వామపక్షాలు ‘శ్వేతపత్రం’ ఇవ్వాలి

తెలంగాణ రాష్ట్రం 2-62014న ఏర్పడిన నాలుగున్నర మాసాల తర్వాత 2882014 నాడు పది వామపక్షాలు హైదరాబాద్‌లో సమావేశమై ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. దానికి ‘తెలంగాణ సమగ్రాభివృద్ధికి ఐక్య కార్యాచరణ’ అని పేరు పెట్టారు. ఆ ప్రకటన వెలువడి ఇప్పటికి నాలుగు సంవత్సరాలు గడిచాయి. ప్రస్తుతం అందరూ రానున్న అసెంబ్లీ ఎన్నికల సన్నాహాలలో ఉన్నారు. అందువల్ల ఇతర కార్యకలాపాలు జరపగలరని ఆశించలేము. కనుక దానిని అట్లుంచి, ‘తెలంగాణ సమగ్రాభివృద్ధికి ఐక్య కార్యాచరణ’ను వారు ఈ నాలుగు […]

తెలంగాణ రాష్ట్రం 2-62014న ఏర్పడిన నాలుగున్నర మాసాల తర్వాత 2882014 నాడు పది వామపక్షాలు హైదరాబాద్‌లో సమావేశమై ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. దానికి ‘తెలంగాణ సమగ్రాభివృద్ధికి ఐక్య కార్యాచరణ’ అని పేరు పెట్టారు. ఆ ప్రకటన వెలువడి ఇప్పటికి నాలుగు సంవత్సరాలు గడిచాయి. ప్రస్తుతం అందరూ రానున్న అసెంబ్లీ ఎన్నికల సన్నాహాలలో ఉన్నారు. అందువల్ల ఇతర కార్యకలాపాలు జరపగలరని ఆశించలేము. కనుక దానిని అట్లుంచి, ‘తెలంగాణ సమగ్రాభివృద్ధికి ఐక్య కార్యాచరణ’ను వారు ఈ నాలుగు సంవత్సరాల పాటు మాత్రం నిరాఘాటంగా కొనసాగించినట్లు భావించాలి. ఆ ‘కార్యాచరణ’ ఏమిటో వారంతా కలిసి తెలంగాణ ప్రజలకు ‘ఐక్యం’ గా వివరించనున్నారని కూడా భావించాలి.
ఇటువంటి ఐక్యకార్యాచరణలు సాధారణంగా వారంతా కలిసి ఎన్నికలలో పోటీ చేసేందుకు, వారు అనే ‘బూర్జువా’ పార్టీలకు బూర్జువా వ్యవస్థకు ప్రత్యామ్నాయ వ్యవస్థ ప్రణాళికను ప్రజల ముందుంచగలరని మనం భావిస్తాము. మాటలు సరిగా ఇవి కాకపోయినా అదే అర్థం వచ్చే వాక్యాలు మనకు వారి సంయుక్త ప్రకటనలో కన్పిస్తాయి కూడా. తమ లక్షంలో వారు విజయం సాధించారా లేదా అన్నది వేరే ప్రశ్న. ఇటువంటి లక్షాల సాధన తేలిక కాదని, నాలుగేళ్లలో జరిగేది అంతకన్నా కాదని ఎవరైనా అంగీకరించక తప్పదు. కాని తమ ప్రకటన ప్రకారం కార్యాచరణ, కృషి అన్నది ప్రధానం.
అటువంటి కార్యాచరణ అంటూ చేసినట్లయితే అది ఏమిటో తెలుసుకోవాలనే కోరిక ప్రజలకు ఉండటం సహజం. ఒక విధంగా అది ప్రజల హక్కు కూడా. అందువల్ల, సంయుక్త ప్రకటనపై సంతకాలు చేసిన పది వామపక్షాలు అప్పటి నుంచి నాలుగు సంవత్సరాల కాలం గడిచిన స్థితిలో, తమ “ఐక్య కార్యాచరణ”ను వివరిస్తూ ఒక ‘సంయుక్త ప్రకటన’ను విడుదల చేయవలసిన సమయం వచ్చింది. ఆ పని చేయగలరేమో వారు ముందుగా చెప్పినట్లయితే మనం అందుకు సిద్ధంగా ఉండవచ్చు. ఒకవేళ ఆ పని చేయదలచుకోనట్లయితే అందుకు కారణాలు ఏమిటో ప్రజలకు తెలియజేయటం అవసరం. అటువంటి కారణాలను తెలుసుకునే హక్కు కూడా ప్రజలకు ఉంటుంది. ఇటువంటి ప్రశ్నలు, డిమాండ్లను సాధారణ ప్రజలు “బూర్జువా” పార్టీల ముందుంచ లేరు. అవి “బూర్జువా” పార్టీలు గనుక. కాని తాము శ్రామిక, కార్మిక ప్రజలకు చెందుతామని వారికోసమే అంకితమై పని చేస్తామని హామీ వచ్చే పార్టీల ముందు ఉంచగలరు.
అందువల్ల, ఈ పది పార్టీలు వచ్చే ఎన్నికలలోగా తమ పత్రాన్ని ప్రకటించాలి. అది సూటిగా, వివరంగా, నిజాయితీగా ఉండాలి. వాదనలు, విమర్శలు, ఆరోపణలు, సిద్ధాంతాలు, సూత్రీకరణలు, నినాదాలు కూడా అందులో భాగంగా ఉంటే ఉండవచ్చు. అది వారి స్వేచ్ఛ. కాని అంతకన్న ముఖ్యంగా, తమ కార్యాచరణ, ఐక్య కార్యాచరణ అనేది ఏయే అంశాలపై, ఏ విధంగా, ఏయే సమయాలలో సాగిందో సూటిగా, స్పష్టంగా వివరించాలి. ఆ విధంగా దానిని ‘తమ ఐక్య కార్యాచరణ’ పై శ్వేత పత్రం అనగల విధంగా ఉండాలి. శ్వేత పత్రం’ అనే మాట వాడటానికి తగు కారణం ఉంది. వామపక్షాలకు ఎంతో ప్రీతిపాత్రమైన పరిభాషలో శ్వేత పత్రం అనేది ఒకటి. ఇతర పార్టీల ప్రభుత్వాల నుంచి వారు వేర్వేరు విషయాలపై తరచు శ్వేత పత్రాలు కోరుతుంటారు. అది ఒక బ్రహ్మాస్త్రం వంటి డిమాండ్ అని, దానిని ప్రయోగించి “బూర్జువా” ప్రభుత్వాలను చిత్తు చేయవచ్చునని, నిరుత్తరులను చేయగలమని వారి ప్రగాఢమైన నమ్మకం. అందుకు ఆక్షేపించవలసిందేమీ లేదు. పైగా వారి డిమాండ్ ప్రజల పక్షాన గనుక. అయితే వారు అధికారంలో ఉన్న చోట్ల ఎప్పుడూ తమ పరిపాలనలపై ఒక్క శ్వేత పత్రం అయినా విడుదల చేసినట్లు లేరు. ఎందుకో తెలియదు. బహుశా వారి నుంచి అటువంటి పత్రాలను శ్రమ జీవులుగాని “బూర్జువాలు” గాని కోరలేదేమో తెలియదు. అంత మాత్రాన ఇతరుల నుంచి శ్వేత పత్రాలు కోరే హక్కు వారికి లేదని కాదు.
దానినట్లుంచి ప్రస్తుతానికి వస్తే, ఈ పది పార్టీల గత నాలుగేళ్ల “ఐక్యకార్యాచరణ” ఏమిటో తెలుసుకొనగోరే హక్కు తెలంగాణ ప్రజలకు ఉంది. ఎందుకంటే ఇవే పార్టీలు వివిధ సందర్భాలలో మాట్లాడేట్లు, ఇక్కడి ప్రజానీకంలో 90 శాతానికి పైగా బడుగు బలహీన వర్గాలవారు. వారు చేసిన సాయుధ పోరాటానికి వామపక్షాలు నాయకత్వం వహించాయి. ఒకవైపు సామాన్యులు, మరొకవైపు వామపక్షాలు చేసిన త్యాగాలు ఎనలేనవి. అటువంటి నేపథ్యంలో తెలంగాణ ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత అక్కడ గతంలో ఎన్నడూ లేని ఒక రాజకీయ అవకాశం సువర్ణావకాశంవలె లభించినందున, దానిని సద్వినియోగం చేసుకుంటూ, “ఐక్యకార్యాచరణ” ద్వారా ఒక ప్రత్యామ్నాయ పరిపాలన కోసం కృషి చేయగలమని వారు ఒక వేదికపై నుంచి ఘనమైన హామీ ఒకటి ఇచ్చారు. అది చూసి ప్రజలు చాలా ఆశలు పెట్టుకున్నారు. వీరి ఐక్యకార్యాచరణ వివరాలు తెలుసుకునే హక్కు, అవకాశం ప్రజలకు లభిస్తున్నది అందువల్లనే.
2014 ఆగస్టు నాటి సంయుక్త ప్రకటన వివరాలు గుర్తులేని వారి కోసం, ఆ ప్రకటనపై సంతకందారుల పేర్లు ఈ విధంగా ఉన్నాయి. 1) సిపిఎం, 2) సిపిఐ, 3) సిపిఐ ఎం.ఎల్, 4) సిపిఐ ఎంఎల్ మరొక గ్రూపు, 5) న్యూడెమోక్రసీ లిబరేషన్, 6) ఎంపిపిఐయు, 7) సిపిఐ ఎంఎల్ ఇంకొక గ్రూపు, 8) ఆర్‌ఎస్‌పి, 9) ఫార్వర్డ్ బ్లాక్, 10) ఎస్‌యుసిఐ (సి).
ఇపుడు విషయానికి వస్తే, ఈ పది పార్టీల ఐక్య కార్యాచరణ అంటూ ఏమీ జరగలేదన్నది పైకి చేసేందుకు అందరికీ కనిపిస్తూ వచ్చిన విషయం. కొంత జరిగి ఆగిందా లేక అసలు ఆరంభమే కాలేదా అన్నది వారి శ్వేత పత్రంలో తెలియవలసిన విషయం. బయటకు తెలిసి అసలు ఆరంభమే జరగలేదు. ఎందుకట్లా అన్నది కూడా శ్వేత పత్రంలో వారు నిజాయితీతో వెల్లడించవలసి ఉంది. సంయుక్త ప్రకటన తర్వాత కొనసాగింపు చర్చలు ఇంకా సాగుతుండగానే రాడికల్ గ్రూపులు దూరమయాయి. తర్వాత ఎక్కువ కాలం గడవకుండానే, ఆ ప్రకటనపై మొదటి సంతకందారు అయిన సిపిఎం, రెండవ సంతకందారు అయిన సిపిఐకి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయి. చివరకు ఈ రోజున ఎన్నికలు రానుండగా, నాలుగేళ్లు గడిచిన వెనుక, ఐక్యకార్యాచరణ అన్నది ఒక మిథ్యగా మిగిలింది. ఈ రెండు పార్టీలు ఎన్నికలలో దేని దారిని అది పోనున్నాయి.
సీరియస్‌గా చెప్పుకోవాలంటే ఈ నాలుగేళ్ల సంయుక్త ప్రకటన, భిన్నాభిప్రయాలు, విభేదాలు, చీలిక, వేర్వేరుగా పోటీల పరిణామాలన్నింటిని ఎవరైనా నిజంగా శ్వేతపత్రం అన్న విధంగా వివరించి రాయగలిగితే, అది భారతదేశ కమ్యూనిస్టు చరిత్రలోనే ఒక అధ్యాయం కాగలదు. దాని నుంచి మనం ఈ పార్టీల గురించి, వామపక్ష ఉద్యమాల గురించి తెలుసుకొనగలది చాలా ఉంటుంది. శ్వేతపత్రం అన్న మాట ఈ సందర్భంలో వ్యంగ్యంగా తోచవచ్చుగాని, అందుకు సీరియస్ అర్థం కూడా ఉంది. మొత్తానికి రానున్న కొద్ది మాసాలలో వీరి ఐక్య కార్యాచరణ పరస్పరంగా కాకుండా ఇతర పార్టీలతో కలిసి ఓట్లు సీట్ల కోసం జరగనున్నది. “తెలంగాణ సమగ్రాభివృద్ధి” అనే లక్షం గుర్తు చేసుకోవాలన్నా సిగ్గును కలిగించే విధంగా మారనున్నది. కాని నిరాశ అక్కర లేదు. ఎన్నికల తర్వాత వీరంతా తప్పక తిరిగి సమావేశమవుతారు. మరింత సమగ్రాభివృద్ధికి, మరింత ఐక్యంగా కార్యాచరణ కోసం మరింత దీర్ఘమైన సంయుక్త ప్రకటన చేస్తారు.

టంకశాల అశోక్
9848191767