అపవిత్ర పొత్తు

అతి జుగుప్సాకరం : కాంగ్రెస్, టిడిపి మైత్రిపై కెటిఆర్ వ్యాఖ్య  తెలంగాణకు ద్రోహం చేసిన రెండు పార్టీలు ఒక్కటయ్యాయి. రైతు శత్రు పార్టీలు ఒకవైపు, రైతుబంధు టిఆర్‌ఎస్ మరోవైపు. ఆ రెండు పార్టీలకు ఒకేసారి బుద్ధి చెప్పే అవకాశం ప్రజలకు లభించింది – మంత్రి కెటిఆర్  కెసిఆర్ అపార అనుభవం రాష్ట్రాభివృద్ధికి గణనీయంగా ఉపయోగపడింది. నాలుగేళ్లలో విశేష ప్రగతిని చూశాం. ఆ ప్రగతి చక్రానికి బ్రేకులు పడొద్దనే టిఆర్‌ఎస్‌లో చేరుతున్నా. – కెఆర్ సురేశ్‌రెడ్డి మన తెలంగాణ/ […]

అతి జుగుప్సాకరం : కాంగ్రెస్, టిడిపి మైత్రిపై కెటిఆర్ వ్యాఖ్య 

తెలంగాణకు ద్రోహం చేసిన రెండు పార్టీలు ఒక్కటయ్యాయి. రైతు శత్రు పార్టీలు ఒకవైపు, రైతుబంధు టిఆర్‌ఎస్ మరోవైపు. ఆ రెండు పార్టీలకు ఒకేసారి బుద్ధి చెప్పే అవకాశం ప్రజలకు లభించింది
– మంత్రి కెటిఆర్ 

కెసిఆర్ అపార అనుభవం రాష్ట్రాభివృద్ధికి గణనీయంగా ఉపయోగపడింది. నాలుగేళ్లలో విశేష ప్రగతిని చూశాం. ఆ ప్రగతి చక్రానికి బ్రేకులు పడొద్దనే టిఆర్‌ఎస్‌లో చేరుతున్నా.
– కెఆర్ సురేశ్‌రెడ్డి

మన తెలంగాణ/ హైదరాబాద్ : కాంగ్రెస్, టిడిపిలది నీచమైన, అపవిత్ర కలయిక, జుగుప్సాకరమైన పొత్తు అని మంత్రి కెటిఆర్ అభివర్ణించారు. తెలంగాణకు ద్రోహం చేసిన రెండు పార్టీలూ మళ్ళీ ఒకటయ్యాయని విమర్శించారు. ఇద్దరు గడ్డపొళ్ళు కలిసి (చంద్రబాబునాయుడు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి) రాష్ట్రంలో మళ్ళీ కుటిల రాజకీయాలకు తెరతీస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్‌లో వివిధ జిల్లాలకు చెందిన పలువురు కాంగ్రెస్, బిజెపి నాయకులు మంత్రి కెటిఆర్ సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరారు. మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డి, మాజీమంత్రి నేరేళ్ళ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యేలు బిరుదు రాజమల్లు, కోడూరు సత్యనారాయణగౌడ్, మాజీ వ్యవసాయ కమిటీ చైర్మన్ ఆకారపు భాస్కర్‌రెడ్డి, ఉప్పల్ కాంగ్రెస్ నియోజకవర్గం ఇన్‌ఛార్జ్ బండారు లక్ష్మారెడ్డి తదితరులు వారి మద్దతుదారులతో కలిసి పెద్దఎత్తున వచ్చి గులాబీకండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి మంత్రి కెటిఆర్ ప్రసంగిస్తూ, కాంగ్రెస్, టిడిపిల కలయి క, అవకాశవాద రాజకీయాలంటూ మండిపడ్డా రు. కాంగ్రెస్, టిఆర్‌ఎస్ పాలనలో రైతులను రాబందుల్లా పీల్చుకుతిన్నారని విమర్శించారు. సాగునీరు లేక, కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియక పెద్దఎత్తున రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని పేర్కొన్నారు.

కరెంటు కోసం ఆందోళన లు చేస్తే టిడిపి, కాంగ్రెస్ హయాంలో రైతులపై పోలీసుల తూటాలను కురిపించిన నీచ చరిత్ర వారిదని కెటిఆర్ నిప్పులు చెరిగారు. టిడిపి, కాంగ్రెస్ పాలనలో రైతులు పడరాని పాట్లు పడ్డారని, కానీ టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత రైతులను రైతుబంధు పథకంతో గుండెల్లో పెట్టుకుని చూస్తున్నామన్నారు. దురదృష్టవశాత్తూ ఏదైనా కారణంతో రైతులు మరణిస్తే వారి కుటుంబాలను ఆదుకునేందుకు ఐదు లక్షల రూపాయల బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్న ఏకైక ప్రభుత్వం టిఆర్‌ఎస్ అని వ్యాఖ్యానించారు. రైతుల ప్రాణాలను పీల్చిపిప్పి చేసిన అరవై ఏళ్ల రాబందుల పాలన కావాలో లేక రైతు సంక్షమమే ధ్యేయంగా పనిచేస్తున్న టిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని కోరుకుంటా రో తెలంగాణ ప్రజలు తేల్చుకునే సమయం వచ్చిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాలన్న లక్షంతో దివంగత మాజీ ముఖ్యమం త్రి ఎన్‌టి రామారావు తెలుగుదేశం పేరుతో పార్టీ ని స్థాపిస్తే, చంద్రబాబునాయుడు తన స్వార్ధ రాజకీయాల కోసం కాంగ్రెస్‌కు, టిడిపిని తోకపార్టీగా మార్చారని దుయ్యబట్టారు. రెండు పార్టీలు పొత్తు పెట్టుకోవడం సంతోషంగా ఉందని, ఇద్దరిని ఒకేసారి వాయించి కొట్టే సువర్ణ అవకాశం తెలంగాణ ప్రజలకు లభించిందన్నారు.

టిఆర్‌ఎస్‌కు మరోసారి మద్దతు తెలిపి తెలంగాణ గల్లీ దిక్కు చూద్దామా? లేక అపవిత్ర కూటమికి మద్దతు పలికి మరోసారి ఢిల్లీకి గులామ్‌లు అవుదామో ప్రజలు తేల్చుకునే పరిస్థితి ఆసన్నమైందన్నారు. ఉద్యమాలు, త్యాగాలతో సాధించుకున్న రాష్ట్రాన్ని ఆకుపచ్చ తెలంగాణాగా మార్చాలన్నదే ముఖ్యమంత్రి కెసిఆర్ లక్షమన్నారు. తెలంగాణ కోటి ఎకరాల మాగాణం కావాలన్న ఆశయంతోనే కెసిఆర్ నీటి ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలని టిఆర్‌ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంటే పనిలేని, అసమర్ధ, చేవలేని ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకులు తరుచూ ఆరోపణలు చేయడం అలవాటుగా మారిందన్నారు. నీటి ప్రాజెక్టులపై 186 కేసులు వేసి అడుగడుగునా అడ్డుతగలారని మండిపడ్డారు. అందుకే ప్రజా కోర్టును మించిందని లేదని భావించే కెసిఆర్ అసెంబ్లీని రద్దు చేశారన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్దమంటూ సవాల్ విసురుతున్న ప్రతిపక్షాలు ఎన్నికల కమిషన్‌కు మాత్రం ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించవద్దంటూ వినతి పత్రాలను ఎందుకు ఇస్తున్నాయని కెటిఆర్ ప్రశ్నించారు. ఎన్నికలు అంటే అధికార పార్టీకి భయం ఉండాలిగానీ ప్రతిపక్షాలు ఎందుకు వణికిపోతున్నాయో అర్ధం కావడం లేదని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా త్వరలో జరిగే ఎన్నికల్లో మళ్ళీ టిఆర్‌ఎస్ ఘన విజయం సాధించడం ఖాయమని, వేదికపైనున్న తాజీ మాజీలంతా తిరిగి ఎన్నికవ్వడం తథ్యమన్నారు.

తెలంగాణ వాదానికి సురేష్‌రెడ్డి అండగా నిలిచారు
అసెంబ్లీ స్పీకర్‌గా సురేష్‌రెడ్డి ఉన్నప్పుడు సభలో తాము ఎమ్మెల్యేలుగా ఉన్నామని మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. అప్పుడు సభకు సంబంధించిన నియమాలపై సురేష్‌రెడ్డి నుంచి ఎంతో నేర్చుకున్నామమన్నారు. ఆయ న స్పీకర్‌గా ఉండి తెలంగాణవాదానికి అండగా నిలిచారన్నారు. సురేష్‌రెడ్డితో పాటు పార్టీలో చేరుతున్న ఇతర నాయకుల అనుభవం ఖచ్చితంగా టిఆర్‌ఎస్‌కు ఉపయోగపడుతుందన్నారు. కొండగట్టు ఘటనతో సిఎం కెసిఆర్ కలత చెందారని, ఈ పరిస్థితుల్లో సభకు రావద్దని సురేష్‌రెడ్డి తదితరులు సూచించడంతోనే రాలేదన్నారు. త్వరలోనే కెసిఆర్ నిజమాబాద్‌లో పర్యటిస్తారని తెలిపారు.

వివాదాలకు దూరంగా ఉండే వ్యక్తి
అందరికి ఇష్టుడైన సురేష్‌రెడ్డి టిఆర్‌ఎస్‌లో చేరడం చాలా సంతోషంగా ఉందని మరో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. పైగా ఆయన వివాదాలకు దూరంగా ఉండే వ్యక్తి అని వ్యాఖ్యానించారు. కెసిఆర్ నేతృత్వంలో సాగుతున్న రాష్ట్ర ప్రగతికి తన వంతు చేయూతనందించేందుకు సురేష్‌రెడ్డి పార్టీలో చేరడం ఆనందంగా ఉందని అన్నారు. కాంగ్రెస్ కూటమికి ఓటేస్తే దొంగలు, దొంగలు ఊళ్ళు పంచుకున్నట్లుగా తెలంగాణ మారుతుందన్నారు.

అన్ని స్థానాలపై గులాబీ జెండా ఎగురవేస్తాం
నిజామాబాద్‌లోని తొమ్మిదింటింకి తొమ్మిది స్థానాలను టిఆర్‌ఎస్ గెలుస్తుందని ఎంపీ కవిత ధీమా వ్యక్తం చేశారు. 2014 ఎన్నికల తీర్పు మరోసారి నిజామాబాద్‌లో పునరావృతం కాబోతోందన్నారు. సురేష్‌రెడ్డి చేరికతో పార్టీ బలం మరింత పెరిగిందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను పార్టీ కార్యకర్తలు పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్ళాలని ఆమె పిలుపునిచ్చారు.

తెలంగాణ అభివృద్ధికి కెసిఆర్ ఓ దైవ ప్రసాదం
తెలంగాణ అభివృద్ధికి కెసిఆర్ ఓ దైవ ప్రసాదం లాంటివారని టిఆర్‌ఎస్ పార్టీ లోక్‌సభ నాయకుడు, సెక్రటరీ జనరల్ కె. కేశవరావు అభివర్ణించారు. గత అరవై సంవత్సరాలలో జరగని అభివృద్ధి కేవలం నాలుగున్న సంవత్సరాల్లో కెసిఆర్ చేసి చూపించారన్నారు. అతి తక్కువ సమయంలోనే దేశంలో మన రాష్ట్రాన్ని అగ్రభాగాన కెసిఆర్ నిలబెట్టారన్నారు. సురేష్‌రెడ్డిది తాతాల నుంచి రాజకీయ కుటుంబమన్నారు. ఆయన చేరికతో టిఆర్‌ఎస బలం మరింత పెరిగిందన్నారు. నిజామాబాద్ జిల్లా అం తటా మరోసారి గులాబీ జెండాఎగరడం తథ్యమన్నారు.

కెసిఆర్ అనుభవంతోనే అభివృద్ధి
కెసిఆర్‌కున్న అపార అనుభవంతోనే తెలంగాణ కేవలం నాలుగేళ్ళలోనే గణనీయమైన ప్రగతిని సాధించిందని మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఆ ప్రగతి చక్రానికి బ్రేక్‌లు పడొద్దన్న ఉద్దేశ్యంతోనే కెసిఆర్ ఆహ్వానం మేరకు టిఆర్‌ఎస్‌లో చేరాన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను దృ-ష్టిలో పెట్టుకునే మూడు దశాబ్దాల రాజకీయ అనుబంధం ఉన్న పార్టీనీ, వందేళ్ళ చరిత్ర గల కాంగ్రెస్‌ను వీడాల్సి వచ్చిందన్నారు. కెసిఆర్‌తో తనకు 1989 నుంచి మంచి పరిచయంఁ ఉందన్నారు. ఆయన సలహాలను అప్పటి నుంచి తీసుకుంటూనే ఉన్నానన్నారు. తెలంగాణ రాష్ట్రం త్యాగాలతో ఏర్పడిందని, అందువల్ల రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలనే తాను గులాబీ కండువా కప్పుకున్నానని సురేష్‌రెడ్డి తెలిపారు. పార్టీకీ తన సలహాలు ఉపయోగపడుతాయని భావిస్తున్నాన్నారు. అభివృద్ధి కోసం వేగంగా పరుగెడుతున్న రేసు గుర్రం టిఆర్‌ఎస్ అని వ్యాఖ్యానించారు. కొన్ని కూటములు కేవలం అవకాశవాదంతోనే ఏర్పాడుతున్నాయని విమర్శించారు. తెలంగాణ ప్రజలు వాటిని ఆమోదించరని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు కుస్తీ పోటీల్లో పాల్గొన్నట్లుగా ప్రతీ రోజు తిట్లే పరమాధిగా పనిచేస్తున్నాయని విమర్శించారు. వారు ఎన్నివిధాలుగా కుటిల ప్రయత్నాలు చేసినా వచ్చే ఎన్నికల్లో టిఆర్‌ఎస్ ఘన విజయం సాధించడం ఖాయమన్నారు. కెసిఆర్ నేతృత్వంలో తెలంగాణ మరింతగా అభివృద్ధి చెందడం తథ్యమన్నారు.

కొండగట్టు మృతులకు సంతాపం : కొండగట్టు మృతులకు సంతాపంగా సమావేశం ప్రారంభం కావడానికి ముందు రెండు నిమిషాల పాటు నాయకులు మౌనం పాటించి శ్రద్దాంజలి ఘటించారు.

Related Stories: