పోటీ పరీక్షల విషాదం..!

ఏ పోటీ పరీక్షల్లో అయినా జయాపజయాలు ఉంటాయి. అన్ని పరీక్షలు లోతైనవి కాకపోవచ్చు. కానీ పోటీ పరీక్షలకు ఈ లక్షణం ఉంటుంది. పోటీ పరీక్షలకు వెళ్లే వారు తమ లక్ష్యమైన సివిల్ సర్వీసులు, వైద్య, మేనేజ్‌మెంట్, సాఫ్ట్ వేర్, ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలు రాస్తుంటారు. ఈ ఉద్యోగాల మీద ఆసక్తి ఎక్కువ ఉంటుంది. తమకు ఇష్టమైన ఉపాధి సంపాదించుకోవాలంటే పోటీతత్వం ఉంటుంది. ఇది చిన్నతనంలోనే విద్యార్థులను వెన్నాడుతూ ఉంటుంది. ఈ పరీక్షలు గట్టెక్కితే తాము కోరుకున్న ఉద్యోగాలు […]

ఏ పోటీ పరీక్షల్లో అయినా జయాపజయాలు ఉంటాయి. అన్ని పరీక్షలు లోతైనవి కాకపోవచ్చు. కానీ పోటీ పరీక్షలకు ఈ లక్షణం ఉంటుంది. పోటీ పరీక్షలకు వెళ్లే వారు తమ లక్ష్యమైన సివిల్ సర్వీసులు, వైద్య, మేనేజ్‌మెంట్, సాఫ్ట్ వేర్, ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలు రాస్తుంటారు. ఈ ఉద్యోగాల మీద ఆసక్తి ఎక్కువ ఉంటుంది. తమకు ఇష్టమైన ఉపాధి సంపాదించుకోవాలంటే పోటీతత్వం ఉంటుంది. ఇది చిన్నతనంలోనే విద్యార్థులను వెన్నాడుతూ ఉంటుంది. ఈ పరీక్షలు గట్టెక్కితే తాము కోరుకున్న ఉద్యోగాలు సంపాదించే అవకాశం ఉంటుంది కనక వీటికి చాలామంది హాజరవుతూ ఉంటారు. కొన్ని వందలో, వేలో ఉన్న ఉద్యోగాలకు విపరీతమైన పోటీ ఉంటుంది. సాధారణంగా వడపోతల కోసం ఉద్దేశించిన ఈ పరీక్షల్లో విజయాల కన్నా వైఫల్యాలే ఎక్కువ ఉంటాయి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యు.పి. ఎస్.సి.), గ్రాడ్యుయేట్ రికార్డ్ ఎగ్జామినషన్ (జి.ఆర్. ఇ.), గ్రాడ్యుయేట్ మనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్ట్ (జి.ఎం. ఎ.టి.), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జాం (ఐ.ఐ.టి.జె.ఇ.ఇ.) నేషనల్ ఎలిజిబిలిటీ కం ఎంట్రెన్స్ టెస్ట్ (ఎన్. ఇ.ఇ. టి.) మొదలైన పరీక్షల ద్వారా కొన్ని వేలమందిని మాత్రమే ఎంపిక చేస్తారు. వీటికి లక్షలాదిగా పోటీ పడతారు.

ఈ పరీక్షలలో విజయాలకన్నా అపజయాలు ఎక్కువ ఉన్నప్పుడు వీటి కోసం ఎందుకంత పోటీ పడతారన్నది అసలు ప్రశ్న. ఈ వైఫల్యాల గురించి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోదో అంతుబట్టదు. వాటి పర్యవసానాలను ఎందుకు గమనించదో తెలియదు. పరీక్షల వెనక ఉన్న తాత్విక ధోరణి వ్యక్తిగత వైఫల్యాలను నివారించగలుగుతుంది. సామాజిక అశాంతిని దూరం చేయగలుగుతుంది. ఈ పరీక్షలకు హాజరయ్యే వారిలో నిరాశకన్నా ఆసక్తే ఎక్కువ ఉంటుంది. నిజానికి పరీక్షలు ఆశా నిరాశల మధ్య సమతూకం సాధించడానికి ఉద్దేశించినవి. పదవీ కాంక్ష, తమకు ఆ ఉద్యోగం దక్కాలన్న ఆకాంక్ష ‘ఇవ్వాళ్ల నేను విజయం సాధిస్తాను, రేపు నీకు దక్కుతుంది’ అన్న భావన కలగజేస్తుంది. ఆశ నిరాశను దూరం చేస్తుంది. నిరాశ విధ్వంసకరమైంది. పోటీ పరీక్షల మీద ఆశ పురిగొల్పడానికి అసలు కారణం ఇదే. ఈ పరీక్షలు నిబంధనల ప్రకారం జరుగుతాయని, దాపరికం లేకుండా ఉంటాయని అనుకోవడంవల్ల ఇవి హేతుబద్ధంగా కనిపిస్తాయి. అందువల్లే ఈ పరీక్షలకు వెళ్లే వారిలో ఓ విశ్వాసం కలుగుతుంది. ఆ తర్వాత తమ వైఫల్యానికి కారణం ఏమిటో తెలుసుకోగలుగుతారు.

ఈ పరీక్షల్లో విఫలమైన వారు వైఫల్యానికి కారణం తామే అని సరిపెట్టుకుంటారు. అయినా మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తారు. అదే వైఫల్యం ఎదురైతే ఆత్మహత్యలకు పాల్పడే వారూ ఉన్నారు. ఇందులో వారి ఆకాంక్ష కన్న పరీక్షల తాత్వికత మీదే ఎక్కువ నమ్మకం ఉంటుంది. ఈ పరీక్షల్లో విజయమో అపజయమో ఎదుర్కొనే వారు ఇలా సరిపెట్టుకుంటారు కనకే యోగ్యమైన ఉద్యోగాలు కల్పించే బాధ్యత నుంచి ప్రభుత్వం వాటంగా తప్పించుకుంటుంది. అవకాశాలు కల్పించే బాధ్యత విస్మరిస్తుంది. ఈ అంశాన్ని ఖాతరు చేయకపోతే పరిణామాలు దారుణంగా ఉంటాయన్న ధ్యాస కూడా ప్రభుత్వాలకు ఉండదు. అవకాశాలు తగ్గడంపై ప్రభుత్వానికి ఎలాంటి ఆందోళనా ఉండదు. ముఖ్యంగా సివిల్ సర్వీసు ఉద్యోగాలపై ఉన్న ఆకాంక్షలను ప్రభుత్వం పట్టించుకున్నట్టే లేదు. ఇది ప్రభుత్వం సవ్యంగా ఉందనడానికి ఎంత మాత్రం సంకేతం కాదు. పోటీపరీక్షల కు సిద్ధంచేయడానికి పుట్టగొడుగుల్లా వెలుస్తున్న కోచిం గ్ కేంద్రాలను ప్రభుత్వం ఏ మాత్రం నియంత్రించదు.

వైఫల్యం కారణంగా నిరాశకు గురై ఆత్మహత్య చేసుకోవడాన్ని వ్యక్తిగత వైఫల్యం కింద కొట్టి పారేయకూడదు. యోగ్యత ఉన్నవారికైనా ఉద్యోగాల కల్పనలో ప్రభు త్వం విఫలం అవుతూనే ఉంది. జనానికి ఉన్న ఆకాంక్షలు ఇతర మార్గాల ద్వారా తీరే అవకాశం ఉండాలి. ప్రస్తుతం అవి దాదాపుగా లేవు. ఉన్నా ఎందుకూ చాలవు. వ్యవసాయ, పారిశ్రామిక రంగాలలో ఉపాధి గౌరవప్రదమైందిగా మార్చే బాధ్యత ప్రభుత్వానిదే. ఈ అవకాశాలు లేనంత కాలం యు.పి.ఎస్.సి. కల్పించే ఉద్యోగాలే పరమావధిగా ఉంటాయి. అవి రాని వారు దిగులు పడతారు. వస్తు వినియోగంపై ఆధారపడిన పెట్టుబడిదారీ విధానానికి విస్తృత రంగాల్లో గౌరవప్రదమైన ఉద్యోగాలు కల్పించే సామర్థ్యం లేదు. ఇతర ఉద్యోగాల మీద ప్రతికూల అభిప్రాయం ఉన్నందువల్ల ఉన్నత లక్ష్యాలు సాధించాలనుకునే వారు ఈ ఉద్యోగాలు చేయరు. రాజీపడ్డట్టు అవుతుందనుకుంటారు. అవమానంపాలు కాకుండా ఉండాలంటే యు.పి.ఎస్. సి. ఉద్యోగాల మీదే మక్కువ ఉంటుంది. పోటీ పరీక్ష నిరంతర వైఫల్యాలను హేతుబద్ధం చేసే తాత్విక ధోరణిని అనుసరిస్తుంది. ఈ హేతుబద్ధత కల్పించడం కోసమే విజయవంతం కావడాన్ని మహత్కార్యంగా భావిస్తారు.

* (ఇ.పి.డబ్ల్యు.సౌజన్యంతో)