పట్టణ నక్సలైట్లు ఎవరు?

భారతీయుల్లో ఇప్పటికీ చాలామంది ఆకలికి అలమటిసున్నప్పుడు, కట్టుకోవడానికి వస్త్రాలు లేని దశలో ఉన్నప్పుడు, తల దాచుకోవడానికి సరైన గూడు లేని వారు ఉన్నప్పుడు, చదువు లేని వారు అపారంగా ఉన్నప్పుడు, వైద్య సహాయం అందుబాటులో లేని వారు ఉన్నప్పుడు, వీటన్నింటికీ కారణం రాజ్యవ్యవస్థ అణచివేత విధానాలు అనుసరించడం అని అనుకున్నప్పుడు, విప్లవాత్మకమైన మార్పు అవసరం అని భావించినప్పుడు చలించకుండా ఉండలేని వ్యక్తి నక్సలైట్. ఈ నిర్వచనం ప్రకారం చూస్తే చాలామంది భారతీయులు నక్సలైట్ల కిందే లెక్క. వారు […]

భారతీయుల్లో ఇప్పటికీ చాలామంది ఆకలికి అలమటిసున్నప్పుడు, కట్టుకోవడానికి వస్త్రాలు లేని దశలో ఉన్నప్పుడు, తల దాచుకోవడానికి సరైన గూడు లేని వారు ఉన్నప్పుడు, చదువు లేని వారు అపారంగా ఉన్నప్పుడు, వైద్య సహాయం అందుబాటులో లేని వారు ఉన్నప్పుడు, వీటన్నింటికీ కారణం రాజ్యవ్యవస్థ అణచివేత విధానాలు అనుసరించడం అని అనుకున్నప్పుడు, విప్లవాత్మకమైన మార్పు అవసరం అని భావించినప్పుడు చలించకుండా ఉండలేని వ్యక్తి నక్సలైట్. ఈ నిర్వచనం ప్రకారం చూస్తే చాలామంది భారతీయులు నక్సలైట్ల కిందే లెక్క. వారు గ్రామీణులైనా, పట్టణ వాసులైనా. 

భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ప్రభుత్వ, హిందుత్వ వాద సాంస్కృతిక ‘జాతీయతా’ ఉద్యమ పైశాచిక అత్యుత్సాహానికి అంతు లేకుండా పోతోంది. హిందుత్వ వాదుల ఆగడాలకు బిజెపి ప్రభుత్వం సకల విధ తోడ్పాటు అందజేయడమే కాక అందులో భాగం అవుతోంది. హిందుత్వవాదానికి శత్రువులైన వారిని రాజ్యం భయోత్పాతానికి గురి చేస్తోంది. తమకు గిట్టని వారిని ‘పట్టణ నక్సలైట్లు’ అన్న ముద్ర వేసి నిర్బంధానికి గురి చేస్తోంది. సాధారణంగా హిందుత్వ వాదుల ఆగ్రహం, ఆక్రోశం ముస్లింలు, సమర శీలమైన అణగారిన వర్గాల మీద, ‘మావోయిస్టుల’ మీద కేంద్రీకృతమై ఉండేది. ఇప్పుడు మానవ హక్కుల కోసం పోరాడే వారిని, కవులను, రచయితలను, పత్రికా రచయితలను, ప్రొఫెసర్లను, మావోయిస్టు పార్టీలో ‘క్రియాశీలురు’ అని తాము అనుకునే వారిని ‘పట్టణ నక్సలైట్లు’ అని ముద్రవేస్తోంది.
ఆగస్టులో నిర్బంధించిన అయుదుగురి మీద చట్టవ్యతిరేక కార్యకలాపాల(నిరోధక)చట్టంతో సహా నేరా ల కిందకు వచ్చే అనేక చట్టాల కింద నేరారోపణ చేశారు. ప్రభుత్వం వేధించదలచుకున్న ఇలాంటి అనేక మందికి చెందిన కార్యాలయాలు, ఇళ్ల మీద దాడులు చేశారు. ప్రభుత్వానికి అమ్ముడు పోయిన మీడియా, ప్రధానంగా కొన్ని టీవీ చానళ్లు ప్రభుత్వం మోపిన ఈ బూటకపు ఆరోపణలకు అమితమైన ప్రచారం ఇచ్చాయి. హక్కుల కోసం పోరాడే వారిని అమ్ముడు పోయిన మీడియా ‘దేశద్రోహుల’ జాబితాలో చేర్చేసింది. వీరు దేశానికి ‘కనిపించని శత్రువులు’ అన్న బిరుదులు కూడా తగిలించింది. వీరివల్ల భారత ప్రజాస్వామ్యానికి తీవ్ర ముప్పు ఉందని, వీరు మావోయిస్టు పార్టీకి మద్దతు ఇస్తున్నారని నిందాప్రచారానికి దిగింది.
ప్రభుత్వం ఇలా ముద్ర వేసిన ‘కనిపించని శత్రువు’ ల జాబితాలో ప్రసిద్ధమైన ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ(ఇ.పి.డబ్ల్యు.)పత్రికలో పనిచేసే జర్నలిస్టు గౌతం నవలఖ కూడా ఉన్నారు. ఆయన 1980లలో ఇ.పి.డబ్ల్యు.లో చేరారు. రజని దేశాయ్, ఎం.ఎస్. ప్రభాకర, కృష్ణరాజ్ వంటి వారితో కలిసి పని చేసేవారు. వీరందరూ ఉత్తమ పత్రికా రచయితలు. ఆ తర్వాత గౌతం ఢిల్లీకి మారినా ఇ.పి.డబ్ల్యు.లో పని చేస్తుండే వారు. ఆయనను సంపాదకవర్గ సలహాదారు అనేవారు. 2006 దాకా ఆ హోదాలోనే కొనసాగారు. పీపుల్స్ యూనియన్ ఫర్ డెమోక్రాటిక్ రైట్స్ తరఫున పౌర హక్కుల కోసం మరింత ఎక్కువ కాలం వెచ్చించడానికి తనను ఇ.పి. డబ్ల్యు. బాధ్యతల నుంచి తప్పించాలని అప్పటి సంపాదకుడు సి.రాం మనోహర్ రెడ్డిని కోరారు. అయినా ఇ.పి.డబ్ల్యు.కు రాస్తూనే ఉండేవారు.
1990ల తర్వాత గౌతం నవలఖ రచనల్లో కొట్టొచ్చిన మార్పు కనిపించింది. ఆయన జమ్మూ-కశ్మీర్ పౌర సమాజ వేదికతో సంబంధాలు పెట్టుకున్నారు. ఆ సంస్థ తరఫున నిజ నిర్ధారణ కమిటీల్లో పని చేశారు. ఆ ఉద్యమంలో తిరిగారు. ఆ నివేదికలు రాసేవారు. ఆయన సత్యాన్వేషి. కాని కశ్మీర్‌లో దిక్కూమొక్కూ లేని వారి గోరీల్లో సత్యం సమాధి అయ్యేది. గౌతం ఇ.పి. డబ్ల్యు.లో, ఇతర పత్రికలలో రాసిన వ్యాసాలు సమాధి అయిన సత్యాన్ని బయటకు తీసే ప్రయత్నమే. జమ్మూ-కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలు, బూటకపు ఎన్‌కౌంటర్లు, సైన్యం ఆగడాలకు ఎలాంటి శిక్షా లేకపోవడం, పోలీసు, సైనికాధికారుల దుశ్చర్యలు మొదలైన వాటినన్నింటినీ గౌతం తవ్వి తీశారు.
దేశంలో అమలవుతున్న ప్రజాస్వామ్యం ఎంత బూటకమైందో గౌతం చూపించారు. నిర్భీతితో ఆయనలా పత్రికా రచయితగా ఉండాలన్నా, మానవ హక్కు ల కోసం పోరాడాలన్నా చాలా ధైర్యం కావాలి. ఒక వైపున ప్రభుత్వం దుష్ప్రచారం, మరోవేపున అమ్ముడు పోయిన మీడియా భీకరంగా దుష్ప్రచారం చేస్తున్న దశలో మరింత ధైర్యం ఉండాలి. దౌర్జన్యకాండలో బాధితులనే దౌర్జన్యకారులుగా చిత్రిస్తున్నారు. అలాంటప్పుడు ఈ ప్రచారానికి లోబడి కోపోద్రిక్తులైన జనం మీరు చెప్పినా వినిపించుకోరు. పార్లమెంటరీ రాజకీయాలలో కూరుకుపోయిన వామపక్ష వాదులు సైతం గౌతం నవలఖా కశ్మీర్ గురించి రాసిన వాటిని తోసిపుచ్చారు. ఆయనను ‘దారి తప్పిన వాడు’ అన్నారు. కాని వాస్తవాలు, హేతుబద్ధతతో ఆయన తనమాటకు కట్టుబడి ఉన్నారు. కాశ్మీర్‌లో జరుగుతున్న దురాగతాలను ఎండగట్టారు.
కమ్యూనిస్టులుగా, సోషలిస్టులుగా ఉన్న వాళ్లు, జాతి, కుల, మత, లింగ వివక్షకు నిరసన తెలియజేయాల్సిందే. ఇది మార్క్సిస్టు-, సోషలిస్టు నీతిలో చాలా కీలకమైన అంశం. మార్క్సిజం అణగారినవర్గాలకు, శ్రామికవర్గాలకు ఉపకరించే సిద్ధాంతం. ప్రధానంగా పేద రైతుల అభ్యున్నతికోసం ఉద్దేశించిన తాత్వికత, మార్క్సిజం అధికారానికి సంబంధించిన తాత్వికత కాదు. అది సమానత్వ సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్నే నవలఖ జీర్ణించుకుని ఆచరించారు. గౌతం నవలఖ సత్యాన్వేషణ ఆయనను ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు ఉద్యమం జరుగుతున్న చోటికి, తీవ్రవాద వ్యతిరేక చర్యల పేర ఆపరేషన్ గ్రీన్ హంట్ పేర తీవ్రమైన అణచివేత కొనసాగుతున్న చోటికి లాక్కెళ్లింది. 2009 నుంచి ఆయన ఈ పని మీదే ఉన్నారు.
సరిగ్గా 1930లలో అమెరికా పత్రికా రచయిత ఎడ్గార్ స్నో చేసిన పనే నవలఖ చేశారు. ఎడ్గార్ స్నో 1938లో ‘రెడ్ స్టార్ ఓవర్ చైనా’ గ్రంథం రాశారు. తాను చూసిన వాస్తవాలను గ్రంథస్థం చేశారు. చైనా ప్రజా విమోచన దళం, చైనా కమ్యూనిస్టు పార్టీ నాయకుల గురించి, ఆ పార్టీ విధానాలు, కార్యకలాపాల గురించి రాశారు. నవలఖ కూడా 2012లో ‘డేస్ అండ్ నైట్స్ ఇన్ ది హార్ట్ లాండ్ ఆఫ్ రెబెలియన్’ గ్రంథంలో ఛత్తీస్ గఢ్ లో తాను మావోయిస్టు గెరిల్లాల కార్యకలాపాల గురించి చూసిన విషయాలు రాశారు. ఈ అంతర్యుద్ధాన్ని గురించి తనకు కలిగిన అవగాహన మేరకు భారత రాజ్యవ్యవస్థ, మావోయిస్టు పార్టీ 1949 నాటి జెనీవా ఒప్పందంలోని 3వ అధికరణాన్ని, అంతర్జాతీయ కలహాలు కాని ఘర్షణలకు సంబంధించిన ఒప్పందాన్ని అమలు చేయాలని ఈ గ్రంథంలో నవలఖ సూచించారు.
మరి ఆయన అర్బన్ నక్సలైట్ ఎలా అయ్యారు? నవలఖ ఆచరణను గమనించినందువల్ల నక్సల్ అన్న పదాన్ని నేను ఇలా నిర్వచిస్తాను. భారతీయుల్లో ఇప్పటికీ చాలామంది ఆకలికి అలమటిసున్నప్పుడు, కట్టుకోవడానికి వస్త్రాలు లేని దశలో ఉన్నప్పుడు, తల దాచుకోవడానికి సరైన గూడు లేని వారు ఉన్నప్పుడు, చదువు లేని వారు అపారంగా ఉన్నప్పుడు, వైద్య సహాయం అందుబాటులో లేని వారు ఉన్నప్పుడు, వీటన్నింటికీ కారణం రాజ్యవ్యవస్థ అణచివేత విధానాలు అనుసరించడం అని అనుకున్నప్పుడు, విప్లవాత్మకమైన మార్పు అవసరం అని భావించినప్పుడు చలించకుండా ఉండలేని వ్యక్తి నక్సలైట్. ఈ నిర్వచనం ప్రకారం చూస్తే చాలామంది భారతీయులు నక్సలైట్ల కిందే లెక్క. వారు గ్రామీణులైనా, పట్టణ వాసులైనా. వారు నా లాంటి వారో, నవలఖ లాంటి వారో. అంతమాత్రం చేత వీరందరూ మావోయిస్టు పార్టీలో సభ్యులూ కానక్కర లేదు. ఆ పార్టీ మద్దతుదార్లూ కానవసరం లేదు.

బెర్నార్డ్ డి మెలో
(ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ సౌజన్యంతో)

Comments

comments