మద్దతు ధరకు హామీ

రైతుకు కనీస మద్దతుధర అందేలా పిఎం-ఆశ విధానానికి కేంద్రమంత్రి వర్గం ఆమోదం రెండు ఆర్థిక సంవత్సరాలకు రూ. 15,053 కోట్లు కేటాయింపు న్యూఢిల్లీ: రైతాంగానికి కనీస మద్దతు ధరకు భరోసా కల్పించే నూతన సేకరణ విధానానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రూ 15,053 కోట్ల వ్యయంతో కూడిన ప్రధాన మంత్రి అన్నదాత, ఆయ్ సంరక్షణ్ అభియాన్ (పిఎం ఆశ) ఏకీకృత విధానాన్ని అమలులోకి తీసుకురావాలని నిర్ణయించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేబినెట్ […]

రైతుకు కనీస మద్దతుధర అందేలా పిఎం-ఆశ విధానానికి కేంద్రమంత్రి వర్గం ఆమోదం
రెండు ఆర్థిక సంవత్సరాలకు రూ. 15,053 కోట్లు కేటాయింపు

న్యూఢిల్లీ: రైతాంగానికి కనీస మద్దతు ధరకు భరోసా కల్పించే నూతన సేకరణ విధానానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రూ 15,053 కోట్ల వ్యయంతో కూడిన ప్రధాన మంత్రి అన్నదాత, ఆయ్ సంరక్షణ్ అభియాన్ (పిఎం ఆశ) ఏకీకృత విధానాన్ని అమలులోకి తీసుకురావాలని నిర్ణయించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేబినెట్ భేటీలో ఈ వినూత్న విధాన నిర్ణయానికి ఆమోదముద్ర దక్కింది. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఈ నూతన సేకరణ విధానానికి రూపకల్పన చేశారు. రైతాంగానికి కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) కల్పించడం ఈ విధాన నిర్ణయంలో కీలక అంశం. ఈ పాలసీలో రెండు పథకాలు ఇమిడి ఉన్నాయి. నూనెగింజల రైతులకు అమ్మకం ధరలు ఎంఎస్‌పికి తక్కువగా ఉన్నట్లు అయితే వారికి నష్ట పరిహారం కల్పించేలా చేయ డం ఇందులో మొదటి పథకం.

ఇక రైతుల పంటల సేకరణకు రాష్ట్రాలు ప్రైవేటు సంస్థలకు అవకాశం కల్పించేందుకు అనుమతిని ఇవ్వడం రెండో పథకం అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి రైతాంగానికి సముచిత గిట్టుబాటు ధరలను కల్పించేందుకు పరిహార పథకం, దానితో పాటు అవసరం అయితే ప్రైవేటు సంస్థలను రంగంలోకి దించడం వంటి ప్రత్యామ్నాయాలను రాష్ట్రాలు ఎంచుకునేందుకు ఈ నూతన విధానంతో వీలేర్పడుతుంది. రైతాంగానికి సముచిత రీతిలో కనీస మద్దతు ధరలు కల్పించేందుకు పూర్తి స్థాయి భద్రతాయుత వ్యవస్థను ఖరారు చేయడం జరుగుతుందని ఈ ఏడాది బడ్జెట్‌లో కేంద్రం తెలిపిందని ఈ మేరకు ఇప్పుడు నూతన విధానం రూపొందించామని వ్యవసాయ మంత్రి రాధా మోహన్ సింగ్ తెలిపారు. ఈ నూతన విధానం కోసం కేటాయించిన మొత్తం రూ 15,053 కోట్లను వచ్చే రెండు ఆర్థిక సంవత్సరాలలో వెచ్చిస్తారు.

ఇందులో ఈఏడాది రూ రూ 6250 కోట్లు ఖర్చు చేస్తారని వ్యవసాయ మంత్రి వివరించారు. ఇది కాకుండా ఆహార ధాన్యాల సేకరణ సంస్థలకు రుణ విధానంలో పెంపుదల చేపట్టారు. అదనంగా రూ 16,550 కోట్ల ప్రభుత్వ గ్యారంటీని కల్పించాలని నిర్ణయించారు. దీనితో ఈ మొత్తం ఇకపై రూ 45,500 కోట్లకు చేరుతుందని వ్యవసాయ మంత్రి తెలిపారు. రైతాంగానికి గిట్టుబాటు ధరలలో న్యాయం కల్పించేందుకు సరైన విధివిధానాలను కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ, రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించి తగు సూచనలు ఇవ్వాలని నీతి ఆయోగ్‌ను ఆదేశించారు. వ్యవసాయ మంత్రిత్వశాఖ వారు అన్నదాత మౌల్య సంరక్షణ యోజన పేరిట నూతన సేకరణ విధానాన్ని ప్రతిపాదించిందని అధికార వర్గాలు తెలిపాయి. ఇప్పుడు కేబినెట్ పిఎం ఆశాగా ఆమోదించింది.
ధాన్యాల సేకరణలో రాష్ట్రాలకు వెసులుబాట్లు
ఈ నూతన విధానం పరిధిలో రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు సరైన ఎంఎస్‌పి దక్కేందుకు అనువైన అన్ని ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవచ్చు. కనీస మద్దతు ధరలను కల్పించేందుకు బహుళ పథకాలను ఎంచుకోవచ్చు. ఇక నూతన సేకరణ విధానంలోని రెండో నూతన పథకం ‘ తక్కువ ధరల భర్తీ చెల్లింపు (పిడిపి)’ని మధ్యప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన భవాంతర్ భూగ్టన్ యోజన (బిబివై) తరహాలో రూపొందించారు. దీని మేరకు కేవలం చమురుగింజల రైతులకు ధరల భద్రత ఏర్పడుతుంది. ఈ పిడిపి పథకంలో భాగంగా టోక్ మార్కెట్‌లో చమురుగింజల నెలవారీ సగటు ధరలకు, మద్దతు ధరలకు ఉండే తేడాలను గుర్తించి ఆ మేరకు చెల్లింపులు చేపడుతారు. 13000 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ విద్యుద్ధీకరణ దేశంలో మిగిలిన 13వేల కిలోమీటర్ల రైల్వేట్రాక్ విద్యుద్ధీకరణ పనులను చేపట్టే పథకానికి కేంద్ర మంత్రి మండలి నిర్ణయించింది. రైల్వే ట్రాక్‌ల విద్యుద్ధీకరణలో ఇది చివరి మజిలీ. ప్రధాని అధ్యక్షతన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో దీనికి ఆమోదం లభించింది. ప్రస్తుతం బ్రాడ్‌గేజ్ సెక్షన్‌లో 108 సెక్షన్స్‌లలో పనులు పెండింగ్‌లో ఉన్నాయి. 13,675 కిలోమీటర్ల మార్గం అంటే 16,540 ట్రాక్ కిలోమీటర్ల పరిధిలో జరిగే ఈ పనుల సంపూర్తికి రూ 12,134.5 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఈ పనులు 202122 నాటికి పూర్తి అవుతాయని భావిస్తున్నారు.
ఇథనాల్ ధరలు రూ 52.43గా ఖరారు
చెరకు రైతుకు ప్రయోజనం కల్గించే రీతిలో పెట్రోలులో ఇథనాల్ వాడకం పెంపు ప్రోత్సాహదిశలో ఉన్న కేంద్రం ఇథనాల్ ధరను ఇప్పుడున్న రూ 47.49 పైసల నుంచి రూ 52.43కు పెంచింది. ఇక దేశంలో నాలుగు నేషనల్ ఇనిస్టూట్ ఆఫ్ డిజైన్ (ఎన్‌ఐడిలకు) ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా విజయవాడ, జోర్‌హట్, కురుక్షేత్ర, భోపాల్‌లలో వీటిని ఏర్పాటు చేస్తారు. ఇక విజయవాడలోని ఎన్‌ఐడికి జాతీయ ప్రాధాన్యత గల విద్యాసంస్థగా గుర్తింపును ఇచ్చింది. దీని పేరును ఎన్‌ఐడి అమరావతిగా మార్పు చేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.

Comments

comments

Related Stories: