మహా కాదు, స్వాహా

టిడిపి, కాంగ్రెస్ పొత్తుతో ఎన్‌టిఆర్ ఆత్మ క్షోభిస్తుంది, తెలంగాణ బిడ్డలను చంపిన వారితోనా కోదండరామ్ చెట్టపట్టాల్? వరంగల్ జిల్లా నర్సంపేట నుంచి వెయ్యి మంది కాంగ్రెస్, టిడిపి, బిజెపి కార్యకర్తలు టిఆర్‌ఎస్‌లో చేరిన సందర్భంగా మంత్రి కెటిఆర్ నిశిత విమర్శనాస్త్రాలు మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ బిడ్డలను చంపిన వారితో కోదండరాం ఎన్నికల పొత్తు పెట్టుకున్నారని, అలాంటి వ్యక్తికి టిఆర్‌ఎస్ గురిం చి మాట్లాడే అర్హతే లేదని, అది ‘మహాకూటమి కా దని దానిని ‘స్వాహా కూటమి’గా పిలవాలని […]

టిడిపి, కాంగ్రెస్ పొత్తుతో ఎన్‌టిఆర్ ఆత్మ క్షోభిస్తుంది, తెలంగాణ బిడ్డలను చంపిన వారితోనా కోదండరామ్ చెట్టపట్టాల్?
వరంగల్ జిల్లా నర్సంపేట నుంచి వెయ్యి మంది కాంగ్రెస్, టిడిపి, బిజెపి కార్యకర్తలు టిఆర్‌ఎస్‌లో చేరిన సందర్భంగా మంత్రి కెటిఆర్ నిశిత విమర్శనాస్త్రాలు

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ బిడ్డలను చంపిన వారితో కోదండరాం ఎన్నికల పొత్తు పెట్టుకున్నారని, అలాంటి వ్యక్తికి టిఆర్‌ఎస్ గురిం చి మాట్లాడే అర్హతే లేదని, అది ‘మహాకూటమి కా దని దానిని ‘స్వాహా కూటమి’గా పిలవాలని మం త్రి కెటిఆర్ వ్యాఖ్యానించారు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గానికి చెందిన పౌర సరఫరాల శాఖ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో వెయ్యి మంది కార్యకర్తలు మం త్రి కెటిఆర్ సమక్షంలో తెలంగాణ భవన్‌లో సోమవారం టిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ టిడిపి, కాంగ్రెస్‌తో పెట్టకున్న పొత్తుతో ఎన్‌టిఆర్ ఆత్మ క్షోభిస్తుంద న్నారు. ముదిగొండ, బషీర్‌బాగ్ కాల్పులకు పాల్పడినవారు కలిసిపోయి మహాకూటమిగా ఏర్పడి పొత్తు లు పెట్టుకున్నారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమం సమయంలో కెసిఆర్ జెఏసి చైర్మన్‌గా కోదండరాంను చేస్తే ఆయన వెంట ప్రజలు నడిచారని, అలాంటి వ్యక్తి నేడు దొంగలతో కలిసి ఎన్నికల్లో పొత్తులు పెట్టుకున్నారని, ఈ పరిణామాలన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం నైతిక విలువలు కోల్పోయేలా మహాకూటమి పొత్తులు ఉన్నాయని ఆయన విమర్శించారు. గతంలో తమ పార్టీకి కూడా పొత్తు పెట్టుకుందని ఇలా ప్రజలను మోసం చేసే విధంగా వ్యవహారించలేదని కెటిఆర్ పేర్కొన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలనుకునే వారు ఢిల్లీ, అమరావతిలకు తెలంగాణ ప్రజలను బానిసలుగా చేయాలన్న ఉద్దేశ్యంతోనే మహాకూటమి ఆవిర్భవిస్తోందన్నారు.
ఉత్తమ్, ఆజాద్ మాటల్లో నియంతృత్వ ధోరణి
ఉత్తమ్‌కుమార్ రెడ్డి, గులాం నబీ ఆజాద్‌లు తెలంగాణ ఇచ్చింది తామేనని మాట్లాడుతున్నారని, వా రు మాట్లాడే మాటల్లో నియంతృత్వ ధోరణి కనబడుతుందన్నారు. కెసిఆర్ ప్రత్యేక రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తే తెలంగాణ ఇస్తామని హామీ ఇచ్చిన అప్పటి కాంగ్రెస్ 10 రోజుల తరువాత వెంటనే మాట మార్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం తెలంగాణ ప్రజలందరూ కలిసికట్టుగా ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని ఆయన పేర్కొన్నారు. ఆంధ్ర, తెలంగాణకు ఇష్టంలేని పెళ్లి చేసి జవహర్‌లాల్ నెహ్రూ ఇబ్బందులు పెట్టారని, దానినే కొనసాగింపుగా ఇందిరాగాంధీ తెలంగాణ ప్రజలను చంపిం చి మరో రకంగా కక్షసాధింపు చర్యలకు దిగిందని ఆరోపించారు. అలాంటి కుటుంబం నుంచి వచ్చి న రాహుల్‌గాంధీ తామే తెలంగాణ ఇచ్చామంటూ పదేపదే చెబుతున్నారని, తాము పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని, ఎవరూ తమ కు బిచ్చమేయలేదని, తప్పని పరిస్థితుల్లో ప్రజల ఉద్యమాన్ని చూసి భయపడి ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారని ఆయన పేర్కొన్నారు.
సింహం సింగిల్‌గానే వస్తుంది
ఏపి సిఎం చంద్రబాబు నాయుడు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నారని, మరోసారి తెలంగాణ ప్రజలనుమోసం చేయడానికి ఆయన ప్రయత్నిస్తున్నారన్నారు. నాలుగున్నర సంవత్సరాల్లో తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్టులకు వ్యతిరేకంగా చంద్రబాబు కేంద్రానికి 30 ఉత్తరాలు రాశారని కెటిఆర్ గుర్తుచేశారు. పొరపాటున మహాకూటమి అధికారంలోకి వస్తే తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్టులను చంద్రబాబు కట్టనిస్తారో లేదో ప్రజలకు తెలుసన్నారు. ఇక్కడ ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేని కాంగ్రెస్ ఢిల్లీలో అధిష్టానంపైనే ఆధారపడిందన్నారు. అలాంటి పార్టీకి ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ శనిలా దాపురించిదన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి తట్టుకోలేక ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయన్నారు. టిఆర్‌ఎస్ ఎన్నికల్లో ఇచ్చే హామీలను ఉత్తమ్ కాఫీ కొడుతూ నెరవేరని హామీల గురించి ప్రజలకు వాగ్ధానం చేస్తున్నారన్నారు. ఉత్తమ్ ఇచ్చే హామీలన్నీ ఉత్తవేనని ఆయన ఆరోపించారు. రైతుల బంధుగా సిఎం కెసిఆర్ ఒక వైపు ప్రజల రక్తాన్ని తాగే రాబంధులందరూ ఒకవైపు ఉన్నారని, సింహం సింగిల్‌గానే వస్తుందని, ఢిల్లీకి భయపడాల్సిన అవసరం తమకు లేదని, ప్రజలకు మాత్రమే తాము భయపడతామని పేర్కొనడంతో కార్యకర్తలు పెద్ద ఎత్తున హర్షధ్వానాలు వ్యక్తం చేశారు.
పూలబుట్టలో పెట్టి అసెంబ్లీకి పంపాలి
నర్సంపేట నియోజకవర్గం నుంచి ఈసారి పెద్ది సుదర్శన్ రెడ్డిని గెలిపించి పూలబుట్టలో పెట్టి అసెంబ్లీకి పంపాలని కెటిఆర్ నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. గతంలో కొన్ని శక్తులు ఆయన్ను ఓడించడానికి కుట్ర పన్నాయని అయినా నియోజకవర్గ ప్రజలకు ఏ లోటు రాకుండా చూసుకున్నారని ఇప్పటికైనా ఆయన మంచితనాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి 18 సంవత్సరాలుగా కెసిఆర్ వెన్నంటి ఉన్నారని, ఉద్యమంలో మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగారని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకుడిగా సుదర్శన్ రెడ్డి అందరికీ సుపరిచితుడేనని, ఉద్యమంలో ఆయన చురు గ్గా పాల్గొన్నారన్నారు. ఈ కార్యక్రమంలో టిఎస్‌ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, ఎంపి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ప్రభుత్వ విఫ్ వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యే భాస్కర్‌రావు , బీరం సంజీవరెడ్డి, సత్యనారాయణగౌడ్, మినుముల రాజు, ఇరుకు దేవేందర్ రావు తదితరులు పాల్గొన్నారు.

Related Stories: