సమరోత్సాహంతో భారత్

ప్రతీకారం కోసం పాక్ నేడు దాయాదుల సమరం దుబాయి: వరుస విజయాలతో దూకుడు మీదున్న టీమిండియా ఆదివారం దాయాది పాకిస్థాన్‌తో జరిగే సూపర్4 మ్యాచ్‌కు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఇప్పటికే లీగ్ దశలో పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్ ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు పాకిస్థాన్ కూడా భారత్‌పై ప్రతీకారం తీర్చుకోవాలనే లక్షంతో కనిపిస్తోంది. పాక్‌తో పోల్చితే భారత్‌కే గెలుపు అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. పసికూన అఫ్గానిస్థాన్‌తో జరిగిన కిందటి మ్యాచ్‌లో పాక్ […]

ప్రతీకారం కోసం పాక్

నేడు దాయాదుల సమరం

దుబాయి: వరుస విజయాలతో దూకుడు మీదున్న టీమిండియా ఆదివారం దాయాది పాకిస్థాన్‌తో జరిగే సూపర్4 మ్యాచ్‌కు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఇప్పటికే లీగ్ దశలో పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్ ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు పాకిస్థాన్ కూడా భారత్‌పై ప్రతీకారం తీర్చుకోవాలనే లక్షంతో కనిపిస్తోంది. పాక్‌తో పోల్చితే భారత్‌కే గెలుపు అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. పసికూన అఫ్గానిస్థాన్‌తో జరిగిన కిందటి మ్యాచ్‌లో పాక్ అతి కష్టం మీద గట్టెక్కింది. మరోవైపు భారత్ మాత్రం బంగ్లాదేశ్‌ను అలవోకగా ఓడించింది. ఒక్క హాంకాంగ్‌పై తప్ప మిగిలిన రెండు మ్యాచుల్లో భారత్ చెలరేగి ఆడింది. చాలా కాలం తర్వాత జట్టులోకి వచ్చిన రవీంద్ర జడేజా బంగ్లాదేశ్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కూడా చెలరేగాలనే పట్టుదలతో ఉన్నాడు. జడేజా చేరికతో భారత్ మరింత బలోపేతంగా మారింది. స్పీడ్‌స్టర్లు భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రిత్ బుమ్రాలు కూడా జోరుమీదున్నారు. భువనేశ్వర్ ఆడిన మూడు మ్యాచుల్లోనూ సత్తా చాటాడు. బుమ్రా కూడా జోరుమీదున్నాడు. ఇక, ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మలు భీకర ఫాంలో ఉన్నారు. ఈసారి కూడా జట్టుకు కీలకంగా మారారు. అంబటి రాయుడు, దినేశ్ కార్తీక్, కేదార్ జాదవ్, జడేజా, భువనేశ్వర్‌లతో బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. తాజాగా సీనియర్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని బంగ్లాదేశ్‌పై మెరుగైన బ్యాటింగ్‌ను కనబరిచాడు. ఇది కూడా భారత్‌కు కలిసి వచ్చే అంశమే. ఇక, చాహల్, కుల్దీప్‌లతో కూడిన స్పిన్ ఉండనే ఉంది. వీరికి జడేజా, కేదార్‌లు తోడైతే భారత్‌కు విజయం నల్లేరుపై నడకే.
జోరుమీదున్నారు…


ఆసియా కప్‌లో భారత ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మలు అద్భుత ఫాంలో ఉన్నారు. ఆడిన మూడు మ్యాచుల్లోనూ వీరు సత్తా చాటారు. తొలి మ్యాచ్‌లో ధావన్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇక, తర్వాత రెండు మ్యాచుల్లోనూ మెరుగైన బ్యాటింగ్‌ను కనబరిచాడు. కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఫాంలోకి వచ్చాడు. రోహిత్, ధావన్‌లు ప్రతి మ్యాచ్‌లోనూ జట్టుకు మెరుగైన ఆరంభాన్ని ఇస్తున్నారు. తాజాగా పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లోనూ చెలరేగాలనే పట్టుదలతో కనిపిస్తున్నారు. ఎటువంటి బౌలింగ్‌నైనా చిన్నాభిన్నం చేసే సత్తా భారత ఓపెనర్లకు ఉంది. ఇప్పటికే ఆసియాకప్‌లో వీరు దీన్ని ఆచరణలో చేసి చూపించారు. పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లోనూ చెలరేగాలనే లక్షంతో కనిపిస్తున్నారు. బంగ్లాదేశ్‌పై ఇద్దరు బాగానే ఆడాడు. పాక్‌పై కూడా అదే జోరును కనబరిచి భారత్‌కు మరో విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. ఇక, వన్‌డౌన్‌లో వస్తున్న అంబటి రాయుడు కూడా అద్భుతంగా ఆడుతున్నాడు. ఆడిన మూడు మ్యాచుల్లోనూ జట్టుకు అండగా నిలిచాడు. హాంకాంగ్‌పై అద్భుత ఇన్నింగ్స్ ఆడిన రాయుడు పాకిస్థాన్‌పై కూడా సత్తా చాటాడు. బంగ్లాదేశ్‌పై కూడా పర్వాలేదనిపించాడు. రాయుడు ఫాంలో ఉండడం భారత్‌కు కలిసి వచ్చే అంశమే. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా రాయుడు సొంతం. పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో కూడా రాయుడుపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. రాయుడు చెలరేగితే భారత్‌కు మెరుగైన స్కోరు చేయడం కష్టమేమి కాదు. ఇక, దినేశ్ కార్తీక్, కేదార్ జాదవ్‌లు కూడా బాగానే ఆడుతున్నారు. ఈ మ్యాచ్‌లో కూడా సత్తా చాటాలనే పట్టుదలతో కనిపిస్తున్నారు. కేదార్ బ్యాట్‌తో పాటు బంతితోనూ జట్టుకు అండగా నిలుస్తున్నాడు. ఈసారి కూడా ఆల్‌రౌండ్‌షోతో అదరగొట్టాలని తహతహలాడుతున్నాడు. దినేశ్ కూడా మెరుపులు మెరిపించాలనే పట్టుదలతో ఉన్నాడు. రానున్న ప్రపంచకప్ నాటికి జట్టులో స్థానాన్ని శాశ్వతం చేసుకోవాలని భావిస్తున్న దినేశ్ అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నాడు. మరోవైపు బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఫాంలోకి వచ్చాడు. ఈ మ్యాచ్‌లో ధోని మెరుగైన బ్యాటింగ్‌తో జట్టు విజయంలో తనవంతు పాత్ర పోషించాడు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేయగలిగే సత్తా కలిగిన ధోనికి చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై మంచి రికార్డే ఉంది. ఈసారి కూడా మెరుగైన ఆటతో జట్టుకు అండగా నిలువాలని తహతహలాడుతున్నాడు. ఇక, కిందటి మ్యాచ్‌లో అద్భుతంగా రాణించిన రవీంద్ర జడేజాపై అందరి దృష్టి నిలిచింది. ఇప్పటికే బంతితో సత్తా చాటిన జడ్డూ బ్యాట్‌తోనూ రాణించాలనే పట్టుదలతో ఉన్నాడు. తనదైన రోజు ఎంతటి పెద్ద జట్టుకైన ముచ్చెమటలు పట్టించే సత్తా జడేజాకు ఉంది. ఈసారి కూడా ఆల్‌రౌండ్‌షోతో ఆకట్టుకోవాలని భావిస్తున్నాడు.
బౌలింగే బలం..
ఇక, ఆసియాకప్‌లో భారత బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగి పోతున్నారు. ఒక్క హాంకాంగ్‌పై తప్ప మిగతా రెండు మ్యాచుల్లో భారత బౌలర్లు చెలరేగి పోయారు. హాంకాంగ్‌పై కూడా చివరి దశలో అద్భుతంగా రాణించి జట్టును గెలిపించారు. పాకిస్థాన్‌పై భువనేశ్వర్, కేదార్ జాదవ్‌లు అద్భుత బౌలింగ్‌ను కనబరిచారు. ఈసారి కూడా భారత్ బౌలింగ్‌పై భారీ ఆశలు పెట్టుకుంది. ప్రపంచంలోనే అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లుగా పేరు తెచ్చుకున్న బుమ్రా, భువనేశ్వర్‌లు పాకిస్థాన్‌పై చెలరేగేందుకు తహతహలాడుతున్నారు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా వీరికుంది. ఎటువంటి బ్యాటింగ్ లైనప్‌కైన చుక్కలు చూపించే భువనేశ్వర్, బుమ్రాలు విజృంభిస్తే పాక్ బ్యాట్స్‌మెన్ కష్టాలు ఖాయం. ఇక, జడేజా రూపంలో మరో మ్యాచ్ విన్నర్ అస్త్రం భారత్‌కు అందుబాటులోకి వచ్చింది. తన సత్తా ఏంటో ఇప్పటికే బంగ్లా బ్యాట్స్‌మెన్‌కు రుచి చూపించిన జడేజా పాక్‌పై కూడా అదే జోరును కొనసాగించాలని తహతహలాడుతున్నాడు. ఇక, ఇప్పటి వరకు ఆసియాకప్‌లో అంతంత మాత్రంగానే రాణించిన మ్యాచ్ విన్నర్ ద్వయం చాహల్, కుల్దీప్‌లు కూడా చెలరేగేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇలా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో చాలా బలంగా ఉన్న టీమిండియా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్‌లో గెలిచే జట్టుకు ఫైనల్ బెర్త్ దాదాపు ఖాయమవుతోంది. దీంతో ఇరు జట్లు కూడా విజయమే లక్షంగా పోరుకు సిద్ధమయ్యాయి.
సవాలు వంటిదే…


మరోవైపు భారత్‌తో జరిగే మ్యాచ్ పాకిస్థాన్‌కు సవాలుగా మారింది. లీగ్ దశలో భారత్ చేతిలో చిత్తుగా ఓడిన పాకిస్థాన్‌కు ఈ మ్యాచ్‌లో కూడా కష్టాలు తప్పక పోవచ్చు. పసికూన అఫ్గాన్‌పై అతి కష్టం మీద నెగ్గిన పాక్ బలమైన భారత్‌కు ఏ విధంగా పోటీ ఇస్తుందో అంతుబట్టడం లేదు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో భారత్ చాలా బలంగా ఉంది. పాక్‌లో కూడా ప్రతిభావంతులకు కొదవలేదు. అయితే నిలకడలేమి వారికి ప్రతికూలంగా మారింది. టీమిండియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్ ఘోరంగా విఫలమయ్యారు. టాప్ ఆర్డర్, మిడిలార్డర్ చేతులెత్తేయడంతో పాక్ తక్కువ స్కోరుకే పరిమితమైంది. ఇటువంటి పరిస్థితుల్లో భారత్‌ను ఓడించడం చాలా కష్టమను చెప్పాలి. కానీ, సంచనాలకు మరో పేరుగా చెప్పుకునే పాకిస్థాన్‌ను తక్కువ అంచన వేయలేం. తనదైన రోజు ఎంతటి పెద్ద జట్టుకైన షాక్ ఇవ్వడం పాక్‌కు వెన్నతో పెట్టిన విద్య. ఈసారి కూడా అదే సంప్రదయాన్ని కొనసాగించాలనే పట్టుదలతో పోరుకు సిద్ధమైంది.

పాక్‌ను ఓడిస్తాం..
చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగే సూపర్4 మ్యాచ్‌లో తప్పక విజయం సాధిస్తామని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ధీమా వ్యక్తం చేశాడు. మ్యాచ్‌ను పురస్కరించుకొని అతను శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ విషయం చెప్పాడు. లీగ్ మ్యాచ్‌లో పాక్‌పై తాము పూర్తి ఆధిపత్యం చెలాయించామన్నాడు. ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తామన్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో తమ జట్టు సమతూకంగా ఉందన్నాడు.

Related Stories: