భావితరాలకు వారసత్వం ‘వేయి స్తంభాల గుడి’

తెలంగాణ రాష్ట్రంలోని చారిత్రాత్మక దేవాలయల్లో వేయిస్తంభాల గుడి ఒకటి. ఇది 11వ శతాబ్దంలో కాకతీయ వంశానికి చెందిన రుద్రదేవుడు ఈ ఆలయాన్నిక్రీ.శ 1163లో చాళుక్యుల శైలిలో నిర్మించాడు. కాకతీయ సామ్రాజ్య కళాపిపాసకు, విశ్వ బ్రాహ్మణ శిల్పుల పనితనానికి మచ్చుతునకగా, భావితరాలకు వారసత్వంగా ఈ దేవాలయం మిగిలి ఉంది. ప్రధాన దైవం: శివుడు, విష్ణువు, సూర్యుడు ఆలయ విశేషాలు… వరంగల్ జంట నగరమైన హనుమకొండ నడిబొడ్డున ఉంది. కాకతీయు ల శిల్పకళా శైలితో అలరారే ఈ త్రికూ టాలయంలొ […]

తెలంగాణ రాష్ట్రంలోని చారిత్రాత్మక దేవాలయల్లో వేయిస్తంభాల గుడి ఒకటి. ఇది 11వ శతాబ్దంలో కాకతీయ వంశానికి చెందిన రుద్రదేవుడు ఈ ఆలయాన్నిక్రీ.శ 1163లో చాళుక్యుల శైలిలో నిర్మించాడు. కాకతీయ సామ్రాజ్య కళాపిపాసకు, విశ్వ బ్రాహ్మణ శిల్పుల పనితనానికి మచ్చుతునకగా, భావితరాలకు వారసత్వంగా ఈ దేవాలయం మిగిలి ఉంది.
ప్రధాన దైవం: శివుడు, విష్ణువు, సూర్యుడు

ఆలయ విశేషాలు… వరంగల్ జంట నగరమైన హనుమకొండ నడిబొడ్డున ఉంది. కాకతీయు ల శిల్పకళా శైలితో అలరారే ఈ త్రికూ టాలయంలొ నక్షత్రాకార పీఠంపై రుద్రేశ్వరుడు లింగ రూపంలో భక్తుల పాలిట కొంగుబంగారమై కొలువైనాడు. ప్రధానాలయం తూర్పుకు అభిముఖంగా అద్భుతమైన వాస్తుకళతో అలరారుతోంది. ఆలయ ముఖమండపానికి ఉత్తరాభి ముఖమైయున్న నందీశ్వరుని విగ్రహం నల్లరాతితో మలచబడి కళ్యాణ మంటపానికి, ప్రధానాలయాలకు మధ్యన ఠీవిగా దర్శనమిస్తుంది.

చూడాల్సినవి… ఉత్తర ప్రాకార ద్వారం గుండా ఆలయ ప్రాంగణంలోనికి ప్రవేశించగానే నిలువెత్తు పానవట్టం లేని లింగా లపై కరవీర వృక్షం పుష్పార్చన చేస్తున్నట్టుగా గాలికి రాలే పూవులు సువాసనలు వెదజల్లుతాయి. లింగాలపై పూలు పడే దృశ్యం చూసిన తర్వాత ఈశాన్య దిశలో అలనాటి కోనేటిని దర్శించవచ్చు. ప్రధానాలయం నక్షత్రాకార మంటపంపై రుద్రేశ్వరుడు, విష్ణు, సూర్య భగవానులకు వరుసగా తూర్పు, దక్షిణ, పడమరలకు అభిముఖంగా మూడు ఆలయాలు ఏకపీఠంపై అద్భుతమైన శిల్పకళతో మలచబడినవి. సజీవంగా గోచరమయ్యే నందీశ్వరుడికి ఎదురుగా ఉత్తర దిశ ద్వార పాలకు లుగా ఉన్నట్లుగా నిలచిన గజ శిల్పాలను దాటి సభా మంటపంలోనికి వెళ్ళి విఘ్నేశ్వరున్ని అర్చించి భక్తులు రుద్రేశ్వరున్ని దర్శిస్తారు.

ప్రత్యేక ఆకర్షణ… ఆలయ మంటపంపై లతలు, పుష్పాలు, నాట్య భంగిమలో ఉన్న స్త్రీ మూర్తులు, పలు పురాణ ఘట్టాలను శిల్పాలుగా మలచిన తీరు చూపరులను ఆకర్షిస్తాయి. కళ్యాణ మంటపం ప్రధానాలయాన్ని కలిపి మొత్తం వేయి స్తంభాలతో నిర్మించిన కారణంగానే ఈ ఆలయానికి వేయి స్తంభాల దేవాలయమనే పేరు ప్రసిద్ధి. నీటిపాయపై ఇసుకతో నిర్మించిన పునాదిపై భారీ శిల్పాలతో కళ్యాణ మండపం నెలకొల్పిన తీరు కాకతీయుల శిల్పకళా చాతుర్యానికి అద్దం పడుతుంది. ఆలయ ప్రాంగణంలో మారేడు, రావి, వేప వృక్షాలు భక్తుల సేద తీరుస్తాయి. ఆలయ వాయువ్యదిశలో వాయు పుత్ర అభయాంజనేయ స్వామి, నాగ ప్రతిమలు కొలువైనవి. ఆనాటి రహస్య సైనిక కార్య కలాపాల కోసం ఓరుగల్లు కోట ఇతర నిగూఢ కాకతీయ సామ్రాజ్య స్థావరాలను కలుపుతూ భూ అంతర్భాగం నుండి నెలకొల్పిన మార్గపు ద్వారాన్ని కూడా దర్శించవచ్చు. భద్రతా కారణాల దృష్ట్యా రహస్య మార్గం ధ్వంసమైన కారణంగా ఈ ద్వారం ప్రస్తుతం మూసివేశారు. 2014లో భారత ప్రభుత్వ పురావస్తు శాఖ వారి త్రవ్వకాల్లో కల్యాణ మంటపం కింద ఒక బావి బయటపడింది.

ముఖ్య దినాలు… మాఘ, శ్రావణ, కార్తీక మాసాలలో ఆలయ సందర్శన విశేష ఫలాన్నిస్తుందని నమ్మకం. మహా శివరాత్రి, కార్తీక పౌర్ణమి, గణేశ నవరాత్రుల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు, శతసహస్ర దీపాలంకరణలు, నిత్యపూజలు, అన్నరాశితో జరిగే ప్రత్యేక అలంకరణలతో అలరారే రుద్రేశ్వర స్వామిని భక్తిశ్రద్ధలతో దర్శించడం దివ్యానుభూతిని కలిగిస్తుంది.

ఎలా వెళ్లాలంటే… ఇంతటి ప్రశస్తి కల ఈ ఆలయా నికి దూరప్రాంతాల వారు ఖాజీ పేట లేక వరంగల్ రైల్వేస్టేషను చేరుకుని బస్సు, ఆటోల గుండా
5 కి.మీ. దూరంలో ఉన్న హనుమకొండ నగరానికి చేరుకొని ఆలయ వేళల్లో రుద్రేశ్వర స్వామిని దర్శించవచ్చు.

Comments

comments