ఇంట గెలిచి రచ్చ గెలిచిన బతుకమ్మ

(A Successful Woman is one who can build a firm foundation with the bricks others have thrown at her) దీనికి నిలువెత్తు నిదర్శనం కల్వకుంట్ల కవిత. 2001 నుండి 2014 వరకు కెసిఆర్ గారిది ఉద్యమ బాట, 2014 నుండి తెలంగాణ పునర్నిర్మాణ బాట. తండ్రి బాటలో కొనసాగుతూనే తరతరాలుగా తెలంగాణలో వివక్షకు గురవుతున్న మహిళలను, మన సంస్కృతి, సంప్రదాయాలను జాగృతం చేసేందుకు తెలంగాణ జాగృతి అనే సంస్థను స్థాపించి […]

(A Successful Woman is one who can build a firm foundation with the bricks others have thrown at her) దీనికి నిలువెత్తు నిదర్శనం కల్వకుంట్ల కవిత. 2001 నుండి 2014 వరకు కెసిఆర్ గారిది ఉద్యమ బాట, 2014 నుండి తెలంగాణ పునర్నిర్మాణ బాట. తండ్రి బాటలో కొనసాగుతూనే తరతరాలుగా తెలంగాణలో వివక్షకు గురవుతున్న మహిళలను, మన సంస్కృతి, సంప్రదాయాలను జాగృతం చేసేందుకు తెలంగాణ జాగృతి అనే సంస్థను స్థాపించి సమైక్య రాష్ట్రంలో గుర్తింపు కోల్పోతున్న బతుకమ్మ పండుగను భుజానేసుకుని ప్రపంచం గుర్తించి గౌరవించేలా బతుకమ్మ విశిష్టతను ఎలుగెత్తి చాటిన ఘనత ఆమెకే దక్కింది.
విదేశాల్లో సైతం బతుకమ్మ పండుగను ఎన్‌ఆర్‌ఐలు ఘనంగా నిర్వహిస్తున్నారు అంటే దీనికి వెనక కవితక్క కృషి ఎనలేనిది. ఒక్క మాటలో చెప్పాలంటే మరుగునపడిన బతుకమ్మ పండుగకు పునర్ జీవం పోసింది కవితక్కే.
2009లో ప్రత్యేక రాష్ట్రానికై తన తండ్రి కెసిఆర్ ఆమరణ దీక్షకు పూనుకుంటే కూతురిగా తండ్రి పక్క ఉండాల్సిన సమయంలో తన తండ్రి ఆశయ సాధన కోసం ఉద్యమకారులకు మద్దతుగా నిలబడడమే కాకుండా ఉద్యమకారులపై ఉక్కుపాదం మోపుతున్న అప్పటి పాలకుల దుర్మార్గాన్ని ఎండగడుతూ అండ గా నిలబడింది. ఒకవైపు ఉద్యమం చేస్తూ ఇంకోవైపు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల విశిష్టతను ఖండాంతరాలకు వ్యాప్తి చెందేలా కృషి చేశారు కవితక్క.
తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత పార్లమెంట్ సభ్యురాలిగా గెలిచి తెలంగాణ ప్రగతికై చట్టసభలో తెలంగాణకు న్యాయంగా రావాల్సిన వాటాలపై గట్టిగా పోరాడుతున్నారు. సీనియర్ పార్లమెంట్ సభ్యులు సైతం కవిత సమస్యలపై వివిధ అంశాలపై చేస్తున్న ప్రసంగాలకు ముగ్ధులై ఆమెను గొప్ప వక్తగా అభివర్ణించడం విశేషం. తెలంగాణలోనే కాదు ప్రపంచంలో ఉన్న తెలంగాణ ప్రజలకు ఉద్యమ స్ఫూర్తిని నింపేందుకు సంస్కృతి సంప్రదాయాలను విస్తరించేందుకు ఉద్యమంలో భాగంగా అమెరికా, ఇంగ్లాండ్ లాంటి దేశాలకు వెళ్లి అశేష ఆదరణ చూరగొన్న కవిత తన వంతు బాధ్యతగా విదేశాలలో ఉన్న తెలంగాణ ప్రజల చేత బతుకమ్మను అంగరంగ వైభవంగా జరిపించాలని సంకల్పించుకున్నారు.
ఉద్యమంలో భాగంగా జాగృతి ద్వారా బతుకమ్మ ను తెలంగాణ మొత్తం నిర్వహించి మహిళలను ఉద్యమంలో భాగస్వాములుగా చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కవిత అక్క పాత్ర జాగృతి వేదిక మరువలేనివి. ‘ఇంట గెలిచి రచ్చ గెలవాల‘న్న సంకల్పంతో స్వరాష్ట్రంలో బతుకమ్మ జీవం పోసుకున్న తరువాత దానికి విదేశాలలో జీవం పోయడానికి కంకణం కట్టుకున్నారు కవిత. ప్రపంచ పటంలో తెలంగాణ కీర్తి ప్రఖ్యాతులను మన సంస్కృతీ సాంప్రదాయాలతో చాటి చెప్పడానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్న కవిత మొదట తెలంగాణ ప్రజలు ఎక్కువగా నివసించే అమెరికా వెళ్లి అక్కడ ప్రపంచమంతా గర్వించేలా ఘనం గా బతుకమ్మ నిర్వహించారు.
అదే విధంగా లండన్‌లో అశేష జనాదరణ చూరగొన్న తాను ఇక ప్రతి సంవత్సరం ఇలాగే ఘనంగా నిర్వహించడానికి ‘జాగృతి’ సంస్థని అమెరికా, యూరప్ దేశాలలో ఏర్పరచి అక్కడికి కార్యవర్గానికి మన సంస్కృతి సంప్రదాయాలను కొనసాగించేలా దిశానిర్దేశం చేశా రు. 2015, 2016 లో తెలంగాణలో జాగృతి అధ్వర్యం లో ప్రతి ఊరు, వాడ, పల్లె, నగరం మన బతుకమ్మ పండుగను చరిత్రలో మున్నెన్నడూ లేని విధంగా ఘనంగా జరుపుకున్న తరువాత మిగతా దేశాలలో ఘనంగా జరపడానికి 2016లో అమెరికా, బ్రిటన్ , ఆస్ట్రేలియా, సింగపూర్, దుబాయి, మలేషియా, న్యూజిలాండ్, డెన్మార్క్ దేశాలకు తిరిగి అక్కడ అంతమవుతున్న తెలంగాణ సంస్కృతికి జీవం పోశారు.
ఈ రోజు ప్రపంచం అంతా బతుకమ్మను సగౌరవంగా జరపడానికి కారణం కవిత. ఇది జగం ఎరిగిన సత్యం. నిద్రాహారాలు మాని, తన కుటుంబ సభ్యులను వదిలి మన సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేస్తూ తెలంగాణ ప్రజలు గర్వపడే స్థాయిలో బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించి విదేశాలలో ఆయా దేశాలు బతుకమ్మ పండగ ను అధికారికంగా (ప్రభుత్వ సహాయం) నిర్వహించే స్థాయికి తీసుకొచ్చిన మన ఆడబిడ్డ.

నాగేందర్ రెడ్డి కాసర్ల
(అధ్యక్షుడు టిఆర్‌ఎస్ ఆస్ట్రేలియా)