నేను ఓటేస్తాను, మరి మీరో…

మన దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి డెబ్భై యేళ్ళు పూర్తయ్యాయి. ఈ మధ్యకాలంలో ఎన్నో లోక్‌సభ, శాసన సభల ఎన్నికలు జరిగాయి. వీటితో పాటు మరెన్నో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగాయి. ప్రజలు తమ ఓటు హక్కుని వినియోగించుకొని, నచ్చిన పాలకులను ఎన్నుకుంటున్నారు. నచ్చని వారిని ఇంటి బాట పట్టిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్య ఘన విజయంగా చెప్పవచ్చు. అయితే ఇప్పటికీ ఓటింగ్ శాతం అరవైకి మించడం లేదు. క్రమక్రమంగా అక్షరాస్యత పెరిగినప్పటికీ, ఎన్నికల అక్షరాస్యత ఇప్పటికీ ఆశించిన స్థాయికి […]


మన దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి డెబ్భై యేళ్ళు పూర్తయ్యాయి. ఈ మధ్యకాలంలో ఎన్నో లోక్‌సభ, శాసన సభల ఎన్నికలు జరిగాయి. వీటితో పాటు మరెన్నో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగాయి. ప్రజలు తమ ఓటు హక్కుని వినియోగించుకొని, నచ్చిన పాలకులను ఎన్నుకుంటున్నారు. నచ్చని వారిని ఇంటి బాట పట్టిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్య ఘన విజయంగా చెప్పవచ్చు. అయితే ఇప్పటికీ ఓటింగ్ శాతం అరవైకి మించడం లేదు. క్రమక్రమంగా అక్షరాస్యత పెరిగినప్పటికీ, ఎన్నికల అక్షరాస్యత ఇప్పటికీ ఆశించిన స్థాయికి చేరుకోకపోవడం ఆందోళన కలిగించే విషయం. ఓటు నమోదు విషయం, ఓటు హక్కు వినియోగించే విషయంలో ప్రజల చైతన్య స్థాయిని, అవగాహన స్థాయిని పెంచాల్సిన అవసరం ఎంతైన ఉంది.

ముందస్తు శాసనసభ ఎన్నికల నేపథ్యంలో, తెలంగాణ రాష్ట్రంలో పెద్దఎత్తున ఓట్లు గల్లంతయ్యాయన్న ఆరోపణలు రావడంతో కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల నమోదుకు శ్రీకారం చుట్టింది. “నేను ఓటు నమోదు చేసుకున్నాను. మరి మీరో” అంటూ అనేక ప్రజా చైతన్య కార్యక్రమాలకు రూపకల్పన చేసింది. ఇందులో భాగంగా, కరపత్రాల నుండి కళాజాతల వరకు, ర్యాలీల నుండి రంగోళీ పోటీల వరకు, పత్రికా ప్రకటనల నుండి షార్ట్‌ఫిల్మ్‌ల తయారీ వరకు ఎన్నో కార్యక్రమాలను చేపట్టింది. కళాశాల విద్యార్థుల ఎలక్టోరల్ క్లబ్స్ ఏర్పాటు చేశారు. ‘స్వీప్’ కార్యక్రమం ద్వారా ప్రజలకు ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పింది కేంద్ర ఎన్నికల సంఘం.

ఆఫ్‌లైన్‌తో పాటు ఆన్‌లైన్ పద్ధతిలో ఓటర్ల నమోదుకు అవకాశం కల్పించారు. వివిధ రకాల ఫారంలకు విశేష ప్రచారం కల్పించారు. నమోదుకు ఫామ్ 6, ఓటర్ల జాబితా నుండి తొలగించడానికి ఫావ్‌ 7, పేరు, చిరునామాలాంటి మార్పులకు ఫారం 8 తోపాటు ఎన్నారైలకు సైతం ఫారం 8ఎ రూపొందించారు. ఇటీవల ఎన్నారైలకు ఓటు హక్కును కల్పిస్తూ భారత పార్లమెంటు చట్టం చేసింది. దీంతో సుమారు 25 లక్షల పై చిలుకు ఓటర్లు తమ పేరును నమోదు చేసుకున్నారు. పెద్ద సంఖ్యలో 18, 19 సంవత్సరాల నవయువకులు సైతం ఓటు హక్కు నమోదుకు ఆసక్తి చూపారు. ఓటు నమోదు నిరంతర ప్రక్రియ కనుక, నామినేషన్లు స్వీకరించే పది రోజుల ముందు వరకు ఓటు నమోదు చేసుకోవచ్చు. దీంతో ఓటర్ల సంఖ్య ఇంకా పెరగవచ్చు.

ఓటు నమోదుపైన, ఓటు హక్కు వినియోగం పైన, ప్రజలలో ఉన్న కొన్ని ‘విశ్వాసాల’ కారణంగా, పలు సమస్యలు తలెత్తుతున్నాయి. మనది 125 కోట్ల ప్రజలు ఉన్న దేశం. పట్టణీకరణ, పారిశ్రామికీకరణ వల్ల, జీవిక కోసం ప్రజలు గ్రామాల నుండి పట్టణాలకు పరుగుపెడుతున్నారు. పట్టణాల నుండి నగరాలకు వలసవెళ్లుతున్న వారి సంఖ్య తక్కువేమీ కాదు. గ్రామాల నుండి వలస వెళ్లుతున్న ఓటర్లకు వారి స్వస్థలాలలో ఇల్లుతో పాటు, వ్యవసాయ భూములు కలిగి ఉంటారు. గ్రామాలతో ఎల్లప్పుడు సంబంధాలు కొనసాగిస్తారు. పండుగలు, పబ్బాలు, జాతరలు, పెళ్ళిళ్ళు, పేరంటాలకు తరుచూ వచ్చిపోతుంటారు. వీరు పట్టణాలు లేదా నగరాలలో నివాసముంటున్న కారణంగా అక్కడ ఓటు నమోదు చేసుకుంటారు. కాని గ్రామాలలో ఉన్న ఓటును పోగొట్టుకోడానికి ఇష్టపడరు.

గ్రామాలలో ఓటు హక్కు కోల్పోవడమంటే, స్వస్థలంతో తెగతెంపులు చేసుకున్నట్టుగా భావిస్తారు. ఊరితో అనుబంధం తెగిపోయినట్టుగా విలవిలలాడుతారు. దీనివల్ల చాలా మందికి రెండు చోట్ల ఓటు నమోదు అయి ఉంటుంది. వారికి నోటీసులు జారీ చేసి, పేరు తొలగించాలని ప్రయత్నిస్తే, ఎప్పటికైన మేము గ్రామాలకు వచ్చేవాళ్ళమని, కాబట్టి మా పేరు ఓటర్ల జాబితా నుండి తొలగించడానికి వీల్లేదని బూత్ లెవల్ అధికార్లతో ఘర్షణ పడ్డ ఉదాహరణలు కోకొల్లలు. అయితే ఎన్నికల సంఘం, సిడాక్ రూపొందించిన ఈర్‌నెట్ సాఫ్ట్‌వేర్ ద్వారా, రెండు చోట్ల ఓటరుగా నమోదు చేసుకున్న పేర్లను గుర్తించి బూత్ లెవల్ అధికార్లను అప్రమత్తం చేస్తుంది. దీని ద్వారా ఒకచోట తొలగించి, మరొకచోట కొనసాగించవచ్చు. అయితే ఈ సాఫ్ట్‌వేర్ ఒక నియోజకవర్గ పరిధిలో రెండు చోట్ల నమోదు చేసుకుంటేనే వర్తిస్తుంది. ఈ విషయంలో ప్రజలకు మరింత అవగాహన, చైతన్యం కలిగించాల్సి ఉంది.

ఓటు నమోదు నిరంతర ప్రక్రియ కాబట్టి, ప్రజలు నివాసముంటున్న చోటే ఓటు నమోదు చేసుకునేలా ప్రోత్సహించాలి. డబుల్ ఎంట్రీ నైతికంగా తప్పని, అంతేకాదు చట్టపరంగా నేరమని ఓటర్లను జాగృతపరచాలి. రెండుచోట్ల ఓటరు నమోదు అయి ఉంటే, ఒకచోట స్వచ్ఛందంగా వదులుకునేలా చేయాలి. ఆధార్‌తో లింక్ చేసినా తప్పులేదు. ఎన్నికల సంఘం దృష్టి సారించాల్సిన మరో అంశం, మరణించిన ఓటర్లు, వేరే ప్రాంతాలకు శాశ్వతంగా వలస వెళ్ళిన ఓటర్లు, ఓటర్ల జాబితాలో సంవత్సరాల కొలది కొనసాగుతున్నారు. మరణించిన ఓటర్లను ఎప్పటికప్పుడు తొలగించి, ఓటర్ల జాబితాను అప్‌డేట్ చేయాలి. అయితే ఇటీవల చేపట్టిన ఓటర్ల నమోదు కేంద్రాలలో మరణించిన ఓటర్లను, వేరే ప్రాంతాలకు వెళ్ళిన ఓటర్లకు నోటీసులు జారీచేసి పేర్లు తొలగించారు. గ్రామ పంచాయితీ లేదా మున్సిపాలిటీలు మరణ ధృవీకరణ పత్రం జారీచేసిన రోజే, ఆ ఓటరు పేరు దానంతటదే తొలగిపోయేలా సాఫ్ట్‌వేర్ రూపొందించాలి.

ఇక థర్డ్‌జెండర్‌కు ప్రత్యేక కాలవ్‌ పొందుపర్చినప్పటికీ, గ్రామాలలో ఉన్న థర్డ్‌జెండర్ ఓటర్లు మహిళ లేదా పురుషునిగానే నమోదు చేసుకున్నారు. కేవలం పట్టణాలలో సంఘటితంగా ఉన్నచోటే థర్డ్ జెండర్ ఓటరుగా నమోదు చేసుకున్నారు. ఈ విషయంలో ఎన్నికల సంఘం దృష్టి సారించాలి. మరో ముఖ్యమైన విషయమేమిటంటే, ఓటర్లు తమ ఓటు ఉందో లేదో తెలుసుకోవడానికి నానా ఇబ్బందులు పడాల్సివస్తున్నది. ఓటర్ల జాబితా ఎక్కడ లభ్యమవుతుందో చాలా మందికి తెలియదు. ఓటర్ల జాబితా కావాలంటే జిరాక్స్ తీసుకోవాలి. కనీసం రెండు మూడు వందలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీంతో చాలా మంది వెనుకడుగు వేస్తారు. అందువల్ల గ్రామ పంచాయితీ కార్యాలయాలు, పోస్టాఫీసులు, గ్రంథాలయాలల్లో ఓటర్ల జాబితాను అందుబాటులో ఉంచాలి. మండల గ్రంథాలయాలలో ఆ మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన ఓటర్ల జాబితాలను లభ్యమయ్యేలా ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేయాలి. అదే విధంగా ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో అన్ని గ్రామాల ఓటర్ల జాబితాను పొందుపరచాలి. దానికి విస్తృత ప్రచారం కల్పించాలి.

కటాఫ్ తేదీ ఏదీ లేకుండా, 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువ ఓటరుకు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునేలా ఎన్నికల సంఘం అవకాశం ఇవ్వాలి. అన్ని కళాశాలలో జనవరి 25వ తేదీన జరిపే ఓటర్ల దినోత్సవాన్ని తప్పనిసరిగా నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలి. యువ ఓటర్లను వంద శాతం నమోదు చేసుకునేలా ప్రోత్సహించాలి. మరోవైపు ఓటు హక్కు వినియోగంలో సైతం చాలా మంది కేంద్రాలలో నిలబడి, ఓటు వేయడం నామోషీగా భావిస్తున్నారు. ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు, ఉద్యోగులలో చాలా కొద్ది మంది మాత్రమే పోస్టల్ బ్యాలట్‌ని వినియోగించుకుంటున్నారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు సైతం ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనడం లేదు. సర్వీసు పర్సన్స్ కూడా తక్కవ శాతం ఓటు వేస్తున్నారు. ఎక్కువ శాతం, తక్కువ చదువుకున్న వాళ్ళే ఓటేస్తున్నారు. ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మల్లా నిలుస్తున్నారు.ఓటింగ్ శాతం పెరగడానికి, అన్ని ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలకు సెలవు దినంగా ప్రకటించాలి.

ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇచ్చిన రోజే, పోస్టల్ బ్యాలట్ అందజేయాలి. ప్రతి ఓటరుకు ఓటింగ్ స్లిప్పులు అందేలా ఎన్నికల సంఘం అన్ని చర్యలు తీసుకోవాలి. ఓటే వజ్రాయుధం. ఓటు అత్యంత పవిత్రమైంది. అపవిత్రం చేయరాదు. మన ఓటే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. తాత్కాలిక ప్రయోజనాలకు ఓటును తాకట్టుపెట్టకూడదు. “నేను ఓటేసాను, మరి మీరో” అంటూ సవాలు విసురుతూ ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి. పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని తెలంగాణ కోసం నిలబడి, కలబడి త్యాగాలు చేసి మొదటి వరుసలో నిలిచిన పార్టీలను గెలిపించుకోవాలి. ఆ పార్టీల చేతుల్లోనే తెలంగాణ ‘సుభిక్షంగా, సుసంపన్నంగా, సురక్షితంగా’ కొనసాగుతుంది.