‘సభ’ రద్దు కారణం ఇపుడు స్పష్టం

ఆ విధంగా మొత్తం మీద, అసెంబ్లీని తొమ్మిది మాసాల ముందే రద్దు పరచటమనే ఆశ్చర్యకరమైన నిర్ణయం వెనుకగల కారణాలు ఏమిటో స్వయంగా ముఖ్యమంత్రి మాటలలోనే మనకు తెలియవచ్చింది. తాను చెప్పిన కారణాలను కాంగ్రెస్, తదితర ప్రతిపక్షాలు ఆమోదించబోవని వేరే చెప్పనక్కరలేదు. వాటిని కొట్టి వేస్తూ వారు సహజంగానే తమ వాదనలు తాము చేస్తారు. ఇరు పక్షాల మాటలను వినే ప్రజలు ఎవరి అభిప్రాయాలకు వారు వస్తారు. ఇక ఇంతటితో ఎన్నికల భేరీలు మోగినట్లే గనుక ఆ ప్రచారాలు, […]

ఆ విధంగా మొత్తం మీద, అసెంబ్లీని తొమ్మిది మాసాల ముందే రద్దు పరచటమనే ఆశ్చర్యకరమైన నిర్ణయం వెనుకగల కారణాలు ఏమిటో స్వయంగా ముఖ్యమంత్రి మాటలలోనే మనకు తెలియవచ్చింది. తాను చెప్పిన కారణాలను కాంగ్రెస్, తదితర ప్రతిపక్షాలు ఆమోదించబోవని వేరే చెప్పనక్కరలేదు. వాటిని కొట్టి వేస్తూ వారు సహజంగానే తమ వాదనలు తాము చేస్తారు. ఇరు పక్షాల మాటలను వినే ప్రజలు ఎవరి అభిప్రాయాలకు వారు వస్తారు. ఇక ఇంతటితో ఎన్నికల భేరీలు మోగినట్లే గనుక ఆ ప్రచారాలు, ఈ వాదనలు కలగలిసిపోయి తెలంగాణను సుమారు మూడు మాసాలపాటు హెరెత్తించనున్నాయి. 

తెలంగాణ శాసనసభను ముఖ్యమంత్రి కెసిఆర్ కొన్ని నెలలు ముందుగానే ఎందువల్ల రద్దు చేయిస్తున్నారనే ప్రశ్న, గురువారం నాడు ఆయన మీడియా సమావేశంతో స్పష్టమైంది. ఆ రోజు మధ్యాహ్నం 2 గంటల 50 నిముషాలకు ఆయన మీడియా సమావేశం ఆరంభమయే సరికి సభ రద్దు జరిగిపోయింది. గవర్నర్ నరసింహన్ ఆ మేరకు నోటిఫికేషన్ జారీ చేశారు కూడా. ఆ లాంఛనం ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి తెలంగాణ భవన్‌లో మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ, కాంగ్రెస్ తదితర ప్రతిపక్షాల “కాకిగోల” వల్ల అభివృద్ధి కుంటుపడరాదనే ఉద్దేశంతోనే మమూలు గడువు కన్న ముందుగా ఎన్నికలకు పోతున్నట్లు స్పష్టం చేశారు.

ఇదే విషయాన్ని కెసిఆర్ పలు మాటలతో పదేపదే వ్యాఖ్యాన సహితంగా వివరించటాన్ని బట్టి, ప్రతిపక్షాల ధోరణి తనకు ఎంత చికాకుగా మారిందో, అది చివరకు అసెంబ్లీనే రద్దు పరచి ముందుగా ఎన్నికలకుపోయేట్లు ఎట్లా చేసిందో అర్థం చేసుకోవచ్చు. తన మాటలను ఒకసారి గమనించండి. ముఖ్యమంత్రి చెప్పిన దాని ప్రకారం, తెలంగాణను 1956 నుంచి మొదలుకొని దగా చేయటమేగాక ఆంధ్ర ప్రాంతంతో బలవంతంగా విలీనం చేసింది, ఇక్కడ అభివృద్ధి సరిగా జరగకుండా అడ్డుపడింది కాంగ్రెస్ పార్టీ.
అటువంటి నేపథ్యంలో ప్రజలు ఉద్యమించి రాష్ట్రాన్ని తెచ్చుకుంటే ప్రాజెక్టులు వగైరాలపై కుప్పలుగా కేసులు వేసి అభివృద్ధికి అడ్డుపడుతున్నది అదే పార్టీ. తెలంగాణవంటి సరికొత్త రాష్ట్రాన్ని, వెనుకబడిన ప్రాంతాన్ని శాయశక్తులా కృషి చేసి మొత్తం దేశంలోనే అగ్రగామి మార్గంలో తమ ప్రభుత్వం నడిపిస్తున్నది. సంక్షేమంతోపాటు మధ్యంతర అభివృద్ధి, దీర్ఘకాలక అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు ఇక్కడి ప్రజల నుంచే గాక జాతీయ , అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందుతున్నాయి. సరిగా ఈ రోజే (సెప్టెంబర్ 5న) సుప్రసిద్ధ ఆర్థిక పత్రిక ఎకనమిక్ టైమ్స్ గ్రూపు తనకు తెలంగాణ ముఖ్యమంత్రిగా ‘బిజినెస్ రిఫార్మర్’ అవార్డును ప్రకటించింది.

పరిస్థితి ఇది కాగా, తాము ఇన్నేళ్ల కాంగ్రెస్ వైఫల్యాలను క్రమంగా సరిదిద్దుకుంటూ పోతుండగా (అట్లా దిద్దుతున్నవి ఏమిటో ముఖ్యమంత్రి కొన్ని అంశాలను పేర్కొన్నారు). కాంగ్రెస్ “కాకిగోల” వల్ల అభివృద్ధి కుంటుపడే ప్రమాదం ఏర్పడుతున్నది. వారి ధోరణి ఒక “అంతులేని మూర్ఖత్వం” వలె తయారైంది. అభివృద్ధి కోసం అధికారులు, ముఖ్యంగా నీటి పారుదల శాఖ వారు, అర్ధరాత్రి వరకు కష్టపడి పని చేస్తున్నారు. వీరి తీరువల్ల అధికారుల స్థైర్యం దెబ్బతినే పరిస్థితి కనిపిస్తున్నది. దీనిని “మేము నిరోధించ దలచుకున్నాము” అన్నారాయన.

తెలంగాణ ప్రజల కోసం ఈ పని చేయవలసి వస్తున్నదని కూడా చెప్పారు. అసెంబ్లీ రద్దు వల్ల ప్రతిపక్షాలకు నష్టం ఏమీ లేదని, తామే త్యాగం చేస్తున్నామని, పదవీ కాలం నష్టపోతున్నది తామేనని అన్నారు. ఈ మాటలన్నీ చెప్తున్నపుడు కెసిఆర్ భాషలో, హావభావాలలో కన్పించిన పరుషత్వాన్ని టివి ఛానళ్లు చూసిన వారు గమనించే ఉంటారు. దానిని బట్టి ముఖ్యంగా కాంగ్రెస్ తీరుపట్ల ఆయన ఎంత విసుగెత్తి ఉంటారో గ్రహించవచ్చు. ఆ వేగంలో ఆయన కాంగ్రెస్‌ను తెలంగాణ ప్రజలకు “మొదటి విలన్‌” గా అభివర్ణించారు. ఆ మాట తను గతంలోనూ అన్నదే. ఈసారి మరింత తీవ్రంగా అన్నట్లు తోచింది. ఈ పద్ధతిలో రాష్ట్రంలో రాజకీయం ఇటీవల “అతి” గా సాగుతున్నదని, అది సరికాదని కూడా అన్నారాయన.

ఆ విధంగా మొత్తం మీద, అసెంబ్లీని తొమ్మిది మాసాల ముందే రద్దు పరచటమనే ఆశ్చర్యకరమైన నిర్ణయం వెనుకగల కారణాలు ఏమిటో స్వయంగా ముఖ్యమంత్రి మాటలలోనే మనకు తెలియవచ్చింది. తాను చెప్పిన కారణాలను కాంగ్రెస్, తదితర ప్రతిపక్షాలు ఆమోదించబోవని వేరే చెప్పనక్కరలేదు. వాటిని కొట్టి వేస్తూ వారు సహజంగానే తమ వాదనలు తాము చేస్తారు. ఇరు పక్షాల మాటలను వినే ప్రజలు ఎవరి అభిప్రాయాలకు వారు వస్తారు. ఇక ఇంతటితో ఎన్నికల భేరీలు మోగినట్లే గనుక ఆ ప్రచారాలు, ఈ వాదనలు కలగలిసిపోయి తెలంగాణను సుమారు మూడు మాసాలపాటు హెరెత్తించనున్నాయి. రానున్న రెండు మూడు వారాలలో వివిధ పార్టీల ఎన్నికల మేనిఫెస్టోలు కూడా విడుదలైనపుడు ప్రజలకు విని ఆలోచించేందుకు చాలానే ఉంటుంది.

అదట్లా ఉంచి, ముఖ్యమంత్రి వ్యాఖ్యల దృష్టా కాంగ్రెస్ నాయకత్వం ఆత్మ పరిశీలన చేసుకోవలసిన విషయాలు కొన్నున్నాయి. అధికార రాజకీయాలలో విమర్శలు, ఆరోపణలు సహజమేగాని, అదే సమయంలో విమర్శకులు ఒకటి రెండింటిని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవటం అవసరం వారి మాటలు సాధారణ ప్రజలకు వెగటు పుట్టించే విధంగా ఉండకూడదు. ప్రజలకు వాస్తవాలు చెప్పి, సహేతుకమైన విమర్శలు చేసి, వారి విశ్వాసాన్ని పొందగలిగే విధంగా ఉండాలి. అది జరగనపుడు కేవలం తీవ్రమైన ఆరోపణలు, విమర్శలు కాదు గదా, ఆకాశాన్ని అంటేంత హామీలు ఇచ్చినా ప్రయోజనం ఉండదు. ప్రజలు ఎంత మాత్రం స్వానుభవాలు, స్వంత ఆలోచనలు లేనివారని భావించటం పొరపాటు.కాని రాష్ట్రంలో కాంగ్రెస్‌తో పాటు ఇతర ప్రతిపక్షాలు అన్నీ ప్రజలను తక్కువ అంచనా వేస్తున్నాయి. నిజంగానే అతిగా వ్యవహరిస్తున్నాయి. ఇది వాటికే నష్టదాయకం.

మీడియా సమావేశంలో కెసిఆర్ స్పష్టం చేసినవి, చెప్పినవి మరికొన్ని ముఖ్యమైనవి ఉన్నాయి. తాము ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పనివి సైతం 76 కార్యక్రమాలు అమలు పరుస్తున్నామన్నది వాటిలో ఒకటి. భూ రికార్డుల ప్రక్షాళన, రైతుబంధు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి ముఖ్యమైనవి కూడా వాటిలో ఉన్నాయని పేర్కొన్నారాయన. తమ విమర్శలు, ఆరోపణల క్రమంలో ప్రతిపక్షాలు విస్మరించి తమకు తాము నష్టం చేసుకుంటున్నవి, ప్రజల నమ్మకం పోగొట్టుకుంటున్నవి ఇటువంటివే. ఉదాహరణకు ఇటువంటి కార్యక్రమాలు ప్రజల ప్రశంసలను బాగా పొందుతున్నాయి. కాని, ప్రతిపక్షాలు అధికారం కోసం ఆతురతలో ఇటువంటి వాటిని కూడా విమర్శిస్తున్నాయి. ప్రజలందరూ మంచి అంటున్న వాటిని తాము కూడా మెచ్చగల సహృదయత లేకపోగా, వాటిపై దుమ్మెత్తిపోసే రాజకీయ ఇంగిత జ్ఞాన రాహిత్యం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. వారు కనీసం ఇపుడు ఎన్నికల ప్రచారం ఆరంభమవుతున్న దశలోనైనా పునస్సమీక్షించుకుని తమ ధోరణిని మార్చుకోవటం తమకే మంచిది.

టిఆర్‌ఎస్ నూటికి నూరు శాతం సెక్యులర్ పార్టీ అని, కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంతో సంబంధాలు రెండు ప్రభుత్వాల మధ్య రాజ్యాంగ పరంగా, పరిపాలనా పరంగా ఉండే సంబంధాలు మాత్రమే తప్ప అందులో బిజెపితో రాజకీయ సంబంధం ఏమీ లేదన్నది ఎన్నికలకు ముందు కెసిఆర్ ఇచ్చిన ఒక ముఖ్యమైన స్పష్టీకరణ. లేదా గతంలో పలు మార్లు ఇచ్చిన స్పష్టీకరణకు పునరుద్ఘాటన అనవచ్చు. బిజెపితో టిఆర్‌ఎస్ సంబంధాలన్నవి టిఆర్‌ఎస్ వ్యతిరేకులు, లేదా విషయాలను సంకుచితంగా తప్ప సహేతుకంగా చూడలేని వారు ప్రచారంలో పెట్టే వదంతులు వంటివి. అయినప్పటికీ చిన్న పామునైనా పెద్ద కట్టెతో కొట్టటం అన్నట్లు ఇటువంటి ప్రమాదకరమైన వదంతులను మరోమారు ఈ దశలో ఖండించి మంచిపని చేశారాయన.

అసెంబ్లీ రద్దు రోజునే 105 మంది అభ్యర్థులపేర్ల ప్రకటన, ఆ మరునాడు హుస్నాబాద్‌లో మొదటి ఎన్నికల సభ ప్రకటనతో టిఆర్‌ఎస్ పార్టీ అట్టహాసంగా ఎన్నికల రంగంలో అడుగుపెట్టింది. ఇక రానున్న మూడు నెలల పాటు హోరాహోరీయే.

                                                                                                                                                      –  టంకశాల అశోక్