ప్రపంచముంది, శాంతి లేదు

నేను సైతం విశ్వశాంతికి వెర్రిగొంతుకనిచ్చి మ్రోశాను అన్నాడు మహాకవి శ్రీశ్రీ. విశ్వశాంతి కోసం వినిపించే గొంతులన్నీ ఇప్పుడు వెర్రిగొంతులే అయిపోయాయిఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో/ ఎక్కడ మనుషులు తలెత్తుకుని తిరుగుతారో…/ ఆ స్వే చ్ఛా స్వర్గంలో నా దేశాన్ని మేల్కొలుపు అని రాశాడు విశ్వకవి రవీంద్రుడు. నేటికి కూడా ఇది నెరవేరని స్వప్నంగానే మిగిలిపోయింది. సెప్టెంబర్ 21 వరల్డ్ పీస్ డే … ప్రపంచ శాంతి దినోత్సవం విశ్వవ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నాం. ఇప్పుడున్న అరాచక హింసాయుత ప్రపంచంలో […]

నేను సైతం విశ్వశాంతికి వెర్రిగొంతుకనిచ్చి మ్రోశాను అన్నాడు మహాకవి శ్రీశ్రీ. విశ్వశాంతి కోసం వినిపించే గొంతులన్నీ ఇప్పుడు వెర్రిగొంతులే అయిపోయాయిఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో/ ఎక్కడ మనుషులు తలెత్తుకుని తిరుగుతారో…/ ఆ స్వే చ్ఛా స్వర్గంలో నా దేశాన్ని మేల్కొలుపు అని రాశాడు విశ్వకవి రవీంద్రుడు. నేటికి కూడా ఇది నెరవేరని స్వప్నంగానే మిగిలిపోయింది.
సెప్టెంబర్ 21 వరల్డ్ పీస్ డే … ప్రపంచ శాంతి దినోత్సవం విశ్వవ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నాం. ఇప్పుడున్న అరాచక హింసాయుత ప్రపంచంలో శాంతి కోసం ఒక రోజు కేటాయించుకోవటం కాస్త ఊరట నిచ్చే విషయమే. ఐక్యరాజ్య సమితే స్వయంగా వరల్డ్ పీస్ డే ప్రకటించి జరుపుతూ వస్తోంది. ఒక్కో సంవత్సరం ఒక్కో అంశాన్ని థీమ్ గా స్వీకరిస్తున్నారు. ఈ సంవత్సరం ప్రపంచ శాంతి దినోత్సవం థీమ్ “శాంతి హక్కు: మానవహక్కుల ప్రకటనకు 70 ఏళ్ళు” ప్రపంచశాంతి దినోత్సవం సందర్భంగా వివిధ దేశాల్లో అనేక కార్యక్రమాలు చేపట్టారు. భారతదేశంలోను అనేక కార్యక్రమాలు ఈ సందర్భంగా జరిగాయి. అంతర్జాతీయ శాంతి దినోత్సవాన్ని 1981 లో నిర్ణయించారు. ఐక్యరాజ్యసమితి సాధారణ సభ తీర్మానం 36/67 ద్వారా ప్రపంచ వ్యాప్తంగా శాంతి దినోత్సవం జరపాలని నిర్ణయించింది. సెప్టెంబర్ మూడవ శనివారం రోజున అంటే ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ప్రారంభం రోజున జరపాలని మొదట అనుకున్నారు. ఆ ప్రకారమే 1982 సెప్టెంబర్ నుంచి నిర్వహించారు. 2001లో ఐక్యరాజ్యసమితి సాధారణ సభ 55/282 ఏకగ్రీవ తీర్మానం చేసింది. దీనికి అనుగుణంగా సెప్టెంబర్ 21 వ తేదీని అంతర్జాతీయంగా అహింస, కాల్పుల విరమణ దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించారు.
యూనివర్శల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ లేదా అంతర్జాతీయ మానవ హక్కుల ప్రకటన 70వ వార్షికోత్సవం సందర్భంగా ఈ సంవత్సరం ప్రపంచశాంతి దినోత్సవం నిర్వహిస్తున్నామని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ అన్నారు. ప్రపంచంలో ఆకలి, అణచివేతలు లేనప్పుడే శాంతి వెల్లి విరుస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా ప్రపంచంలో గ్లోబల్ పీస్ ఇండెక్స్ లో భారతదేశం ఏ స్థానంలో ఉందో కూడా ఒకసారి పరిశీలించడం అవసరం. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం కాస్త మెరుగైన స్థానంలోనే ఉన్నాం అని సంతోషించవచ్చు.
ప్రపంచశాంతి సూచిని ఇనిస్టిట్యూట్ ఫర్ ఎకనమిక్స్ అండ్ పీస్ ప్రతి సంవత్సరం విడుదల చేస్తుంది. ప్రపంచంలోని 163 దేశాల్లో వివిధ దేశాల్లో శాంతియుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ ర్యాంకులు ఇస్తారు. గత సంవత్సరం ప్రపంచశాంతి సూచిలో మన స్థానం 137వ స్థానంలో ఉన్నాం. ఈ సంవత్సరం 136వ స్థానానికి వచ్చాం. అన్నింటికన్నా అగ్రస్థానంలో ఐస్ ల్యాండ్ ఉంది. భారతదేశం 2016లో 141వ స్థానంలో ఉండేది. ఐస్‌ల్యాండ్ అగ్రస్థానంలో ఉంటే రెండవ స్థానంలో న్యూజిలాండ్ ఉంది. ఆ తర్వాత వరుసగా ఆస్ట్రియా, పోర్చుగల్, డెన్మార్క్, కెనడా, చెక్ రిపబ్లిక్, సింగపూర్, జపాన్, ఐర్లాండ్ దేశాలు మొదటి పదిస్థానాల్లో ఉన్నాయి. ప్రాంతీయంగా చూస్తే దక్షిణాసియాలో శాంతియుత పరిస్థితులు గత సంవత్సరం కన్నా మెరుగయ్యాయి. కాని మనకన్నా మన పొరుగు దేశాలు మెరుగైన ర్యాంకుల్లో ఉన్నాయి. భూటాన్ ర్యాంకు 19, శ్రీలంక ర్యాంకు 67, నేపాల్ ర్యాంకు 84, బంగ్లాదేశ్ ర్యాంకు 93. ఈ దేశాలన్నీ మనకన్నా చాలా మెరుగైన ర్యాంకుల్లో ఉన్నాయి. మనకన్నా తక్కువ ర్యాంకులో ఉంది పాకిస్థాన్ 151వ ర్యాంకు. అఫ్ఘనిస్థాన్ 162వ ర్యాంకు.
‘శాంతి’ అన్న పదం వినటానికి కరువైన రోజులు దాపురించాయా? అనే ప్రశ్న వేసుకోవాల్సిన అవసరం ప్రపంచ వ్యాప్తంగా దాపురించింది. ఇదే పరిస్థితి మన దేశంలోను ఉంది. అంతర్గత కల్లోలాలు, పొరుగు దేశం పాకిస్థాన్ కలిగిస్తున్న ఇబ్బందులపై మన దేశం పెట్టిన ఖర్చు 2013లో 177 బిలియన్ల డాలర్లకి చేరింది. అంటే దాదాపు 13 వేల కోట్ల రూపాయలు. అప్పుడు ఈ ఖర్చు మన జిడిపిలో సుమారు 4.7%. భద్రతా దళాల మోహరింపు ఈ పెరిగిన ఖర్చులకి కారణం. ప్రపంచశాంతి సూచిలో 2008లో 138వ స్థానంలో ఉన్న ఇండియా ఆ తర్వాత 143వ స్థానానికి దిగజారి పోయింది. 2016లో అంతర్గత అలజడులు, హింసాకాండల వల్ల భారతదేశానికి 742 బిలియన్ అమెరికన్ డాలర్ల నష్టం భరించవలసి వచ్చింది. అంటే దాదాపు 54 వేల కోట్ల రూపాయలు.
గ్లోబల్ పీస్ ఇండెక్స్ ప్రకారం సిరియాలో హింసాకాండ వల్ల ఆ దేశం జిడిపిలో 68 శాతం నాశనమవుతోంది. ఇది ప్రపంచంలోనే అత్యధికం. భారతదేశంలో హింసాకాండల వల్ల జరుగుతున్న నష్టం 1.19 ట్రిలియన్ డాలర్లు. అంటే 80 లక్షల కోట్ల రూపాయలు. ఇది పర్చేజింగ్ పవర్ పారిటీ ప్రకారం. అదే తలసరి ఆదాయం లెక్కన చూస్తే ప్రతి మనిషి 595 డాలర్లు అంటే 40,000 రూపాయలు హింసాకాండ వల్ల నష్టపోయాడు. ఇది గత సంవత్సరం లెక్క. ఇది ఇండియా జిడిపిలో 9 శాతం. దీని ప్రకారం హింసాకాండల వల్ల జిడిపి నష్టం సూచికలో భారతదేశం 163 దేశాల జాబితాలో 59వ స్థానంలో ఉంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి డేటా ప్రకారం చూస్తే, భారతదేశం పర్చేజ్ పవర్ పారిటీ ప్రకారం జిడిపి 9.46 ట్రిలియన్ డాలర్లు. అంటే తలసరి ఆదాయం ప్రకారం 2017లో కేవలం 7,180 డాలర్లు. అంటే 5, 17,031 రూపాయలు. ప్రపంచంలో అత్యంత అశాంతి ఉన్న దేశాల్లో మొదటి యాభై దేశాల్లో అమెరికాతో పాటు మనం కూడా ఉన్నాం. మనతో పాటు పాకిస్థాన్, అఫ్ఘనిస్థాన్, టర్కీ, సౌదీ అరేబియా, రష్యా దేశాలు కూడా ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా హింసాకాండల వల్ల 2017లో జరిగిన నష్టం 14.76 ట్రిలియన్ డాలర్లు. హింసాకాండ వల్ల వాటిల్లే ప్రత్యక్ష, పరోక్ష నష్టాలను పరిగణనలోకి తీసుకున్న లెక్కలివి. గత దశాబ్దకాలంగా ప్రపంచ వ్యాప్తంగా హింసాకాండ వల్ల ఆర్ధిక వ్యవస్థలకు నష్టాలు చాలా పెరిగాయి. 2012 నుంచి చైనా, రష్యా, దక్షిణాఫ్రికా తదితర దేశాలు అంతర్గత భద్రతకు ఖర్చును చాలా పెంచాయి.
కేంద్రమంత్రి హంసరాజ్ ఆహిర్ ప్రకారం గత సంవత్సరం దేశంలో 822 మతపరమైన అల్లర్లు జరిగాయి. మరోవైపు మూక హత్యలు పెరుగుతున్నాయి. ప్రపంచ శాంతికి సదస్సులు జరుగుతున్నాయి. ప్రపంచ శాంతికి కృషి చేసినవారికి నోబుల్ బహుమతులు లభిస్తున్నాయి. ప్రపంచ శాంతి మాత్రం కనుచూపు మేరలో కనిపించడం లేదు. మొన్న విడుదల అయిన ప్రపంచ శాంతి సూచికలో శాంతియుత దేశాలుగా అగ్రస్థానంలో ఉన్న స్వీడన్, స్విట్జర్లాండ్ దేశాలు ప్రపంచంలో ఘర్షణలు, పోరాటాలు జరుగుతున్న ప్రాంతాలకు ఆయుధాలు సరఫరా చేసే దేశాలు కూడా. స్వీడన్ ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆయుధాల ఎగుమతి దేశం. స్విట్జర్లాండ్ ప్రపంచంలో 7వ అతిపెద్ద ఆయుధాల ఎగుమతి దేశం. ప్రపంచశాంతి కోసమే ఉగ్రవాదంపై యుద్ధం చేస్తున్నట్లు చెప్పుకునే అమెరికా ప్రపంచంలో అతిపెద్ద ఆయుధాల ఎగుమతి దేశం. ప్రపంచశాంతి దినోత్సవాలు జరుపుకోవడం వల్ల, లేదా ప్రపంచశాంతి సదస్సులు జరుపుకోవడం వల్ల శాంతియుతమైన ప్రపంచాన్ని సాధించలేము. చిత్తశుద్ధితో ప్రయత్నాలు జరగవలసి ఉంది. యుద్ధాలు, హింసాకాండ, జాతి, మత, కలహాలు లేని, ఆకలి, అణచివేతలు, ప్రకృతి విపత్తులులేని ప్రదేశం ఇంకా ఒక కలగానే మిగిలిపోయింది. రవీంద్రనాథ్ ఠాగూర్ కోరిన ప్రపంచం ఇంకా సుదూర స్వప్నమే.

* ఆదిత్యనాథ్