బూటకపు వాగ్దానాలు

ఎన్నికల మేనిఫెస్టోలో తాము చేసిన వాగ్దానాలు ఉత్తుత్తివేనని రాజకీయ పక్షాలు వాటి నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పి చేతులు దులుపుకోవడం ప్రజాస్వామ్యానికి ఎంతటి విద్రోహమో వివరించనక్కరలేదు. దేశాన్ని పాలిస్తున్న భారతీయ జనతా పార్టీకి చెందిన ఇద్దరు ప్రముఖ వ్యక్తులే ఇటువంటి ప్రకటనలు చేసినట్టు వచ్చిన వార్తలు మన రాజకీయాలు ఎంతగా దిగజారిపోయాయో రుజువు చేస్తున్నాయి. 2014 ఎన్నికలలో తమ పార్టీ తప్పుడు వాగ్దానాల మీద అధికారంలోకి వచ్చిందని కేంద్ర మంత్రి గడ్కరీ ఒక టివి ఛానెల్‌కి […]

ఎన్నికల మేనిఫెస్టోలో తాము చేసిన వాగ్దానాలు ఉత్తుత్తివేనని రాజకీయ పక్షాలు వాటి నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పి చేతులు దులుపుకోవడం ప్రజాస్వామ్యానికి ఎంతటి విద్రోహమో వివరించనక్కరలేదు. దేశాన్ని పాలిస్తున్న భారతీయ జనతా పార్టీకి చెందిన ఇద్దరు ప్రముఖ వ్యక్తులే ఇటువంటి ప్రకటనలు చేసినట్టు వచ్చిన వార్తలు మన రాజకీయాలు ఎంతగా దిగజారిపోయాయో రుజువు చేస్తున్నాయి. 2014 ఎన్నికలలో తమ పార్టీ తప్పుడు వాగ్దానాల మీద అధికారంలోకి వచ్చిందని కేంద్ర మంత్రి గడ్కరీ ఒక టివి ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వూలో చెప్పినట్టు వెల్లడయిన ఒక విడియో ఇటీవల సంచలనం సృష్టించింది. దీనిని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్విట్టర్‌లో ఉంచారు. రియాలిటీ టివి షోలో అతిథిగా పాల్గొన్న గడ్కరీ, నానాపటేకర్ ప్రశ్నకు సమాధానమిస్తూ ఈ విషయం చెప్పారు. ఈ విడియో బహిర్గతమైన తర్వాత గడ్కరీ వివరణ ఇచ్చారు. అది 2014 సాధారణ ఎన్నికల సమయంలోనిది కాదని మహారాష్ట్ర అసెంబ్లీ పోలింగ్ నాటిదని ఆయన తెలియజేశారు. ఆ ఎన్నికల్లో గెలిచి తీరుతామన్న ధైర్యం తమకు లేనందున అప్పుడు బిజెపి తరపున ప్రచార సారథ్యం వహించిన దేవేంద్ర ఫడ్నవీస్, గోపినాథ్ ముండేలు ఆచరణ సాధ్యంకాని వాగ్దానాలు చేయాలని నిర్ణయించుకున్నారని ఎలాగూ అధికారంలోకి రాము కాబట్టి వాటిని నెరవేర్చే బాధ్యత తమపై ఉండదని భావించి అటువంటి సంకల్పానికి వచ్చారని గడ్కరీ ఆ ఇంటర్వూలో బయటపెట్టారు. ఊహించని విధంగా తమ పార్టీ గెలిచిందని ఇప్పుడు ఆ వాగ్దానాల అమలు కోరుతూ ప్రజలు నిలదీస్తున్నారని అయినా ఏమి చేయగలమని గడ్కరీ అన్నారు. ఎన్నికలు ఏవైనప్పటికీ ప్రజలకు ఉద్దేశపూర్వకంగా తప్పుడు హామీలిచ్చి భ్రమల్లో ముంచి గెలుపొందినట్టు గడ్కరీ అంగీకరించారు.
ఇలాగే అమిత్ షా కూడా ఒక్కొక్క ఓటరు ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తామని ప్రధాని మోడీ చేసిన వాగ్దానం మాట వరుసకు అన్నదే (జుమ్లా)నని, దానిని పెద్దగా పట్టించుకోవలసిన పని లేదని ఆ మధ్య ఒక ఇంటర్వూలో అభిప్రాయపడ్డారు. గత సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి అధికారంలోకి రావడానికి, నరేంద్ర మోడీ ప్రధాని కావడానికి బాగా దోహదపడింది ఈ వాగ్దానమే. విదేశీ ఖాతాల్లోని భారతీయ సంపన్నుల గుప్త ధనాన్ని వెనక్కి తెచ్చి ఒక్కొక్క ఓటరు బ్యాంకు అకౌంటులో రూ. 15 లక్షలు జమ చేస్తామనే అభిప్రాయం కలిగిస్తూ నరేంద్ర మోడీ తన ప్రచార ప్రసంగాల్లో పదేపదే చేసిన ప్రకటన ఓటర్లను బాగా ఆకట్టుకున్నది. ప్రలోభ పెట్టింది. ఈ ఆశతోనే చాలా మంది పేదలు బ్యాంకుల్లో ఖాతాలు తెరిచి పెట్టుకున్నారని కూడా అప్పుడు వినిపించింది.
ఒకరు కేంద్ర మంత్రి, మరొకరు దేశాన్ని ఏలుతున్న పార్టీ జాతీయ అధ్యక్షులు. అవాస్తవికమైనవి, ఆచరణ సాధ్యం కానివని తెలిసే ఎన్నికల్లో ఆ వాగ్దానాలు తాము చేశామని ఈ పెద్దలిద్దరూ అంగీకరించడం సాధారణ విషయం కాదు. వాస్తవానికి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన క్షణంలోనే విస్మరించడం ప్రస్తుతం దాదాపు అన్ని పార్టీలకు అలవాటైన విద్య.
దేశ, రాష్ట్ర అధికారం కోసం జరిగే బ్యాలట్ యుద్ధాల్లో ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన, పవిత్రమైన ఘట్టం. అటువంటి సందర్భంలో పార్టీలు చేసే వాగ్దానాలకు అనితరమైన ప్రాధాన్యం ఉంటుంది. వాటి మీద ఆశలు పెట్టుకుని ప్రజలు ఆయా పార్టీలకు ఓటు వేసి గెలిపిస్తారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలు ఉత్తుత్తివేనని పాలకులు ప్రకటించడం ‘ఓడ మల్లన్న …. బోడి మల్లన్న’ చందమే. ఏరుదాటి తెప్ప తగలేయడమే. విద్య, సమాచారం అందుబాటు బాగా పెరుగుతున్న ఈ రోజుల్లో ప్రజలు నెమ్మదిగానైనా చైతన్యవంతులవుతున్నారు. ఏ పార్టీ, ఏ నాయకులు ఏ వాగ్దానం చేశారో గుర్తు పెట్టుకోగలుగుతున్నారు. వాగ్దాన భంగాన్ని బొత్తిగా సహించబోమని చెప్పడానికి వెనుకాడటం లేదు. ప్రజలను ఒక సారి మభ్యపెట్టవచ్చు, మోసం చేయవచ్చుగాని మళ్లీమళ్లీ చేయలేమని రాజకీయ పక్షాలు, వాటి నాయకత్వాలు గుర్తించాలి.
ఎన్నికల్లో వాగ్దానాలు చేయడాన్ని అవినీతిగా పరిగణించలేమంటూనే మేనిఫెస్టోల్లో ఇచ్చిన హామీలకు పార్టీలు కట్టుబడి ఉండేలా తగిన ఏర్పాట్లు చేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు సుప్రీంకోర్టు సూచించి ఉన్నది. అటువంటి కట్టుదిట్టాల అవసరం ఎంతైనా ఉన్నది.