ముఖ్య స్థానాలపై నజర్

ద్వితీయ శ్రేణి నేతలతో భేటీకి సిఎం నిర్ణయం?  50రోజుల్లో 100 సభల ప్రచార ఘట్టం ప్రారంభానికి ముందే నియోజకవర్గాలవారీ సమావేశాలు  గత ఎన్నికల ఫలితాలు, తాజా సర్వే నివేదికల ఆధారంగా పార్టీ బలోపేతానికి సూచనలు, సలహాలు  అభ్యర్థులు లేకుండానే భేటీలు మన తెలంగాణ/హైదరాబాద్ : ‘50 రోజుల్లో 100 సభలు’ ప్రచారాన్ని ప్రారంభించే సమయానికే కీలక నియోజకవర్గాలకు చెందిన రెండవ శ్రేణి నాయకత్వంతో టిఆర్‌ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సమావేశాలు నిర్వహంచనున్నట్లు తెలిసింది. గత ఎన్నికల […]

ద్వితీయ శ్రేణి నేతలతో భేటీకి సిఎం నిర్ణయం? 

50రోజుల్లో 100 సభల ప్రచార ఘట్టం ప్రారంభానికి ముందే నియోజకవర్గాలవారీ సమావేశాలు
 గత ఎన్నికల ఫలితాలు, తాజా సర్వే నివేదికల ఆధారంగా పార్టీ బలోపేతానికి సూచనలు, సలహాలు
 అభ్యర్థులు లేకుండానే భేటీలు

మన తెలంగాణ/హైదరాబాద్ : ‘50 రోజుల్లో 100 సభలు’ ప్రచారాన్ని ప్రారంభించే సమయానికే కీలక నియోజకవర్గాలకు చెందిన రెండవ శ్రేణి నాయకత్వంతో టిఆర్‌ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సమావేశాలు నిర్వహంచనున్నట్లు తెలిసింది. గత ఎన్నికల ఫలితాలతో పాటు తాజాగా వచ్చిన సర్వే నివేదికల ఆధారంగా పార్టీని మరింతగా బలోపేతం చేయాల్సిన స్థానాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. ఏ అంశాల్లో ఆ నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతం కావాల్సి ఉందో స్పష్టత ఇవ్వడంతోపాటు ఇకపైన యుద్ధ ప్రాతిపదికన చేపట్టాల్సిన కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలోనే రెండు దఫాలుగా సమావేశాలను నిర్వహించే అవకాశం ఉందని, సుమారు ముప్పై నియోజకవర్గాల నుంచి ద్వితీయశ్రేణి పార్టీ నాయకులు హాజరయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం. వివిధ జిల్లాలవారీగా గెలుపుతో పాటు మెజారిటీని కూడా అంచనావేస్తున్న కెసిఆర్ నియోజకర్గ నేతలతో స్వయంగా మాట్లాడి సూచనలు, సలహాలు, ఆదేశాలు ఇవ్వనుండడం విశేషం. ఈ స మావేశాల్లో ఆ నియోజకవర్గాల అభ్యర్థులు పాల్గొనకపోవచ్చని తెలిసింది. సర్వే నివేదిక ల్లో వెల్లడైన అంశాలతో పాటు నియోజకవర్గాల్లో తాజా స్థానిక పరిస్థితులపై నాయకుల నుంచి అభిప్రాయాలు స్వీకరించి, ఆ మేరకు లోటుపాట్లను సరిదిద్దుకునేలా దిశానిర్దేశం చేయనున్నారని తెలిసింది. ఆయా నియోజకవర్గాలలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడం, అభ్యర్థుల పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణకు తోడు పార్టీ గొప్పదనాన్ని వివరించాలని సూచించే అవకాశం ఉంది. నియోజకవర్గాలవారీగా మండలాలు, గ్రామాలలో పార్టీ పరిస్థితి, ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి బలాబలాలను క్షుణ్ణంగా విశ్లేషించి, అక్కడి పరిస్థితులను అనుగుణంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై ప్రణాళికలు రూపొందించనున్నట్లు సమాచారం.
అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రణాళికలు
రాష్ట్రంలో ఎన్నికలలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి..? ఏయే నియోజకవర్గాలలో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది తదితర అంశాలపై ఇప్పటికే పలు సంస్థలు, రాజకీయ పార్టీలు సర్వేలు నిర్వహించుకున్నాయి. ఈ సర్వే రిపోర్టులతో పాటు క్షేత్రస్థాయి వాస్తవాలను పరిశీలించిన తర్వాత పార్టీ అధినేత నియోజకవర్గాలవారీగా ముఖ్యనేతలతో చర్చించి, అనుకూల, వ్యతిరేక అంశాలపై సమీక్షించి ఆయా నియోజకవర్గాలలో గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రణాళికలు సిద్దం చేయనున్నట్లు తెలిసింది. ఆయా నియోజకవర్గాలలో ఉన్న పార్టీ అధినేతకు నమ్మకంగా ఉన్న రెండవ శ్రేణి నాయకత్వంతో ఈ వ్యూహాలపై చర్చించనున్నట్లు సమాచారం. అభ్యర్థులతో చర్చిస్తే వాస్తవ పరిస్థితులను కప్పిపుచ్చే అవకాశం ఉందని భావిస్తున్న పార్టీ అధినాయకత్వం ద్వితీయ శ్రేణి నాయకత్వంతోనే పూర్తి సమాచారాన్ని స్వీకరించి వ్యూహాలు రచించినున్నట్లు తెలిసింది. మండలాలవారీగా పార్టీ బలాలను అంచనా వేస్తూ గ్రామ స్థాయి నుంచి అనుసరించాల్సిన వ్యూహాలు చర్చించనున్నారు. ఆయా నియోజకవర్గాల పరిస్థితులపై ఒక అంచనాకు వచ్చిన తర్వాత అక్కడ అనుసరించాల్సిన వ్యూహాలపై గులాబీ బాస్ శ్రేణులకు దిశానిర్థేశం చేయనున్నారు. ఈ నెలాఖరులోగా కీలక నియోజకవర్గాల సమావేశాలు నిర్వహించిన తర్వాత 50 రోజుల్లో 100 సభలకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిసింది.
కొత్త ఓటర్ల నమోదు బాధ్యత నేతలదే
రాష్ట్రంలో శాసనసభ నియోజకవర్గాలవారీగా కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమంలో పార్టీ నేతలు క్రియాశీలకంగా వ్యవహరించాలని పార్టీ నాయకత్వం ఆదేశాలు జారీ చేసింది. నియోజకవర్గాలలో 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న యువతీ యువకుల జాబితాను సిద్దం చేసుకుని ఓటర్లు నమోదు చేసుకునేలా వారిని ప్రోత్సహించాలి. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ఇప్పటికే టిఆర్‌ఎస్ పార్టీ నేతలు ఓటరు నమోదు కార్యక్రమంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇంటర్మీడియేట్ ద్వితీయ సంవత్సరం పూర్తయిన వారు లేదా డిగ్రీ చదువుతూ ఓటు హక్కు లేని యువతీయువకులు ఓటరుగా నమోదు చేసుకునేలా ప్రోత్సహిస్తున్నారు.

Related Stories: