అక్టోబర్ 31 తర్వాత

ఎప్పుడైనా ఎన్నికలకు సిద్ధం  కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిపిన రాష్ట్ర సిఇఒ మన తెలంగాణ/హైదరాబాద్: వచ్చే నెల 31వ తేదీ కల్లా ప్రతి పోలింగ్ స్టేషన్‌లో అన్ని సదుపాయాలు కలిగి ఉండి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతీ ఓటరు ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రణాళికలను సిద్ధం చేసిన ట్లు కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం నివేదించింది. అక్టోబరు 31 తర్వాత ఏ నిమిషంలో ఎన్నికలు జరిగినా సర్వం సిద్ధం గా ఉన్నట్లేనని ఆ […]

ఎప్పుడైనా ఎన్నికలకు సిద్ధం 

కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిపిన రాష్ట్ర సిఇఒ

మన తెలంగాణ/హైదరాబాద్: వచ్చే నెల 31వ తేదీ కల్లా ప్రతి పోలింగ్ స్టేషన్‌లో అన్ని సదుపాయాలు కలిగి ఉండి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతీ ఓటరు ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రణాళికలను సిద్ధం చేసిన ట్లు కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం నివేదించింది. అక్టోబరు 31 తర్వాత ఏ నిమిషంలో ఎన్నికలు జరిగినా సర్వం సిద్ధం గా ఉన్నట్లేనని ఆ నివేదికలో నొక్కిచెప్పినట్లు తెలిసింది. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణపై పలు అంశాలపై సందేహాలు వ్యక్తం చేసిన కేంద్ర ఎన్నికల సంఘం వాటిపై వివరణ కో రుతూ ఇటీవల రాష్ట్ర సిఇఓ కు లేఖ రాసింది. చాలా ముఖ్యమైన అంశాలని, తెలంగాణలో ఎన్నికల నిర్వహణకు, తేదీలను నిర్ణయించే ముందు వీటిని పరిగణనలోకి తీసుకోనున్నట్లు సమాచారం. అందులో భాగంగా రెండు రోజులు సుదీర్ఘ కసరత్తు చేసిన సి ఇఒ కార్యాలయం జిల్లా ఎన్నికల అధికారుల (డిఇఒ) నుంచి, రాష్ట్ర డిజిపి నుంచి 30 అంశాలపై సమాచారం తెప్పించుకుని నివేదికను రూపొందించి కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించినట్లు తెలిసింది. పోలింగ్ స్టేషన్‌లలో అవసరమైన సిబ్బందితో పాటు, మౌలిక సదుపాయాల కల్పన, తుది ఓటరు జాబితా ప్రకటన, శాంతి భద్రతల సమస్యలు, ఓటు హక్కు వినియోగంపై అవగాహన వంటి అంశాలకు సంబంధించి గడువు తేదీలు విధించుకుని ప నులు పూర్తి చేయనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిపింది. రాష్ట్రంలో 32,574 పోలింగ్ స్టేషన్‌లు ఏర్పాటు చేస్తున్నామని, ఇందులో 32,320 శాశ్వాత భవనాల్లోనే అని గుర్తించారు. 19,044 పోలింగ్ స్టేషన్‌ల లొకేషన్స్, మ్యాప్‌లను కూడా నివేదికలో పొందుపర్చినట్లు తెలిసింది. పోలింగ్ స్టేషన్‌లలో తాగునీటి సౌకర్యం, కరెంట్, ర్యాంప్స్, మూత్రశాలలు, ఇతర మౌలిక సదుపాయాలపై నివేదికలో పొందుపర్చినట్లు సమాచారం. ఇవన్నీ వచ్చే నెల 31వ తేదీ కల్లా పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉంటుందని పేర్కొన్నట్లు తెలిసింది. బూత్ స్థాయి అధికారి, సూపర్‌వైజర్‌ల వివరాలను ‘నెర్ప్’ వెబ్ పోర్టల్‌లో నమోదు చేయనున్నట్లు తెలిపింది. రాష్ట్ర, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో ఎన్నికల నిర్వహణ ప్రణాళికలు కూడా అక్టోబర్ 31వ తేదీ లోపు పూర్తి చేసుకుంటామని కేంద్ర ఎన్నికల సంఘానికి ఇచ్చిన నివేదికలో పొందుపర్చినట్లు సమాచారం. శాంతి భద్రతలు, పోలీసు, ఇతర ఫోర్స్ సిబ్బందిపై కూడా రాష్ట్ర పోలీసు శాఖ నుంచి సిఇఒ కార్యాలయం వివరాలు తీసుకుంది. అందుబాటులో ఉన్న పోలీసు, ఇతర బలగాల సిబ్బందిపై ప్రాథమిక సమాచారం అందిందని, అదనపు బలగాల అవసరతపై అక్టోబర్ 10వ తేదీ లోపు స్పష్టత వస్తుందని ఇసిఐకు తెలిపింది. ప్రతి పోలీసు స్టేషన్ వారీగా రాజకీయ పార్టీలపై, నాయకులు, ఇతరులపై నమోదైన కేసులతో పాటు సమస్యలు సృష్టించే వారి వివరాలు సిఇఒ వివరాలు సేకరిస్తోంది. శాంతి భద్రతల సమస్యలు తలెత్తే ప్రాంతాలపై కూడా ప్రత్యేక నిఘా ఉంచనున్నట్లు పేర్కొన్నారు. వ్యక్తిగత ఆయుధ (గన్) లైసెన్స్‌లు కలిగిన, నేర చరిత్ర కలిగిన వారి నుంచి ఎటువంటి ఇబ్బందలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకునేలా డిజిపితో పాటు జిల్లా ఎస్‌పిలకు ఆదేశాలు జారీ చేసినట్లు నివేదించారు. ఎన్నికల ఖర్చులపై రాష్ట్ర, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి పర్యవేక్షణ కమిటీలు కూడా వచ్చే నెల 15వ తేదీ నాటికి వేసుకోనున్నట్లు పేర్కొన్నారు. ఓటర్లుగా నమోదవుతున్న 18 నుంచి 19 ఏళ్ల వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలని, జానాభా లెక్కల ప్రకారం నమోదులు ఉండాలని కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది. ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకారం రాష్ట్రంలో ఆ వయస్సు వారు 2.21 లక్షల మంది ఉన్నారని ఈ నెల 25 తరువాత వాటి వడపోతలపై స్పష్టత రానున్నట్లు సిఇఒ కార్యాలయం తెలిపింది. అలాగే ట్రాన్స్‌జెండర్స్, మురికి వాడల్లో నివసిస్తున్న పౌరులు, వలస కార్మికులు, సొంత ఇంటి నివాసం లేని వారు ఎవరైనా ఓటు హక్కు కోల్పోయినట్లయితే అటువంటి వారిపై ప్రత్యేక శ్రద్ధ కల్పించి, జాబితాలో ఉండేలా చూడాలని ఇసిఐ సూచించింది. ఈ విషయంలో ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ పనిచేస్తున్నట్లు పేర్కొన్న సిఇఒ కార్యాలయం ఈ నెల 25 వరకు పూర్తి చేస్తామని వివరణ ఇచ్చింది. దీని ప్రకారం ముసాయిదా ఓటర్ల జాబితా గడువు తేదీ ఈ నెల 25తో ముగియనుందని స్పష్టమౌతోంది. పోలింగ్ బూత్ మ్యాప్‌లపై వస్తున్న ఫిర్యాదులను స్వీకరిస్తున్నామని, తుది జాబితాలో తప్పిదాలు ఉండవని సిఇఒ కార్యాలయం నివేదించింది. ఓటరు నమోదు కార్యక్రమంపై బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్, క్రికెటర్ వి.విఎస్ లక్ష్మణ్‌ల కూడిన వీడియోను అన్ని థియేటర్‌లలో ఈ నెల 25 వరకు ప్రసారం చేస్తున్నట్లు పేర్కొంది. అదే తరహాలో ఇవిఎం, వివిప్యాట్‌ల పనితీరుపై కూడా అవగాహన కల్పించనున్నట్లు నివేదించినట్లు సమాచారం.

Comments

comments

Related Stories: