రాఫెల్ రగడ

 మోడీ దొంగని తేలిపోయింది, ఇప్పటికైనా నిజం చెప్పండి, దేశరక్షణపైనే సర్జికల్ దాడి చేశారు : రాహుల్  రిలయన్స్ ఎంపికలో ప్రభుత్వ పాత్ర లేదు : రక్షణశాఖ  ఆలోచించి మాట్లాడాలి : రాజ్‌నాథ్ సింగ్  మా ప్రమేయం లేదు : ఫ్రాన్స్ ప్రభుత్వం  అది మా నిర్ణయమే : డసాల్ట్ ఏవియేషన్  రాహుల్ బాధ్యతరాహిత్యం : రవిశంకర్ ప్రసాద్ న్యూఢిల్లీ: రాఫెల్ యుద్ధ విమానాల తయారీలో భారత భాగస్వామిగా రిలయన్స్ డిఫెన్స్‌ను ఎంచుకోవడంలో తమకెలాంటి సంబం ధం లేదని […]

 మోడీ దొంగని తేలిపోయింది, ఇప్పటికైనా నిజం చెప్పండి, దేశరక్షణపైనే సర్జికల్ దాడి చేశారు : రాహుల్

 రిలయన్స్ ఎంపికలో ప్రభుత్వ పాత్ర లేదు : రక్షణశాఖ
 ఆలోచించి మాట్లాడాలి : రాజ్‌నాథ్ సింగ్
 మా ప్రమేయం లేదు : ఫ్రాన్స్ ప్రభుత్వం
 అది మా నిర్ణయమే : డసాల్ట్ ఏవియేషన్
 రాహుల్ బాధ్యతరాహిత్యం : రవిశంకర్ ప్రసాద్

న్యూఢిల్లీ: రాఫెల్ యుద్ధ విమానాల తయారీలో భారత భాగస్వామిగా రిలయన్స్ డిఫెన్స్‌ను ఎంచుకోవడంలో తమకెలాంటి సంబం ధం లేదని ఫ్రెంచ్ ప్రభుత్వం శనివారం స్పష్టం చేసింది. అంతేకాదు ఒప్పందాల్లో తమ భాగస్వాములను ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఫ్రెంచ్ కంపెనీలకు ఉంటుందని కూడా తెలియజేసింది. రాఫెల్ యుద్ధ విమానాల తయారీలో భాగస్వామిగా రిలయన్స్ డిఫెన్స్‌ను ఎంచుకోవాలని భారత ప్రభుత్వమే డసాల్ట్ ఏవియేషన్‌కు సూచించిందని ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే చెప్పినట్లు ఫ్రెంచ్ పత్రిక ‘మీడియా పార్ట్’ లో కథనాలు వచ్చిన నేపథ్యంలో ఫ్రెంచ్ ప్రభుత్వం ఈ వివరణ ఇచ్చింది.‘ భారత ప్రభుత్వం ప్రతిపాదించిందని మేము కంపెనీలను భాగస్వాములుగా ఎంచుకోం. ఈ ఒప్పందంలో మా పాత్ర కూడా ఏమీ లేదు. తమ భాగస్వాములను ఎంపిక చేసుకునే పూర్తి స్వేచ్ఛ ఫ్రెంచ్ కంపెనీలకు ఉంటుంది. ఏ కంపెనీకి సామర్థం ఉందని భావిస్త్తాయో దానినే మా కంపెనీలు ఎంపిక చేసుకుంటాయి. దాని తర్వాతే భారత ప్రభుత్వ అనుమతి తీసుకుంటాయి’ అని ఫ్రెంచ్ ప్రభు త్వం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. రాఫెల్ విమానాల తయారీలో భాగస్వామిగా రిలయన్స్ డిఫెన్స్‌ను ఎంపిక చేసుకోవాలని భారత ప్రభుత్వమే ప్రతిపాదించిందని, ఇందులో తమ ప్రభుత్వ ప్రమేయం ఏమీ లేదని ఫ్రెంచ్ మాజీ అధ్యక్షుడు హోలాండే చెప్పిట్లుగా ‘మీడియా పార్ట్’ కథనం పేర్కొంది. తమకు వేరే అవకాశం లేకపోవడం వల్ల భారత ప్రభుత్వం ఇచ్చిన వారినే తీసుకున్నామని ఆయన చెప్పినట్లు కూడా ఆ పత్రిక వెల్లడించింది. హోలాండే ప్రకటన భారత్‌లో ప్రకంపనలు సృషించిన నేపథ్యంలో ఫ్రెంచ్ ప్రభుత్వం ఈ వివరణ ఇచ్చిం ది. మరోవైపు హోలాండే వ్యాఖ్యలను డసాల్ట్ ఏవియేషన్ కూడా ఖండించింది. రిలయన్స్ డిఫెన్స్‌ను భాగస్వామిగా ఎంచుకోవడం పూర్తి గా తమ నిర్ణయమేనని ఆ సంస్థ స్పష్టం చేసిం ది.‘ మేక్ ఇన్ ఇండియాలో భాగంగా రిలయన్స్ డిఫెన్స్‌ను ఎంపిక చేసుకున్నాం. అది మా నిర్ణయమే. ఈ భాగస్వామ్యం ఫలితంగానే డసాల్ట్ రిలయన్స్ ఏరోస్పేస్ లిమిటెడ్ జాయిం ట్ వెంచర్ ఏర్పాటయింది. ఫాల్కన్, రాఫెల్ విమానాల కోసం విడి భాగాలను తయారు చేయడం కోసం డసాల్ట్, రిలయన్స్ డిఫెన్స్‌లు నాగపూర్‌లో ఒక ప్లాంట్‌ను నిర్మించాయి’ అని కూడా ఆ సంస్థ తెలియజేసింది. బిటిఎస్‌ఎల్, డెఫ్‌సిస్, కైనెటిక్, మహింద్రా, మైని, శామ్‌టెల్ లాంటి ఇతర కంపెనీలతో కూడా భాగస్వామ్య ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. మరో వందకు పైగా కంపెనీలతో చర్చలు కొనసాగుతున్నాయి. భారత అధికారులు రాఫెల్‌ను ఎం పిక చేసుకున్నందుకు డసాల్ట్ ఏవియేషన్ గర్విస్తోంది అని కూడా కంపెనీ తెలిపింది.
2015 ఏప్రిల్ 10న పారిస్‌లో ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు హోలాండెతో చర్చలు జరిపిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ 36 రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించారు. 2016 సెప్టెంబర్ 23న తుది ఒప్పందం కుదిరింది. యుపిఏ ప్రభుత్వం 126 రాఫెల్ విమానాల కొనుగోలుకు చర్చలు జరిపినప్పుడు ఒక్కో విమానం ఖరీదు రూ. 526 కోట్లుగా ఖరారు అయిందని, అయితే మోడీ ప్రభుత్వం ఒక్కో విమానాన్ని రూ.1670 కోట్లకు కొనుగోలు చేస్తోందని, ఫలితంగా వేల కోట్ల ప్రజాధనం వృథా అవుతోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు, ఈ ఒప్పందంలో డసాల్ట్ ఏవియేషన్ భాగస్వామిగా రిలయన్స్ డిఫెన్స్ సంస్థను ఎం పిక చేయడం ద్వారా వేల కోట్ల రూపాయల అప్పుల ఊబిలో కూరుకు పోయిన అనిల్ అంబానీకి లబ్ధి చేకూర్చారని,ఇదంతా ఓ పెద్ద కుంభకోణమని కూడా ఆ పార్టీ ఆరోపిస్తోంది.

మోడీ దొంగని తేలిపోయింది

 రాఫెల్‌పై ఇప్పటికైనా మౌనం వీడి నిజమేంటో చెప్పాలి
 దేశ రక్షణపైనే సర్జికల్ దాడి చేశారు
 ప్రధానిపై దాడిని తీవ్రం చేసిన రాహుల్

భారత ప్రభుత్వం సూచన మేరకే రాఫెల్ యుద్ధ విమానాల తయారీలో భాగస్వామిగా రిలయన్స్ డిఫెన్స్ సంస్థను ఎంచుకున్నట్లు ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే చెప్పడంతో కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శల దాడిని మరింత తీవ్రం చేశారు. శనివారం అటు ట్విట్టర్ వేదికగా, ఇటు మీడియా సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీపై ముప్పేట దాడితో విరుచుకుపడ్డారు. ప్రధాని మౌనం వీడి నిజం ఏమిటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.‘ ‘రాఫెల్ విమానాల తయారీకి అనిల్ అంబానీ కంపెనీని ఎంపిక చేయడంలో ఫ్రెంచ్ ప్రభుత్వం ప్రమేయం ఏమీ లేదు. మోడీ చెప్పడం వల్లే అనిల్ అంబానీకి వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ కట్టబెట్టారు. ఆది రూ.౩౦ వేల కోట్ల కుంభకోణం. ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు భారత ప్రధానిని దొంగ అని అంటున్నారు. ఈ విషయంపై మోడీనుంచి ఒక్క మాట కూడా రావడం లేదు. ఈ దేశానికి కాపలాదారుడు దొంగగా మారిపోయాడు(దేశ్‌కా చౌకీదార్ చోర్ హై)’ అని శనివారం ఇక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాహుల్ దుయ్యబట్టారు. ‘ఇంత జరుగుతున్నా ప్రధాని ఎందుకు మౌనం వీడడం లేదు. హోలాండే ప్రకటన నిజమో కాదో చెప్పాలి. అబద్ధమయితే వాస్తవమేమిటో కూడా చెప్పాలి’ అని రాహుల్ అన్నారు. అంతేకాదు ప్రధానిని కాపాడడానికి రక్షణ మంత్రులు సైతం అబద్ధాలు చెప్తున్నారని కూడా ఆయన ఆరోపించారు. రాఫెల్ ఒప్పందంలో అవినీతి జరిగిందనేది సుస్పష్టం అని అంటూ తాను ఇంతకు ముందు డిమాండ్ చేసినట్లుగా ఈ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని, అవసరమయితే హోలాండేను కూడా కమిటీ ముందుకు పిలిపించాలని రాహుల్ అన్నారు.
దేశ రక్షణపైనే మెరుపు దాడులు
అంతకు ముందు ట్విట్టర్ వేదికగా కూడా రాహుల్ మోడీ సర్కార్‌పై విమర్శల వర్షం కురిపించారు. రాఫెల్ ఒప్పందం పేరుతో ప్రధాని మోడీ అనిల్ అంబానీతో కలిసి లక్షా ముప్ఫై వేల కోట్ల రూపాయలతో సర్జికల్ స్ట్రైక్స్ చేశారని దుయ్యబట్టారు. ‘ప్రధాని నరేంద్ర మోడీ అనిల్ అంబానీతో కలిసి దేశ రక్షణశాఖపైనే మెరుపు దాడి చేశారు. ప్రధాని ప్రజలకు నమ్మక ద్రోహం చేశారు. సైనికుల రక్తాన్ని అగసరవపరిచారు. ఇది సిగ్గుచేటు. సైనికులను, దేశ ప్రజలను మోసం చేశారు’ అని ట్విట్టర్‌లో రాహుల్ విమర్శించారు.

Comments

comments