రోబోల వల్ల ఉద్యోగ హాని

ప్రస్తుతం మనిషి చేస్తున్న పనుల్లో 52 శాతం పనులు 2025 నాటికి రోబోలే చేస్తాయని వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ప్రకటించింది. కొంతకాలం క్రితం హైదరాబాదులో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మహాసభలో సౌదీ అరేబియాకు చెందిన రోబో సోఫియా వచ్చింది. ఈ రోబోకు సౌదీ పౌరసత్వం కూడా ఉంది. సౌదీలో కఠినమైన ఇస్లామీయ నిబంధనలున్నాయి. స్త్రీలు ఖచ్చితంగా బురఖా ధరించి బయటకు వస్తారు. కాని సోఫియా మాత్రం బురఖా లేకుండా వచ్చేసింది. ‘సౌదీ అరేబియా పౌరసత్వం ఉండి కూడా అక్క […]


ప్రస్తుతం మనిషి చేస్తున్న పనుల్లో 52 శాతం పనులు 2025 నాటికి రోబోలే చేస్తాయని వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ప్రకటించింది. కొంతకాలం క్రితం హైదరాబాదులో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మహాసభలో సౌదీ అరేబియాకు చెందిన రోబో సోఫియా వచ్చింది. ఈ రోబోకు సౌదీ పౌరసత్వం కూడా ఉంది. సౌదీలో కఠినమైన ఇస్లామీయ నిబంధనలున్నాయి. స్త్రీలు ఖచ్చితంగా బురఖా ధరించి బయటకు వస్తారు. కాని సోఫియా మాత్రం బురఖా లేకుండా వచ్చేసింది. ‘సౌదీ అరేబియా పౌరసత్వం ఉండి కూడా అక్క డి చట్టాలను అతిక్రమించి బురఖా లేకుండా తిరుగడ మంటే, రోబోలకు భిన్నమైన నియమాలేమైనా ఉన్నా యా?’ అని అడిగితే ఆ రోబో తడుముకోకుండా, ‘విభిన్నమైన నియమాలేవీ మాకు అవసరం లేదు. ప్రత్యేక ప్రోత్సాకాలనూ మేము కోరుకోవడం లేదు. వాస్తవంగా మహిళల హక్కుల గురించి ప్రశ్నించడానికి నా పౌరసత్వ హోదా ను వినియోగించేందుకు నేను ఇష్టపడతాను’ అంటూ జవాబిచ్చింది. వింటున్న వారు నిశ్చేష్టులయ్యారు. ఇది తెలివిగా ఆలోచించి చెప్పిన సమాధానం.
ఇంత తెలివిగా సమాధానాలిస్తున్న రోబోలు మనుషులను జయిస్తాయేమో, రజనీకాంత్ రోబో సినిమా, షారూక్ ఖాన్ రావన్ సినిమా, హాలీవుడ్ లో వచ్చిన ఐ రోబో, టెర్మినేటర్ వగైరా సినిమాల్లో మాదిరిగా మానవజాతిపై యంత్రాల దాడుల భయాలు కలగడమూ సహజమే. ఈ భయాలను నిజం చేస్తూ కొన్ని సంఘటనలు కూడా జరిగాయి. రోబోల చేతుల్లో మనుషులు ప్రాణాలు కోల్పోయారు. ఇవి హత్యలా? ప్రమాదాలా? యంత్రాలతో పనులు చేయిస్తున్నప్పుడు జరిగే ప్రమాదాలుగానే చట్టాలు ఈ మరణాలను గుర్తించాయి. గుర్గావ్ లోని మారుతీ సుజుకీ ప్లాంట్ లో కార్లు తయారు చేసే రోబో అక్కడ పనిచేసే కార్మికున్ని పొట్టన బెట్టుకుంది. తయారీ క్రమంలో పనిచేస్తున్న కార్మికున్ని ఒక వస్తువుగా భావించిన రోబో కార్మికుడి ప్రాణాలు తీసేసింది. ఊహించని ఈ ప్రమాదానికి అక్కడి కార్మికులంతా హతాశులయ్యారు.
ఈ భయాలు ఎలా ఉన్నప్పటికీ, రోబోలతోను, కృత్రిమ మేధ వల్లను వచ్చే లాభాలు చాలా ఉన్నాయి. అత్యంత నైపుణ్యంతో ఐదారు గంటలు చేసే సర్జరీ ఒక రోబో సునాయాసంగా ఖచ్చితంగా తక్కువ సమయంలో చేయవచ్చు. సరిహద్దుల్లో మందుపాతరలను రోబోలు తొలగించగలవు. అగ్నిప్రమాదాల్లో మనుషులకు బదులు రోబోలు వెళ్ళి మంటలు ఆర్పవచ్చు. ఇలాంటి అనేక పనులు రోబోలు సునాయాసంగా చేయగలవు.
విద్య, వైద్యం, బ్యాంకింగ్, పరిశ్రమలు, దేశ భద్రత, వ్యవసాయం, అంతరిక్ష పరిశోధన… ఇలా ప్రతి రంగంలో రోబోలు ప్రవేశిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం విస్తృతంగా రోబోలపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఇప్పటికే వేలాది రోబోలు పారిశ్రామిక కార్మికులూ, డాక్టర్లూ, నర్సులూ, స్కూల్ టీచర్లూ, రిసెప్షనిస్టులూ, పోలీసులూ తదితరుల స్థానాల్ని భర్తీ చేస్తూ వివిధ రంగాల్లో సేవలందిస్తున్నాయి. మున్ముందు దాదాపు అన్ని రంగాల్లో మనుషుల ఆధిపత్యాన్ని తగ్గించే దిశగా అడుగేస్తున్నాయి.
కేవలం రాబోయే ఏడు సంవత్సరాల్లోనే యంత్రాలు మనిషి జీవితంలో చాలా భాగాన్ని ఆక్రమించుకోబోతున్నాయి. ప్రస్తుతం యంత్రాలు 29 శాతం పనులు మాత్రమే చేస్తున్నాయి. 2025 నాటికి 50 శాతం పనులు చేస్తాయి. 2022 నాటికి యంత్రాల వల్ల 7 కోట్ల 50 లక్షల ఉద్యోగాల్లో మనుషుల అవసరం ఉండదు. కాని 13 కోట్ల 30 లక్షల కొత్త ఉద్యోగాలు కూడా ఉనికిలోకి వస్తాయి. రోబోలు ముఖ్యంగా ఎక్కౌంటింగ్, క్లయింట్ మేనేజిమెంట్, పరిశ్రమలు, పోస్టల్, సెక్రటరియల్ ఉద్యోగాలన్నింటినీ ఆక్రమించుకుంటాయి. కాని సేల్స్, మార్కెటింగ్, కస్టమర్ సర్వీస్ వంటి రంగాల్లో యంత్రాలు ప్రవేశించడం కష్టం. ఇ కామర్స్ రంగంలో ఉద్యోగులకు మరింత శిక్షణ అవసరమవుతుంది. అలాగే సృజనాత్మక రంగాల్లోనూ మనిషికి యంత్రాల పోటీ ఉండదు.
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఐటి రంగంలో ఉద్యోగులకు మెడపై కత్తిలా వేలాడుతోంది. భారతదేశంలో 150 బిలియన్ డాలర్ల ఐటి రంగంలో 40 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఆటోమేషన్ వల్ల భారతదేశంలో 69 శాతం ఉద్యోగాలు పోవచ్చు. చైనాలో 77 శాతం ఉద్యోగాలు పోవచ్చని వరల్డ్ బ్యాంక్ పరిశోధనలో తేలింది. దీనివల్ల ప్రస్తుతం ఉన్న ఉద్యోగాలపై 60 నుంచి 70 శాతం ప్రభావం పడుతుంది. ఇదంతా కేవలం ఒక్క దశాబ్దంలో జరగబోతోంది. 2021 నాటికి ఐటి రంగంలో తక్కువ నైపుణ్యం అవసరమైన 6.4 లక్షల ఉద్యోగాలు ఇండియాలో తగ్గిపోతున్నాయి. డిజిటైజేషన్, ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ వల్ల కొత్త ఉద్యోగాలు వస్తాయి. కాని వాటిని అందుకోడానికి తగిన శిక్షణతో సిద్ధంగా ఉన్నవారికే అవి లభిస్తాయి.
ఆటోమేషన్ వల్ల కేవలం ఐటి రంగంపైనే కాదు ఇతర రంగాలపై కూడా ప్రభావం పడుతుంది. వ్యవసాయరంగంలో డ్రోన్ ఉపయోగించి పంటలపై పురుగుమందులు స్ప్రే చేయించడానికి టాటా కన్సల్టేన్సీ ప్రయోగాలు చేస్తోంది. బెంగుళూరులోని స్కైలార్క్ డ్రోన్స్ ల్యాండ్ సర్వే, పవర్ లైన్ ఇన్‌స్పెక్షన్, నిర్మాణాల మానిటరింగ్ వంటి పనులకు డ్రోన్లను ఉపయోగిస్తుంది. అనేక రంగాలను ఇప్పుడు యంత్రాలు ఆక్రమించుకుంటున్నయి. కాబట్టి వచ్చే ఐదు సంవత్సరాల్లో 54 శాతం ఉద్యోగులు తమ నైపుణ్యాలను పెంచుకోడానికి అవసరమైన శిక్షణ పొందవలసి ఉంటుంది.
కంపెనీలు తమ ఉద్యోగులకు అవసరమైన కొత్తనైపుణ్యాల శిక్షణ అందించవలసి ఉంటుంది. కేవలం కాలేజీలో పట్టా పుచ్చుకుని బయటకు వస్తే లభించే ఉద్యోగాలు ఇక ఉండకపోవచ్చు. జీవితాంతం ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండవలసిందే. అవసరమైన శిక్షణతో మనిషి సిద్ధంగా ఉంటే యంత్రాలతో పాటు కలిసి హాయిగా పనిచేసుకోవచ్చు. లేకపోతే మనిషి ఉపాధిని యంత్రాలు లాక్కుంటాయి. ఒక ఎటిఎం వల్ల దాదాపు ముగ్గురు ఉద్యోగుల పని జరుగుతుంది. ఎటియం నిర్వహణకు అయ్యే ఖర్చు ఒక ఉద్యోగి జీతం కన్నా తక్కువే ఉంటుంది. ఇలా పనులన్నీ యంత్రాలే చేస్తుంటే ఇక ఉద్యోగాలెక్కడుంటాయి?
వంద మంది మనుషుల పని ఒక్క రోబో చేయడం ఒక విధంగా లాభమే. కానీ దాని వల్ల ఆ వంద మంది ఉద్యోగాలు ప్రమాదంలో పడిపోతాయి. రోబోల వల్ల మనుషులకు జరిగే తొలి నష్టం అదే. మనిషి అవసరమైన నైపుణ్యాలు పెంచుకుంటే ఉద్యోగాలు కూడా ఉంటాయని చాలా మంది వాదిస్తున్నారు.

* అలెగ్జాండర్