ట్రంప్ వాణిజ్య యుద్ధం విస్తరణ

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చైనాతో వాణిజ్య యుద్ధాన్ని విస్తరించటం క్రూడ్ ఆయిలు ధర పెరుగుదల, డాలర్‌తో రూపాయి మారక విలువ దిగజారుడుకు హేతువవుతున్నది. అమెరికా, చైనాలు పరస్పర దిగుమతులపై సుంకాల విధింపును మంగళవారం పెంపు చేయటంతో ఆ రెండు దేశాల మధ్య వాణిజ్య వైరం తారా స్థాయికి చేరింది. చైనా నుంచి 200 బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులపై అమెరికా 10 శాతం సుంకం విధించగా, చైనా ప్రతిచర్యగా అమెరికా నుంచి 60 బిలియన్ డాలర్ల […]

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చైనాతో వాణిజ్య యుద్ధాన్ని విస్తరించటం క్రూడ్ ఆయిలు ధర పెరుగుదల, డాలర్‌తో రూపాయి మారక విలువ దిగజారుడుకు హేతువవుతున్నది. అమెరికా, చైనాలు పరస్పర దిగుమతులపై సుంకాల విధింపును మంగళవారం పెంపు చేయటంతో ఆ రెండు దేశాల మధ్య వాణిజ్య వైరం తారా స్థాయికి చేరింది. చైనా నుంచి 200 బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులపై అమెరికా 10 శాతం సుంకం విధించగా, చైనా ప్రతిచర్యగా అమెరికా నుంచి 60 బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులపై 510 శాతం మధ్య సుంకాలు విధించింది. ఈ కొత్త సుంకాలు ఇరువైపులా సెప్టెంబర్ 24 నుంచి అమలులోకి వస్తాయి. ఈ సుంకాల యుద్ధం అమెరికా ఆర్థికాభివృద్ధికి చేటు చేస్తుందని వాణిజ్య వర్గాలు భావిస్తున్నప్పటికీ, అక్రమ వాణిజ్య పద్ధతుల నుంచి చైనాను నిరోధించటానికి శిక్షించటమే మార్గమని ట్రంప్ భావిస్తున్నారు. ట్రంప్ అసలు ఉద్దేశం అమెరికాకు పోటీగా ఆర్థికశక్తిగా ఎదుగుతున్న చైనాను కృంగదీయటం. చైనా, భారత్‌వంటి దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాలనే పేరుతో ప్రాధాన్యతా దేశాలుగా ఎగుమతులపై పొందుతున్న సబ్సిడీలు నిలుపు చేయాలని ట్రంప్ కొద్ది రోజుల క్రితం ఆదేశించటం గుర్తు చేసుకోదగింది.
ట్రంప్ జనవరిలో చైనాపై వాణిజ్య యుద్ధం మొదలు పెట్టారు. సోలార్ సెల్, వాషింగ్ మెషిన్ దిగుమతులపై జనవరి 22న వరుసగా 30 శాతం, 20 శాతం సుంకాలు విధించారు. చైనా సహా అన్ని దేశాల నుంచి స్టీలు, అల్యూమినియం దిగుమతులపై ట్రంప్ మే 9న వరుసగా 25 శాతం, 10 శాతం సుంకాలు విధించారు. ఈ దెబ్బ చైనా, భారత్‌లతో పాటు యూరోపియన్ యూనియన్ దేశాలకూ తగిలింది. అమెరికా నుంచి 3 బిలియన్‌ల విలువైన దిగుమతులపై చైనా ఏప్రిల్ 2న సుంకాలు విధించింది. చైనా తమ టెక్నాలజీని అపహరిస్తున్నట్లు మే 28న అమెరికా ఆరోపించింది. 50 బిలియన్ డాలర్ల విలువైన చైనా వస్తువుల దిగుమతిపై సుంకాలు జులై, ఆగస్టు నెలల్లో అమలులోకి వచ్చాయి. అంతే మొత్తం విలువైన వస్తువులపై సుంకాలతో చైనా ఎదురు దాడి చేసింది. ట్రంప్ తాజా ప్రకటనతో చైనా వస్తువుల దిగుమతిపై సుంకాలు 250 బిలియన్ డాలరల విలువకు విస్తరించగా చైనా సుంకాలు 110 బిలియన్ డాలర్ల అమెరికన్ వస్తువులకు విస్తరించాయి. కొత్త సుంకాల రేటును ఈ సంవత్సరాంతానికి 25 శాతానికి పెంచుతామని ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. అమెరికా చర్యపట్ల “ప్రగాఢమైన విచారం” వ్యక్తం చేసిన చైనా తమ న్యాయమైన హక్కుల పరిరక్షణకు, ప్రపంచ వాణిజ్య వ్యవస్థ పరిరక్షణకు ప్రతిచర్యలు తీసుకోక తప్పడం లేదని ప్రకటించింది.
చైనాతో అమెరికా వాణిజ్య లోటు 375 బిలియన్ డాలర్లు. అమెరికా మొత్తం వాణిజ్య లోటులో ఇది సగానికన్నా పెచ్చు. సుంకాల ద్వారా చైనా మెడలు వంచి లోటును సగానికిపైగా తగ్గించాలన్నది ట్రంప్ ఎత్తుగడ. ‘అమెరికా ఫస్ట్’ పేరుతో ‘స్వీయ రక్షణ వాదం’ విధానాన్ని అనుసరిస్తున్న ట్రంప్ బెదిరింపులు, ఆంక్షలతో ఇతర దేశాల మెడలు వంచాలని చూస్తున్నారు.
కాగా, స్టీలు, అల్యూమినియం దిగుమతులపై ట్రంప్ మార్చి 9న సుంకాలు విధించిన దరిమిలా భారత ప్రభుత్వం ప్రకటించిన ప్రతీకార సుంకాల అమలును మరోసారి, నవంబర్ 2వ తేదీకి వాయిదా వేసింది. ఎందుకీ మెతకవైఖరి? కొద్ది వారాల క్రితం ‘2+2 సంభాషణ’ అమెరికాతో రక్షణ రంగం బంధాన్ని మరింతగా పటిష్టం చేసుకోవటం ఈ విషయంలో భారత ప్రభుత్వాన్ని వెనక్కిలాగి ఉండవచ్చు. ఇరాన్ నుంచి క్రూడ్ ఆయిల్ దిగుమతిని నవంబర్ నుంచి మానుకోవాలని ఆంక్ష విధించిన ట్రంప్ ప్రభుత్వం ఆయిల్ విషయంలో ఏమైనా వెసులుబాటు ఇస్తుందా అంటే అదేమీ లేదు. తమ నుంచి ఆయిలు కొనుక్కోమంటోంది. అమెరికా నుంచి దిగుమతి చేసుకోవాలంటే రవాణా ఛార్జీలే తడిసిమోపడవుతాయి. దగ్గరలో ఉన్న అమెరికా మిత్ర రాజ్యం సౌదీ అరేబియా ఎక్కువ క్రూడ్ ఇవ్వవచ్చుగాని ధర నియంత్రణకు అది సుముఖంగా లేదు. బ్యారల్ 80 డాలర్లు దాటటాన్ని ఇప్పుడది సమర్థిస్తున్నది. ఇరాన్ ఆయిల్ కొనుగోలుపై అమెరికా ఆంక్షలు అమలులోకి రాగానే క్రూడ్ ధర మరింత పెరిగే అవకాశముంది. రెండోవైపు డాలర్‌తో రూపాయి మారక విలువ రోజురోజుకూ దిగజారుతూ బుధవారం నాడు రూ. 72.98 పైసలకు చేరింది. నవంబర్‌కు కాంట్రాక్టు చేసుకున్న బ్రెండ్ క్రూడ్ బ్యారల్ 1.55 డాలర్లు పెరిగి 79.80 డాలర్లకు చేరటం, అమెరికా చైనా వాణిజ్య యుద్ధం విస్తరణ రూపాయిని ఒత్తిడికి గురి చేశాయి. అందువల్ల ప్రభుత్వం శక్తిమంతగా జోక్యం చేసుకోకపోతే రూపాయి విలువ నిలబడదు, రిటైల్ ఆయిల్ ధర తగ్గదు. మోడీ ప్రభుత్వానికిది కష్టకాలం.

Comments

comments

Related Stories: