మరో మూడు బ్యాంకుల విలీనం

పెద్దగా ఆలోచించువిజ్ఞతతో వ్యవహరించు అంటారు పెద్దలు. ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉండాలంటే పెక్కు బ్యాంకులకన్నా కొద్దిసంఖ్యలో పెద్దబ్యాంకులు, ప్రపంచస్థాయి బ్యాంకులు ఉండటం మేలని మోడీ ప్రభుత్వం కొంత కాలంగా ఆలోచిస్తోంది. ప్రభుత్వరంగ బ్యాంకులు నిరర్థక ఆస్తుల (తిరిగిరాని రుణాలు) ఊబిలో కూరుకుపోయి గిజగిజలాడుతున్న నేపథ్యంలో బ్యాంక్ ఆఫ్ బరోడా, దేనా బ్యాంక్, విజయాబ్యాంక్‌లను విలీనం చేసి మరో పెద్ద బ్యాంకును రూపొందించాలని నిర్ణయించింది. ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ నేతృత్వంలోని మంత్రుల కమిటీ (ప్రత్యామ్నాయ మెకానిజం) ఈ నిర్ణయాన్ని తమ […]

పెద్దగా ఆలోచించువిజ్ఞతతో వ్యవహరించు అంటారు పెద్దలు. ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉండాలంటే పెక్కు బ్యాంకులకన్నా కొద్దిసంఖ్యలో పెద్దబ్యాంకులు, ప్రపంచస్థాయి బ్యాంకులు ఉండటం మేలని మోడీ ప్రభుత్వం కొంత కాలంగా ఆలోచిస్తోంది. ప్రభుత్వరంగ బ్యాంకులు నిరర్థక ఆస్తుల (తిరిగిరాని రుణాలు) ఊబిలో కూరుకుపోయి గిజగిజలాడుతున్న నేపథ్యంలో బ్యాంక్ ఆఫ్ బరోడా, దేనా బ్యాంక్, విజయాబ్యాంక్‌లను విలీనం చేసి మరో పెద్ద బ్యాంకును రూపొందించాలని నిర్ణయించింది. ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ నేతృత్వంలోని మంత్రుల కమిటీ (ప్రత్యామ్నాయ మెకానిజం) ఈ నిర్ణయాన్ని తమ ప్రతిపాదన రూపంలో ఆ బ్యాంకు బోర్డులకు పంపుతుంది. డైరెక్టర్ల బోర్డులు సానుకూల తీర్మానాలు చేసి పంపిన తదుపరి దానికొక స్కీం తయారు చేసి బ్యాంకింగ్ రెగ్యులేటర్‌కు సమర్పించటం, ఆ తదుపరి పార్లమెంటు ఆమోదం పొందటం వంటి లాంఛనాలు పూర్తికావటానికి 612 మాసాల సమయం పడుతుందని నిపుణుల అంచనా. స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాలో దాని అనుబంధ బ్యాంకులు ఐదింటిని విలీనం చేయటంతో అది అతిపెద్ద బ్యాంక్ అయింది. ప్రైవేట్ బ్యాంక్ ఐసిఐసిఐ రెండవ అతిపెద్ద బ్యాంక్. ప్రతిపాదిత మూడు బ్యాంకులు విలీన మైతే ఆ కోవలో అది మూడవది అవుతుంది. అయితే ఆ మూడింటిలో ఏదైనా బ్యాంకులో మిగతా రెండింటిని విలీనం చేస్తారా లేక మూడింటితో కొత్త బ్యాంకును ఏర్పాటు చేస్తారా స్పష్టతలేదు. దేనా బ్యాంక్ ఇప్పటికే రిజర్వుబ్యాంక్ ఆదేశించిన దిద్దుబాటు చర్యల పరిధిలో ఉంది. మిగతా రెండింటిలో విజయాబ్యాంక్ మాత్రమే 201718లో లాభం ప్రకటించింది. బరోడా బ్యాంక్ పరిస్థితి ఫరవాలేదు. రెండు బలమైన బ్యాంకులతో ఒక బలహీన బ్యాంకును విలీనం చేయటంవల్ల దాన్ని ఆ బ్యాంకులు ఇముడ్చుకోగలుగుతాయి. మూడూ కలిసి పెద్ద బ్యాంకుగా ప్రపంచ పోటీని తట్టుకోగల శక్తిని సంతరించుకుంటాయి అన్నది ఆర్థికమంత్రి తర్కం. విలీనం తదుపరి కొత్త బ్యాంక్ మొత్తం వ్యాపారం రూ.14.82 లక్షల కోట్లు ఉంటుంది; రుణాలు రూ.6.4లక్షల కోట్లు, డిపాజిట్లు రూ.8.41లక్షల కోట్లు ఉంటాయని అంచనా. నిరర్థక ఆస్తుల దామాషా ప్రస్తుత సగటు 12.13 శాతం నుంచి 5.71 తగ్గుతుంది. 9,500 బ్యాంక్ బ్రాంచీలతో 85,675 మంది ఉద్యోగులుంటారు.
బ్యాంక్ పరిమాణం పెద్దగా ఉన్నంతమాత్రాన అది సమర్థవంతంగా పనిచేస్తుందన్న గ్యారంటీ లేదు. అమెరికాలో అతిపెద్ద బ్యాంక్ లెహమాన్ బ్రదర్స్ కుప్పకూలటంతో అమెరికాతోపాటు పలు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలు చతికిలపడ్డాయి. ఒబామా ప్రభుత్వం ప్రభుత్వ సొమ్ము ట్రిలియన్‌ల కొలది గుప్పించి అమెరికన్ బ్యాంకులకు ప్రాణం పోసింది. ఇక్కడ భారత ప్రభుత్వం కూడా ఒకవైపు కొంతశాతం వాటాలను ప్రైవేటు వారికి విక్రయిస్తూ, మరోవైపున అదనపు పెట్టుబడి సమకూర్చుతూ బ్యాంకుల అవసరాలను నెరవేర్చుతున్నది. పెద్దబ్యాంక్ అయినంతమాత్రాన ఈ ఆశ్రిత పెట్టుబడిదారీ విధానంలో బడా కార్పొరేట్లకు ఉదారంగా రుణాలు మంజూరు కావన్న గ్యారంటీ లేదు. బ్యాంకుల ఎన్‌పిఎలు పెరగటానికి అసలు జబ్బు ఆర్థిక వ్యవస్థలో ఉంది. నిలిచిపోయిన అనేక మౌలిక వసతుల ప్రాజెక్టులే ఇందుకు ఉదాహరణ.
అయితే ప్రభుత్వ ఆలోచన భిన్నంగా ఉంది. వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అవసరాలను బలమైన, ప్రపంచవ్యాప్త పోటీతో పనిచేయగల పెద్ద బ్యాంకులే తీర్చగలవని మంత్రుల కమిటీ భావించింది. 20 కి పైగా ఉన్న ప్రభుత్వరంగ బ్యాంకులను ఐదారుకు తగ్గించాలన్న ఆలోచన ప్రభుత్వానికి చాలాకాలం నుంచి ఉంది. అందులో తొలిచర్య ఎస్‌బిఐలో ఐదు అనుబంధ బ్యాంకుల విలీనం. పెద్ద విలువగల కరెన్సీ నోట్ల రద్దు, జిఎస్‌టి సమస్యల్లో ప్రభుత్వం తలమునకలు కావటం వల్ల ఆ క్రమానికి బ్రేకుపడింది. ఎన్‌పిఎలు భారీగా ఉన్న ఐడిబిఎను ఇటీవలనే ఎల్‌ఐసికి అప్పగించింది.
ఎస్‌బిఐలో అనుబంధ బ్యాంకుల విలీనం తదుపరి బ్యాంకింగ్ నిర్వహణ మెరుగైందా? డిపాజిట్లు పెరిగాయా, రుణాల మంజూరు, వసూలు పెరిగిందా? ఎన్‌పిఎలు తగ్గాయా? బ్రాంచీల విస్తరణ జరిగిందా? ప్రభుత్వం ఇటువంటి ప్రగతి రిపోర్టుతో ప్రజలను చైతన్య పరిస్తే బ్యాంకుల విలీనం వెనుక ఉన్న తర్కాన్ని వారు అర్థం చేసుకోగలుగుతారు. బ్యాంకుల వికేంద్రీకరణ బదులు కేంద్రీకరణ విధానాలు సామాన్య ఖాతాదారులకు భారం కాకూడదు.

Comments

comments

Related Stories: