నిజాలు నిగ్గు తేలాలి

దేశానికి గుండెకాయ వంటి రక్షణ రంగంలో నీతి నియమ బద్ధత, పారదర్శకతలను ఆశించడం బొత్తిగా వ్యర్థమని మరోసారి రుజువవుతున్నది. రాజీవ్ గాంధీ పాలనలోని కాంగ్రెస్ హయాంలో బోఫోర్స్ యుద్ధ విమానాల కుంభకోణం ఆ పార్టీని గద్దె దింపినా రక్షణ రంగ అవినీతి కొండ చిలువ మన దేశాన్ని వదలడం లేదు. ఈ కుంభకోణాల్లో పాలకులే నేరుగా ప్రధాన పాత్ర వహిస్తున్నారనే అభిప్రాయానికి తావు కలగడం అత్యంత ఆందోళనకరం. ఫ్రెంచ్ కంపెనీ దసో తయారు చేసే రాఫెల్ యుద్ధ […]

దేశానికి గుండెకాయ వంటి రక్షణ రంగంలో నీతి నియమ బద్ధత, పారదర్శకతలను ఆశించడం బొత్తిగా వ్యర్థమని మరోసారి రుజువవుతున్నది. రాజీవ్ గాంధీ పాలనలోని కాంగ్రెస్ హయాంలో బోఫోర్స్ యుద్ధ విమానాల కుంభకోణం ఆ పార్టీని గద్దె దింపినా రక్షణ రంగ అవినీతి కొండ చిలువ మన దేశాన్ని వదలడం లేదు. ఈ కుంభకోణాల్లో పాలకులే నేరుగా ప్రధాన పాత్ర వహిస్తున్నారనే అభిప్రాయానికి తావు కలగడం అత్యంత ఆందోళనకరం. ఫ్రెంచ్ కంపెనీ దసో తయారు చేసే రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందాన్ని అనిల్ అంబానీకి అనుకూలంగా మార్పించింది స్వయంగా ప్రధాని మోడీయేనని భావించడానికి రూఢి ఆధారాలు బయటపడుతుండడం ఎడమ చేయికి బదులు పుర్ర చేయి అనే నానుడికి ప్రాణం పోస్తున్నది. అందరూ అదే తానులో ముక్కలేనని ప్రజలు అనుకోడానికి ఆస్కారమేర్పడుతున్నది.
వాస్తవానికి 2012లో యుపిఎ ప్రభుత్వం హయాంలోనే రాఫెల్ ఒప్పందం ప్రాథమికంగా కుదిరింది. అప్పుడు 126 యుద్ధ విమానాల కొనుగోలుకు నిర్ణయం జరిగింది. అందులో భాగంగా మన దేశంలో విడి భాగాల తయారీ బాధ్యతను స్వీకరించే ఆఫ్‌సెట్ కంపెనీగా ముఖేష్ అంబానీ సంస్థను ఎంచుకున్నారు. ఫ్రెంచ్ దసోల్‌కు ముఖేష్ అంబానీ కంపెనీకి మధ్య కుదిరిన ఒప్పందానికి యుపిఎ 2 ప్రభుత్వం ఆమోదాన్ని మాత్రమే తెలిపింది. అంతకుమించి దాని ప్రమేయం లేదు. ఆ తర్వాత ముఖేష్ అంబానీ రక్షణ పరిశ్రమల రంగం నుంచి తప్పుకోవడం, పర్యవసానంగా ఆ ఒప్పందం 2014లో రద్దు కావడం జరిగాయి. అనంతరం దసోల్ భారత ప్రభుత్వ రంగ కంపెనీ హిందూస్థాన్ ఏరోనాటిక్స్ (హాల్) తో 126 రాఫెల్ యుద్ధ విమానాల విడి భాగాల తయారీ ఒప్పందం కుదుర్చుకున్నది. నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత ఈ వ్యవహారం మొత్తం తిరగబడింది.
హాల్‌తో ఒప్పందం అమలు ప్రక్రియ 95 శాతం పూర్తి అయిందని దసోల్ సిఇఒ ఎరిక్ ట్రాపీ అప్పటికే ప్రకటించి ఉన్నారు. అయినా దానిని పూర్తిగా భూస్థాపితం చేసి భారతీయ ఆఫ్‌సెట్ భాగస్వామిగా అనిల్ అంబానీ కొత్త కంపెనీని చేర్చారు. హాల్‌తో కుదుర్చుకున్నట్టు 126 కాకుండా 36 విమానాల తయారీకి మాత్రమే ఒప్పందాన్ని పరిమితం చేశారు. అయితే 2012 నాటి ఒప్పందంలో ఒక్కో విమానం ఖరీదు 590 కోట్ల రూపాయలు కాగా అనిల్ అంబానీ కంపెనీతో కుదిరిన అంగీకారంలో దానిని ఒక్కసారిగా 1100 కోట్ల రూపాయలకు పెంచడం గమనించవలసిన విషయం. ఆ విధంగా ఇండియాలో అనిల్ అంబానీ ద్వారా నెలకొల్పే పరిశ్రమలో దసో 30 వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టాలి. అనిల్ అంబానీ కంపెనీకి మెజారిటీ షేర్లు (51 శాతం), దసోకు 49 శాతం వుండేలా ఏర్పాటు జరిగింది. ఇందులో పరస్పర ప్రయోజన కాండ ఉంది. ఈ ఒప్పందానికి అంగీకరించినందుకు అప్పటి ఫ్రెంచ్ అధ్యక్షుడు హాలెండ్ సన్నిహితురాలు జులియా గయెట్ నిర్మిస్తున్న చిత్రానికి పెట్టుబడి పెట్టడానికి అనిల్ అంబానీ అంగీకరించారు.
రాఫెల్ ఒప్పందంలో భారత దేశంలో ఆఫ్‌సెట్ కంపెనీగా అనిల్ అంబానీ సంస్థను తీసుకోవాలని 2015లో భారత ప్రభుత్వమే సూచించిందని దానితో తమకుగానీ దసోకుగానీ ప్రత్యామ్నాయం లేకపోయిందని ఫ్రాన్స్ అధ్యక్షుడు హాలెండ్ ఇటీవల ఒక ఇంటర్వూలో స్పష్టంగా వెల్లడించడంతో ప్రధాని మోడీ ప్రభుత్వం పరిస్థితి కుడితిలో పడిన ఎలుక చందం అయింది. భారత ప్రభుత్వం తరఫున ఈ సూచన ఎవరు చేశారు అనే ప్రశ్నకు సమాధానం నేరుగా ప్రధాని మోడీ వైపే అనుమానపు ముల్లును ఎక్కుపెడుతున్నది. అలాగే 2012లో కుదిరిన దానికంటె అతి ఎక్కువ రేటుకు తాజా అంగీకారం కుదుర్చుకోవలసిన అవసరం ఏల కలిగింది? సమర్థురాలైన ప్రభుత్వ రంగ సంస్థ హాల్ చేత విడిభాగాలు తయారు చేయించి వీలైనంత తక్కువకు ప్రభుత్వ ఖర్చును పరిమితం చేయడానికి బదులు అనిల్ అంబానీకి చెందిన అనుభవంలేని కొత్త కంపెనీకి ఎందుకు ఆ అవకాశాన్ని ఇవ్వవలసి వచ్చింది, అది దేశ ఖజానాను కొల్లగొట్టి ప్రైవేటు పెట్టుబడిదార్లకు దోచిపెట్టడం కిందకు రాదా అనే ప్రశ్నలు తల ఎత్తుతున్నాయి. ప్రధాని దేశానికి కాపాలాదారు కాదు దొంగ అని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేరుగా విమర్శించినా మోడీ నుంచి మౌనమే జవాబు కావడం గమనార్హం. ఆయన తరఫున అరుణ్‌జైట్లీ మున్నగువారు చేస్తున్న ప్రతి విమర్శలో పస కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఈ అవినీతి బురదమయమైన ఒప్పందానికి బీజాలు ఎలా పడ్డాయి, బాధ్యులెవరు అనే ప్రశ్నకు అనుమానాతీతమైన సమాధానాన్ని దేశ ప్రజలు ఆశించడం సహజం.

Related Stories: