పార్లమెంట్ నియోజకవర్గానికో సభ?

నోటిఫికేషన్ వెలువడేలోపు శ్రీకారం,  ప్రచార వ్యూహాల్ని సిద్ధం చేస్తున్న టిఆర్‌ఎస్ హైదరాబాద్: రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్షాల కంటే ముందే ఉన్న టిఆర్‌ఎస్ మరింత వేగం పెంచేలా ఆ పార్టీ ప్రణాళికలను సిద్దంచేస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడేలోపు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గానికి ఒకటి లేదా ప్రతీ పూర్వ జిల్లాకు ఒకటి చొప్పున బహిరంగ సభలను నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలిసింది. బతుకమ్మ సంబురాలుప్రారంభమయ్యే వరకు ఈ సభలను నిర్వహించి మధ్యలో పది రోజుల […]

నోటిఫికేషన్ వెలువడేలోపు శ్రీకారం,  ప్రచార వ్యూహాల్ని సిద్ధం చేస్తున్న టిఆర్‌ఎస్

హైదరాబాద్: రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్షాల కంటే ముందే ఉన్న టిఆర్‌ఎస్ మరింత వేగం పెంచేలా ఆ పార్టీ ప్రణాళికలను సిద్దంచేస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడేలోపు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గానికి ఒకటి లేదా ప్రతీ పూర్వ జిల్లాకు ఒకటి చొప్పున బహిరంగ సభలను నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలిసింది. బతుకమ్మ సంబురాలుప్రారంభమయ్యే వరకు ఈ సభలను నిర్వహించి మధ్యలో పది రోజుల విరామం ఇచ్చి తర్వాతి దశలో అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఇందుకోసం ఇప్పటికే ప్రచారం ఉధృతంగా నడుస్తున్న నియోజకవర్గాలను ఎంపిక చేసే కసరత్తు ప్రారంభమైంది. ఎన్ని బహిరంగసభలను ఏర్పాటు చేయాలనేదానిపై సిఎం కెసిఆర్‌తో సంప్రదించిన తర్వాత స్పష్టత వస్తుందని పార్టీ వర్గాలు వ్యాఖ్యానించాయి. గత ఎన్నికలలో టిఆర్‌ఎస్ గెలుపులో ప్రచార వ్యూహం కీలక పాత్రే పోషించింది. ఇప్పుడు కూడా అదే తరహా వ్యూహాలను పార్టీ సిద్దం చేస్తోంది. ప్రతిపక్షాలకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా, ప్రత్యర్థులను అయోమయానికి గురిచేసేలా వ్యూహాత్మకంగా ప్రచారం నిర్వహించాలని పార్టీ భావిస్తోంది. అసెంబ్లీ రద్దు చేసిన వెంటనే 105 మంది అభ్యర్థులను ప్రకటించిన గులాబీ బాస్, ఆ తర్వాత హుస్నాబాద్‌లో ‘ప్రజా ఆశీర్వాద సభ’ మాత్రమే నిర్వహించారు. అభ్యర్థులను ప్రకటించిన రోజే 50 రోజుల్లో 100 సభలు నిర్వహించనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో వెంటవెంటనే సభలు ఉంటాయని ఆయా నియోజకవర్గాల అభ్యర్థులు భావించారు. అయితే సభలకు కొంత విరామం ఏర్పడింది. 50 రోజుల్లో 100 సభల నిర్వహణకు ముందే పార్లమెంట్ నియోజకవర్గాలవారీగా బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత 50 రోజుల్లో 100 సభలు ప్రారంభించాలని భావిస్తున్నట్లు సమాచారం.

వారంలో సభలు ప్రారంభం
అభ్యర్థులు తమ నియోజకవర్గాలలో ప్రచారం కొనసాగిస్తున్నప్పటికీ స్వయంగా కెసిఆర్ బహిరంగ సభ నిర్వహిస్తేనే పార్టీ కార్యకర్తల్లో, కేడర్‌లో ఉత్సాహం పెరుగుతుందని పార్లమెంట్ నియోజవర్గాల వారీగా బహిరంగ సభలకు శ్రీకారం చుడుతున్నట్లు సమాచారం. ఎంపిక చేసిన పార్లమెంట్ నియోజకవర్గాలలో ఈ వారంలో బహిరంగ సభలు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతీ సభకు లక్షమందికి తగ్గకుండా జనసమీకరణ చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. పార్టీ ముఖ్యనేతలకు ఈ సభలకు ఇప్పటికే సమాచారం అందించినట్లు సమాచారం. ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థులను ప్రకటించేలోపే పార్లమెంట్ నియోజకవర్గాలవారీగా బహిరంగ సభలు నిర్వహించడం ద్వారా పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తల్లో ఉత్సాహం ఎన్నికలకు సన్నద్దమవుతారని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

అభ్యర్థుల్లో ధైర్యం నింపుతున్న అధిష్టానం
అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ అధినేత ప్రకటించిన అభ్యర్థులు వారి నియోజకవర్గాలలో గెలుపే ధ్యేయంగా ఆత్మస్థైర్యంతో ధీమాగా ప్రచారం నిర్వహించుకునేలా పార్టీ అధిష్టానం ధైర్యం నింపుతోంది. అసమ్మతి గురించి ఎలాంటి భయం వద్దని, దానిని పార్టీ పరిష్కరిస్తుందని హామీ ఇస్తున్నారు. ఇప్పటికే అలాంటి పరిస్థితి ఉన్న నియోజకవర్గాల్లోని నాయకులతో మంత్రి కెటిఆర్ సమావేశం నిర్వహించి సర్దుబాటు చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలను కలుపుకుపోతూ మండలాలవారీగా ప్రతీ గ్రామం తిరగాలని, ఇంటింటికీ ప్రచారం చేస్తూ ప్రజల కష్టసుఖాలు అడిగి తెలుసుకోవాలని సూచించినట్లు సమాచారం. బి.ఫాం గురించి ఎలాంటి భయాలు, అనుమానాలు వద్దని, అభ్యర్థులు నిశ్చింతగా ప్రచారం చేసుకోవాలని పార్టీ కీలక నేతలు అభ్యర్థులకు చెప్పినట్లు తెలిసింది. జిల్లాలవారీగా కొంతమంది అభ్యర్థులకు పార్టీ అధినేత కెసిఆర్ స్వయంగా ఫోన్లు చేసి ప్రచారం సరళిని అడిగి తెలుసుకుంటున్నారు. కొన్ని నియోజకవర్గాలకు పార్టీ అధినేత తన దూతలను పంపించి క్షేత్రస్థాయిలో అభ్యర్థుల పరిస్థితి, ప్రచారం సరళిని తెలుసుకుంటున్నారు. అభ్యర్థులు తమ నియోజకవర్గాలలో మండలాలవారీగా ద్వితీయ శ్రేణి నాయకులతో నిరంతరం మాట్లాడుతూ ఉంటూ, గ్రామాలవారీగా పార్టీ పరిస్థితులను సమీక్షిస్తూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపాలని ఆదేశించినట్లు సమాచారం. అభ్యర్థులు ఎట్టి పరిస్థితుల్లో ప్రచారంలో వెనుబడిపోవద్దని, ప్రత్యర్థి అభ్యర్థులు ప్రచారం ప్రారంభించేలోపే టిఆర్‌ఎస్ అభ్యర్థులు రెండు మూడు సార్లు నియోజకవర్గం మొత్తం ప్రచారం నిర్వహించి ఉండాలని పార్టీ అధిష్టానం చెప్పినట్లు తెలిసింది.

Comments

comments

Related Stories: