వలసదారుల సమస్యకు అమెరికా తరహా పరిష్కారం

అస్సోం పరిణామాలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమౌతున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మూడేళ్ళ క్రితం జాతీయ పౌర రిజిస్ట్రీని సరిదిద్దే ప్రయత్నం పూర్తయ్యి తొలి పౌరుల జాబితా విడుదల కాగా అందులో సుమారు నలభై లక్షల మంది వలసదారులకు చోటు లభించలేదు. ఈ ప్రక్రియ ఎలా జరిగింది, దాని ప్రభావం ఏమిటి అని ఆలోచించని రాజకీయ పార్టీలు వెంటనే ఈ అంశాన్ని రాజకీయం చేసెయ్యడం దురదృష్టకరం. ఈ జాతీయ పౌర రిజిస్ట్రీలో పేరు నమోదు చేసుకునేందుకు 1971 మార్చి […]

అస్సోం పరిణామాలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమౌతున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మూడేళ్ళ క్రితం జాతీయ పౌర రిజిస్ట్రీని సరిదిద్దే ప్రయత్నం పూర్తయ్యి తొలి పౌరుల జాబితా విడుదల కాగా అందులో సుమారు నలభై లక్షల మంది వలసదారులకు చోటు లభించలేదు. ఈ ప్రక్రియ ఎలా జరిగింది, దాని ప్రభావం ఏమిటి అని ఆలోచించని రాజకీయ పార్టీలు వెంటనే ఈ అంశాన్ని రాజకీయం చేసెయ్యడం దురదృష్టకరం. ఈ జాతీయ పౌర రిజిస్ట్రీలో పేరు నమోదు చేసుకునేందుకు 1971 మార్చి 24కు ముందు నాటికి జారీ చేయబడిన పన్నెండు ఆస్తి ధ్రువీకరణ పత్రాలలో ఒక దానిని చూపించాల్సి వుంటుంది.
అయితే అత్యధికంగా పేదవారు 48 సంవత్సరాల క్రితం నాటి ధ్రువీకరణ పత్రాలను భద్రపరచుకోవడం అసంభవం కాబట్టి బెనిఫిట్ ఆఫ్ డౌట్ (అస్పష్టతా ప్రయోజనం, అనుమానమేలు) కింద వారిని పౌరులుగా నమోదు చేసుకోవాలని కాంగ్రెస్ పట్టుపడుతోంది. నమోదు కాని వారిలో అత్యధికులు ముస్లిం బెంగాలీలు కాబట్టి రాజకీయ అవసరాల కోసమే వారిని తుది జాబితా నుండి తప్పించడం జరిగిందని, ఒక నెల లోపు ఆ నలభై లక్షల మందిని పౌరులుగా ధ్రువీకరించి తుది జాబితా విడుదల చెయ్యకపోతే రక్తపాతం తప్పదని మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చింది. బిజెపి మాత్రం జాతీయ పౌర రిజిస్ట్రీ ప్రక్రియ చాలా పకడ్బందీగా జరిగిందని, ఎలాంటి అనుమతులు లేకుండా సరిహద్దులు దాటి అక్రమంగా వచ్చిన వారిని తిరిగి వెనక్కి పంపేయాల్సిందేనని, తద్వారా తుది జాబితా నుంచి ఆ నలభై లక్షల మందిని మినహాయించాల్సిందేనని పట్టుపడుతోంది.
ఏది ఏమైనా అన్ని పార్టీలు అస్సోంలోని పరిణామాలను రాజకీయ లబ్ధి కోసం తమ తమ దృష్టి కోణం నుండి చూస్తున్నాయే తప్ప దేశ భవిష్యత్తుకు, సమగ్రతకు ఏది మంచిది అనే చూపుతో ఆలోచించక పోవడం బాధాకరం. ఆ రాష్ట్రం లో జరగబోయే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో వుంచుకొని, ఎవరిని పౌరులుగా నిర్ణయించాలి లేక ఎవరిని పౌరసత్వానికి అనర్హులుగా ప్రకటించాలి, తద్వారా తమకు ఎన్నికలలో గెలుపు సంభవిస్తుందా అనే అంశం ఆధారం గానే ఒక సంక్లిష్టమైన సమస్యకు పరిష్కారం సూచించడం బాధాకరం, అది వారి సంకుచిత దృష్టికి నిదర్శనం. గతంలో పాలకుల క్షుద్ర రాజకీయాలవల్లే అస్సోం, ఇతర రాష్ట్రాలలో వలసదారుల సమస్య సంక్లిష్టమయ్యింది. దేశ విభజన, 1967లో చైనాతో యుద్ధం, 1971లో పాకిస్తాన్‌తో యుద్ధం వంటి సమయాలలో సరిహద్దులలో నెలకొన్న పరిస్థితులను అడ్డం పెట్టుకొని లక్షల మంది పొరుగు దేశం నుండి మన దేశం లోనికి అక్రమంగా ప్రవేశించారు.
తర్వాత వారు స్థానిక అధికారుల అవినీతి, వ్యవస్థాగత లోపాలు, రాజకీయ నాయకుల అధికార, అర్ధ, కండ బలం అడ్డం పెట్టుకొని తప్పుడు ధ్రువ పత్రాలను పొంది స్థానికులవలే సకల సౌకర్యాలు పొందారు. కొన్ని వర్గాలు తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలు సంపాదించి చదువులు, ఉద్యోగాలలో రిజర్వేషన్లను కూడా పొందినట్లు అధికార గణాంకాలు తెలియజేస్తున్నాయి. కొందరు రాజకీయాలలోనికి ప్రవేశించి ప్రజాప్రతినిధులుగా కూడా ఎన్నికై అధికారం చెలాయిస్తున్నారు. దేశంలో భద్రతా వ్యవస్థ, నిఘా వ్యవస్థ, జనాభా గణన విధానం, ధ్రువీకరణ పత్రాల జారీ విధానం అత్యంత లోపభూయిష్టంగా వుండబట్టే అన్య దేశస్థులు మన దేశంలోనికి ప్రవేశించి భారత పౌరులుగా చెలామణి అవగలుగుతున్నారు. అనేకులు భారత పౌరులుగా చెలమణి అవుతూ, అన్ని సౌకర్యాలు అనుభవిస్తూ, దారుణమైన నేరాలకు పాల్పడి విచారణ ఎదుర్కొంటునట్లు జాతీయ నేర గణాంకాల బ్యూరో తెలియజేస్తోంది.
దేశం లో 1951 నాటి ఎన్‌ఆర్‌సిని సమీక్షిస్తున్న రాష్ట్రం అస్సోం ఒక్కటే కావడం గమనార్హం. కానీ అక్రమ వలసల విషయంలో అస్సోంతో పాటు ఇతర ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ బెంగాల్, ఒడిశా, జమ్మూ కశ్మీర్ కూడా వున్నా వాటి ఎన్‌ఆర్‌సిలను పునఃసమీక్షించాలని ఏ ఒక్క పార్టీ కోరకపోవడం విచిత్రం. అందుకు కారణం ఆయా రాష్ట్రాలలో వలసదారులను మంచి చేసుకొని వారిని తమ ఓటు బ్యాంకుగా మలచుకొనేందుకు ఈ పార్టీలు ప్రయత్నిస్తుండడమే. ఆయా దేశాలలో నెలకొన్న పరిస్థితులను తట్టుకోలేక, అక్కడ తమ ఆస్తిపాస్తులన్నీ వదిలి భారత దేశానికి వచ్చిన వలసదారులు సుమారుగా రెండు కోట్ల వరకు వుండవచ్చునని ప్రభుత్వ గణాంకాలు తెలియజేస్తుండగా వారిని వారి వారి స్వదేశాలకు తిరిగి పంపించే విషయమై ఇప్పటి వరకు అధికారంలో వున్నప్పుడు ఏ ఒక్క పార్టీ ప్రయత్నించ లేదు. వారిని తమ రాజకీయ అవసరాల కోసం స్థానికులతో సమానంగా అన్ని సౌకర్యాలు ఇచ్చి నెత్తిన ఎక్కించుకోవడం వలన సహజంగా స్థానికులు మైనారిటీలుగా మారిపోయినందున పలు ప్రాంతాలలో అలజడులు, ఉద్యమాలు చెలరేగుతున్నాయి.
అక్రమవలసదారుల సంఖ్య పెరిగితే జనాభా పరంగా, శాంతి భద్రతల పరంగా ఎన్నో సమస్యలు తలెత్తుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంతకాలం వారిని యథేచ్ఛగా వుండనిచ్చి ఇప్పుడు పౌరసత్వ జాబితా పునః సమీక్ష పేరిట వారిని పౌరసత్వానికి అనర్హులుగా తేల్చితే వలసదారుల భవితవ్యం ఏమిటనేది ఇప్పుడు ప్రభుత్వం ముందున్న పెద్ద సమస్య. అసలే జనాభా విస్ఫోటనం కారణంగా ప్రపంచంలో రెండవ స్థానంలో వున్న భారతదేశంలో లక్షల కొద్దీ వలసదారులను వుంచుకోగలగడం అసలు సాధ్యమేనా అన్న ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. పరిమిత వనరులు దేశస్థులకే సరిపడకపోతుంటే వలసదారులకు ఎక్కడి నుండి సరిపోతాయో తెలీని విషయం.
వారందరికీ ఓటు హక్కు ఇస్తూపోతే ప్రభుత్వాల భవితను శాసించే స్థితికి వలసదారులు ఎదిగి దేశంలో రాజకీయ సమీకరణలు మారిపోతాయి. ఇందుకు ప్రభుత్వం ముందు వున్న ఒక మంచి పరిష్కారం అమెరికాలోవలె వలసదారులకు వర్క్ పర్మిట్లు జారీ చెయ్యడం. వారికి పని చేసుకొని పొట్ట పోషించుకోవడానికి మాత్రమే అనుమతి కల్పించాలి. వలసదారులను వారి అనుమతి పత్రాలు ఆధారంగా జిపిఎస్ విధానం ద్వారా పర్యవేక్షిస్తూ ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా లేక ధ్రువ పత్రాలు లేకుండా జీవిస్తున్నా వారిపై కఠిన చర్యలు తీసుకునే విధంగా నియమ నిబంధలను జారీ చెయ్యాలి.

*  సి.హెచ్.ప్రతాప్