తలాక్ ఆర్డినెన్స్ ఆంతర్యం!

ట్రిపుల్ తలాక్‌ను శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తూ రూపొందించిన ఆర్డినెన్స్‌కు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ట్రిపుల్ తలాక్ బిల్లు శీతాకాల సమావేశాల్లో లోక్‌సభలో ఆమోదం పొందింది. కానీ ప్రతిపక్షాలు అభ్యంతరాలు లేవనేత్తడంతో రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదం పొందలేదు. బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని ప్రతిపక్షాలు కోరాయి. గత ఆగష్టులో ప్రభుత్వం ‘ముస్లిం విమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆన్ మ్యారేజ్ బిల్లు’లో మూడు సవరణలు చేసింది. ట్రిపుల్ తలాక్ కేసును నాన్ బెయిలబుల్‌గా ప్రతిపాదించిన […]

ట్రిపుల్ తలాక్‌ను శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తూ రూపొందించిన ఆర్డినెన్స్‌కు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ట్రిపుల్ తలాక్ బిల్లు శీతాకాల సమావేశాల్లో లోక్‌సభలో ఆమోదం పొందింది. కానీ ప్రతిపక్షాలు అభ్యంతరాలు లేవనేత్తడంతో రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదం పొందలేదు. బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని ప్రతిపక్షాలు కోరాయి. గత ఆగష్టులో ప్రభుత్వం ‘ముస్లిం విమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆన్ మ్యారేజ్ బిల్లు’లో మూడు సవరణలు చేసింది. ట్రిపుల్ తలాక్ కేసును నాన్ బెయిలబుల్‌గా ప్రతిపాదించిన ప్రభుత్వం నిందితుడు విచారణకు ముందే బెయిల్ కోసం కోరవచ్చని సవరణ చేసింది. మరో సవరణ ప్రకారం బాధితురాలు, ఆమె రక్త సంబంధీకుల ఫిర్యాదు మేరకే కేసు నమోదవుతుంది. ఈ కేసును కాంపౌండబుల్ అంటే రాజీ కుదిరే కేసుగా కూడా సవరణ చేశారు. మెజిస్ట్రేట్ తనకున్న అధికారాలతో భార్యాభర్తల మధ్య సయోధ్య కుదర్చవచ్చు.
ట్రిపుల్ తలాక్‌ను శిక్షార్హమైన నేరంగా మార్చడాన్ని కొన్ని మహిళా సంఘాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. దీనివల్ల ముస్లిం మహిళలకు ఎదురయ్యే కష్టాలను పట్టించుకోకుండా కేవలం రాజకీయాలు చేస్తున్నారన్న విమర్శలు బలంగా చేస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ట్రిపుల్ తలాక్ ఎలాగూ చెల్లదు. అందువల్ల ట్రిపుల్ తలాక్ అనేది ఇప్పుడు అధికారిక విడాకులు కాదు. ఇది కేవలం భార్యను వదిలేయడం వంటిది. భార్యను వదిలేసిన పురుషుడికి శిక్షలు వేస్తున్నామా అని ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ విమెన్స్ అసోసియేషన్ సెక్రటరీ కవితా కృష్ణన్ ప్రశ్నించారు. నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ విమెన్ జనరల్ సెక్రటరీ అన్నీ రాజా ఈ ఆర్డినెన్సు వెనుక ఉద్దేశము సంకల్పం రెండు అనుమానాస్పదంగా ఉన్నాయని చెప్పారు. మహిళా హక్కుల కార్యకర్త షబ్నం హాష్మీ మాట్లాడుతూ ట్రిపుల్ తలాక్‌ను శిక్షార్హమైన నేరంగా చేయడం అన్నది ప్రజలను మతపరంగా చీల్చే కుట్ర అన్నారు. ట్రిపుల్ తలాక్‌ను సుప్రీంకోర్టు నిషేధించిన తర్వాత దాన్ని నేరంగా ప్రకటించడం కేవలం రాజకీయమేనని చెప్పారు. ఆల్ ఇండియా డెమొక్రటిక్ విమెన్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ మరియం థవాలే ఈ ఆర్డినెన్సు వల్ల ముస్లిం మహిళల కష్టాలు మరింత పెరుగుతాయని చెప్పారు. నిజానికి ట్రిపుల్ తలాక్ విషయంలో ముస్లిములు కూడా వ్యతిరేకంగానే ఉన్నారు. ఆల్‌ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు 2017లో స్పందిస్తూ తామే ట్రిపుల్ తలాఖ్‌ను ఏడాదిన్నరలోగా రద్దు చేస్తామని ప్రకటించింది. అనేక మంది ముస్లిం ధర్మవేత్తలు కూడా సుప్రీంకోర్టు తీర్పు వచ్చినప్పుడు దాన్ని స్వాగతించారు. ఒక దురాచారం ఈ తీర్పుతో దూరమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ముస్లిముల్లో అన్ని వర్గాలలో ట్రిపుల్ తలాక్ ఉందనుకుంటే పొరబాటు. కేవలం హనఫీ సంప్రదాయంలోనే ఇది చెల్లుబాటు అవుతుంది. షియాల్లో ఈ పద్ధతి చెల్లదు. ముస్లిముల్లోనూ చాలా మంది ఈ పద్ధతిని వ్యతిరేకిస్తున్నప్పటికీ ట్రిపుల్ తలాక్ ఆర్డినెన్సు విషయంలో ఎందుకు వ్యతిరేకత చూపిస్తున్నారన్నది ఆలోచించవలసిన ప్రశ్న.
ముస్లిం వివాహం ఒక సివిల్ కాంట్రాక్టు. సివిల్ వ్యవహారాన్ని క్రిమినల్ వ్యవహారంగా మార్చి మూడు సంవత్సరాల కఠిన కారాగార శిక్షను విధించడాన్ని వ్యతిరేకిస్తున్నారు. దీనివల్ల తలాక్ ఇచ్చిన పురుషుడు జైలు పాలవుతాడు, భార్య ఆర్థిక కష్టాలతో రోడ్డున పడుతుంది. చివరకు ఆ కాపురం కూలిపోతుంది. భర్తకు జైలు శిక్ష విధించడంతో పాటు అతడు జీవనభృతి చెల్లించాలని పేర్కొనడం విడ్డూరమని చాలా మంది విమర్శిస్తున్నారు. జైల్లో ఉన్న భర్త జీవనభృతి ఎలా చెల్లించగలడన్న ప్రశ్న తలెత్తుతోంది. అసలు ట్రిపుల్ తలాక్ అంటే ఏమిటో తెలుసుకోవాలంటే ముస్లిముల్లో విడాకుల ప్రక్రియ గురించి తెలుసుకోవాలి. దివ్యఖుర్‌ఆన్, హదీసు గ్రంథాలు విడాకుల ప్రక్రియను వివరంగా తెలిపాయి. భార్యాభర్తల మధ్య సయోధ్య లేకపోతే వారి తరఫున ఇద్దరు మధ్యవర్తులను నియమించుకుని సమస్యల పరిష్కారానికి ప్రయత్నించాలి. ఈ ప్రయత్నాలు విఫలమైతే విడాకుల ప్రక్రియ ప్రారంభమవుతుంది. భర్త కోపంలో తలాక్ ఇవ్వకూడదు. మత్తులో ఇవ్వరాదు. భార్య రుతుకాలంలో ఉన్నప్పుడు ఇవ్వరాదు. భార్య రుతుకాలం గడిచిన తర్వాత ఇద్దరి మధ్య శారీరక సంబంధం ఏర్పడితే మళ్ళీ రుతుకాలం వరకు తలాక్ ఇవ్వరాదు. భర్త పై షరతులను దృష్టిలో ఉంచుకుని భార్యతో తాను తలాక్ ఇస్తున్నట్లు చెప్పాలి. ఇది సాక్షుల సమక్షంలో జరిగి తలాక్ నామా రాయించడం ఉత్తమం. అలా తలాక్ ఇచ్చిన తర్వాత మూడు నెలల కాలం అంటే భార్య మూడు రుతుస్రావాల కాలం వరకు ఆమె అతని ఇంటనే ఉంటుంది. అయితే వారి మధ్య దాంపత్య సంబంధం ఉండదు. ఈ మూడు నెలల కాలంలో భర్తలో మార్పు వచ్చి తలాక్ ఇవ్వాలన్న నిర్ణయాన్ని మార్చుకుంటే తలాక్ అమలు కాదు.
ఒకవేళ భర్తలో మార్పు రాకుంటే, మూడు నెలల తర్వాత తలాక్ అమలవుతుంది. విడాకులు అమలైనట్లే. మూడు సార్లు తలాక్ చెప్పవలసిన అవసరం లేదు. అలా ఒకసారి భార్యాభర్తలు విడిపోయిన తర్వాత మళ్ళీ ఆ భర్త అదే భార్య కావాలనుకుంటే అప్పుడు ఆమెను మళ్ళీ నికాహ్ చేసుకోవచ్చు. అలా ఆ దంపతులు ఒకసారి విడిపోయి మళ్ళీ నికాహ్ చేసుకున్న తర్వాత కూడా వారి మధ్య ఘర్షణలు మొదలైతే చివరకు విడాకుల వరకు వెళితే మళ్ళీ తలాక్ ప్రక్రియ మొత్తం జరగవలసిందే. అది ఆ దంపతులకు రెండవ తలాక్ అవుతుంది. అలా ఆ దంపతుల మధ్య మూడవ తలాక్ జరిగిపోతే వారిద్దరు మళ్ళీ వివాహం చేసుకునే అవకాశం లేదు. ఇది శాశ్వత స్థాయి కలిగి ఉంటుంది. వివాహాన్ని ఒక ఆటగా మార్చి మాటిమాటికి విడాకులిచ్చి మళ్ళీ కలిసిపోవడం అనేది లేకుండా చేయడానికే ఈ ఏర్పాటు. దీన్ని తలాకె అహ్సన్ అంటారు. కాని రానురాను మూడు పర్యాయాలుగా జరిగే ఈ విడాకులను ఒకేసారి శాశ్వత విడాకులుగా ఒకే సిట్టింగులో చెప్పే దురాచారం చోటు చేసుకుంది. దీన్ని దురాచారంగానే భావిస్తూ తలాకె బిద్దత్ అంటారు. భార్య విడాకులివ్వాలనుకుంటే ఆమె కూడా ఇవ్వవచ్చు. భార్య ఖాజీ వద్దకు వెళ్ళి తన కారణాలు చెప్పి నికాహ్ రద్దు చేయించుకోవచ్చు. దీనిని ఫిస్క్ నికాహ్ అంటారు. లేదా ఖులా ద్వారా విడాకులు కోరవచ్చు. పార్లమెంటు సమావేశాలు నవంబరులో లేదా డిసెంబరులో జరగవచ్చు. అప్పటి వరకు ఆగి పార్లమెంటులో చట్టమే చేయవచ్చు కదా ఇంత హడావిడిగా ఆర్డినెన్సు అవసరమేమిటి? ఎందుకంటే పార్లమెంటు సమావేశాల నాటికి వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగిపోవచ్చు. ఈ ఆర్డినెన్సు వల్ల బిజెపికి ముస్లిం మహిళల ఓట్లు పడతాయని కొందరి వాదన. లోక్‌సభ ఎన్నికల్లోనూ దీనివల్ల ప్రయోజనం పొందవచ్చన్నది పథకం. కాని ఈ ఆర్డినెన్సు వల్ల ముస్లిం మహిళల ఓట్లు పడవు. ఎందుకంటే పెద్ద సంఖ్యలో ముస్లిం మహిళలు కూడా ట్రిపుల్ తలాక్ బిల్లును వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేశారు. దేశంలోని ఏ సముదాయంలో కూడా విడాకులు పొందిన మహిళల సంఖ్య ఎన్నికల సమస్యగా మారేంత పెద్ద సంఖ్యగా లేదు. కాబట్టి ట్రిపుల్ తలాక్ ఎన్నికల సమస్య కాదు. బిజెపి తన ఓటు బ్యాంకును కాపాడుకునే ప్రయత్నాల్లో భాగంగా ట్రిపుల్ తలాక్ ఆర్డినెన్సు తీసుకువచ్చిందని మరికొందరి విశ్లేషణ. బిజెపి హిందూత్వకు కట్టుబడిన పార్టీ అన్న స్పష్టమైన సంకేతాలు తమ ఓటు బ్యాంకుకు ఇవ్వడానికే ఎన్నికలకు ముందు ఈ ఆర్డినెన్సు వచ్చినట్లు కనిపిస్తుంది.

* రఫీ

Comments

comments