ఘాతుకం

అరకులో ఎంఎల్‌ఎ కిడారి సర్వేశ్వరరావును, మాజీ ఎంఎల్‌ఎ సివేరి సోమను పట్టపగలు కాల్చి చంపిన మావోయిస్టులు, దుంబ్రిగుడ మండలం లిపిటిపుట్టు వద్ద దారుణం వాహనాన్ని అటకాయించి తాళ్లతో చేతులు కట్టేసి గన్‌మెన్ నుంచి ఆయుధాలు తీసుకొని… ఆగ్రహించిన ఇద్దరు నేతల అనుచరులు దుంబ్రిగుడ పోలీస్‌స్టేషన్‌కు నిప్పు పోలీసుల నిర్లక్షమే కారణమంటూ నినాదాలు ప్రాణభయంతో పరుగులు పెట్టిన పోలీసులు రెండు స్టేషన్ల వద్ద ఉద్రిక్తత మన తెలంగాణ/హైదరాబాద్: అంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లా అరకు లోయలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. […]

అరకులో ఎంఎల్‌ఎ కిడారి సర్వేశ్వరరావును, మాజీ ఎంఎల్‌ఎ సివేరి సోమను పట్టపగలు కాల్చి చంపిన మావోయిస్టులు, దుంబ్రిగుడ మండలం లిపిటిపుట్టు వద్ద దారుణం
వాహనాన్ని అటకాయించి తాళ్లతో చేతులు కట్టేసి గన్‌మెన్ నుంచి ఆయుధాలు తీసుకొని…

ఆగ్రహించిన ఇద్దరు నేతల అనుచరులు
దుంబ్రిగుడ పోలీస్‌స్టేషన్‌కు నిప్పు
పోలీసుల నిర్లక్షమే కారణమంటూ నినాదాలు
ప్రాణభయంతో పరుగులు పెట్టిన పోలీసులు
రెండు స్టేషన్ల వద్ద ఉద్రిక్తత

మన తెలంగాణ/హైదరాబాద్: అంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లా అరకు లోయలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. ప్రభుత్వ విప్,అరకు ఎంఎల్‌ఎ కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎంఎల్‌ఎ సివేరి సోమపై ఆదివారం ఉదయం కాల్పులు జరిపారు. నాలుగు రౌండ్లు కాల్పులు జరపడంతో ఘటనా స్థలంలోనే సర్వేశ్వరరావు(43), సివేరి సోమ(51) ప్రాణాలు విడిచారు. దుంబ్రిగూడ మండలం లిపిటిపుట్టు సమీపంలో ఈ దారుణం చోటు చేసుకుంది. దాడిలో కిడారి అనుచరులకు, పోలీసులకు సైతం గాయాలైయ్యాయి. 2014లో ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సిపి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన కిడారి ఇటీవలే టిడిపిలో చేరారు. మృతి చెందిన కిడారికి ఇద్దరు కుమారులున్నారు. మావోయిస్టుల హిట్‌లిస్ట్‌లో ఉన్న కిడారిని గతంలోనే హెచ్చరించారు. గ్రామాల్లో పోస్టర్ల ద్వారానూ ప్రచారం చేశారు. ఈ దాడిలో దాదాపు 20 మంది మావోయిస్టులు పాల్గొన్నట్లు పోలీసు ఉన్నతాధికారులు వివరించారు.

‘గ్రామదర్శిని’ కార్యక్రమంలో భాగంగా స్వంత వాహనాల్లో వెళ్తున్న క్రమంలో మావోయిస్టులు మాటువేసి రోడ్డుపై వాహనాన్ని అటకాయించి ఒక్కసారిగా ఆ ఇద్దరూ ప్రయాణిస్తున్న వాహనాన్ని చుట్టుముట్టి ఆయుధాలను ఎక్కుపెట్టి వాహనం నుంచి కిందికి దించారు. కిడారికి రక్షణగా ఉన్న ఇద్దరు గన్‌మెన్ దగ్గర ఉన్న ఆయుధాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు మాజీ ఎంఎల్‌గా ఉన్న సోమకు రక్షణ కోసం ఉన్న గన్‌మాన్ నుంచి కూడా ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. కిడారి, సోమల చేతులను తాళ్ళతో వెనకవైపుకు కట్టి వెంట తీసుకెళ్ళి సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్ళి కొద్దిసేపు వారితో మాట్లాడి ఆ తర్వాత ‘పాయింట్ బ్లాంక్’ రేంజిలో కాల్చి చంపారు. అనంతరం మావోయిస్టులు ఆ ఆయుధాలను తీసుకుని అడవిలోకి పారిపోయారు. కాల్పుల శబ్దం విన్న వాహనాల్లోని అనుచరులు అక్కడికి వెళ్ళి చూడగానే అప్పటికే రక్తపు మడుగులో ఉండి ప్రాణాలు వదిలారు.

దాడికి నిరసనగా పోలీస్‌స్టేషన్లపై దాడులు
అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరావు, మాజీ ఎమ్మెల్యే శివేరి సోమ హత్యలపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ వారి అనుచరులు అరకు, డుంబ్రిగూడ పోలీస్ స్టేషన్లపై దాడి చేశారు. డుంబ్రిగూడ పోలీస్ స్టేషన్‌కు నిప్పంటించారు. పోలీసుల నిర్లక్షం వల్లే ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు చనిపోయారంటూ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ఘటనతో ఉలిక్కిపడ్డ పోలీసులు ప్రాణ భయంతో పరుగులు పెట్టారు. రెండు పోలీస్ స్టేషన్ల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దాడిలో పోలీసు స్టేషన్ల అద్డాలు, ఫర్నీచర్, పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. విధినిర్వహణలో ఉన్న ఓ కానిస్టేబుల్‌పై సోమ అనుచరులు భౌతికదాడి చేయడంతో తీవ్రంగా గాయాలయ్యాయి.

ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి
అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే శివేరి సోమను మావోయిస్టులు కాల్పిచంపడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అమెరికా పర్యటనలో ఉన్న సిఎం ఈ దాడి గురించి తెలియగానే విచారం వ్యక్తం చేయడంతో పాటు ఖండించారు. వెనుకబడిన ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనుల అభ్యున్నతికి కిడారి, శివేరి చేసిన సేవలను కొనియాడారు. మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఈ దాడిని ప్రజాస్వామ్యవాదులు అందరూ ఖండించాలని కోరారు.

ముందస్తు హెచ్చరికలు చేశాం: డిఐజి శ్రీకాంత్
ఏజెన్సీ ప్రాంతాలలో మావోయిస్టుల కదలికలను తాము గమనిస్తూనే ఉన్నామని, మావోయిస్టు ప్రభావిత ప్రాం తాలలోని ఎంపి, ఎంఎల్‌ఏ, ఎంఎల్‌సి పాటు ప్రజా ప్రతినిధులకు ఈనెల 21న నోటీసులు ఇచ్చామని డిఐజి శ్రీకాంత్ తెలిపారు. ఎమ్మెల్యే కిడారి ‘గ్రామదర్శిని’కి వెళుతున్నట్లు పోలీసులకు సమాచారం ఇవ్వలేదని, ప్రజా ప్రతినిధులు పర్యటించే ప్రాంతాలపై పోలీసులకు సమాచారం అందిస్తే యాంటి నక్సల్స్ బలగాలను రంగంలోకి దింపుతామన్నారు. కూంబింగ్, బాంబ్ డిటెక్షన్, రోడ్ ఓపెనింగ్ తదితరాలను నిర్వహించిన తర్వాతనే అక్కడి పరిస్థితులకు అనుగుణంగా పర్యటనకు అనుమతి ఇచ్చేవారమని, తగిన భద్రత కల్పించేవారమని తెలిపారు. ఘటన జరిగిన ప్రాంతంలో ఇటీవల కాలంలో గ్రామసభలు నిర్వహించిన సమాచారం తమ వద్ద ఉందని, ఈ సమయంలో పోలీసుల అనుమతి లేకుండా ఎమ్మెల్యే కిడారి ఆ ప్రాంతానికి వెళ్లాల్సి రావడంపై ఆరా తీస్తున్నామని డిఐజి వివరించారు.

ఇద్దరిపై ఒకేసారి కాల్పులు : ప్రత్యక్ష సాక్షులు
‘ప్రభుత్వానికి తొత్తులుగా మారి వందలాది కోట్ల రూపాయలు స్వాహా చేస్తున్నారు, వద్దని చెబితే వినరా’ అంటూ మావోయిస్టులు ఆగ్రహం వ్యక్తం చేసి ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సోమపై ఏకకాలంలో కాల్పులు జరిపారని ప్రత్యక్ష సాక్షి అయిన గన్‌మాన్ స్వామి, మాజీ ఎమ్మెల్యే సోమ కారు డ్రైవర్ చిట్టి మీడియాకు వివరించారు. ఘటనకు ముందు మావోయిస్టులు కార్లను అడ్డుకున్నారని, రౌండప్ చేసి తమ వద్ద ఉన్న ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారన్నారు. అనంతరం వారిద్దరినీ దూరంగా తీసుకెళ్లి 20 నిమిషాల పాటు మీటింగ్ పెట్టారన్నారు. ఏజెన్సీ భూముల్లో బాక్సైట్ తవ్వకాలు జరుపుతారా? ప్రభుత్వ తొత్తులుగా మారి మూడు క్వారీలు నడుపుతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసి ఇద్దరిపై ఒకేసారి కాల్పులు జరిపారని తెలిపారు.

బాక్సైట్ తవ్వకాలే కారణం?
ప్రభుత్వ విప్,అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే శివేరి సోమలను మావోయిస్టులు కాల్చివేతకు బాక్సైట్ తవ్వకాలే కారణమని పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి. విశాఖ ఏజెన్సీలోని జెర్రెల బ్లాక్ 1,2,3తోపాటు కొయ్యూరు సమీపంలోని గూడెంకొత్తవీధిలోని బ్లాక్‌లో 2017లో ‘నాల్కో’ (నేషనల్ అల్యూమినియం కంపెనీ)కు బాక్సైట్ తవ్వకాలకు అనుమతి ఇవ్వడం, మావోయిస్టులు దీన్ని వ్యతిరేకించడంతోపాటు పచ్చని అడవులు నాశనమౌతాయని, ఆదివాసుల మనుగడ కష్టమవుతుందని బహిరంగంగానే పోస్టర్లు వేసి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అరకు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు గులకరాళ్ల పేరిట తవ్వకాలు జరుపుతూ రహదారుల నిర్మాణానికి నిధుల్ని మంజూరు చేయించడంతో ఆగ్రహించిన మావోయిస్టులు హిట్‌లిస్టులో పెట్టి ఇప్పుడు దాడిచేసి హతమార్చినట్లు ఆ గ్రామాల ప్రజలు వ్యాఖ్యానించారు. విశాఖ ఏజెన్సీలో దాదాపు 15 సంవత్సరాల తరువాత మావోయిస్టులు బడా నేతలపై దాడులకు పాల్పడ్డారు. 14ఏళ్ల క్రితం 2004 మార్చి 18న అప్పటి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి మత్సరాస మణికుమారి భర్త వెంకట రాజును కాల్చిచంపారు.

 కీలక నేత చలపతి పనేనా?

గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొన్న అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, శివేరి సోమ హత్యల్లో ఎఒబి రాష్ట్ర మిలటరీ కమిషన్ కార్యదర్శి రాంచంద్రారెడ్డి ప్రతాప్‌రెడ్డి అలియాస్ చలపతి పాల్గొన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనాస్థలంలో ప్రతాప్‌రెడ్డి కదలికలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా ఘటనలో యాక్షన్ టీమ్ తోపాటు మావోయిస్టు సానుభూతిపరులు ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన ప్రతాప్‌రెడ్డి దీర్ఘకాలంగా మావోయిస్టు పార్టీలో కీలక బాధ్యతల్లో కొనసాగుతున్నారు. సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఉన్న ఆయన రాష్ట్ర మిలటరీ కమిషన్ కార్యదర్శిగానూ పనిచేస్తున్నారు. ఆయన నేతృత్వంలో యాక్షన్ టీమ్ నెల రోజులపాటు రెక్కీ నిర్వహించి ఈ దాడికి పాల్పడినట్లు పోలీసుల ప్రాధమిక దర్యాప్తులో వెల్లడైంది.

Related Stories: