిత్స చేయిస్తున్నామని తెలిపారు.శుక్రవారం నాటి ప్రమాదంలో 61 మంది ప్రాణాలు కోల్పోగా 72 మంది గాయాలపాలయ్యారు.అమృత్‌సర్‌లోని జోడా పాఠక్ రైల్వే క్రాసింగ్ దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రావణ దహనకాండని చూడటానికి అక్కడ సుమారు 300 మంది వచ్చారు.

బాధితులను పరామర్శించిన సిఎం

అమృత్‌సర్ రైలు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ పరామర్శించారు. ఈ ప్రమాదంపై విచారణకు ఆదేశించారు. ఇజ్రాయిల్ పర్యటనని ఆయన వాయిదా వేసుకున్నారు. ఈ ప్రమాదంపై మేజిస్ట్రేట్‌తో విచారణకు ఆదేశించానని ఆయన తెలిపారు. నాలుగు వారాల్లో నివేదిక అందజేయాలని కోరానని ఆయన చెప్పారు. జలంధర్ డివిజనల్ కమిషనర్‌కు విచారణ బాధ్యతని అప్పగించామని ఆయన తెలిపారు.చనిపోయిన వారి కుటుంబానికి 5 లక్షల వంతున పరిహారం ప్రకటించారు. గాయపడిన వారి వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని ఆయన చెప్పారు. అమృత్‌సర్ విమానాశ్రయంలో దిగిన వెంటనే సిఎం దుర్ఘటన జరిగిన ప్రాంతానికి వెళ్లారు. సీనియర్ అధికారులను కలిసి వివరాలు తెలుసుకున్నారు. విపత్తు నిర్వహణ బృందంతో చర్చలు జరిపారు. తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయన వెంట ఆరోగ్యశాఖ మంత్రి బ్రహ్మ మోహిందర్, మంత్రి నవజోత్ సింగ్ సిద్ధూ , విద్యా శాఖ మంత్రి ఒపి సోని, పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు సునీల్ జాఖర్ ఉన్నారు.

Related Stories: