ఎర్రగడ్డలో రిపీట్ అయిన మిర్యాలగూడ పరువు హత్య

హైదరాబాద్: మిర్యాలగూడలో మారుతీరావు తన బిడ్డ అయిన అమృత భర్త ప్రణయ్‌ని హత్య చేయించిన ఘటన మరవకముందే హైదరాబాద్‌లో మరో ఘటన చోటుచేసుకుంది. సొంత అల్లుడిని సుపారీ ఇచ్చి హత్య చేయించాడు మారుతీరావు. మారుతీరావు సహా నింధితులందరినీ అరెస్టు చేసిన కొద్ది గంటల్లోనే మరో దారుణం హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది. పెద్దలను ఎదిరించి వారం రోజుల క్రితమే ప్రేమ పెళ్లి చేసుకున్న నవ దంపతులపై అమ్మాయి తండ్రి కత్తితో వారిద్దరిపై దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో […]

హైదరాబాద్: మిర్యాలగూడలో మారుతీరావు తన బిడ్డ అయిన అమృత భర్త ప్రణయ్‌ని హత్య చేయించిన ఘటన మరవకముందే హైదరాబాద్‌లో మరో ఘటన చోటుచేసుకుంది. సొంత అల్లుడిని సుపారీ ఇచ్చి హత్య చేయించాడు మారుతీరావు. మారుతీరావు సహా నింధితులందరినీ అరెస్టు చేసిన కొద్ది గంటల్లోనే మరో దారుణం హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది. పెద్దలను ఎదిరించి వారం రోజుల క్రితమే ప్రేమ పెళ్లి చేసుకున్న నవ దంపతులపై అమ్మాయి తండ్రి కత్తితో వారిద్దరిపై దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో అబ్బాయికి తీవ్రగాయాలు కాగా అమ్మాయి పరిస్థితి విషమంగా ఉంది. ఆమె మెడ, చేతులపై బలమైన కత్తిగాట్లు అయ్యాయి. పెళ్లి బట్టలు తీసుకుపోవాలని నమ్మించి ఎర్రగడ్డకు రప్పించి నడిరోడ్డుపై పట్టపగలు అత్యంత కిరాతకంగా దాడికి పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం… బోరబండ వివేకనందనగర్‌కు చెందిన విశ్వబ్రాహ్మణ కులానికి చెందిన మనోహరచారి అమీర్‌పేటలోని గణేష్ జువెలరీ షాప్‌లో పని చేస్తున్నాడు. ఇతని కూతురు మాధవి (20) సనత్‌నగర్‌లోని హిందూ డిగ్రీ కళాశాలో ద్వితీయ సంవత్సరం చదువుతుంది. ఎర్రగడ్డ ప్రేమ్‌నగర్‌కు చెందిన ఎస్‌సి కులానికి చెందిన నవదీప్ అలియాస్ సందీప్ (21) కూకట్‌పల్లిలోని వివేకానంద కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. పదో తరగతి పరీక్షలో వీరిద్దరు పరీక్ష సెంటర్ ఒకే స్కూల్‌లో పడడంతో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి సందీప్, మాధవిలు ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న మాధవి తండ్రి మనోహరచారి పలుమార్లు నవదీప్‌ను మందలించాడు. అయినా వీరి ప్రేమ కొనసాగిస్తునే ఉన్నారు. ఇంతలో మాధవికి తన మేన మామకు ఇచ్చి పెళ్లి చేసేందుకు మనోహరచారి సిద్దమయ్యాడు. దీంతో మాధవి, సందీప్‌లు సెప్టెంబర్ 12వ తేదీన అల్వాల్‌లోని ఆర్యసమాజ్‌లో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. అదే రోజు ఈ నవ దంపతులు తమకు మనోహరచారి కుటుంబ సభ్యుల నుంచి ప్రాణ హాని ఉందని ఎస్‌ఆర్‌నగర్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మనోహరచారితో పాటు అతని కుటుంబ సభ్యులను స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్ చేశారు. అమ్మాయి, అబ్బాయి ఇద్దరు మేజర్లు కావడంతో వారి ఇష్ట పూర్తిగా పెద్దలు నడుచుకోవాలని పోలీసులు సూచించారు. ఆ తరువాత ఎవరి ఇంటికి వారు వెళ్లిపోయారు.

మూడు రోజుల క్రితమే పథకం…
తన కూతురు కులాంతర వివాహం చేసుకుందని మానోహరచారి రగిలిపోయాడు. ఈ క్రమంలోనే మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్య గురించి టివిలో చూసి తాను కూడా సందీప్‌ను ఎలాగైనా హత్య చేసి పగ తీర్చుకోవాలని నిర్ణయించుకొని తన పథకం సక్రమంగా అమలు కావాలంటే ముందుగా నవ దంపతులను నమ్మించి వారికి దగ్గర కావాలని పన్నాగం పన్నాడు. ఈ క్రమంలోనే మూడు రోజుల నుంచి కూతుర్ని మచ్చిగ చేసుకునేందుకు ప్రతి రోజు ఫోన్ చేసి మాట్లాడేవాడు. మనసులో కక్షలు పెట్టుకోవద్దని, త్వరలో గొప్పగా రిసప్షన్ చేస్తామని సందీప్, మాధవిలను నమ్మించాడు. బుధవారం ఉదయం నుంచి పలుమార్లు మనోహరచారి తన కూతురికి ఫోన్ చేసి కొత్త బట్టలు ఖరీదు చేశానని ఫోన్‌లో కూతర్ని నమ్మించాడు. ఈ బట్టలు తాను వచ్చి ఇవ్వలేనని, ఎర్రగడ్డ వరకు వస్తే అక్కడ అందిస్తానని నమ్మబలికాడు. తండ్రి మాటలు నమ్మిన మాధవి తన భర్త సందీప్‌తో కలిసి ఎర్రగడ్డకు మధ్యాహ్నం 3.30 గంటలకు కెనెటిక్ హోండాపై వచ్చారు.

టార్గెట్ సందీప్.. అడ్డుకున్నందుకు కూతురిపై
ఎలాగో అలా నమ్మించి ఎర్రగడ్డకు మాధవి, సందీప్‌లను రప్పించిన మనోహర చారి ముందస్తు ప్రణాళికలో భాగంగానే అక్కడ కాపు కాచాడు. తన బ్యాగ్‌లో కొబ్బరి బొండాలు నరికే కత్తిని పెట్టుకున్నాడు. ఎర్రగడ్డకు మాధవి, సందీప్‌లు వచ్చిన విషయం చూసిన మనోహరచారి తన బైక్‌పై వారి వద్దకు చేరుకున్నాడు. బైక్ పార్క్ చేసి దిగుతు దిగుతునే బ్యాగ్‌లో ఉన్న కత్తిని తీసి డ్రైవింగ్ సీట్లో ఉన్న సందీప్ మెడపై బలంగా నరికాడు. ఈ దెబ్బతో నవదీప్ కింద పడిపోయాడు. మాధవి వెంటనే షాక్ నుంచి కోలుకుని తండ్రిపై దాడి చేసింది. తండ్రిని గట్టిగా పట్టుకోవడంతో ఇద్దరు కింద పడిపోయారు. ఇంతలో కత్తి దెబ్బలకు గాయాలైన నవదీప్ అక్కడి నుంచి పక్కకు పారిపోయాడు. నవదీప్‌ను చంపకుండా అడ్డుకున్నందుకు ఆవేశంతో రగిలిపోయిన మనోహరచారి కూతురిపై కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశాడు. కూతురిపై కత్తితో దాడి చేస్తున్న తరుణంలో మనోహరచారిపై రోడ్డుపై వెళ్తున్న ఓ యువకుడు ధైర్యం చేసి అడ్డుకున్నాడు. ఇంతలో మరికొంత మంది రావడంతో మనోహరచారి అక్కడి నుంచి పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన మాధవి, నవదీప్‌లను స్థానికులు సనత్‌నగర్‌లోని నీలిమా ఆసుపత్రికి తరలించగా అక్కడి వైద్యులు మాధవి పరిస్థితి విషమంగా ఉందాని తెలుపడంతో అక్కడ నుండి సికింద్రాబాద్‌లోని యశోధ ఆసుపత్రికి తరలించారు. భర్తను రక్షించేందుకు తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా మాధవి పోరాడిన్న తీరు అందర్ని కంట తడి పెట్టించింది. సందీప్‌పై మరో కత్తివేటు పడి ఉంటే మాత్రం అక్కడికక్కడే అతడు చనిపోయేవాడు. సందీప్‌పై మరో కత్తిపోటు పడకుండా మాధవి ధైర్యసహాసాలు ప్రదర్శించి ప్రాణాల మీదకు తెచ్చుకుందని స్థానికులు చెప్పారు. దాడి అనంతరం మనోహరచారి ఎస్‌ఆర్‌నగర్ పోలీసుల ఎదుట లోంగిపోయ్యాడు.
బోరబండలో బందోబస్తు…
సందీప్‌పై దాడి చేయడంతో అతని వర్గానికి చెందిన కుటుంబ సభ్యులు, స్నేహితులు మనోహరచారి ఇంటిపై దాడి చేసే అవకాశాలు ఉండడంతో బోరబండలో ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే అబ్బాయి నివాసముంటున్న ప్రేమ్‌నగర్‌లో కూడా పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. యశోధ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాధవి నుంచి పోలీసులు వాంగ్మూలం రాసుకున్నారు. ఈ దాడికి తన తండ్రే కారణమని ఆమె పేర్కొంది.
యశోద డాక్టర్లు మాదవి పరిస్థితి విషమంగా ఉంది. మెడపై బలంగాకత్తితో దాడి చేయడం వల్ల మెదడులకు దారి తీసే నరాలు దెబ్బ తిన్నాయి. ఎడమ చెయ్యిపై నరకడంతో సగభాగం విరిగి పోయి తీవ్రంగా రక్తస్త్రావం అయింది.

Related Stories: