‘టు ప్లస్ టు’ ఏమి సాధించాం?

ఎట్టకేలకు అమెరికాతో టు ప్లస్ టు ( ఇద్దరిద్దరు) చర్చలు ముగిశాయి. న్యూఢిల్లీలో జరిగిన ఈ చర్చల్లో గొప్ప ఫలితాలేమీ ముందుకు రాలేదు. టు ప్లస్ టు చర్చల్లో పాల్గొన్న నలుగురు మంత్రుల్లో ఎవ్వరు కూడా చర్చల తర్వాత జరిగిన క్లోజింగ్ రిమార్కుల్లో రష్యా పేరెత్తలేదు. కనీసం ఇరాన్ పేరు కూడా ప్రస్తావించలేదు. అయితే మీడియాతో సమావేశాల్లో ఈ రెండు దేశాలకు సంబంధించి మాట్లాడుకున్న వివరాలు కొన్ని చెప్పారు. అమెరికా ఇండియా సంబంధాల్లో రక్షణ సహకారం అనేది […]

ఎట్టకేలకు అమెరికాతో టు ప్లస్ టు ( ఇద్దరిద్దరు) చర్చలు ముగిశాయి. న్యూఢిల్లీలో జరిగిన ఈ చర్చల్లో గొప్ప ఫలితాలేమీ ముందుకు రాలేదు. టు ప్లస్ టు చర్చల్లో పాల్గొన్న నలుగురు మంత్రుల్లో ఎవ్వరు కూడా చర్చల తర్వాత జరిగిన క్లోజింగ్ రిమార్కుల్లో రష్యా పేరెత్తలేదు. కనీసం ఇరాన్ పేరు కూడా ప్రస్తావించలేదు. అయితే మీడియాతో సమావేశాల్లో ఈ రెండు దేశాలకు సంబంధించి మాట్లాడుకున్న వివరాలు కొన్ని చెప్పారు. అమెరికా ఇండియా సంబంధాల్లో రక్షణ సహకారం అనేది చాలా కీలకమైనది. రెండు దేశాల మధ్య సంబంధాల్లో రక్షణ వ్యవహారాలు ప్రాముఖ్యాన్ని రక్షణ మంత్రి నిర్మలా సితారామన్ కూడా చెప్పారు. రక్షణ రంగానికి సంబంధించి రెండు ముఖ్యమైన ప్రకటనలు ఈ సందర్భంగా చేశారు. ఇందులో మొదటిది భారతదేశం అమెరికాకు సంబంధించిన యుఎస్ కమ్యునికేషన్స్ సెక్యురిటీ మెమొరాండం ఆఫ్ అగ్రిమెంట్ (COMCASA)పై సంతకాలు చేయడానికి సంబంధించింది. రెండవ ప్రకటన 2019లో త్రివిధ దళాలు భారత తూర్పుతీరాన చేసే మిలిటరీ కసరత్తులకు సంబంధించింది.

ఇందులో మొదటి ప్రకటన వల్ల భారతదేశం అమెరికా నుంచి అత్యున్నత స్థాయి కమ్యునికేషన్ సామాగ్రిని పొందడం తేలిక అవుతుంది. అయితే మనం అడిగిన వెంటనే అమెరికా ఆ సామాగ్రి ఇవ్వవలసిన అవసరం లేదు. అలాగే అమెరికా తనకున్న గ్లోబల్ నెట్ వర్క్ ద్వారా సేకరించిన విస్తారమైన సమాచారం ఈ ఒప్పందం వల్ల మనకు అందుబాటులోకి కూడా రాదు. ఈ సమాచార మార్పిడి అవసరమైనప్పుడు, అవసరమైన మేరకు బదిలీ చేయడం జరుగుతుంది. ఈ ఒప్పందం వల్ల మనకున్న ఒకే ఒక్క సౌలభ్యం ఏమంటే, అమెరికాకు చెందిన అత్యుత్తమ కమ్యునికేషన్ పొందడంలో ఇబ్బందులు ఉండవు. ఇక త్రివిధ దళాల కసరత్తులకు సంబంధించి ఇది కీలకమైన పరిణామమే. 1990 తర్వాతి నుంచి అమెరికాతో మన సంబంధాలు కొత్త దశలోకి ప్రవేశించాయి. దానికి కొనసాగింపుగానే ఇదంతా జరుగుతోంది. ఇందులో ముఖ్యమైన విషయం ఈ కసరత్తులు భారత తూర్పుతీరాన జరుగుతాయి. బహ్రెయిన్ లో ఉన్న అమెరికా సెంట్రల్ కమాండ్ నావల్ సెంటరులో భారత సమన్వయాధికారి ఒకరు దీని కోసం పనిచేస్థారు.

ఈ చర్చల తర్వాత న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంలో అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపియో మాట్లాడుతూ రష్యా నుంచి భారతదేశం యస్-400 క్షిపణులు కొనే విషయమై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అన్నాడు. రెండు దేశాలకు అనుకూలమైన నిర్ణయాన్ని చర్చల ద్వారా సాధించవచ్చని మాత్రం ఒక ఆశావాదాన్ని ప్రకటించే మాట చెప్పాడు. అంతేకాదు, భారతదేశం వంటి వ్యూహాత్మకంగా కీలకమైన భాగస్వామ్య దేశాన్ని ఇబ్బందుల పాలు చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటామని ఒక భరోసా ఇచ్చాడు. కాని, యస్-400 క్షిపణులకు సంబంధించి”కౌంటరింగ్ అమెరికాస్ ఎడ్వర్సరీస్ థ్రూ శాంక్షన్స్ యాక్ట్‌“ లేదా CAATSA చట్టం ద్వారా ఇండియాపై చర్యలను తీసుకోరాదని ట్రంప్ ఒకవేళ నిర్ణయించినా, ఈ వ్యవహారం భారతదేశానికి భవిష్యత్తులో కూడా తలనొప్పి వ్యవహారమే. ఎందుకంటే ఇండియా రక్షణ సామాగ్రి 60 శాతానికి మించి రష్యా నుంచే వస్తుంది. రానున్న దశాబ్దాల్లో ఇది కొంత తగ్గవచ్చేమో కాని పూర్తిగా తగ్గదు. రష్యా నుంచి భారీ కొనుగోళ్ళు చేయరాదని భారతదేశం నిర్ణయించినప్పటికీ కొన్ని కొనుగోళ్ళు తప్పవు. అమెరికా తన ఆంక్షలను అమలు చేయడానికి రూపొందించిన ఈ చట్టం చాలా కఠినమైనది. ఇందులో సెక్షన్ 231 ప్రకారం రష్యాతో రక్షణ రంగానికి లేదా ఇంటిలిజెన్స్ రంగానికి సంబంధించి ఎలాంటి లావాదేవీలు జరిపినా అలాంటి దేశంపై ఆంక్షలు విధించవచ్చు. అంటే మన వద్ద ఉన్న రష్యా నుంచి కొన్న రక్షణ సామాగ్రికి సంబంధించి స్పేర్ పార్టులు కొన్నా ఇది వర్తిస్తంది. సెక్షన్ 235 పరిశీలిస్తే, రష్యా, ఇండియా సంబంధాలను పూర్తిగా దెబ్బతీసే సెక్షన్ ఇది. చెల్లింపులు, లావాదేవీలను అమెరికా ఆర్ధిక వ్యవస్థతో లంకె పెట్టే వ్యవహారం ఇది. అన్ని డాలర్ లావాదేవీలు దీని కిందికి వస్తాయి.

రెండవ సమస్య ఇరాన్ కుసంబంధించింది. మన చమురు అవసరాలు చాలా వరకు ఇరాన్ నుంచి వచ్చే చమురుపై ఆధారపడి ఉన్నాయి. ఇరాన్ మనకు దగ్గరగా ఉంది. అందువల్ల చమురు రవాణా ఖర్చు తగ్గుతుంది. ఈ విషయంలో ఇండియాకు మినహాయింపుల గురించి ఎలాంటి సమాచారము లేదు. ఈ సమస్య కూడా భారతదేశానికి ఆందోళన కలిగించే సమస్య. ఇరాన్ తో సంబంధాలు కేవలం చమురు కొనుగోలుకు మాత్రమే పరిమితం కాదు. ఈ ప్రాంతంలో భారతదేశం ప్రాముఖ్యతను కూడా నిర్దేశించే అంశం. ఈ ప్రాంతంలో వ్యూహాత్మకంగా ఇండియా విధానాలను నిర్దేశించే అంశం. అఫ్గనిస్తాన్; ఇరాన్, మధ్యాసియాలకు సంబంధాలు మెరుగు పరచుకోడానికి చాబహార్ పోర్టు చాలా కీలకమైనది. పాకిస్తాన్ తో సంబంధం లేకుండా ఈ దేశాలతో సంబంధాలకు ఈ పోర్టు అవసరం.

ఇరాన్ నుంచి చమురు దిగుమతి చేసుకునే దేశాలకు నవంబరు 4వ తేదీ డెడ్ లైన్ అని ఆ తర్వాత ఆంక్షలు అమలు చేస్తామని పాంపియో అన్నాడు. ఈ విషయంలో ఇండియాకు ఎలాంటి మినహాయింపుల సమాచారం లేదు. అయితే రెండు దేశాలకు అనుకూలమైన ఫలితాల కోసం ప్రయత్నిస్తున్నామని మాత్రం చెప్పాడు.ఈ సమస్యలున్నప్పటికీ టు ప్లస్ టు చర్చలు ఇరు దేశాల మధ్య పటిష్టమైన సంబంధాలను సూచిస్తున్నాయి. చైనా అధ్యక్షుడితోను, రష్యా అధ్యక్షుడితోను మోడీ సమావేశమైనప్పటికీ అమెరికాతో సంబంధాలకు ప్రాముఖ్యం ఉంది. ఇండియాకు ట్రంప్ కూడా ప్రాముఖ్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇండో పసిఫిక్ ప్రాంతాన్ని యూరప్, మధ్యాసియాల కన్నా ఎక్కువగా అమెరికా జాతీయ భద్రత వ్యూహకర్తలు పరిగణిస్తున్నారు. ఇండియా ప్రధాన రక్షణ భాగస్వామి హోదాలో ఉంది.

హెచ్ 1బి విసాలకు సంబంధించిన సమస్య ఉన్నప్పటికీ భారత విద్యార్థులు అమెరికా వెళుతూనే ఉన్నారు. దేశంలో అమెరికా కంపెనీలు గొప్ప వ్యాపారం చేస్తూనే ఉన్నాయి. వాల్మార్ట్, అమెజాన్ వంటి కంపెనీలు భారతదేశంలో పెద్ద పెద్ద ప్రణాళికలు రచిస్తున్నాయి. వాణిజ్యానికి సంబంధించిన కొన్ని సమస్యలున్నప్పటికీ దిగుమతి సుంకాల సమస్యలున్నప్పటికీ, అమెరికా నుంచి విమానాలు, ఇంధన ఉత్పత్తులు దిగుమతి చేసుకోవడం ద్వారా భారతదేశం దీన్ని అధిగమించ వచ్చని పాంపియో అన్నాడు. స్టీల్ అండ్ అల్యుమినియంకు సంబంధించి ట్రంప్ విధానాల వల్ల నష్టపోయే దేశాల్లో ఇండియా కూడా ఉంది. ఏటా 1.5 బిలియన్ డాలర్ల స్టీలు, అల్యుమినియం అమెరికాకు మనం ఎగుమతి చేస్తున్నాం. ఇండియా దిగుమతి సుంకాల విషయంలో బెదిరించింది కాని చివరి నిముషంలో మనసు మార్చుకుంది. హార్లే డేవిడ్ సన్ మోటారు సైకిళ్ళు, వైద్య పరికరాల విషయంలో దిగుమతి సుంకాలపై అమెరికా ఆగ్రహంతో ఉంది. ఈ సమస్యలన్నీ టు ప్లస్ టులో ప్రస్తావనకు వచ్చాయా? సమాచారం తెలియదు.

ప్రజాస్వామ్యం తదితర ఉమ్మడి విలువల గురించి ప్రసంగాలను పక్కన పెడితే ఆచరణాత్మకంగా అమెరికా కోరేది ఈ ప్రాంతంలో ఇండియా సుస్థిరమైన దేశంగా ఉండడం. అమెరికా రక్షణ మంత్రి మాటిస్ మాటల్లో చెప్పాలంటే ఈ ప్రాంతంలో స్థిరత్వాన్నిచ్చే శక్తిగా కొనసాగడం. ఇండో పసిఫిక్ ప్రాంతం, పశ్చిమ భాగంలో భారతదేశం ఒక కీలకమైన దేశంగా ఉపయోగపడాలన్నదే అమెరికా ఆలోచన.                                                                                                            – మనోజ్ జోషీ (ది క్వింట్)