అభివృద్ధికే ఓటేయ్యండి : కెటిఆర్

  ఎల్లారెడ్డిపేటలో నియోజకవర్గ స్థాయి కార్యకర్తల విస్తృత సమావేశం మన తెలంగాణ / సిరిసిల్ల : కాంగ్రెస్, టిడిపి, బిజెపి తదితర పార్టీల అభ్యర్థులెవరైనా తనకంటే ఎక్కువగా అభివృద్ధి చేస్తారని భావిస్తే నిరభ్యంతరంగా వారికే ఓట్లు వేయవచ్చని మంత్రి కెటిఆర్ స్పష్టం చేశారు. టిఆర్‌ఎస్ చేసిన అభివృద్ధి పనులే తమను గెలిపిస్తాయన్న ఆత్మవిశ్వాసంతో ఎన్నికల బరిలోకి దిగాలని సిరిసిల్ల నియోజకవర్గ టిఆర్‌ఎస్ కార్యకర్తలకు సిరిసిల్ల నియోజకవర్గ టిఆర్‌ఎస్‌అభ్యర్థి, ఆపద్ధర్మ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సూచించారు. శనివారం సిరిసిల్ల […]

 

ఎల్లారెడ్డిపేటలో నియోజకవర్గ స్థాయి కార్యకర్తల విస్తృత సమావేశం

మన తెలంగాణ / సిరిసిల్ల : కాంగ్రెస్, టిడిపి, బిజెపి తదితర పార్టీల అభ్యర్థులెవరైనా తనకంటే ఎక్కువగా అభివృద్ధి చేస్తారని భావిస్తే నిరభ్యంతరంగా వారికే ఓట్లు వేయవచ్చని మంత్రి కెటిఆర్ స్పష్టం చేశారు. టిఆర్‌ఎస్ చేసిన అభివృద్ధి పనులే తమను గెలిపిస్తాయన్న ఆత్మవిశ్వాసంతో ఎన్నికల బరిలోకి దిగాలని సిరిసిల్ల నియోజకవర్గ టిఆర్‌ఎస్ కార్యకర్తలకు సిరిసిల్ల నియోజకవర్గ టిఆర్‌ఎస్‌అభ్యర్థి, ఆపద్ధర్మ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సూచించారు. శనివారం సిరిసిల్ల నియోజకవర్గ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశాన్ని ఎల్లారెడ్డిపేటలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజలందరూ కెసిఆర్‌ను తిరిగి ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. సిరిసిల్ల నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని, మళ్లీ గెలిపిస్తే ఇప్పటికంటే పదింత అభివృద్ధి చేస్తానన్నారు. తను సిరిసిల్ల ఎమ్మెల్యేగా గెలవగానే అభివృద్ధి పనులు ప్రారంభిస్తానని సిరిసిల్లకు మూడేళ్లలో రైలును తెస్తానని రాష్ట్ర స్థాయి ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేయిస్తానని స్పష్టం చేశారు. ప్రతిపక్షాల కూటమికి పది సీట్లు కూడా రావనేది స్పష్టమన్నారు. టిడిపి అధ్యక్షుడు రమణ తెలంగాణలో 20 సీట్లు గెలుస్తామని అంటున్నారని, ఆయన సీటే గెలుస్తారని భరోసా లేదన్నారు. చంద్రబాబు నాయు డు కాళేశ్వరం పాలమూరు , సీతారామ ప్రాజెక్టులకు అడ్డుపడాలని కేంద్రానికి లేఖలు రాశాడని అలాంటి వాళ్లు పొరపాటున అధికారంలోకి వస్తే రైతులకు ప్రాజెక్ట్‌లు పూర్తయి నీళ్లు వస్తాయా అని నిలదీశారు. ఒకేసారి రుణమాఫీ చేస్తామని ప్రకటిస్తున్న కాంగ్రెస్ పార్టీ కర్ణాటక, పంజాబ్ రాష్ట్రాల్లో నాలుగు దఫాలుగా ఎందుకు చేస్తుందో చెప్పాలనిచ తెలంగాణలో ఒకేసారి రుణమాఫీ ఎలా చేస్తుందని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేరాలంటే దక్షిణ భారతదేశంలోని ఆరు రాష్ట్రాల మొత్తం బడ్జెట్ కలిపితే కూడా పూర్తి కావన్నారు. కాంగ్రెస్ నేతలు ఇటీవల ప్రచారం కోసం గ్రామాల్లోకి వెళ్తున్నారని గ్రామాల్లో కనిపిస్తున్న అభివృద్ధి చూసి వారు ఏమీ మాట్లాడలేక పోతున్నారన్నారు. ఎల్లారెడ్డిపేటలో డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయించడంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో అభివృద్ధిని చూపిస్తానని ఉపాధి, విద్యా అవకాశాలను కల్పిస్తానన్నారు. తెలంగాణలో తాము గెలిచిన మొదటి తొమ్మిది నెలలు మోడీ సర్కార్ తమకు ఇబ్బందులు కలిగించిందని, ఆ తర్వాత మూడేళ్లలోనే పాలన సాగించామన్నారు. సిరిసిల్ల లాంటి ప్రాంతాల అభివృధ్ది చూసి పాత జిల్లా కేంద్రమైన కరీంనగర్ కూడా సిరిసిల్ల లాగా అభివృద్ది చెందాలని కోరుకుంటుందన్నారు. 2006లో రాజకీయాల్లోకి వచ్చిన తనను సిరిసిల్ల శాసనసభ్యునిగా గెలిపించిందని, సిరిసిల్ల రుణం తీర్చుకుంటున్నానని, ఇంకా అభివృద్ధి చేస్తానన్నారు. సిరిసిల్ల నేతన్నల ఆత్మహత్యలతో ఒకప్పుడు సిరిసిల్లను ఉరిసిల్ల అన్నారని, నేడది సిరుల ఖిల్లాగా మారిందన్నారు. సిరిసిల్ల పద్మశాలీ కులంలో తాను జన్మించకపోయినప్పటికీ పద్మశాలీ వృత్తికి సంబంధించిన సమస్యలు తనకు తెలుసన్నారు. సిరిసిల్లలో నేతన్నలకు 300 కోట్ల రూపాయలతో బతుకమ్మ చీరలు, 80 కోట్లతో ఆర్వీఎం వస్త్రాల వంటివి తయారు చేసే ఆర్డర్లు ఇప్పించి సీఎం కెసిఆర్ ఆశయాల మేరకు 7, 8 వేల రూపాయల కూలీ సంపాదించుకునే పవర్‌లూం కార్మికులకు 20 నుండి 25 వేల రూపాయల కూలీ లభించేలా చర్యలు తీసుకున్నానన్నారు. గిరిజన తండాలకు, జిల్లా సరిహద్దుల గ్రామాలకు వంతెనల నిర్మాణం శరవేగంగా కొనసాగుతుందన్నారు. నర్మాల ప్రాజెక్ట్‌లోకి నీటిని నింపి మధ్య మానేరు ప్రాజెక్ట్ ద్వారా లక్ష ఎకరాలకు నీటిని అందించడమే తన లక్షమన్నారు. ఇంటింటికి మిషన్ భగీరథ నీటిని అందించడానికి దాదాపు పనులన్నీ పూర్తయ్యాయన్నా రు. కెసిఆర్ కృషి వల్లే తెలంగాణ రాలేదని ఎవరైనా అనగల్గుతారా అని అన్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలోని తండాలన్నీ కెటిఆర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి తీర్మానాలు చేస్తున్నాయన్నారు. ఇదేమని అడిగితే తండాలను కెసిఆర్ గ్రామపంచాయితీలుగా చేస్తానని ఇచ్చిన మాట నిలుపుకున్నారన్నారు. కెసిఆర్ 4000మారుమూల పల్లెలను గ్రామపంచాయితీలుగా మార్చారని వివరించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గంభీరావుపేట మండలంలోని రాజుపేట అనే గ్రామాన్ని గ్రామపంచాయితీగా మార్చాలని అప్పటి మంత్రి జానారెడ్డి చుట్టూ పొర్లుదండాలు పెడుతూ తిరిగినా ఆయన ఏమీ చేయలేకపోయారన్నారు. అప్రమత్తంగా ఉండి ప్రచార పర్వాన్ని ముందుకు తీసుకుపోవాలన్నారు.
నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి నియోజకవర్గంలోని కార్యకర్తలందరూ అత్యంత ఉత్సాహంతో పాల్గొన్నారు. మోటార్ బైక్ ర్యాలీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపి వినోద్‌కుమార్, ఎమ్మెల్సీ భానుప్రసాద్‌రావు, నియోజకవర్గం ఇంఛార్జీ బస్వరాజు సారయ్య, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, నియోజకవర్గ నాయకులు చిక్కాల రామారావు, గడ్డం నర్సయ్య, ఆకునూరి శంకరయ్య, గూడూరి ప్రవీణ్, జిందం చక్రపాణి, జడ్పిటిసిలు, ఎంపిపిలు, మున్సిపల్ చైర్‌పర్సన్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో హాజరయ్యారు.

Related Stories: