పరువు హత్య పిరికి చేష్ట

మిర్యాలగూడలో పథకం ప్రకారం గావించిన ‘పరువుహత్య’ అత్యంత అమానుషం, కిరాతకం, హృదయవిదారకం. కులాంతర వివాహం చేసుకుందన్న కక్షతో కన్నకూతురు భర్తను కిరాయి ముఠాతో దారుణంగా హత్య చేయించిన తండ్రి మారుతీరావు అనే నడమంత్రపు శ్రీమంతుడికి ఇప్పుడు మిగిలిందేమిటి? తాను అనుకుంటున్న పరువు అతన్నే పరిహసిస్తున్నది. మారుతీరావు అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి తన కూతురు అమృతవర్షిణి ప్రణయ్ కుమార్ అనే స్నేహితుణ్ణి ప్రేమించి పెళ్లి చేసుకోవ టాన్ని సహించలేకపోయాడు. కారణం అతడు దళితుడు కావటమే. గర్భవతి అయిన […]

మిర్యాలగూడలో పథకం ప్రకారం గావించిన ‘పరువుహత్య’ అత్యంత అమానుషం, కిరాతకం, హృదయవిదారకం. కులాంతర వివాహం చేసుకుందన్న కక్షతో కన్నకూతురు భర్తను కిరాయి ముఠాతో దారుణంగా హత్య చేయించిన తండ్రి మారుతీరావు అనే నడమంత్రపు శ్రీమంతుడికి ఇప్పుడు మిగిలిందేమిటి? తాను అనుకుంటున్న పరువు అతన్నే పరిహసిస్తున్నది. మారుతీరావు అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి తన కూతురు అమృతవర్షిణి ప్రణయ్ కుమార్ అనే స్నేహితుణ్ణి ప్రేమించి పెళ్లి చేసుకోవ టాన్ని సహించలేకపోయాడు. కారణం అతడు దళితుడు కావటమే. గర్భవతి అయిన అమృతకు స్థానిక ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకుని బయటకు వచ్చిన ప్రణయ్‌ను వెనుకనుంచి వచ్చిన కిరాయి హంతకుడు కత్తితో మెడపై నరికిచంపిన దారుణం హృదయాలను ద్రవింపచేసే దృశ్యం. ఆదివారంనాడు ప్రణయ్ అంతిమయాత్రకు కులాలకతీతంగా తరలివచ్చిన వేలాదిజనం మానవతకు నిలువెత్తు నిదర్శనం. క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం ప్రణయ్ పార్థివ దేహాన్ని ఖననం చేశారు. ఆ శ్మశాన వాటిక కులోన్మాది మారుతీరావు ఇంటికి సమీపంలోనే ఉందట. ప్రణయ్ సమాధి నిత్యం అతడి నేరాన్ని గుర్తుచేస్తూ ఉంటుంది!

ప్రణయ్, అమృతవర్షిణి జనవరి 30న హైదరాబాద్‌లో వివాహం చేసుకున్నారు. తన కుమార్తె జాడ తెలియటం లేదని మారుతీరావు మిర్యాలగూడ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. మార్చినెలలో పట్టణం తిరిగి వచ్చిన దంపతులు డిఎస్‌పిని కలిసి, తాము ప్రేమించి పెళ్ళి చేసుకున్నట్లు, కులాలు వేరైనందున అమృత తల్లిదండ్రులనుంచి ప్రమాదం ఉన్నట్లు తెలియజేశారు. వెంటనే మారుతీరావును పిలిచి కౌన్సెలింగ్ చేసిన డిఎస్‌పి, ఆ తదుపరి పలు మార్లు ఇరుపక్షాలకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇటువంటి వివాహాల్లో ఆరంభంలో కొట్లాడుకునే కుటుంబాలు తర్వాత రాజీపడటం సహజమని, అయినా తాము రెగ్యులర్‌గా దంపతులను హెచ్చరిస్తూ, రావుపై నిఘాపెట్టినట్లు పోలీసులు తెలిపారు. పోలీసు సలహాపై ప్రణయ్ ఇంటివద్ద సిసి కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. అయినా మారుతీరావు పగతీర్చుకున్నాడు.

కులాంతర వివాహాల విషయంలో హర్యానా, రాజస్థాన్ వంటి వెనుకబడిన రాష్ట్రాల్లో ఖాప్(కుల)పంచాయతీలు నిర్వహించటం, శిక్షలు విధించటం వంటి ఘటనల వార్తలను అప్పుడప్పుడూ మనం చదువుతుంటాం. కాని మన రాష్ట్రంలో కూడానా! అని విస్మయం చెందాల్సిన పరిస్థితి వచ్చింది. సమాజం ఎంతో పురోగమించిందని చెప్పుకుంటున్నాం. కాని కులం వ్రేళ్లు మరింతగా వేళ్లూనుకున్నాయని మరిచిపోయాం. అదేదో రాజకీయాలు, ఓట్లు, సీట్లకు పరిమితం కాలేదు. సామాజిక వ్యవస్థలో ఘనీభవించింది. అక్రమమో, సక్రమమో ఆస్తులు కూడబెడుతున్నారు. సమాజంలో పెద్ద మనుషుల్లాగా చెలామణీ అవుతున్నారు. రాజకీయంగా పలుకుబడి సంపాదిస్తున్నారు. ఇదంతా మనిషి బాహ్య స్థితి. కాని తరతరాలుగా మస్తిష్కంలో గూడుకట్టుకున్న కులగజ్జి బలోపేతమవుతున్నదే గాని, మనస్సు విశాలం కావటం లేదు. కులాంతర వివాహం చేసుకుంటే దంపతుల్లో ఒకరికి ఉద్యోగమిచ్చి ప్రభుత్వం ఒకప్పుడు ప్రోత్సహిస్తుండేది. మరోవైపున సాంఘిక సంస్కరణోద్యమం మచ్చుకైనా కానరాదు. తద్భిన్నంగా ఛాందసవాద ప్రచారం హోరెత్తుతోంది. మొత్తంగా సమాజం మితవాదం వైపు తిరోగమిస్తున్నది.

ప్రణయ్ హత్య ఒక ఉందంతం మాత్రమే. మూర్ఖత్వం బలపడుతున్న సమాజంలో ఇటువంటివి ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరికైనా జరగవచ్చు. ప్రణయ్‌ను హత్యచేయిస్తే తన కూతురు తన వద్దకు తిరిగి వస్తుందని మారుతీరావు భావించాడని చెప్పబడుతున్నది. పిచ్చి భ్రమ! ఇవాళ ఆడపిల్లలు కూడా ఉన్నత విద్య లార్జిస్తూ విరివిగా ఉద్యోగాల్లోకి వస్తున్నారు. ఈ ప్రయాణంలో స్నేహాలు ఏర్పడతాయి, ప్రేమగా పరిణమిస్తాయి,కొన్ని పెళ్లిదాకా వెళతాయి. కాని తల్లిదండ్రులు కూపస్థమండూకాల్లా తమ బూజుపట్టిన బుర్రలతోనే ఆలోచించినపుడు ఇటువంటి పరువు హత్యలకు ఒడిగట్టి కటకటాలపాలై బతుకును దుఃఖభాజనం చేసుకుంటారు. చిరువ్యాపారి అయిన మారుతీరావు కొన్ని దశాబ్దాల్లోనే కోటీశ్వరుడైనాడు. అతనికి రాజకీయ సంబంధాలు కూడా మెండుగా ఉన్నట్లు సమాచారం. అందువల్ల పోలీసు లు ప్రలోభాలపాలు కాకుండా ఈ హత్య కుట్రదారులను, కిరాయి హంతకులను, వారికి తోడ్పడినవారినీ పట్టి పకడ్బందీ ఆధారాలతో న్యాయస్థానం ముందు నిలబెట్టి కఠినంగా శిక్షింపజేయాలి.