వేడెక్కుతున్న భూగోళం

వాతావరణ మార్పుల వల్ల వచ్చే ప్రమాదాన్ని తప్పించడానికి భారతదేశం తగిన చర్యలు చేపడుతుందని పర్యావరణ శాఖా మంత్రి హర్షవర్ధన్ అన్నారు. ఈ ప్రయత్నాలు చేయడానికి ఏ రిపోర్టుల కోసం వేచి ఉండడం జరగదని కూడా అన్నారు. ఆయన ఐక్యరాజ్యసమితి ఇటీవల విడుదల చేసిన వాతావరణ మార్పుల రిపోర్టును ప్రస్తావిస్తూ ఈ మాటలు చెప్పారు. ఐక్యరాజ్యసమితి నియమించిన కమిటీ ఇటీవల వాతావరణ మార్పులపై నివేదిక సమర్పించింది. మరో పన్నెండేళ్ళ తర్వాత భూగోళం వేడెక్కడాన్ని ఆపడం కష్టమని శాస్త్రవేత్తలు హెచ్చరించిన […]

వాతావరణ మార్పుల వల్ల వచ్చే ప్రమాదాన్ని తప్పించడానికి భారతదేశం తగిన చర్యలు చేపడుతుందని పర్యావరణ శాఖా మంత్రి హర్షవర్ధన్ అన్నారు. ఈ ప్రయత్నాలు చేయడానికి ఏ రిపోర్టుల కోసం వేచి ఉండడం జరగదని కూడా అన్నారు. ఆయన ఐక్యరాజ్యసమితి ఇటీవల విడుదల చేసిన వాతావరణ మార్పుల రిపోర్టును ప్రస్తావిస్తూ ఈ మాటలు చెప్పారు. ఐక్యరాజ్యసమితి నియమించిన కమిటీ ఇటీవల వాతావరణ మార్పులపై నివేదిక సమర్పించింది. మరో పన్నెండేళ్ళ తర్వాత భూగోళం వేడెక్కడాన్ని ఆపడం కష్టమని శాస్త్రవేత్తలు హెచ్చరించిన నివేదిక అది. మరో పన్నెండు సంవత్సరాల తర్వాత భూగోళం ఉష్ణోగ్రత మరో 1.5 డిగ్రీల సెల్సియస్ పెరుగుతుందని, అంతకుమించి పెరిగితే కరువులు, వరదలు తప్పవని హెచ్చరించారు.
ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ వాతావరణ మార్పుల కమిటీ ఈ నివేదికను 8వ తేదీన సమర్పించింది. పారిస్ ఒప్పందం దీనికి సంబంధించిందే.

గ్లోబల్ వార్మింగ్ ఇదే విధంగా కొనసాగితే, ప్రపంచంలోని వివిధ దేశాలు దీన్ని నివారించే ప్రయత్నాలు చేయకపోతే, 2030 నుంచి 2052 మధ్య కాలంలో ఉష్ణోగ్రత పెరుగుదల 1.5 సెల్సియస్ దాటి 2 సెల్సియస్ డిగ్రీలకు చేరుకోవచ్చని నివేదిక పేర్కొంది. 2015లో కుదిరిన పారిస్ ఒప్పందం అమలుకు సంబంధించి ఈ సైంటిఫిక్ నివేదిక అవసరమైన మార్గదర్శనం చేస్తోంది. పారిస్ ఒప్పందం ప్రకారం వివిధ దేశాలు 2100 నాటికి భూమిపై ఉష్ణోగ్రత పెరుగుదల 2 డిగ్రీల సెల్సియస్ చేరకుండా, 1.5 డిగ్రీల సెల్పియస్ పరిధి దాటకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలి. పారిశ్రామిక విప్లవానికి ముందు కాలంలో కన్నా ఇప్పుడు భూమిపై ఉష్ణోగ్రత 1 డిగ్రీ సెల్సియస్ పెరిగింది. ఈ ఉష్ణోగ్రత పెరుగుదల 1.5 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంటే ఆరోగ్య బాధలు, ఆహార భద్రత దెబ్బతినడం, నీటి కరువు, ఆర్ధిక ప్రగతి కుంటుపడడం తదితర సమస్యలు తప్పవు. ప్రపంచ బ్యాంకు కూడా ఇటీవలి నివేదికలో 2050 నాటికి వాతావరణ మార్పుల వల్ల భారత జిడిపి 2.8శాతం దెబ్బతింటుందని చెప్పిన విషయం గుర్తుంచుకోవాలి.

వాతావరణ మార్పుల ప్రమాదాన్ని భారత ప్రభుత్వం గుర్తిస్తోందని, దీన్ని నివారించడానికి సాధ్యమైన ప్రయత్నాలు చేస్తోందని పర్యావరణ శాఖ అడిషనల్ సెక్రటరీ ఎ.కె.మెహతా అన్నారు. ఒక బాధ్యతాయుతమైన దేశంగా భారతదేశం అవసరమైన చర్యలన్నీ తీసుకుంటుందని చెప్పారు. ఈ నివేదిక రూపొందించిన వారిలో భారతదేశానికి చెందిన అరోమర్ రవి మాట్లాడుతూ బెంగళూరు, ఢిల్లీ తదితర నగరాల్లో ఇప్పటికే పెరుగుతున్న వేడి ప్రభావం కనిపిస్తోందని చెప్పారు. కేదార్‌నాథ్, శ్రీనగర్, చెన్నై, కేరళలో వరదలకు కాని, దేశంలోని వివిధ ప్రాంతాల్లో కరువు పరిస్థితులకు కాని వాతావరణ మార్పులు కూడా ఒక కారణం అన్నారు. మన పర్యావరణాన్ని మనం అర్ధం చేసుకోవడం లేదని, దీనిపైనే మనం ఆధారపడి ఉన్నామని ఆయన చెప్పారు.

ఈ నివేదిక ప్రకారం రిన్యూవబుల్ శక్తి వనరుల నుంచి విద్యుత్ ఉత్పత్తి 2050 నాటికి 70 నుంచి 85 శాతం వరకు పెరగాలి. ప్రస్తుతం విద్యుత్ ఉత్పత్తిలో రిన్యూవబుల్ శక్తి వనరుల నుంచి ఉత్పత్తి కేవలం 25 శాతం మాత్రమే ఉంది. భూ ఉష్ణోగ్రత పెరగకుండా, ఉష్ణోగ్రత పెరుగుదల 1.5 సెల్సియస్ దాటకుండా చూడాలంటే పట్టణ ప్రాంతాల్లో, నగర ప్రాంతాల్లో అనేక చర్యలు తీసుకోవలసి ఉంటుంది. పారిశ్రామిక రంగంలో అనేక మార్పులు రావాలి. ప్రపంచంలో గ్రీన్ హౌస్ వాయువులను పెద్దస్థాయిలో తగ్గించాలి. కార్బన్ డై ఆక్సయిడ్ విడుదలను 2010 నుంచి 2030 నాటికి 45 శాతం తగ్గించాలి. 2050 నాటికి జీరో స్థాయికి చేరుకోవాలి. గ్రీన్ హౌస్ వాయువుల విడుదలను నివారించడానికి పారిస్ ఒప్పందంలో సంతకాలు చేసిన దేశాలు ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలు సరిపోవు. పైగా అమెరికా దీని నుంచి వైదొలిగింది. పారిస్ ఒప్పందంలో 197 దేశాలు సంతకాలు చేశాయి. ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత ఈ ఒప్పందం అమెరికా ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉందంటూ అమెరికా తప్పుకుంది. కాని గ్లోబల్ వార్మింగ్‌ను అదుపు చేయాలంటే అంతర్జాతీయంగా వివిధ దేశాల మధ్య సహకారం అవసరం. ఏ ఒక్క దేశమో చేయగలిగిన పని కాదు.

ఈ కమిటీలో ఉన్న నోబుల్ బహుమతి గ్రహీతలైన శాస్త్రవేత్తలు గ్లోబల్ వార్మింగ్ విషయంలో తీవ్రమైన హెచ్చరికలు చేశారు. అభివృద్ధి చెందిన దేశాలు గ్లోబల్ వార్మింగ్‌కు చాలా వరకు కారణం కాబట్టి ఈ దేశాలపై బాధ్యత ఎక్కువగా ఉంది. కాని అభివృద్ధి చెందిన దేశాలు ఈ విషయమై తమ బాధ్యతను నిర్వర్తించడానికి ముందుకు రావడం లేదు. అమెరికా పూర్తిగా తప్పుకుంది. ప్రపంచంలోని 40 దేశాలకు చెందిన 91 మంది శాస్త్రవేత్తలు కలిసి రూపొందించిన నివేదిక ఇది. ఈ నివేదిక రూపొందించిన వారిలో జాధవ్ పూర్ విశ్వవిద్యాయానికి చెందిన జయశ్రీ రాయ్ కూడా ఉన్నారు. ఆమె మాట్లాడుతూ గ్లోబల్ వార్మింగ్ ను నిరోధించే భారం పేదదేశాలపై పడుతోంది. నిజానికి గ్లోబల్ వార్మింగ్‌కు ఈ దేశాలు కారణం కాదు. భూమి ఉష్ణోగ్రత పెరుగుదల 1.5 డిగ్రీల సెల్సియస్ దాటకుండా ఉండే ప్రయత్నాలు చేయకపోతే భారతదేశంలోని ప్రధాన నగరాలపై ప్రభావం పడుతుంది. కోస్తా ప్రాంతాలపై ప్రభావం పడుతుంది. వాతావరణ కాలుష్యం పెరిగిపోతుంది అన్నారు. అలాగే ఈ కమిటీలోని మరో భారతీయ శాస్త్రవేత్త, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ కు చెందిన ఎన్.హెచ్ రవీంద్రనాథ్ మాట్లాడుతూ వాతావరణ మార్పుల ప్రభావం ఇప్పుడు పర్యావరణంపైన, సాంఘిక ఆర్ధిక వ్యవస్థలపైన పడుతుందన్నారు. దేశంలోని జనాభాను దృష్టిలో పెట్టుకుంటే వాతావరణ మార్పుల ప్రభావం మనపై చాలా ఎక్కువగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

గ్లోబల్ వార్మింగ్‌ను అరికట్టాలంటే అన్నింటికన్నా ముందు బొగ్గుపై ఆధారపడడం మానాలి. ఈ విషయాన్నే నివేదిక కూడా తెలియజేసింది. రాబోయే తరాలకు మనం ఇలాంటి భూమిని అందిస్తున్నాం? ఎలాంటి జీవితాన్నిస్తున్నామన్నది ఈ రోజు మనం తీసుకున్నే నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా అగ్రరాజ్యాలు ఈ విషయంలో తగిన శ్రద్ధ చూపిస్తాయా?