రాజకీయాల ప్రక్షాళనకు పకడ్బందీ చట్టం

నేరస్థులు పాలిటిక్స్‌లోకి రాకుండా కఠిన  శాసనాన్ని తీసుకురావాలి పార్లమెంట్‌కు సుప్రీంకోర్టు సూచన  అభియోగాలున్న వ్యక్తులను విచారణ స్థాయిలో అనర్హులను చేసే అవకాశం లేదు  దోషులని తేలక ముందే ఏమీ చేయలేం  నేరస్థులను రాజకీయాలకు దూరంగా ఉంచాల్సిందే  తగిన చట్టం కోసం పార్లమెంట్ చొరవ చూపాలి  అభ్యర్థులు విధిగా తమపై గల కేసులను అఫిడవిట్‌లో పొందుపర్చాలి, పార్టీలూ వెబ్‌సైట్‌లో పెట్టాలి న్యూఢిల్లీ: తీవ్రమైన క్రిమినల్ కేసుల్లో విచారణను ఎదుర్కొంటున్న వ్యక్తులు రాజకీయాల్లోకి ప్రవేశించకుండా చేయడానికి ఒక చట్టాన్ని చేసే […]

నేరస్థులు పాలిటిక్స్‌లోకి రాకుండా కఠిన  శాసనాన్ని తీసుకురావాలి

పార్లమెంట్‌కు సుప్రీంకోర్టు సూచన

 అభియోగాలున్న వ్యక్తులను విచారణ స్థాయిలో అనర్హులను చేసే అవకాశం లేదు
 దోషులని తేలక ముందే ఏమీ చేయలేం
 నేరస్థులను రాజకీయాలకు దూరంగా ఉంచాల్సిందే
 తగిన చట్టం కోసం పార్లమెంట్ చొరవ చూపాలి
 అభ్యర్థులు విధిగా తమపై గల కేసులను అఫిడవిట్‌లో పొందుపర్చాలి, పార్టీలూ వెబ్‌సైట్‌లో పెట్టాలి

న్యూఢిల్లీ: తీవ్రమైన క్రిమినల్ కేసుల్లో విచారణను ఎదుర్కొంటున్న వ్యక్తులు రాజకీయాల్లోకి ప్రవేశించకుండా చేయడానికి ఒక చట్టాన్ని చేసే బాధ్యతను పార్లమెంటుకే వదిలేస్తున్నట్లు సుప్రీంకోర్టు మంగళవారం స్పష్టం చేసింది. క్రిమినల్ విచారణను ఎదుర్కొంటున్న చట్టసభ సభ్యులు దోషులుగా తేలకముందే వారిపై అనర్హత వేయలేమని కూడా సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఎంపిలు, ఎంఎల్‌ఎలపై క్రిమినల్ కేసులు నమోదయితే వారిని ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ దాఖలయిన పిటిషన్లపై సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవారం కీలక తీర్పు ప్రకటించింది. కేవలం అభియోగాలు నమోదయితే  వారిని అనర్హులుగా ప్రకటించలేమని.. అయితే  వారు ఎన్నికల్లో పోటీ చేయవచ్చా, లేదా అనే విషయాన్ని పార్లమెంటుకే వదిలేస్తున్నామని స్పష్టం చేసింది. అలాంటి వా రు ఎన్నికల్లో పోటీ చేయకుండా చూసే ఒక చట్టాన్ని పార్లమెంటు చేయాల్సిన సమయం వచ్చిందని ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని అయిదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రస్తుతం ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం .. క్రిమినల్ కేసులో దోషిగా తేలాకే చట్టసభ సభ్యుడిపై అనర్హత వేటు పడుతుంది. అయితే అభియోగాల నమోదు దశనుంచే ఎన్నికల్లో పోటీ చేయకుండా వారిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ ‘ పభ్లిక్ ఇంట్రెస్ట్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ, బిజెపి నాయకుడు అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ తదితరులు ప్రజా ప్రయోజన పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లను విచారించిన స్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. ఈ ధర్మాసనంలో న్యాయమూర్తులు ఆర్‌ఎఫ్ నారిమన్, ఎఎం ఖన్విల్కర్, డివై చంద్రచూడ్, ఇందుమల్హోత్రాలు సభ్యులుగా ఉన్నారు. ‘ క్రిమినల్ కేసుల్లో విచారణను ఎదుర్కొంటున్న చట్టసభ సభ్యులపై అనర్హత వేటు వేసే స్థాయిలో న్యాయస్థానం లేదు. ఈ విషయంలో లక్ష్మణ రేఖను అతిక్రమించలేము. అయితే నేరస్థ్థులను చట్ట సభలకు దూరంగా ఉంచాల్సిన సమయం వచ్చింది. ఈ వ్యాధి మరింతగా ముదరక ముందే దీన్ని నయం చేయాల్పిన అవసరం ఉంది. క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న నేతలు ఎన్నికల్లో పోటీ చేయాలా, వద్దా అనే విషయాన్ని పార్లమెంటుకే వదిలేస్తున్నాం. ఈ విషయంలో పార్లమెంటు ఒక చట్ట్టాన్ని తీసుకు రావాలి’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇలాంటి చట్టంకోసం దేశం ఎంతో అత్రుతగా ఎదురు చూస్తోందని ధర్మాసనం అంటూ, ఈ రాచపుండును నయం చేసే బాధ్యతను ప్రజాస్వామ్యానికి చెందిన చట్టాలను చేసే విభాగం తప్పక తీసుకుంటుందన్న నమ్మకం తమకు ఉందని వ్యాఖ్యానించింది.
తీవ్రమైన నేరాలకు చెందిన అభియోగాలను ఎదుర్కొంటున్న వారి సభ్యత్వాలను రాజకీయ పార్టీలు రద్దు చేసే విధంగా, అలాంటి వారిని ఎన్నికల్లో నిలబెట్టకుండా ఉండే విధంగా కఠినమైన చట్టాన్ని పార్లమెంటు తీసుకు రావాలని కూడా ధర్మాసనం అభిప్రాయపడింది. అంతేకాక.. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమపై క్రిమినల్ కేసులు నమోదయి ఉంటే ఎన్నికల అఫిడవిట్‌లో ఆ కేసుల వివరాలను తప్పనిసరిగా విస్పష్టంగా పేర్కొనాలని కూడా ధర్మాసనం తన వందపేజీల ఏకగ్రీవ తీర్పులో స్పష్టం చేసింది. అలాగే రాజకీయ పార్టీలు కూడా తమ అభ్యర్థుల కేసుల వివరాలను పార్టీ వెబ్‌సైట్‌లలో ఉంచాలని కూడా స్పష్టం చేసింది. మంచి నాయకుల పాలన కింద కొనసాగే హక్కు సమాజానికి ఉందని, క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న నేతలను ‘అగాథం’లోకి నెట్టి తీరాల్సిందేనని తీర్పులో బెంచ్ అభిప్రాయపడింది. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడకముందే దీనికి సంబంధించి ఒక చట్టాన్ని తీసుకు రావలసిన అవసరం ఉందని కూడా బెంచ్ వ్యాఖ్యానించింది. ప్రస్తుతం దేశంలోని ఎంపిలు, ఎంఎల్‌ఎలు సహా 1,765 మంది ప్రజా ప్రతినిధులు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నట్లు ఈ కేసు విచారణ విచారణ సందర్భంగా గత మార్చిలో కేంద్రం సుప్రీంకోర్టుకు తెలియజేసింది.

Comments

comments