టికెట్లు రాకపోతే స్వతంత్రంగా పోటీ

 కాంగ్రెస్‌కు కేటాయిస్తే అదేపని   టిడిపి నేతల ప్రణాళికలు మన తెలంగాణ/హైదరాబాద్: రానున్న ఎన్నికల్లో టిక్కెట్లను ఆశిస్తున్న పలువురు తెలుగుదేశం నాయకులు అంత్య నిష్ఠూరం కంటే ఆదినిష్ఠూరమే మేలని భావిస్తున్నారు. మహాకూటమిలో భాగంగా టికెట్లు రానిపక్షంలో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయడానికి ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇదే విషయాన్ని టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబుతో పాటు రాష్ట్ర అధ్యక్షులు ఎల్.రమణకు కూడా వారు స్పష్టం చేసినట్లు తెలిసింది. అధికార పార్టీని రానున్న ఎన్నికల్లో ఓడించాలనే […]

 కాంగ్రెస్‌కు కేటాయిస్తే అదేపని

  టిడిపి నేతల ప్రణాళికలు

మన తెలంగాణ/హైదరాబాద్: రానున్న ఎన్నికల్లో టిక్కెట్లను ఆశిస్తున్న పలువురు తెలుగుదేశం నాయకులు అంత్య నిష్ఠూరం కంటే ఆదినిష్ఠూరమే మేలని భావిస్తున్నారు. మహాకూటమిలో భాగంగా టికెట్లు రానిపక్షంలో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయడానికి ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇదే విషయాన్ని టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబుతో పాటు రాష్ట్ర అధ్యక్షులు ఎల్.రమణకు కూడా వారు స్పష్టం చేసినట్లు తెలిసింది. అధికార పార్టీని రానున్న ఎన్నికల్లో ఓడించాలనే లక్షంతో టిడిపి, కాంగ్రెస్, సిపిఐ, తెలంగాణ జన సమితి పార్టీలతో మహాకూటమి ఏర్పాటు దశలో ఉండగానే తెలుగుదేశం నాయకులు కుండబద్దలు కొట్టినట్లు వారి అభిప్రాయాన్ని పార్టీ అధినేతకే స్పష్టం చేయడం గమనార్హం. ఈ నాలుగు పార్టీల పొత్తుకు ప్రధాన అజెండా టిఆర్‌ఎస్‌ను ఓడించడమే. టిఆర్‌ఎస్‌ను ఓడించాలన్న అంశంలో ఈ పార్టీలన్నింటి మధ్యా ఏకాభిప్రాయమే ఉన్నప్పటికీ కానీ టికెట్లు రాకపోతే స్వతంత్రంగా పోటీ చేయక తప్పదనే సంకేతంతో పాటు ఏకాభిప్రాయానికి అవకాశం లేకుండా ఎవరి కుంపటి వారు పెట్టుకునే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. టికెట్ దక్కకపోతే స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగి ప్రజల్లో తమకు ఉన్న బలాన్ని నిరూపించుకుంటామని టిడిపిలోని ఆ నేతలు వ్యాఖ్యానించారు. ఇలాంటి అసంతృప్తులను దృష్టిలో ఉంచుకునే టిడిపి అధిష్టానం 35 సీట్లు ఇవ్వాలని కాంగ్రెస్‌పై ఒత్తిడి పెంచినట్లు సమాచారం. ఇందులో 2014లో టిడిపి అభ్యర్థులు గెలిచిన స్థానాలు 15 కాగా, రెండో స్థానంలో నిలిచినవి మరో 15 ఉన్నాయి. తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడం వల్లనే బిజెపి ఐదు సీట్లు గెలిచిందని, అందువల్ల ఆ సీట్లను కూడా మహాకూటమిలో భాగంగా తమకే కేటాయించాలని ఆ పార్టీ నేతలు కోరుతున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం అన్ని సీట్లు ఇచ్చేందుకు సిద్ధంగా లేదని తెలిసింది. మూడు పార్టీలకు కలిపి ముప్పై సీట్లను కేటాయించాలని కాంగ్రెస్ చూస్తున్నట్లు పసిగట్టిన తెలుగుదేశం ఇదే జరిగి తమకు టికెట్లు రాకపోతే స్వతంత్రంగా పోటీ చేయడంతప్ప మరో మార్గం లేదని టిడిపి నేతలు పేర్కొంటున్నారు. 2014లో టిడిపి తరపున కోదాడ నుంచి పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన బొల్లం మల్లయ్య యాదవ్ కూడా ఇలాంటి అసంతృప్తి నేతల జాబితాలో ఉన్నట్లు సమాచారం. కోదాడలో మంచి పట్టును సంపాదించుకున్న బొల్లం మల్లయ్యకు సామాజిక వర్గం కూడా కలిసి వస్తోందని వాదిస్తున్నారు. క్రితంసారి కాంగ్రెస్ తరఫున పోటీచేసిన పద్మావతి గెలిచినందువల్ల ఈసారి టికెట్‌ను తనకే ఇవ్వాలని బొల్లం పట్టుబడుతున్నట్లు తెలిసింది. ఒకవేళ కాంగ్రెస్‌కు ఇస్తే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు మల్లయ్య యాదవ్ తన ఏర్పాట్లను చేసుకుంటున్నట్లు ఆయన వర్గీయులు పేర్కొంటున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకర్గం నుంచి రేవూరి ప్రకాశ్ రెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నారు. 2014 ఎన్నికలలో ఆయన నర్సంపేట నుంచి పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు. మొదటి స్థానంలో స్వతంత్ర అభ్యర్థి దొంతి మాధవరెడ్డి ఉండగా, రెండో స్థానంలో పెద్ది సుదర్శన్ రెడ్డి ఉన్నారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కత్తి వెంకటస్వామి నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నారు. ఇటీవల టిఆర్‌ఎస్ ఆ స్థానాన్ని మళ్లీ పెద్ది సుదర్శన్ రెడ్డికే కట్టబెట్టింది. కూటమి నుంచి కాంగ్రెస్‌కు కేటాయిస్తే స్వతంత్రగా అభ్యర్థిగా బరిలో దిగేందుకు రేవూరి సిద్ధమైనట్లు సమాచారం. ఇక ఆలేరు నియోజకవర్గం నుంచి మహకూటమిలో భాగంగా టిడిపి తరుపున బండ్రు శోభారాణి టికెట్ ఆశిస్తున్నారు. అయితే ఇదే స్థానానికి గతంలో 2009 నుంచి 2014 వరకు ఎంఎల్‌ఎగా ఉన్న బూడిద భిక్షమయ్య గౌడ్ కాంగ్రెస్ నుంచి టికెట్ కోరుతున్నారు. దాదాపుగా ఈ స్థానం కాంగ్రెస్‌కే ఖరారు చేసినట్లు తెలిసింది. దీంతో శోభారాణి స్వతంత్రంగా వెళితే ఎలా ఉంటుందన్న ఆలోచనలు ప్రారంభించినట్లు సమాచారం. ఖైరాతాబాద్ నుంచి టిఎన్‌టియూసి రాష్ట్ర అధ్యక్షులు టిడిపి నుంచి టికెట్ ఆశిస్తున్నారు. గతంలో పొత్తులో భాగంగా ఈ టికెట్‌ను బిజెపికి కేటాయించగా చింతల రామచంద్రారెడ్డి గెలుపొందారు. రెండో స్థానంలో దానం నాగేందర్ నిలిచారు. అయితే ఇప్పుడు దానం టిఆర్‌ఎస్‌కు వెళ్లిపోవడం, బిజెపితో టిడిపికి తెగదెంపులు కావడంలో బి.ఎన్ రెడ్డి ఈ స్థానాన్ని తనకే కేటాయించాలని పట్టుబడుతున్నారు. అలాగే ఎల్.బి నగర్ నుంచి సామ రంగారెడ్డి టిడిపి టికెట్‌ను అడుగుతున్నారు. గత 2014 ఎన్నికల్లో టిడిపి తరపున పోటీ చేసి గెలిచిన ఆర్.కృష్ణయ్య  ప్రస్తుతం పార్టీ కార్యాకలపాలకు దూరంగా ఉంటున్నారు. 2009 ఎన్నికల్లో ప్రజా రాజ్యం పార్టీ నుంచి పోటీ చేసిన సామ రంగారెడ్డి రెండో స్థానంలో నిలిచారు. కూటమిలో భాగంగా ఈ సీట్లు కాంగ్రెస్‌కు కేటాయిస్తే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో అనుకున్న సీట్లు రాకపోతే టిడిపికి రెబల్స్ బెడద తప్పేలా లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Comments

comments

Related Stories: