వెళ్లి రావయ్యా మళ్లి రావయ్యా

హైదరాబాద్ హుస్సేన్ సాగర్ లోకి ఖైరతబాద్ మహాగణపతి                                                                                            వీడ్కోలు చేబుతున్న భక్త జన […]

హైదరాబాద్ హుస్సేన్ సాగర్ లోకి ఖైరతబాద్ మహాగణపతి                                                                                            వీడ్కోలు చేబుతున్న భక్త జన సంద్రం                                                                                                             54,538 విగ్రహాలు నిమజ్జనం                                                                                                            హుస్సేన్‌సాగర్‌లో 3,420 విగ్రహాలు

ప్రశాంతంగా, వైభవంగా వినాయక నిమజ్జనం

మనతెలంగాణ/ సిటీబ్యూరో : మహాగణపతింబజే… అంటూ హైదరాబాద్ మహానగరంలో గణనాథుల నిమజ్జన శోభయాత్ర ఆదివారం కన్నుల పండువగా, భక్తి పారవశ్యంతో కొనసాగింది. వినాయక విగ్రహాల ఊరేగింపు కళాత్మకంగా, సంతోషంతో అన్ని వర్గాలవారు, అన్ని వయస్సులవారు ఉత్సాహంగా పాల్గొంటూ హుస్సేన్‌సాగర్‌వైపు సాగుతున్నారు. బాలాపూర్ నుంచి హుస్సేన్‌సాగర్ వరకు నిమజ్జన శోభాయాత్ర జరుగుతుంది. గ్రేటర్ హైదరాబాద్‌లో హుస్సేన్‌సాగర్‌తోపాటు శివారు ప్రాంతాల్లోనూ 35 చెరువుల్లో గణపతి ప్రతిమల నిమజ్జనం జరిగింది.

జిహెచ్‌ఎంసి ప్రత్యేక ఏర్పాట్లు
గ్రేటర్‌లో గణనాథుల నిమజ్జనానికి 200లకుపైగా క్రేన్‌లు, 10 వేల మందికిపైబడి సిబ్బంది నిమజ్జన కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. ముఖ్యంగా ప్రభుత్వ విభాగాలు జిహెచ్‌ఎంసి, పోలీసు, విద్యుత్, జలమండలి విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. బల్దియా రూ. 16.86 కోట్లు వెచ్చించి రోడ్లకు మరమ్మతులు, అదనపు విద్యుత్ వెలుగులను తీసుకువచ్చింది. నిమజ్జన శోభయాత్రసాగే బాలాపూర్ నుండి హుస్సేన్‌సాగర్ వరకున్న మార్గంలో ప్రతి 3 కి.మీ.లకు ఒక గణేష్ యాక్షన్ టీంను జిహెచ్‌ఎంసి ఏర్పాటు చేసింది. ఒక్కోటీంలో శానిటరీ సూపర్‌వైజర్, జవాన్‌లు ముగ్గురు ఎస్‌ఎఫ్‌ఏలు, 21 మంది పారిశుధ్ధ కార్మికులు మూడు షిప్ట్‌లుగా మొత్తం 178 గణేష్ యాక్షన్ టీంలు పనిచేస్తున్నాయి. నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో 27 ప్రత్యేక వైద్యశిబిరాలు, 92 మొబైల్ టాయిలెట్లు, పారిశుధ్ధ కార్యక్రమాల నిర్వాహణకు 481 మంది సూపర్‌వైజర్లు, 719 మంది ఎస్‌ఎఫ్‌ఏలు, 8,597 మంది కార్మికులు తమతమ విధుల్లో నిమగ్నమయ్యారు.

పహరాలో పోలీసులు టేక్షుగేటర్ హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనం శాంతియుతంగా, భక్తిశ్రద్దలతో జరిగేందుకు పోలీసు యంత్రాంగం ప్రత్యేక బందోబస్తును కల్పించింది. ముగ్గురు కమిషనర్‌లు అంజనీకుమార్(హైదరాబాద్ నగరం), విసి సజ్జనార్(సైబరాబాద్), మహేశ్‌భగవత్ (రాచకొండ)లు పకడ్బందీ వ్యూహాలతో ఎప్పటికప్పుడు పర్యవేక్షణను నిర్వహించారు. ముఖ్యంగా బాలాపూర్ హుస్సేన్‌సాగర్ వరకు జరిగే శోభాయాత్ర జరిగే మార్గంను మూడు రకాలుగా విభజించారు. పెద్దవిగ్రహాలు వెళ్ళేందుకు ఎరుపు రంగు, ఆ తర్వాతి విగ్రహాలకు నీలం రంగు మార్గాలను, నిమజ్జనం పూర్తిచేసిన తర్వాత తిరిగి వెళ్ళే వాహనాలకు ఆకుపచ్చని రంగు మార్గాన్ని నగర పోలీసులు ప్రత్యేకంగా ఏర్పాటుచేశారు. నగర ట్రాఫిక్‌ను 38 సెక్టార్‌లుగా విభజించారు. నిమజ్జనానికి వచ్చే విగ్రహాలకు 38 పాయింట్స్‌లో 38 క్రేన్‌లను అందుబాటులోకి తీసుకువచ్చారు. శోభయాత్ర మార్గంలో 410 మొబైల్ పార్టీలు, 2100మంది ట్రాఫిక్ పోలీసులు, 14 వేల మంది శాంతిభద్రతల పోలీసులు, 16 బాంబు స్కాడ్‌లు, 2 యాక్సెస్ కంట్రోల్ బృందాలు, 22 స్నిప్పర్‌డాగ్స్‌లు భద్రతపై ప్రత్యేక దృష్టిసారించాయి.

మధ్యాహ్నమే ఖైరతాబాద్ గణపయ్య…
57 అడుగుల ఎత్తు, 24 అడుగుల వెడల్పుతో సిద్దమైన ఖైరతాబాద్ భారీ విగ్రహా నిమజ్జన కార్యక్రమాలు ఉ. 7 గం.లకు ప్రారంభమై మధ్యాహ్నం 12.57 గం.లకు నిమజ్జనం పూర్తయ్యింది. గ్రేటర్‌లో మొత్తం 54,538 విగ్రహాలు నిమజ్జనమైనట్టు అధికారులు వెల్లడించారు. సా.6గం.లకు 3,420 విగ్రహాలు హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనమైనట్టు తెలిపారు.