వన్య ప్రాణులను కాపాడుకుందాం

వన్య ప్రాణులను సంరక్షించడం కోసం ప్రత్యేకమైన సంస్థలు వెలిశాయి. అవి ప్రకృతి వనరుల సంరక్షణ గురించి అంతర్జాతీయ యూనియన్ (ఐయుసిఎన్) ప్రపంచ వన్య ప్రాణుల నిధి(డబ్ల్యుడబ్ల్యుఎఫ్) అనేవి. వాటిలో రెండు మన దేశం లో పులులు, ఏనుగులు వన్యమృగాలు గణనీయంగా తగ్గుతున్నాయి. వరల్డ్ యానిమల్ డే యాక్టు ప్రకారం జంతువుల ఆకలి, దాహాలు తీర్చాలి. వాటికి ఎటువంటి బాధ, అసౌకర్యం కలిగించరాదు. వ్యాధులు, గాయాల నుండి కాపాడాలి. అనేక దేశాలవారు వన్యప్రాణుల ప్రాముఖ్యతను తెలియజేయడానికి వాటిని జాతీయ […]

వన్య ప్రాణులను సంరక్షించడం కోసం ప్రత్యేకమైన సంస్థలు వెలిశాయి. అవి ప్రకృతి వనరుల సంరక్షణ గురించి అంతర్జాతీయ యూనియన్ (ఐయుసిఎన్) ప్రపంచ వన్య ప్రాణుల నిధి(డబ్ల్యుడబ్ల్యుఎఫ్) అనేవి. వాటిలో రెండు మన దేశం లో పులులు, ఏనుగులు వన్యమృగాలు గణనీయంగా తగ్గుతున్నాయి. వరల్డ్ యానిమల్ డే యాక్టు ప్రకారం జంతువుల ఆకలి, దాహాలు తీర్చాలి. వాటికి ఎటువంటి బాధ, అసౌకర్యం కలిగించరాదు. వ్యాధులు, గాయాల నుండి కాపాడాలి. అనేక దేశాలవారు వన్యప్రాణుల ప్రాముఖ్యతను తెలియజేయడానికి వాటిని జాతీయ జంతువులుగా గుర్తించారు. ఉదాహరణకు భారతదేశం పులి, ఆస్ట్రేలియా కంగారు లాంటి వాటిని ప్రకటించి వాటి సంరక్షణకు తగిన చర్యలు తీసుకుంటున్నాయి. అన్ని జాతుల మొక్కలను, జంతువులను కాపాడవలసిన నైతిక భాద్యత మానవునిదే. కానీ మానవుని తీవ్ర అత్యాశ, ఆహారం కోసం అన్వేషణ, స్థలం కోసం వెతుకులాట, పంటల పండించుట కొరకు భూమి, పరిశ్రమలు స్థాపన కోసం, జలాశయాలు, ఆనకట్టలు నిర్మించడం మొదలైన కారణాల వలన రోజురోజుకి అడవుల వైశాల్యం క్రమేణా తగ్గుతూ వస్తుంది. అడవుల విస్తీర్ణం తగ్గడం వలన వన్య ప్రాణులకు నిలువ నీడ లేకపోవడం చేత జనారణ్యంలో ఇమడలేక అవి క్రమేణా అంతర్దాన మవుతున్నాయి.

వన్యప్రాణులను వేటాడడానికి కారణాలు అనేకం. వాటిలో కొన్ని నగిషీలు, కళాకృతుల కోసం దంతాలు, మాంసం కోసం, లైంగిక ఔషధాల కోసం వానిని సంహరించడం, అడ్డంగా అడవుల నరికివేత, నీటి నిల్వ కోసం ఆనకట్టలు, రిజర్వాయర్‌ల నిర్మాణం, అడవులలో మంటలు, పర్యావరణం కాలుష్యం ఇలాంటి కారణాల వల్ల చాల జాతులు అంతరించిపోతున్నాయి. భూమి సగటున రోజుకు ఒక జాతిని కోల్పోతోంది. ఇలా అంతరించిపోయే వానిలో మనదేశంలో ఈ మధ్యనే అంతరించి పోతున్న జీవులు చిరుత పులులు. అంతర్జాతీయ గణాంక సంస్థ వారు అంతరించిపోయే అవకాశం వున్న వానిని ఒక పట్టికను తయారుచేసి దానిని రెడ్‌డేటా బుక్‌లో ప్రచురించడం జరిగింది. వన్యప్రాణి సంరక్షణ విషయంలో ప్రభుత్వం అవలంబిస్తున్న అనాలోచిత వైఖరి కారణంగా అరుదైన జంతువులు అంతరించిపోతున్నాయని పర్యావరణ ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వన్యప్రాణి చట్టాలను గట్టిగా అమలు పర్చాలని, జంతు బలులు నిషేధించాలని కోరుతున్నారు. వరల్డ్ యానిమల్ డే యాక్డు ప్రకారం జంతువుల ఆకలి, దాహాలు తీర్చాలి, వాటికి ఎటువంటి అసౌకర్యం, బాధ కలిగించరాదు. వ్యాధులు గాయాల నుండి కాపాడాలి. జంతువులను క్రూరమైన హింస యాతనలనకు గురి చేయరాదు. వర్షం, చలి, ఎండల నుండి కాపాడాలి

భారతదేశంలో జనాభా విస్ఫోటనం వల్ల వ్యవసాయాభివృద్ధి, పారిశ్రామికీకరణ, నగరీకరణ, భారీ నీటిపారుదల ప్రాజెక్టులు, జలవిద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం, రోడ్లు – రైలు మార్గాల అభివృద్ధి మొదలైన కార్యకలాపాలవల్ల అడవుల విస్తీర్ణం క్రమంగా తగ్గుతోంది. ఒకపుడు దాదాపు 35% గా ఉన్న అడవులు నేడు 21% నికి పడిపోయింది. దీంతో పర్యావరణ సమతౌల్యానికి విఘాతం కలుగుతోంది. అడవులు తరగిపోవడంతో వన్యప్రాణుల జీవనానికి ముప్పు వాటిల్లుతోంది. అందుకే జీవ, వృక్ష సమగ్రాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని భారత ప్రభుత్వం 1980లో సమగ్ర అడవుల పరిరక్షణ చట్టాన్ని రూపొందించింది. పదో పంచవర్ష ప్రణాళికా కాలంలో సమగ్ర అడవుల పరిరక్షణ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. 1988లో అటవీ విధానాన్ని, 2006లో జాతీయ పర్యావరణ విధానాన్ని రూపొందించింది. వాతావరణ మార్పు (క్లైమేట్ చేంజ్ ), గ్లోబల్ వార్మింగ్‌ను నివారించడానికి అడవుల పరిరక్షణ ఎంతో అవసరం. అడవుల పరిరక్షణ, నిర్వహణ అనే అంశం భారత రాజ్యాంగం ప్రకారం ఉమ్మడి జాబితాలో ఉండటంతో అడవులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి బాధ్యతగా నిర్వహిస్తున్నాయి.

పెరిగిపోతున్న జనాభాతోపాటు మనిషి పోకడల కారణంగా అడవులు అన్యాక్రాంతమవుతున్నాయి. ఒకప్పుడు విశాలంగా ఎక్కడ చూసినా పచ్చదనంతో నిండిన అటవీప్రాంతాలు రానురాను కనుమరుగైపోతున్నాయి. వన్యప్రాణి సంరక్షణ చట్టానికి తూట్లు పొడుస్తూ అటవీ ప్రాణుల వేట యధేచ్ఛగా జరుగుతోంది. జింకలు, ఏనుగులు, దుప్పులు, అడవి పందులు, కుందేళ్లు, నెమళ్లు, కొండ గొర్రెలు, పులులు తదితర జంతువులను వేటాడి వాటి మాంసాన్ని విక్రయిస్తున్నారు. కొన్ని జంతువుల చర్మాలకు డిమాండ్ పెరగడంతో వానిని అధిక ధరలకు అమ్ముతున్నారు. పక్షులను కూడా వేటాడుతున్నారు. మన దేశానికి వచ్చే వలస పక్షులను, అరుదైన జాతి పిట్టలను చంపి సమీపంలో గల అంగళ్లు, సంతలలో అమ్ముతున్నారు. వీటిని అరికట్టే వన్యప్రాణి సంరక్షణ అధికారులు కొందరు మామూళ్ల మత్తులో మునిగి ఉంటున్నారనే ఆరోపణలు అక్కడక్కడ వినవస్తున్నాయి. ఈ తరహా అక్రమ వేటను, జంతు మాంస విక్రయాలను అరికట్టి మూగ జీవాల ప్రాణాలు కాపాడాల్సిన వన్యమృగ సంరక్షణ విభాగం, అటవీ శాఖ, మూగ జీవాల సంరక్షణ సంఘాలు చోద్యం చూస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో దిగువ స్థాయి సిబ్బంది వేటగాళ్ళతో కుమ్మక్కై వాటిని రక్షించే ప్రయత్నం చేయడంలేదని తెలుస్తోంది. మరికొన్ని ప్రాంతాలలో వేటగాళ్లతో కుమ్మకై మాంసాన్ని పట్టణాలకు తరలిస్తున్నారు.

తెలంగాణ ప్రాంతంలో దట్టమైన అడవులు గల జయశంకర్ భూపాలపల్లి, కొమురంభీం ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్ తదితర ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, వైఎస్‌ఆర్ కడప జిల్లాలలో విస్తరించి వున్న శేషాచలం అటవీప్రాంతం కూడా క్రమంగా అంతరించిపోతుంది. దీనితో ఈ ప్రాంతంలో కనిపించే అరుదైన జంతువులు కనుమరుగైపోతున్నాయి. మన దేశంలోనే ప్రకృతి సిద్ధంగా ఉన్న అతిపెద్ద జంతు ప్రదర్శనశాలలలో మొదటి స్థానంలో ఉన్న తిరుపతి ఎస్వీ జూపార్క్. వన్యప్రాణి సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. దేశంలోనే అరుదైన జంతువు “పునుగుపిల్లి” తో పాటు అడవికోళ్ళు, కొండగొర్రెల సంరక్షణ కూడా ఇక్కడే చేపడుతున్నారు. తిరుపతి అటవీశాఖ అధికారులు అరుదైన జంతువుల సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. గతంలో అంతరించిపోయే దశకు చేరుకున్న అడవికోళ్లు, కొండగొర్రెలను రక్షించి వాటి ఉత్పత్తిని పెంచారు. శేషాచలం అటవీప్రాంతంలో అరుదుగా కన్పించే జంతువులను ఎస్వీ జూపార్క్ అధికారులు పూర్తి స్థాయిలో సంరక్షిస్తు జంతువుల పరిరక్షణకై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పిస్తూ అరుదైన జంతుజాలాన్ని కాపాడుతోంది. జంతు ప్రేమికులు కూడా జంతువులను దత్తత తీసుకుని వాని సంరక్షణకు అయ్యే ఖర్చును భరిస్తున్నారు.

భారత బొటానికల్ సర్వే (బి.ఎస్.ఐ.) ప్రకారం దేశంలో మొత్తం 46 వేలకు పైగా వృక్షజాతులు ఉన్నాయి. కానీ, ఇటీవల అడవుల విధ్వంసం వల్ల అందులో అనేక వృక్షజాతులు అంతరించి పోతున్నాయి. భారత జూలాజికల్ సర్వే (జడ్.ఎస్.ఐ.) ప్రకారం దేశంలో మొత్తం 89 వేలకు పైగా జంతు జాతులు ఉన్నాయి. వీటిలో కూడా అనేకం అంతరించిపోయే ప్రమాదాలను ఎదుర్కొంటున్నాయి. కాబట్టి, ప్రకృతి సిద్ధమైన వృక్ష, జంతుజాతుల జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు భారత ప్రభుత్వం అడవుల్లోని వృక్షాలను, జంతువులను వాటి సహజ పర్యావరణంలో అభివృద్ధి చేసేందుకు జీవావరణ కేంద్రాలను నెలకొల్పింది. ఈ విధంగా దేశంలో మొదటగా ఏర్పాటు చేసింది నీలగిరి జీవావరణ కేంద్రం. దీన్ని 1986లో స్థాపించారు. ప్రస్తుతం భారతదేశంలో మొత్తం 15 జీవావరణ కేంద్రాలున్నాయి. 2008లో స్థాపించిన గుజరాత్‌లోని కచ్ కేంద్రం 15వ జీవావరణ కేంద్రం. ఈ 15 జీవావరణ కేంద్రాల్లో భౌగోళికంగా అతి పెద్దది మన్నార్ కేంద్రం. వీటిలో యునెస్కో గుర్తించి, ప్రపంచ జీవావరణ కేంద్రాల నెట్‌వర్క్ లో చేర్చినవి నాలుగు. అవి: 1) సుందర్‌బన్స్, 2) మన్నార్, 3) నీలగిరి, 4) నందాదేవి అడవులు. వన్యప్రాణుల సంరక్షణకోసం దేశవ్యాప్తంగా 99 జాతీయ పార్కులు, 513 వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలను స్థాపించారు.

ఆంధ్రప్రదేశ్‌లో అయిదు జాతీయ పార్కులు ఏర్పాటయ్యాయి. ఇక పెద్దపులుల సంరక్షణ, అభివృద్ధికి కేంద్రప్రభుత్వం 1973లో ప్రాజెక్టు టైగర్‌ను ప్రారంభించింది. ప్రస్తుతం దేశంలో మొత్తం 17 టైగర్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని నాగార్జునసాగర్ – శ్రీశైలం టైగర్ ప్రాజెక్టుకు రాజీవ్‌గాంధీ టైగర్ ప్రాజెక్టు అని పేరు పెట్టారు. దేశంలోని జంతు సంపదను పరిరక్షించడానికి 1898 లో తమిళ నాడులో, 1935లో జిమ్ కార్బెట్ జాతీయ పార్కును ఏర్పాటు చేసారు. ప్రస్తుతం దేశంలో గల జాతీయ పార్కుల సంఖ్యా 102. వన్యప్రాణుల చట్టాలను కఠినంగా అమలు చేయాలి. అడవులను సంరక్షించుదాం, భావితరాలకు వీటి గురించి తెలుపుదాం. జీవజాతుల సంరక్షణకు పాటుపడదాం. ప్రభుత్వాలు కూడా జంతుజాలాన్ని అడవులను కాపాడే చర్యలు చేపట్టాలి. వన్యప్రాణి సంరక్షణ విషయంలో ప్రభుత్వం అవలంబిస్తున్న మెతక వైఖరి కారణంగా అరుదైన జంతువులు అంతరించిపోతున్నాయని జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడున్న అరుదైన జంతువులను భవిష్యత్ తరాలకు అందించాలంటే ప్రతి ఒక్కరిలోనూ అవగాహన తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు.