చిన్న పొదుపు పథకాల వడ్డీరేట్లు పెంపు

పిపిఎఫ్‌కు ఇకపై 8 శాతం న్యూఢిల్లీ: అనేక ఏళ్ల తర్వాత ప్రభుత్వం చిన్న పొదుపు పథకాలపై వడ్డీరేట్లను పెంచింది. ఇది మధ్యతరగతి ప్రజలకు ఊరట కల్పించనున్నది. అక్టోబరుడిసెంబరు త్రైమాసికానికి జాతీయ పొదుపు(ఎన్‌ఎస్‌సి), ప్రజా భవిష్యనిధి(పిపిఎఫ్) సహా చిన్న పొదుపులపై వడ్డీరేటును 0.4 శాతం మేరకు పెంచింది. బ్యాంకు డిపాజిట్ రేట్లు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకుంది. చిన్న పొదుపులను ప్రోత్సహించడం, సీనియర్ సిటిజెన్లు, బాలికల సంక్షేమాన్ని ప్రమోట్ చేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సాధారణంగా చిన్న […]

పిపిఎఫ్‌కు ఇకపై 8 శాతం

న్యూఢిల్లీ: అనేక ఏళ్ల తర్వాత ప్రభుత్వం చిన్న పొదుపు పథకాలపై వడ్డీరేట్లను పెంచింది. ఇది మధ్యతరగతి ప్రజలకు ఊరట కల్పించనున్నది. అక్టోబరుడిసెంబరు త్రైమాసికానికి జాతీయ పొదుపు(ఎన్‌ఎస్‌సి), ప్రజా భవిష్యనిధి(పిపిఎఫ్) సహా చిన్న పొదుపులపై వడ్డీరేటును 0.4 శాతం మేరకు పెంచింది. బ్యాంకు డిపాజిట్ రేట్లు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకుంది. చిన్న పొదుపులను ప్రోత్సహించడం, సీనియర్ సిటిజెన్లు, బాలికల సంక్షేమాన్ని ప్రమోట్ చేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సాధారణంగా చిన్న పొదుపు వడ్డీ రేట్లను మూడు నెలలకోసారి సవరిస్తుంటారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మూడో త్రైమాసికం(అక్టోబరు 1 నుంచి డిసెంబరు 31)లో చిన్న పొదుపులపై వడ్డీరేట్లను పెంచినట్లు కేంద్ర ఆర్థికశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. చిన్న పొదుపుదారులకు మద్దతు ఇచ్చే లక్షంతో చిన్న పొదుపు పథకాల వడ్డీరేటును 0.3 శాతం నుంచి 0.4 శాతానికి పెంచినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ట్వీట్ చేశారు. మరో ట్వీట్‌లో ఆయన ‘ఇది బాలికల సంక్షేమాన్ని, వయోవృద్ధుల ఆర్థిక భద్రతను పెంపొందించేదిగా ఉండనుంది. అక్టోబరు 1 నుంచి సుకన్య సమృద్ధి యోజనకు 8.1 శాతం నుంచి 8.5 శాతానికి, సీనియర్ సిటిజెన్ల పొదుపు పథకాలకు 8.3 శాతం నుంచి 8.7 శాతానికి ప్రభుత్వం వడ్డీరేట్లు పెంచింది’ అన్నారు.
చిన్న పొదుపు పథకాలపై వడ్డీరేట్లు 2012 ఏప్రిల్ 1 నుంచి తగ్గిపోతూ వస్తున్నాయి. ఆర్థిక మంత్రిత్వశాఖ ప్రకటన ప్రకారం ప్రజా భవిష్యనిధిపై వడ్డీరేటును మూడో త్రైమాసికంలో 7.6 శాతం నుంచి 8 శాతానికి పెంచారు. 2012 ఏప్రిల్ 1న ప్రజా భవిష్యనిధిపై వడ్డీరేటు 8.8 శాతం మేరకు హెచ్చుస్థాయిలో ఉంది. కానీ తర్వాత క్రమేణా వడ్డీ రేటు తగ్గిపోయింది. ప్రజా భవిష్యనిధి డిపాజిట్లకు ఆదాయపు పన్ను మినహాయింపు ఉంది. ఇక కిసాన్ వికాస్ పత్ర(కెవిపి)పై వడ్డీ రేటు ఇదివరకున్న 7.3 శాతం స్థానంలో 7.7 శాతం లభించనుంది. ఈ 0.4 శాతం పెంపుతో కిసాన్ వికాస్ పత్ర డిపాజిట్లు 118 నెలలకు బదులు 112 నెలల్లోనే పరిపక్వం(మేచుర్) చెందుతాయి. ఐదేళ్ల టర్మ్ డిపాజిట్‌పై 7.8 శాతం, రికరింగ్ డిపాజిట్‌పై 7.3శాతం, సీనియర్ సిటిజెన్ పొదుపు ఖాతా పై 8.7 శాతం చొప్పున వడ్డీరేటులు పెంచారు. సీనియర్ సిటిజెన్ల పథకం వడ్డీని త్రైమాసికానికోసారి చెల్లిస్తారు. ఏదిఎలాఉన్నప్పటికీ పొదుపు డిపాజిట్లపై వార్షిక వడ్డీ 4 శాతమే ఉండనుంది. బాలికల పొదుపు పథకం సుకన సమృద్ధి ఖాతాలకు ఇప్పుడున్న వడ్డీరేటుకన్నా అదనంగా 0.4 శాతం పెరిగి 8.5 శాతం లభించనుంది. ఎన్‌డిఎ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం 2015 ఏప్రిల్‌లో 9.2 శాతం వడ్డీని పొందింది.
ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం ఒకటి నుంచి మూడు సంవత్సరాల టర్మ్ డిపాజిట్లకు ఇప్పుడున్న వడ్డీరేటుకన్నా అదనంగా 0.3 శాతం లభించనుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ 2016లో త్రైమాసిక వడ్డీరేట్లను నిర్దారిస్తూ ప్రభుత్వ బాండ్ల ఆదాయంతో చిన్న పొదుపు పథకాల రేట్లను అనుసంధానించింది. ప్రభు త్వం ఇచ్చే చిన్న పొదుపు రేట్లకు అనుగుణంగా బ్యాంకు లు కూడా తమ డిపాజిట్ రేట్లను తగ్గిస్తాయని భావించి ఆ నిర్ణయం తీసుకున్నారు.