యుక్త వయస్సు పిల్లలను అర్థం చేసుకోండి!

ప్రస్తుత ప్రపంచంలో  చాలామంది యుక్త వయసు పిల్లలు తల్లిదండ్రుల పర్యవేక్షణలో పెరగడం లేదు.  పిల్లలను 6 వ తరగతిలోనే వసతి గృహాలకు పంపిస్తున్నారు. పిల్లల భవిష్యత్తు బాగుండాలనే హాస్టల్లో  వేశామని తల్లిదండ్రులు గర్వంగా చెప్పుకునే రోజులివి. పిల్లలు, తల్లిదండ్రులకు ఎంత దూరంగా ఉండి చదివితే అంత గొప్పోడుగా మారతాడని  ఆలోచన. ప్రస్తుత పోటీ ప్రపంచంలో  పిల్లాడికి 98% మార్కులు వచ్చినా 2% మార్కులు ఎందుకు తగ్గాయో విశ్లేషణ చేసుకోవాలని సూచించే తల్లిదండ్రుల సంఖ్య పెరిగిపోతూ ఉంది. ఒకప్పటి  […]

ప్రస్తుత ప్రపంచంలో  చాలామంది యుక్త వయసు పిల్లలు తల్లిదండ్రుల పర్యవేక్షణలో పెరగడం లేదు.  పిల్లలను 6 వ తరగతిలోనే వసతి గృహాలకు పంపిస్తున్నారు. పిల్లల భవిష్యత్తు బాగుండాలనే హాస్టల్లో  వేశామని తల్లిదండ్రులు గర్వంగా చెప్పుకునే రోజులివి. పిల్లలు, తల్లిదండ్రులకు ఎంత దూరంగా ఉండి చదివితే అంత గొప్పోడుగా మారతాడని  ఆలోచన. ప్రస్తుత పోటీ ప్రపంచంలో  పిల్లాడికి 98% మార్కులు వచ్చినా 2% మార్కులు ఎందుకు తగ్గాయో విశ్లేషణ చేసుకోవాలని సూచించే తల్లిదండ్రుల సంఖ్య పెరిగిపోతూ ఉంది. ఒకప్పటి  బాల్యంకన్నా, ప్రస్తుత బాల్యం,  వీళ్లు పెరుగుతున్న వాతావరణంలో చాలా మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తల్లిదండ్రులూ మీ పిల్లల భవిష్యత్తుకోసం జర ఆలోచించండి ..

యుక్తవయస్సులోని పిల్లలు వారి సమీప వ్యక్తుల వల్ల ఎక్కువగా ప్రభావితమైనప్పటికీ, చివరిగా వారు ఆ చర్యకు పాల్పడాలో  లేదో అనే అంతిమ నిర్ణయం మాత్రం వారి చేతిలోనే ఉంటుంది. స్నేహితుల ద్వారా కలిగే ప్రవర్తనలను సమర్థవంతంగా ఎదుర్కొనడానికి ఎటువంటి ప్రత్యేక వ్యూహాలు లేవు, కాని దానికి కొంత మానసిక  పరిపక్వత అవసరం. మీ స్నేహితులు ఆ పని చేయడం సరైనదే అని చెప్పినప్పటికీ, మీకు నిజంగా ఆ పని సమాజ ఆమోదయోగ్యమా కాదా అనే విషయాన్ని తమలో తాము ప్రశ్నించుకోవాలి.   

పిల్లల్లో పెరుగుతున్న కొద్దీ వారిలో శారీరక మార్పులు జరుగుతూ ఉంటాయి. అంతే స్థాయిలో మానసిక పరిపక్వత అభివృద్ధ్ది జరుగుతూ ఉంటుంది. శారీరక మార్పు అనేది బయటకు కన్పిస్తుంది. కాని మానసిక పరిపక్వత అనేది వారి చేష్టలు, మాటలు, స్పందించే తీరు, వివిధ సందర్భాల్లో వారి ప్రవర్తన తీరును పరిశీలన ద్వారా తెలుసుకోవచ్చు. పిల్లల ప్రవర్తనా తీరును అర్థం చేసుకోవడం ప్రస్తుత పరిస్థితులలో తల్లిదండ్రులకు చాలా కష్టంగా మారుతోంది. మారుతున్న కాలానుగుణంగా తల్లిదండ్రుల ఆలోచనా విధానాలలో మార్పు వస్తున్నప్పటికీ పిల్లల పెంపకంపై, వారి కోసం కేటాయించే సమయం, శ్రద్ధ తగ్గుతున్నట్లుగా సర్వేలు ఘోషిస్తున్నాయి.

అమాయకపు వయసు (Age of innocence) : యుక్త వయసు, ప్రారంభ వయోజన వయసు చాలా అమాయకపు వయస్సుగా చెప్పవచ్చు. ఈ వయసులో ఉన్న పిల్లలకు ఏదైనా విషయం అర్థం చేసుకోవడం, తెలుసుకోవాలి అనే కోరిక బలంగా ఉంటుంది. ఆ సమయంలో వారి ప్రతి అనుభవం ఎక్కువగా స్నేహితుల ద్వారానే కలుగుతూ ఉంటాయి. ఈ వయసులో పిల్లలు వారి పరిసరాల్లో ఉన్న స్నేహితులు, వ్యక్తులు, అంశాలతో వారి భవిష్యత్తు రూపుదిద్దబడుతుంది. జీవితంలో ఇది తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది.

వారిని అర్థం చేసుకోండి

యుక్త వయస్సు పిల్లలు ఎదుగుతున్న క్రమంలో వారి వయసు పిల్లలు, స్నేహితులు ఎలాంటి పనులు చేస్తూ ఉంటారో అలాంటి పనులనే వీరూ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. వారి ప్రవర్తనను అనుకరించడం, వారిలాగా డ్రెస్సింగ్ చేసుకోవడం, మ్యూజిక్ వినడంలో, ప్రత్యేక మైన హీరోల సినిమాలు చూడటంలో ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. ఒకవేళ భిన్నంగా ప్రవర్తిస్తే వారితో స్నేహం దూరం అవుతుంది అనే ఒత్తిడి కూడా ఉంటుంది. ఆ గ్రూప్ ఫ్రెండ్స్ లాగానే తనూ ప్రవర్తిస్తూ ఉండాలే తప్ప తనకు వేరే మార్గం ఉండదు.

స్నేహం అనుకూలమా?
స్నేహితులతో మా పిల్లవాడు చెడ్డమార్గంలో వెళ్తాడేమో అనే భావన కలిగే తల్లిదండ్రుల సంఖ్య గరిష్టంగానే ఉంటుంది. కాని వాస్తవానికి అది చాలా వరకు సానుకూల ప్రభావాన్నే చూపుతుందనే విషయాన్ని గుర్తించడం లేదు. యుక్తవయసు పిల్లలు తల్లిదండ్రులతో గడిపే సమయం కంటే స్నేహితులతో గడిపే సమయం ఎక్కువ. చదువుకు సంబంధించిన విషయాలలో ఎలాంటి సందేహమున్నా తన స్నేహితుల ద్వారానే తీర్చుకునే ప్రయత్నం చేస్తాడు. తనకు సంబంధించిన సందేహాలను స్నేహితులకు స్వేచ్ఛగా తెలుపగలుగుతాడు. సమాజంపై అవగాహన పెంచుకోవడానికి, చదువులో ఉత్తమ గ్రేడ్‌లను సాధించడానికి, కొత్తకొత్త నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడానికి, తన భవిష్యత్తు కోసం బాటలు వేసుకోవడానికి తోటి వారి సహాయం తీసుకుంటాడు.

స్నేహం ప్రతికూలమా?
కొన్ని సందర్భాల్లో యుక్తవయసులోని పిల్లలు వాళ్ల ఫ్రెండ్స్ గ్రూప్ లో ఉండడానికి మాత్రమే ప్రవర్తన, వస్త్రధారణను అనుసరిస్తూ ఉంటారు. వారికి ఇష్టం లేకపోయినా చేసే ఈ ప్రవర్తన వలన పిల్లలు తీవ్ర ఒత్తిడికి గురవుతారు,

వయసు ప్రభావం:
యుక్తవయస్సులోని పిల్లలు తరచూ ఎదురయ్యే పరిస్థితులకు అతి తొందరగా ప్రతిస్పందిస్తారు. స్పందన వల్ల ఎదురయ్యే పర్యవసానాలను పట్టించుకొనే అవకాశం తక్కువ. తొందరగా ఫలితం అనుభవించాలనే ఆలోచన ఉంటుంది. శోధించాలి, సాధించాలి అనే తపన ఎక్కువగా ఉండడం వల్ల చాలాసార్లు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ వయసులో ఎంత మంచి ఉంటుందో అంతకంటే తీవ్రంగా చెడ్డ పర్యవసానాలు కూడా ప్రభావాన్ని చూపిస్తాయి.

ధూమపానం, మద్యపానం, మాదకద్రవ్యాల వాడకం వంటి కొన్ని సామాజిక ప్రవర్తనలు, చిన్న వయస్సులోనే లైంగిక కార్యాచరణల్లో పాల్గొనడం వంటి వాటిని ఎక్కువగా తోటివారి ఒత్తిడి వల్ల ప్రయత్నిస్తారు. తన ఫ్రెండ్స్ అందరూ చేస్తున్నారు కాబట్టి నేను చేయాలని, అద్భుతంగా ఉంటుందనే తప్పుడు భావన వల్ల సంభవిస్తుంది. తన ఫ్రెండ్స్ చెప్పిన మాటలను వినడం, నేర్చుకోవడం అనేవి మానవ నైజం. ఈ వయసులో మంచి చెడుల గురించి ఆలోచించడం చాలా తక్కువగా ఉంటుంది.

తల్లిదండ్రులూ గైడెన్స్ ఇవ్వాలి
యుక్తవయసులోని పిల్లల ప్రవర్తనను తరచూ తల్లిదండ్రులు ఒక కంట కనిపెడుతూ ఉండాలి. తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపిస్తే స్నేహితుల మాయలో పడిపోతారు. పిల్లలు మంచి మార్గం కంటే ఎక్కువగా చెడు మార్గం ఎంచుకునే ప్రమాదం ఉంటుంది. యుక్తవయస్సు ప్రారంభంలోనే సరైన రీతిలో తల్లిదండ్రుల గైడెన్స్ చేసినట్లయితే వారు తోటివారి ఒత్తిడిని సానుకూలంగా మలుచుకోగలరు. సమస్యలను తనకు తానుగా సాధించలేనప్పుడు, తల్లిదండ్రులు తమ వెంటే ఉన్నారనే భరోసాను పిల్ల వాడిలో కల్పించాలి.

సన్మార్గంలో నడవాలంటే …..
యుక్తవయస్సులోని పిల్లలు వారి సమీప వ్యక్తుల వల్ల ఎక్కువగా ప్రభావితమైనప్పటికీ, చివరిగా వారు ఆ చర్యకు పాల్పడాలో లేదో అనే అంతిమ నిర్ణయం మాత్రం వారి చేతిలోనే ఉంటుంది. స్నేహితుల ద్వారా కలిగే ప్రవర్తనలను సమర్థవంతంగా ఎదుర్కొనడానికి ఎటువంటి ప్రత్యేక వ్యూహాలు లేవు,

కాని దానికి కొంత మానసిక పరిపక్వత అవసరం. మీ స్నేహితులు ఆ పని చేయడం సరైనదే అని చెప్పినప్పటికీ, మీకు నిజంగా ఆ పని సమాజ ఆమోదయోగ్యమా కాదా అనే విషయాన్ని తమలో తాము ప్రశ్నించుకోవాలి. అవసరమైతే స్నేహితులతో మన మంచి భవిష్యత్తు కోసం లేదు, వద్దు, కాదు, అలా చేయకూడదు అనే పదాలను చెప్పడం నేర్చుకోవాలి.
ఇత రులు అవును అని చెప్పిన అన్నింటికీ మీరు కూడా అవును చెప్పాలనే నియమం ఏమీ లేదు. సొంత ఆలోచనలు, సొంత ప్రవర్తన, ఇష్టమైన వ్యక్తులతోనే స్నేహం చేయడానికి ప్రయత్నించండి.

ఇతరులను ఆకర్షించడానికి, వారి ఆమోదం పొందడానికి తప్పుడు మార్గంలో వెళ్లరాదని గుర్తుంచుకోండి. మంచి స్నేహంతో జీవితంలో అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తారు.