అటు తాలింపులు.. ఇటు వడ్డింపులు

అమెరికా సరుకులపై భారీగా చైనా సుంకాలు  బీజింగ్ : అమెరికా ఆంక్షలకు ప్రతిగా చైనా ఇప్పు డు ఆ దేశం సరుకులపై  సుంకాల వడ్డింపులకు దిగింది. అమెరికా తమ దేశం నుంచి దిగుమతి చేసుకునే పలు సరుకులపై టారీఫ్‌లను పెంచుతున్నట్లు చైనా సోమవారం ప్రకటించింది. దీనితో ఇరుదేశాల మధ్య వాణిజ్య వ్యాపార యుద్ధం మరింత తీవ్రతరం అయింది. ప్రపంచ ఆర్థిక ప్రగతిని ప్రభావితం చేసే సాంకేతిక రంగంలో చైనా  అమెరికా మధ్య రగులుకున్న ప్రచ్ఛన్న యుద్ధం ఆంక్షలు […]

అమెరికా సరుకులపై భారీగా చైనా సుంకాలు 

బీజింగ్ : అమెరికా ఆంక్షలకు ప్రతిగా చైనా ఇప్పు డు ఆ దేశం సరుకులపై  సుంకాల వడ్డింపులకు దిగింది. అమెరికా తమ దేశం నుంచి దిగుమతి చేసుకునే పలు సరుకులపై టారీఫ్‌లను పెంచుతున్నట్లు చైనా సోమవారం ప్రకటించింది. దీనితో ఇరుదేశాల మధ్య వాణిజ్య వ్యాపార యుద్ధం మరింత తీవ్రతరం అయింది. ప్రపంచ ఆర్థిక ప్రగతిని ప్రభావితం చేసే సాంకేతిక రంగంలో చైనా  అమెరికా మధ్య రగులుకున్న ప్రచ్ఛన్న యుద్ధం ఆంక్షలు ప్రతి ఆంక్షలతో రోజురోజుకీ రగులుకొంటోంది. అమెరికా అధికార యంత్రాంగం కావాలని కయ్యానికి కాలుదువ్వుతోందని చైనా అధికారికంగా మండిపడింది. సోమవారం మధ్యాహ్నం నుంచి  ఏకంగా 5207 అమెరికా వస్తువులపై 5 నుంచి 10 శాతం వరకూ అదనపు పన్నులను వసూళ్ల జాబితాలో చేర్చింది. వీటి విలువ 60 బిలియన్ డాలర్ల వరకూ ఉంటుంది. తేనె మొదలుకుని పారిశ్రామిక రసాయనాల వరకూ అనేక సరుకులను అదనపు సుంకాల జాబితాలో చేర్చినట్లు చైనా కస్టమ్స్ సాధారణ పరిపాలనా విభాగం వారు తమ ప్రకటనలో తెలిపారు. చైనా సరుకులపై తాము 200 బిలియన్ డాలర్ల వరకూ  సుంకాలను విధిస్తున్నట్లు ట్రంప్ ఆలోచిస్తున్న తరుణంలోనే చైనా తన కార్యాచరణకు దిగింది. దీనితో ఇరుదేశాల వాణిజ్య యుద్ధం ఇప్పుడు రాజీలేని స్థాయికి చేరుకుందని విశ్లేషణలు వెలువడ్డాయి. చైనా సరుకులపై అధిక సుంకాల వసూళ్లను చేపట్టిందీ లేనిది అమెరికా అధికారికంగా ప్రకటించలేదు. అయితే దీనికి ముందుగానే చైనా నుంచి భారీ స్థాయిలో టారిఫ్‌ల పోటు మొదలైంది.విదేశీ కంపెనీల నుంచి టెక్నాలజీ చోరీకి చైనా పాల్పడుతోందని, అంతేకాకుండా టెక్నాలజీ అప్పగింతకు బెదిరింపులకు దిగుతోందని అమెరికా ఫిర్యాదులకు దిగడం ఈ రెండు అగ్రరాజ్యాల మధ్య పలు రకాల వివాదాలకు దారితీసి, చివరకు ఇది తీవ్రస్థాయి వాణిజ్య లడాయిదాకా రగులుకుంది. చైనా అనేక రకాలుగా తమ పారిశ్రామిక ఆధిపత్యానికి అక్రమరీతులలో గండికొడుతోందని ట్రంప్ అధికార యంత్రాంగం మండిపడుతోంది. రోబో టెక్నాలజీ, ఇతర అధునాతన సాంకేతికలల్లో చైనా అధికారికంగా తమతో తలపడుతోందని, అంతర్జాతీయ మార్కెట్‌పరమైన కట్టుబాట్లకు ఇది విరుద్దం అని అమెరికా విమర్శిస్తోంది. అయి తే ఇటువంటివి అవాస్తవం అని, ప్రపంచ మార్కెట్‌లో తమకు పోటీ కుదరదనే తత్వం సరికాదని చైనా తిప్పికొడుతోంది. వాణిజ్య యుద్ధ నివారణకు చైనా అమెరికా దేశాల మధ్య అధికారుల స్థాయి భేటీలో ప్రతిష్టంభన ఏర్పడిందని , సమస్య మరింతగా ముదురుతోందని ఇటీవలే వాల్ స్ట్రీట్ జర్నల్‌లో వార్త వెలువడింది. అమెరికా ప్రతిపాదిత చర్చల నుంచి చైనా అధికారుల బృందం వైదొలిగిందని తెలిపింది. సోమవారం చైనా నుంచి అధికారికంగా సుంకాల విధింపులు ఉధృతం కావడంతో ఇప్పట్లో చర్చల కు అవకాశం కూడా ఉండబోదని వెల్లడైంది. అమెరికా చాలా కాలంగా వాణి జ్య గుత్తాధిపత్య ధోరణికి పాల్పడుతోందని పైగా ఆర్థిక ఆధిపత్య వాదనకు పాల్పడుతోందని చైనా సోమవారం సుంకాల వడ్డింపు నేపథ్యంలో తీవ్రస్థాయి పదజాలంతో ప్రకటన వెలువరించింది. తాము అమెరికాతో సముచితమైన సవ్యమైన పరిష్కారం కోరుకుంటున్నామని పేర్కొన్న చైనా తాము వడ్డింపులకే దిగుతామని, రాయితీల ప్రసక్తే లేదని సంకేతాలు వెలువరించింది.