మైసూరు దసరా మగోన్మాదం

మహిళ ఎంత గింజుకున్నా ఆమెను నాలుగ్గోడల మధ్య గుంజకు గట్టిగా కట్టి బందీగా ఉంచడమే లక్షమని మన పురుష లోకం పదేపదే చాటుతున్నది. ఆమెను నానా వేధింపులకు గురి చేసి తిరిగి చీకటింటిలోకి పంపించి తాళాలు బిగించడమే తన ఉద్దేశమని ఢంకాబజాయించి చెబుతున్నది. దేశ అత్యున్నత న్యాయస్థానం హెచ్చరికలు, ఆగ్రహ ప్రకటనలు కూడా ఈ పరిస్థితిలో మార్పు తీసుకు రాలేకపోతున్నాయి. మైసూరు దసరా ఉత్సవాల్లో భాగంగా గత శనివారం నాడు తీసిన ఒక ఊరేగింపులో పాల్గొన్న తాము […]

మహిళ ఎంత గింజుకున్నా ఆమెను నాలుగ్గోడల మధ్య గుంజకు గట్టిగా కట్టి బందీగా ఉంచడమే లక్షమని మన పురుష లోకం పదేపదే చాటుతున్నది. ఆమెను నానా వేధింపులకు గురి చేసి తిరిగి చీకటింటిలోకి పంపించి తాళాలు బిగించడమే తన ఉద్దేశమని ఢంకాబజాయించి చెబుతున్నది. దేశ అత్యున్నత న్యాయస్థానం హెచ్చరికలు, ఆగ్రహ ప్రకటనలు కూడా ఈ పరిస్థితిలో మార్పు తీసుకు రాలేకపోతున్నాయి. మైసూరు దసరా ఉత్సవాల్లో భాగంగా గత శనివారం నాడు తీసిన ఒక ఊరేగింపులో పాల్గొన్న తాము లైంగిక వేధింపులకు గురైనట్టు పలువురు మహిళలు సోషల్ మీడియాలో వివరించిన ఉదంతాలు గమనించదగినవి. ఆ ఊరేగింపులో ఉత్సాహంతో పాలుపంచుకున్న తమపై కొంత మంది యువకులు నీచమైన వ్యాఖ్యానాలు చేశారని, ఒంటిమీద చేతులు వేసి వికృత చేష్టలకు పాల్పడ్డారని ఆ మహిళలు సామాజిక మాధ్యమాల్లో వివరించడంతో కర్నాటక ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. పోలీసులు మాత్రం అలవాటైన పద్ధతిలోనే తమకు ఎవరి నుంచీ ఫిరాదు అందలేదని ప్రకటించారు.
సామాజికంగా ద్వితీయ శ్రేణిలో ఉన్నవారు తమకు మించిన వారి నుంచి ఎదురవుతున్న సమస్యలపై తమకు తాముగా ఫిర్యాదు చేసే వరకు వేచి వుండడం మంచి సామాజిక లక్షణం కాదు. మగ వారి నుంచి మహిళలు ఎదుర్కోకూడని ఇబ్బందులకు ఏ మాత్రం సందు లేకుండా చూడవలసిన బాధ్యత సమాజానిదే. ఆ ఊరేగింపు సమయంలో పొద్దుగుంకిపోయిన తర్వాత కూడా నిర్వాహకులు లైట్లు వెలిగించలేదని వార్తలు చెబుతున్నాయి. మహిళలు పాల్గొనే అటువంటి సన్నివేశాలలో తప్పని సరిగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపట్ల నిర్వాహకులు నిర్లక్షం వహించారని అర్థమవుతున్నది. వెలుగు మునిగిపోయి చీకటి కమ్ముకోవడం మహిళలపై అసభ్యప్రవర్తనకు లభించిన లైసెన్సు అనుకోవడం ముమ్మాటికీ అమానుషం.
స్త్రీ, పురుషులనే తేడా లేకుండా ప్రతి మనిషికి ఉండాల్సిన హక్కులను, జాగాను గౌరవించడమే సాటి పౌరుల బాధ్యత. మహిళ విషయంలో ఈ పరిమితిని పాటించకపోవడమే పురుష లక్షణమని మన సమాజం భావిస్తున్నదనే అభిప్రాయానికి తావుకలుగుతున్నది. బీహార్‌లో ఈ మధ్యనే చోటు చేసుకున్న ఇటువంటి మరో ఘటన కూడా ఇదే భావన కలిగించింది. ఆ రాష్ట్రంలోని సుపాల్ అనే గ్రామంలోని పలువురు యువకులు అక్కడి కస్తూర్బా బాలికల పాఠశాలలోకి కర్రలతో ప్రవేశించి విద్యార్థినులను చితకబాదారు. 34 మంది బాలికలు గాయపడ్డారు. ఆ యువకులు ఆ పాఠశాల గోడల మీద తరచుగా అసభ్యమైన రాతలు రాస్తూ ఆ బాలికలను అవమానిస్తూ ఉండేవారు. ఒకరోజు ఒక యువకుడిని అమ్మాయిలు అడ్డుకోబోయారు. అందుకు ఆగ్రహించిన యువకులు స్కూల్లో చొరబడి బాలికలను చితకబాదారు. ఈ ఘటనపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. తరచూ ఇటువంటి ఘటనలు సంభవించడంపై బీహార్ ప్రభుత్వాన్ని ఘాటుగా ప్రశ్నించింది. అంతకు ముందు ముజఫర్ పూర్ అనాథ శరణాలయంలోని బాలికలపై వరుస అత్యాచారాల ఘటన బీహార్ ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసింది.
మైసూర్ ఉదంతం కాని, బీహార్ కస్తూర్‌బా బాలికలపై దాడి ఘటనగాని దేశంలో మహిళలకు రక్షణ లేమిని మరింత తీవ్రంగా ఎత్తిచూపాయి. ఇల్లు దాటి బయట కాలుపెట్టే మహిళ సురక్షితంగా, ఆత్మ గౌరవ భద్రతతో తిరిగి చేరుకుంటుందనే హామీలేని పరిస్థితిని ఈ ఘటనలు చాటుతున్నాయి. మహిళను సాటి మనిషిగా కాకుండా తమ కామ దాహానికి లభించిన ఎరగా మాత్రమే పురుషులు చూడడమనే బాధాకరమైన అమానవీయమైన పరిస్థితి ఇది. బాగా ఆడే మన సినిమాల్లో కూడా స్త్రీని వేధించడమే మగతనమనే అభిప్రాయాన్ని కలిగించే సన్నివేశాలు మామూలయిపోయాయి. లోతుగా వేళ్లూనుకున్న పురుషాధిపత్య, ఫ్యూడల్ సామాజిక దుర్నీతిని పెకలించడానికి అవసరమైన అధికారాలను రాజ్యాంగం ప్రసాదించింది. అయినా మతం, సంస్కృతిపేరిట వాటిని నిర్వీర్యం చేయడానికి బలమైన శక్తులు పనిచేస్తున్నాయి. సుప్రీంకోర్టు ఇచ్చిన తిరుగులేని తీర్పులను వమ్ముచేయడానికి మూకోన్మాదాన్ని రెచ్చగొడుతున్నాయి. బాధిత మహిళాలోకం నుంచే అందుకు మద్దతు సమీకరించే దుస్సాహసానికీ పాల్పడుతున్నాయి. తమపై జరుగుతున్న అన్యాయాలను ఎత్తిచూపడానికి సోషల్ మీడియాను వినియోగించుకునే సాహసాన్ని ప్రదర్శిస్తున్న మహిళలు మరింతగా సంఘటితం కావలసి ఉన్నది. అందుబాటులోని అన్ని వేదికలునూ ఉపయోగించుకుని రాజ్యాంగ పరమైన రక్షణలను వాడుకొని తమకు సురక్షితమైన సమగ్ర సమ సమాజాన్ని సాధించుకోవడానికి ఉద్యమించాలి. అందుకు అభ్యుదయ శక్తులు అండ నిలవాలి.