లేచింది మహిళా లోకం

దేశవ్యాప్తంగా మారుమూల ప్రాంతాల నుంచి వేలాది మంది మహిళలు ఢిల్లీలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ సెప్టెంబర్ 4వ తేదీన జరిగింది. బస్సుల్లో, రైళ్ళలో, సుదూర ప్రాంతాల నుంచి తరలి వచ్చిన వేలాది మహిళలు ఒకే గొంతుతో నినాదాలు చేశారు. వర్షాన్ని లెక్కచేయక ప్రతి ఘటన ప్రదర్శించారు. చంకలో చంటిపిల్లలతో వచ్చారు. అలసి సొలసినా సంకల్పం చెదరలేదు. తెగిన చెప్పులు, భుజాలపై లగేజీ బరువులు, సంచుల్లో కాస్త ఆహారం, కొన్ని దుస్తులు వేసుకుని ఢిల్లీలో తమ […]

దేశవ్యాప్తంగా మారుమూల ప్రాంతాల నుంచి వేలాది మంది మహిళలు ఢిల్లీలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ సెప్టెంబర్ 4వ తేదీన జరిగింది. బస్సుల్లో, రైళ్ళలో, సుదూర ప్రాంతాల నుంచి తరలి వచ్చిన వేలాది మహిళలు ఒకే గొంతుతో నినాదాలు చేశారు. వర్షాన్ని లెక్కచేయక ప్రతి ఘటన ప్రదర్శించారు. చంకలో చంటిపిల్లలతో వచ్చారు. అలసి సొలసినా సంకల్పం చెదరలేదు. తెగిన చెప్పులు, భుజాలపై లగేజీ బరువులు, సంచుల్లో కాస్త ఆహారం, కొన్ని దుస్తులు వేసుకుని ఢిల్లీలో తమ గొంతు వినిపించడానికి వచ్చారు. దేశంలోని 23 రాష్ట్రాల నుంచి తరలి వచ్చారు. వాళ్ళు కోరేవి గొంతెమ్మ కోరికలేమీ కాదు. స్త్రీపురుష సమానత్వం కావాలంటున్నారు. ఆహార భద్రత కోరుతున్నారు. ఉద్యోగాలకు భద్రత ఉండాలంటున్నారు. ఇవి కనీస హక్కులు. వాటి కోసం మహిళలు ఉద్యమించే పరిస్థితి నేడు దాపురించింది.

హాత్ మేం కామ్ దో, కామ్ కా పూరా దామ్ దో (చేతులకు పనివ్వండి. పనికి తగ్గ ప్రతిఫలం ఇవ్వండి) అనే నినాదం ఢిల్లీలో ప్రతిధ్వనించింది. సుదూర ప్రాంతాల నుంచి ఢిల్లీ ఎందుకు వచ్చారో ఆ మహిళలకు స్పష్టమైన అవగాహన ఉంది. ఎందుకోసం ఉద్యమిస్తున్నారో వారికి స్పష్టంగా తెలు సు. ఎలాంటి అస్పష్టతా లేదు. వారితో కలిసి నడుస్తుంటే వారి సంకల్పబలం చూసి విస్తుపోవలసి ఉంటుంది. వారంతా పేద మహిళలు, భూమిలేని కూలీ మహిళలు, ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంది. ప్రతి కథ ఒక జీవితాన్ని మన ముందుంచుతుంది.

ధరల పెరుగుదల వల్ల నడుం విరిగిన పేదబతుకుల వ్యథ తెలుపుతుంది. రేషన్ కార్డులను ఆధార్ తో అనుసంధానించిన పద్ధతి వల్ల గుప్పెడు మెతుకులకు నోచుకోని రోజుల గురించి చెబుతుంది. అంతకు ముందు రేషన్ వల్ల కనీసం కొంత స్వాంతన లభించేది. కాని ఆధార్ కార్డుతో లంకె పెట్టడం, బయో మెట్రిక్ గుర్తింపు, వేలి ముద్రలు మ్యాచ్ కావడం లేదన్న తిరస్కారాలు, కనీసం నడవలేని వృద్ధులను మోసుకుని రేషన్ షాపులకు వస్తున్న వారి సంతానం, భారతదేశాన్ని పాలకులు ఏ స్థాయికి దిగజార్చారో చెప్పే కథలివి.

ఢిల్లీ నగరంలో మహిళలు మార్చ్ చేయడానికి మూడు ముఖ్యమైన డిమాండ్లు ఉన్నాయి. ఆల్ ఇండియా డెమొక్రటిక్ విమెన్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు మాలిని భట్టాచార్య వాటి గురించి వివరించారు. అవేమిటంటే, మహిళలపై హింసాకాండకు బాధ్యులైన వారిని వెంటనే అరెస్టు చేయాలి. మహిళలు, పిల్లలపై హింసకు పాల్పడిన వారిని వదలరాదు, వారిని శిక్షించాలి. నిజానికి ఇది డిమాండ్ చేయవలసిన విషయం కాదు. రాజ్యం నిర్వర్తించవలసిన బాధ్యత. కాని డిమాండ్ చేయవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉన్నావ్ అత్యాచారం కేసులో బాధితురాలి తండ్రి లాకప్పులో మరణించాడు. అది హత్య అన్న ఆరోపణలు వచ్చాయి. దానికి ప్రత్యక్ష సాక్షి తర్వాత అనుమానాస్పదంగా మరణించాడు.

ఇలాంటి అనేక సంఘటనలు ఏం చెబుతున్నాయి? మహిళలపై హింసాకాండకు పాల్పడిన దోషులు కాలరెగరేస్తూ తిరుగుతున్నారనే చెబుతున్నాయి. కేవలం మహిళలపై హింసాకాండను మాత్రమే ఈ మహిళలు ప్రస్తావించడం లేదు, దేశంలో పెరుగుతున్న మూక హత్యల్లో తమ సన్నిహితులను, బంధువులను కోల్పోతున్న మహిళల కన్నీళ్ళను కూడా ప్రస్తావిస్తున్నారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో ఆవు కోసమో, మరో కారణంతోనో మూకలు దాడులు చేసి హత్యాలు చేస్తున్న పరిస్థితులు ఉండరాదని డిమాండ్ చేస్తున్నారు. రెండవ డిమాండ్ రేషన్ కార్డులకు ఆధార్‌తో లంకెపెట్టడం మానేయాలన్నది. అనేక మంది ప్రజలు పోషకాహార లోపం, ఆకలి బాధలకు గురవుతుంటే, కనీసం రేషన్ సరఫరా ద్వారా లభించే కొద్దిపాటి ఊరట కూడా వారికి దొరక్కుండా ఈ ఆధార్ అడ్డంకి అయ్యింది. చాలా మంది పేదలకు ఆధార్ కార్డులు లేవని కూడా తెలుస్తోంది. అందువల్ల ఇలాంటి అడ్డంకులు లేకుండా రేషన్ సరఫరా జరగాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజల ఆకలి బాధ తీర్చడం ప్రభుత్వాల బాధ్యత.

మహిళలకు గౌరవప్రదమైన శ్రమ అవకాశాలు ఉండాలన్నది మూడవ డిమాండ్. అలాగే పనికి తగ్గ ప్రతిఫలం ఉండాలి. మహిళ కాబట్టి తక్కువ ఇవ్వరాదు. ఉద్యోగాల్లో వారికి భద్రత ఉండాలి. ప్రస్తుతం ఉద్యోగాల విషయంలో తీవ్రమైన వివక్షకు గురవుతున్నది మహిళలే. విచిత్రమేమంటే, పేదమహిళలు, పోషకాహారలోపం వల్ల బక్కచిక్కిన మహిళలు, తమ హక్కుల కోసం, తమ డిమాండ్లతో పార్లమెంటు స్ట్రీట్ లో మార్చ్ నిర్వహించినా, ఢిల్లీ నడిబొడ్డున నిలబడి గొంతెత్తి అరిచినా, ఈ దృశ్యాలేవీ జాతీయ మీడియాకు, జాతీయ టీవీ చానళ్ళకు కనబడలేదు. జాతీయ మీడియాకు ఈ గొంతులు వినబడలేదు. కొన్ని మీడియా సంస్థలు తప్ప ఎవ్వరూ పట్టించుకోలేదు. దేశంలో మీడియా కొన్ని వార్తల గొంతు ఎలా నొక్కేస్తుందో చెప్పడానికి ఇది కూడా ఒక ఉదాహరణ. చెక్కుచెదరని ఉక్కు సంకల్పంతో ఈ మహిళలు దేశ రాజధానికి వచ్చారు. కేంద్ర ప్రభుత్వం చెవులకు వినబడేలా తమ గొంతు వినిపించారు. గుండెల్లో బాధల పర్వతాలను మోస్తున్నప్పటికీ ఆడుతూ పాడుతూ తమ బాధలను ప్రకటించారు. నరేంద్ర మోడీ సర్కార్ అబ్ హోష్ మేం ఆవో అంటూ నినాదాలు చేశారు. బహుశా ఈ మహిళల ప్రదర్శనను మీడియా సంస్థలు పట్టించుకోకపోవడానికి ఈ నినాదాలే కారణమా? కోటి పన్నెండు లక్షల మంది మహిళలు సభ్యులుగా ఉన్న ఐద్వా దేశంలో పెరుగుతున్న విద్వేష నేరాల పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మతతత్వ, కుల తత్వ దాడుల పట్ల మహిళల్లో ఆక్రోశం ఆవేదన పెల్లుబుకుతున్నాయి. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన మోడీ కనీసం రెండు లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని నిలదీస్తున్నారు. పైగా నోట్ల రద్దు వల్ల 90 లక్షల ఉద్యోగాలు పోయాయని గుర్తు చేస్తున్నారు. బేటీ బచావో బేటీ పఢావో నినాదాలిచ్చే ప్రభుత్వం ఈ బేటీల గురించి ఆలోచిస్తుందా? వారి మాట వింటుందా? వారి డిమాండ్లకు ప్రతిస్పందిస్తుందా? అలాంటి సూచనలేవీ ఇంతవరకు కనిపించ లేదు.                                                  –  సబా